Image by WikiImages from Pixabay
గాంధీజీ స్వదేశానికి పయనం
1893 లో ఏప్రిల్ 24 వ తేదీన డర్బన్ (దక్షిణ ఆఫ్రికా) చేరుకున్న గాంధీజీ మూడు ఏళ్ళు గడిపిన తరువాత 6 నెలల పాటు స్వదేశం వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ మూడు ఏళ్లలో నాటాల్ (Natal) లో మంచి న్యాయవాదిగా పేరు గాంచారు. ఆయన అవసరం అచ్చటి భారతీయులకు చాలా ఉంది. స్వదేశం వెళ్లి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూసి, భార్య, పిల్లలను తీసుకు వచ్చి నాటాల్ లో స్థిరపడాలని నిర్ణయించారు. భారతావనిలో ఉన్నప్పుడు ప్రజాహిత కార్యాలను నిర్వహించి దక్షిణ ఆఫ్రికాలో భారతీయులు పడుతున్న కష్ట నష్టాల గురించి స్వదేశీయులకు తెలియజెప్పాలని సంకల్పించారు. భారత ఒప్పంద కూలీల మీద వేసిన £3 పన్ను రద్దు అయ్యేవరకు ఆయనకు మనశ్శాంతి ఉండదు.
గాంధీజీ భారతదేశం వెళ్ళినప్పుడు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ (NIC) సంస్థకు, విద్యా సంఘం (Educational Society) కు ఎవరు సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తారు అనే విషయం మీద ముఖ్యులతో చర్చించిన తరువాత ‘యాడంజీ మియాఖాన్’ (Adamji Miyakhan) పేరు ఆమోదించటం జరిగింది. గాంధీజీ వలె బారిష్టర్ కాకపోయినా ఆయన అత్యంత సమర్ధుడు, పట్టుదల గల వ్యక్తి, మర్యాదస్తుడు, స్నేహశీలుడు.
సముద్ర ప్రయాణం
1896 జూన్ 5 వ తేదీన డర్బన్ నుంచి కలకత్తా వెళ్లే S.S. Pongola ఓడలో గాంధీజీ భారతావనికి ప్రయాణించారు. ఆ ఓడలో ఉన్న కొద్ది మంది ప్రయాణికులలో ఇద్దరు ఆంగ్లేయ అధికారులు ఉన్నారు. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఒకాయనతో గాంధీజీ రోజుకు ఒక గంట సేపు చదరంగం (Chess) ఆడే వారు. ఆ ఓడ కు సంబంధించిన ఒక వైద్యుడు తమిళం నేర్పే Self-Teaching పుస్తకం ఇవ్వగా గాంధీజీ నాటాల్ లో ఉన్న తమిళ ప్రజలకు దగ్గర అవ్వాలని అది చదివారు. ఆ పుస్తకాన్ని చదివి తమిళ భాష నేర్చుకోటంలో మంచి పురోగతి సాధించటం జరిగింది. దీనిని గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ద్రావిడ ప్రజలు (తమిళులు, తెలుగు ప్రజలు) నా మీద చూపించిన ఆప్యాయత, ప్రేమ నా మస్తిష్కంలో ఉండిపోయింది. వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు. ఆంగ్ల, హిందుస్తానీ భాషలు ధారాళంగా మాట్లాడలేకపోయినా వీరు తమ హక్కుల కోసం సైనికులలాగా పోరాడారు. నా మీద వారికి ఉన్నప్రేమకు ప్రతిఫలంగా నాకు తమిళ, తెలుగు భాషలు నేర్చుకోవాలనే తపన నాలో నిగూఢమై ఉంది. తమిళ భాషలో కొంచెం పురోగతి సాధించినా, తెలుగు భాషలో అక్షరాలు దాటి నేర్చుకోలేకపోయాను. దక్షిణ ఆఫ్రికాలో ఆంగ్ల భాషరాని వారు ద్రావిడులు హిందుస్తానీ, హిందీ భాషలో మాట్లాడతారు. కాని ఆంగ్ల భాష మాట్లాడేవారు మాత్రం హిందుస్తానీ, హిందీ భాషలో మాట్లాడలేరు. వీరు ఇతర భాషలు నేర్చుకోవటానికి ఆంగ్ల భాష అడ్డంకి అని భావిస్తారు. అందువల్లనే తెలుగు, తమిళ భాషలు నేర్చుకోవాలనే కోరిక నాలో నిగూఢంగా ఉంది.”
