శౌనకాదుల విచారము ఆ.వె: నైమిశమ్ము నందు నారాయణుని ధ్యాన మందు రేయి పగలు మగ్నుడైన సూతమునిని మునులు జూచి మ్రొక్కు లిడుచు ప్రశ్న చేసి రిటుల భక్తి తోడ. ఆ.వె: అన్ని తెలిసి నట్టి హరిభక్తులన మీరె వినగ వేడ్క కల్గె విష్ణు చరిత వేడుచుంటి మయ్య వినయముతో మిమ్ము దేవకీ సుతు కథ దెలుపు డయ్య. ఆ.వె: కలియుగమ్ము నందు కనలుచు జనులెల్ల మందమతులు గాను మందభాగ్యు లగుచు నలమటించు నట్టి వారి కెరుక పరచు మయ్య శాంతి బాట యొకటి. సూతమహర్షి ఆ.వె: ఉర్విలో జనించె ఉగ్ర శ్రవణుడన శౌనకాదులుకును స్వయము గాను భారతాది కథలు ప్రవచనమునుచేసె సూతు డనెడు ఋషియు సూక్త గతిన. ఆ.వె: వ్యాసుడు రచియించి నట్టి పురాణాదు లందు సూతుడు విని నెరుక పరచె నైమిష మను తావు నందెల్ల వారికి నతి హరుషము తోడ నాదరమున. ఆ.వె: మునివరులకు నెల్ల ముదమున సూతుండు తెలుపు చుండె కథలు తీరు గాను శౌనకాదు లెల్ల చక్కగా నాలించి పులకరించి రచట భూరిగాను.. వసురాజు ఆ.వె: కోలాహల మను కొండను కాలి నఖము తోడ నెట్టి కాచుచు నదినే కోలాహలునకు తానవ లీలగ సతిగా నొనర్చె రేడగు వసువే. ఆ.వె: శుక్తిమతికి నొక్క సుతుడు మరి సుతయు సంతు గాను గలుగ సంతసాన వసుపదుడను పేరు బాలునకు,గిరిక యనెడి పేరు సుతకు నవని నిడిరి. ఆ.వె: ఉపరిచరు వసువుగ నుర్విలో పేరొంది నట్టి రాజు వేగ యద్రి సుతను గాంచి ముదము తోడ కరమును చేపట్టి సతిగ చేసుకొనియె సంబరాన. ఆ.వె: వేట కేగ రాజు వీర్యము జారంగ నద్రిక యను ఝషము నారగించ బెస్త వారు బట్టి విభున కొసగ చేప కడుపులో శిశువులు కాని పించ. ఆ.వె: మత్స్యగంధి మరియు మత్స్యుడన పెరిగి పెద్ద వార లైరి విశ్వమందు బెస్తవారు గానె పెరుగుచు ధరలోన మంచి పేరు బడిసి మాన్యులైరి.
రచయిత పరిచయం

నా పేరు డా. బల్లూరి ఉమాదేవి. కర్నూల్ జిల్లా లోని ఆదిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా (తెలుగు) పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాను. వివాహానంతరం బి ఏ, యం ఏ పూర్తి చేశాను. 2005 లో (నా 52 వ ఏట) తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీల పాటలు పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాను. మా తాతగారు, తండ్రిగారు, పెదనాన్నలు తెలుగు పండితులే కావడం వల్ల తెలుగు భాష పట్ల చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువగా వుండేది. అప్పుడప్పుడు పద్యాలు కవితలు రాసే నేను, పదవి విరమణ తర్వాత శంకరాభరణం గ్రూప్ వారి 'సమస్యా పూరణల'తో మరలా రచనకు శ్రీకారం చుట్టాను.
నా ముద్రిత గ్రంథములు (13)
1.శ్రీరామదూత శతకము 2.అక్షర వనం 3. మనో గీతికలు 4.తెలుగు బిడ్డ శతకము 5.శ్రీనివాస శతకం 6.దేవి శతకము 7.శ్రీ రామచంద్ర శతకం 8.శివపురాణ మహత్యము 9.శారదాంబ శతకం 10.హనుమత్ శతకము 11.హనుమోదాహరణము 12.కనకదుర్గ శతకము 13.శ్రీమద్భాగవతము- ఆణిముత్యాలు.
అముద్రిత గ్రంథములు: 1. హిమపవనాలు 2. ఖండకావ్య సమాహారం 3. 'ఆసరా' ఐదు ఆశ్వాసంలో సామాజిక పద్య ప్రబంధము 4. 'జీవన స్రవంతి' ఐదు అంకముల (పద్య నాటకం) 5. విష్ణు దేవ శతకము.
వాల్మీకి రామాయణంలోని అన్ని కాండలలోని కొన్నిసర్గలకు తేటగీతి ఛందస్సు 500 వరకు పద్యాలు రచించాను. వివిధ అంశములపై (సమస్యా పూరణాలు, దత్తపదులు) 5000 పద్యాలు రచించాను.
2000 వరకు కవితలను, 300 పాటలను రచించాను. కొత్త ఛందస్సులలో 100 పద్యములు రచించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు పొందాను. జాతీయ సదస్సులలోను ప్రముఖ పత్రికలలో నా వ్యాసములు ప్రచురితమైనవి. కర్నూలు రేడియో కేంద్రంలో వివిధ అంశములపై ప్రసంగములు చేశాను.
పొందిన బిరుదులు:
సహస్ర కవిరత్న, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి చక్రవర్తిని, సహస్రపద్యశ్రీ, (10500 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారిని చేతుల మీదుగా సహస్రపద్యశ్రీ బిరుదము అందుకున్నాను) కవితా భూషణ, కవిత విభూషణ, మహతి సాహితీ చక్రవర్తి ,కవివరా మొదలగు బిరుదులతో పాటు నారీ శక్తి పురస్కారం, కీర్తిరత్న పురస్కారం అందుకున్నాను.
అనేక అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పలుమార్లు నిషిద్ధాక్షరికి పృచ్ఛకునిగా పాల్గొన్నాను.