అలాగే అచ్చటి మహమ్మదీయులతో మాట్లాడటానికి ఉర్దూ భాష నేర్చుకోవాలనే తపన కూడా ఆయనకు ఉంది. ఆయనతో పాటు ఒక ఆంగ్లేయ మిత్రుడికి కూడా ఉర్దూ భాష నేర్చుకోవాలనే అభిలాష ఉంటే ఆ ఓడలోనే ప్రయాణిస్తున్న ఒక ఉర్దూ మున్షి (Munshi) సహకారంతో వారు అద్భుతమైన పురోగతి సాధించటం జరిగింది. ఉర్దూ భాష అక్షరాలను విడదీయటం గాంధీజీకి కష్టం అనిపించింది. అయినా పట్టుదలతో చాలావరకు నేర్చుకున్నారు. ఇతర భాషల గురించి, మతాల గురించి గాంధీజీ ఇలా అన్నారు.
“ఓడ కెప్టెన్ క్రైస్తవుడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకున్నాము. అతనికి బైబిల్ లోని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. నేను అతనికి హిందూ ధర్మం గురించి విశదీకరించాను. అతను నైతికతకు, నమ్మకానికి మధ్య ఒక గీత గీసి, వీటిమధ్య ఉన్న తేడాలు వివరించటం జరిగింది. దేవుడు (అతనికి జీసస్) మీద ఉండే నమ్మకం, నైతికత ఒక వ్యక్తి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆయనను నమ్మితే ఆ అనైతికతకు విమోచనం (పాప ప్రక్షాళన) లభించవచ్చు. కాని నా దృష్టిలో మతం, నైతికత పర్యాయపదాలే! కాని కెప్టెన్ దృష్టిలో అవి వేరు వేరు పదాలు.
ఈ విషయాల గురించే కాక శాకాహారం గురించి కూడా చర్చించాము. మానవుల ఆకలిని తీర్చటానికే దేవుడు జంతువులను సృష్టించాడని అతని నమ్మకం. కాని గాంధీజీ మానవుల కోసం శాకాహార రాజ్యాన్ని సృష్టించాడని వాదించారు. జంతుజాతులు మానవజాతి లాంటివే అని నేను విశదీకరించాను. కాని ఆయన నా అభిప్రాయాన్ని నమ్మలేదు. తన నమ్మకమే సరి అయినదని ఆయన భావించటం జరిగింది.”
ఇలా ఆ ఇద్దరు వాగ్వివాదాలు చేసుకుంటూ చివరికి 24 రోజుల ప్రయాణం తరువాత జూలై మొదటి వారంలో ఓడ కలకత్తా చేరింది. హుగ్ల్ నది అందాన్ని చూసి తన్మయుడవుతూ, ఓడ దిగిన వెంటనే గాంధీజీ బొంబాయి వెళ్ళటానికి రైలు ఎక్కటం జరిగింది.
భారతావనిలో పర్యటన
గాంధీజీ ఎక్కిన బొంబాయి వెళ్లే రైలు అలహాబాదులో 45 నిముషాలు ఆగింది. ఈ సమయంలో ఆయన ఒక టాక్సీ ఎక్కి అలహాబాదు పట్టణంలో తిరిగి ఒక మందు కొనుక్కుని స్టేషన్ వచ్చే లోపల ఆ రైలు బయలుదేరుతూ ఉంది. గాంధీజీని చూసి ఆ స్టేషన్ మాస్టర్ ఒక నిముషం పాటు రైలును ఆపివేయించాడు. గాంధీజీ రైలు ఎక్కలేకపోవటం చూసి ఆయన సామానును రైలులోనుంచి స్టేషన్ మాస్టర్ దింపించేశాడు. తరువాత జరిగిన సంగతులు గాంధీజీ ఇలా వివరించారు:
“అప్పుడు నేను అలహాబాదు లోని Kelner హోటల్ లో ఒకగది అద్దెకు తీసుకుని బయటకు చుట్టు ప్రక్కల పరిశీలిస్తుంటే అచ్చట ప్రచురించబడే పత్రిక The Pioneer ఆఫీసు కనిపించింది. ఈ పత్రిక భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాస్తూ ఉంటుంది. ఆ సమయంలో Mr. Chesney, Jr. ఈ పత్రికకు సంపాదకుడు. అన్ని వైపులా నుంచి సహాయం పొందాలనుకుని నేను ఆయన ఆఫీసుకు వెళ్లి ఈ సంపాదకుడికి ‘నేను రైలు తప్పి పోయినందువల్ల నేను మరో రైలును రేపు ఎక్కుతాను. ఈ లోపల మిమ్ములను కలిసి మీతో మాట్లాడాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇప్పుడు ఇవ్వమని’ కోరుతూ ఒక చీటీ పంపించాను.
ఆయన వెంటనే నన్ను లోపలి పిలిచి సంభాషిస్తున్నప్పుడు దక్షిణ ఆఫ్రికాలో భారతీయులకు జరిగే అన్యాయాల గురించి వివరించాను. ఆయన ఓపికతో విని ఆ విషయం మీద నేను ఏది వ్రాసినా తన పత్రికలో ప్రచురించగలనని వాగ్ధానం చేశాడు. కాని ప్రతి విషయం తాను సమర్ధించలేకపోయినా బానిసత్వంలో ఉన్న వారి ధృక్కోణానికి సముచిత స్థానం కల్పించగలనని నాకు తెలియజేశాడు.
అది చాలు అని ఆయనకు కృతజ్ఞత చెప్పి ‘మీరు నా వ్యాసాన్ని పూర్తిగా చదివి, అందులో ఉన్న విషయాలను చదివి, చర్చించి అప్పుడు వాటిని ప్రచురించండి’ అని కోరుతూ, ‘నేను ప్రత్యేకంగా ఏమి అడగను; కాని మాకు దక్కవలసిన కనీస న్యాయమే నేను కోరుచున్నాను’ అని ఆయనకు తెలియ జేశాను.
ఆరోజు మిగతా సమయంలో అలహాబాదులో తిరిగి అద్భుతమైన ‘త్రివేణి’ సంగమం చూసి ఆనందించి, చివరకు నేను వ్రాయాలనుకున్న వ్యాసం వ్రాసి మరుసటి రోజు దానిని పత్రిక సంపాదకుడికి ఇచ్చాను. ఇస్తూ ‘మీరు ఈ వ్యాసాన్ని చదివి దక్షిణ ఆఫ్రికాలో మా సమస్య గురించి చర్చించండి’ అని ఆయనను కోరాను.
Pioneer సంపాదకుడితో ఈ ఊహించని ముఖాముఖి సమావేశం, ఆ పత్రికలో నేను వ్రాసిన వ్యాసం, ఆయన అభిప్రాయాలు చాలా నెలలు తరువాత నేను నాటాల్ తిరిగివెళ్ళినప్పుడు అచ్చట చాలా సంఘటనలు జరగటానికి దారి తీశాయి. ఇవి నా ప్రాణానికి హాని తలపెట్టే స్థితికి వెళ్లాయి. వీటిని గురించి తరువాత వివరిస్తాను.
ఆ తరువాత రైలు ఎక్కి నేను బొంబాయిలో ఆగకుండా తిన్నగా రాజ్ కోట (Rajkot, గుజరాత్) వెళ్లి మరుసటి రోజునుంచి దక్షిణ ఆఫ్రికా భారతీయుల పరిస్థితిని వివరిస్తూ ఒక కరపత్రం (Pamphlet) జులై 10 (1896) వ తేదీన వ్రాయటం మొదలుపెట్టాను. దీనిని ముద్రించిన తరువాత ఆకుపచ్చ అట్ట (Green Cover) ఉన్నందువల్ల అది ‘Green Pamphlet’ గా ప్రాచుర్యం పొందింది. మొదట Pioneer పత్రికకు ఇచ్చిన వ్యాసంతో పాటు (దీనికి కూడా Pamphlet రూపం ఇచ్చాను) ఆగష్టు 14 వ తేదీన ముద్రించబడిన ఈ Pamphlet కూడా భారతావని లోని భారతీయులు చదివి దక్షిణ ఆఫ్రికాలో తమ సోదరులకు జరిగే అన్యాయాలను భూత అద్దంలో చూసినట్లుగా ఉన్నాయి.
ఈ కరపత్రానికి 10,000 కాపీలు తీసి వాటిని భారతావనిలో ప్రతి దినపత్రికలకు, నాయకులకు పంపించాను. Pioneer పత్రిక సంపాదకుడు వ్రాసిన సంపాదకీయం సారాంశం లండన్ లోని అంతర్జాతీయ సంస్థ Reuters నాటాల్ కు Telegraph Cable ద్వారా పంపించింది. మూడు పంక్తులలో సూక్షంగా ఉన్న ఈ Cable నాటాల్ లో భారతీయులను ఎలా పీడిస్తున్నారో ప్రముఖంగా తెలియజేసింది. వెంటనే అచ్చటి ప్రతి దినపత్రిక వారు అనుభవిస్తున్న స్థితి గురించి వ్యాఖ్యానించాయి.
ఈ కరపత్రికలను అన్ని చోట్లకు, అందరికి పంపించటం సామాన్య విషయం కాదు. ఈ పని ఖర్చుతో కూడుకున్నది. చవకగా ఈ పని చేయటానికి నేను ఉన్న చోట ఉత్సాహవంతులైన పిల్లలను నియమించాను. బడి లేని రోజులలో రోజుకు మూడు గంటలు వారితో పని చేయించటం జరిగింది. పని పూర్తి అయిన తరువాత వారిని ఆశీర్వదించి, బహుమతులు, కొన్ని పోస్టల్ స్టాంపులు ఇచ్చాను. ఇదే నా జీవితంలో మొదటిసారి చిన్న పిల్లలను స్వచ్ఛంద సేవకులుగా ఉపయోగించటం.”
ప్లేగ్ (Plague) వ్యాధి నివారణకు రాజ్ కోట లో గాంధీజీ సేవా కార్యక్రమం
గాంధీజీ జూలై 9 వ తేదీన (1896) రాజ్ కోట చేరారు. గాంధీజీ ఆయన అచ్చట ఉన్న సమయంలో రాజ్ కోట లో పైన వివరించిన కార్యక్రమం నిర్వహించే సమయంలో బొంబాయి నగరంలో సెప్టెంబర్ లో ‘బుబో నిక్ ప్లేగ్’ (Bubonic plague; Black Plague) వ్యాధి ప్రబలింది. అప్పుడు ప్రజలు అన్ని చోట్ల భయాందోళనలో ఉన్నారు. ఈ భయంకర వ్యాధి రాజ్ కోట లో వ్యాప్తి చెందుంతుందనే భయం అచ్చటి ప్రజలలో మొదలయింది. అప్పుడు ఆయన పారి శుధ్య శాఖకు తన సహాయం అందిస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనిని గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“అప్పుడు ప్రభుత్వం ఒక బృందాన్ని (కమిటీని) ఏర్పరిచి పారిశుద్ధం మీద దృష్టి సారించమని కోరింది. నేను బృంద సభ్యులకు మరుగుదొడ్లు శుభ్రత గురించి వివరించగా, వారు ప్రతి వీధిలో వీటిని తనిఖీ చేశారు. పేదవారు తమ మరుగుదొడ్లు తనిఖీ చేయటంలో అభ్యంతరం పెట్టలేదు. వారు వీటిని బాగుచేయటంలో మాతో ఉత్సాహంగా సహకరిస్తే, చాలామంది ధనికులు వారి ఇళ్లను పరిశీలించటానికి అనుమతి ఇవ్వలేదు, మేము ఇచ్చిన సూచనలు పాటించలేదు.
యదార్ధానికి ధనికుల గృహాల్లోని మరుగుదొడ్లే అపరిశుభ్రంగా ఉన్నాయి. అవి మురికితోనూ, పురుగులతోనూ నిండి దుర్వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మేము వారికి మల మూత్రాల విసర్జనలను బకెట్లలో నింపి భూమిలో పాతిపెట్టమని సలహా ఇచ్చాము. అలాగే మరుగుదొడ్లను గాలి, వెలుతురు ఉన్నచోట ఏర్పాటుచేస్తే తేలికగా శుభ్రం చేయటం వీలవుతుందని వారికి చెప్పాము. కాని వీటిని ఆచరించటానికి ఈ పై తరగతులవారు చాలా అభ్యంతరాలు లేవదీసి, మా సలహాలను చేపట్టలేదు.
మా బృందం అంటరానివారుగా పరిగణించబడిన వారి ఇళ్లను, మరుగుదొడ్లను పరిశీలించటానికి ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే నాతో రావటానికి సిద్ధపడ్డాడు. మిగతావారు అసంబద్ధమైన కారణాలు చూపి తప్పించుకున్నారు. ఇక నేను, ఈ సభ్యుడు వారి ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్లను చూస్తామంటే వారు ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్య పరిచింది. వారు ‘వాటిని మేము ఎరగము. మేము మలం విసర్జించటానికి బహిర్భూమికి వెళ్తాం. మరుగుదొడ్లు సంపన్నులకే మాత్రమే ఉంటాయి.’ అని సమాధానం ఇచ్చారు.
అప్పుడు నేను ‘మీ ఇళ్లను తనిఖీ చేయవచ్చా' అని అడిగితే వారు 'మీరు తప్పకుండా పరిశీలించ వచ్చు. అన్ని గృహాలు చూడవచ్చు. కాని మా ఇళ్ళు మాములు ఇళ్ళు లాగా ఉండవు. దూరం నుంచి చూస్తే అవి గుడారాలుగా ఉంటాయి’ అని సమాధానం ఇచ్చారు.
అప్పుడు నేను ఉత్సాహంతో గుడారాలు (Tents) లాగా ఉన్న ఇళ్లను చూస్తే అవి బాగా ఊడ్చి ఉన్నాయి. నేల ఆవుపేడతో అలికియున్నాయి. కుండలు, పెనములు శుభ్రంగా, మెరుస్తూ ఉన్నాయి. ఇటు వంటి ఇళ్ళు కాని ఇళ్లల్లో ఈ ప్లేగ్ వ్యాధి సోకదు, విస్తరించే ప్రమాదం లేదని సంతోషించాను.
సంపన్నుల గృహాలను పరిశీలించినప్పుడు అచ్చటి మరుగుదొడ్లలో నీరు, మూత్రం బయటకు వెళ్ళటానికి ఒకే గొట్టం (Gutter) ఉంది. దీని వల్ల ఆ ఇళ్లలో దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఒక ఇంట్లో అయితే పైఅంతస్తు పడకగది నుంచి ఉన్న గొట్టం ద్వారా క్రింది అంతస్తుకు నీరు, మూత్రం వెళ్ళటం చూ శాము. ఈ కంపు, దుర్వాసన భరించటం అసాధ్యం. ఇటువంటి గృహాలలో ఉన్న ధనికులకు ఎలా నిద్ర పడుతుంది అనేది అంతుబట్టని విషయం.
మా బృందం ఒక వైష్ణవ హవేలిని దర్శించింది. అచ్చట పురోహితుడు నా కుటుంబంతో చాల స్నేహంగా ఉంటాడు. ఆ హవేలిలో ఒక చోట భోజనం చేసిన విస్తరాకులు, పళ్ళాలు ఆ గుడి గోడ బయట విసిరేసి ఉన్నాయి. వాటిని కాకులు తింటున్నాయి. ఒక ప్రార్ధనా స్థలంలో ఇటువంటి అపరిశుభ్రత ఉండటం చాల విచారకరమైన విషయం. ఇటువంటి పవిత్రమైన చోట పారిశుద్ధ్యం ఉంటుందని ఆశిస్తాం. స్మృతి, శృతి గ్రంథకర్తలు అంతఃకరణ శుద్ధి, బాహ్య పరిశుభ్రత గురించి ఉద్ఘాటించినప్పుడు దేవాలయాలలో ఇటువంటి అపరిశుద్ధత తాండవం చేయటం దురదృష్టకరం. అచ్చటి పూజారికి పరిశుభ్రంగా ఉంచుకోటానికి కొన్ని సలహాలు ఇచ్చాము. మా సలహాలు పూజారి బృందం అమలు పరచిందా లేదా అనేది మాకు తెలియదు.
మేము పరిశీలించిన అన్ని చోట్ల అచ్చటి యజమానులకు ప్లేగ్ వ్యాధి నివారించటానికి ఏమి చేయాలో గృహస్తులకు, యజమానులకు, తదితరులకు వివరించటం జరిగింది. చివరకు ఈ మహమ్మారిని నివారించటంలో, వ్యాపించిన చోట్ల అరికట్టటంలో చాలావరకు సఫలీకృతులయ్యాము.”
బ్రిటిష్ రాజ్యాగం మీద గాంధీజీ నమ్మకం
ఒకప్పుడు గాంధీజీకి బ్రిటిష్ రాజ్యాంగం మీద నమ్మకం, దాని యెడల అపారమైన విధేయత ఉండేది. దీనికి ముఖ్య కారణం సత్యం (Truth) మీద ఆయనకు ఉన్న ప్రేమ. ఆ సత్యమే ఆయన జీవన నౌకకు మూలాధారం. నాటాల్ లో జరిగే ప్రతి సమావేశానికి అయన హాజరు అయినప్పుడు బ్రిటిష్ జాతీయ గీతం అందరూ పాడేవారు. ఆ సమయంలో గాంధీజీకి ఆ గీతాన్ని అందరితో పాటు పాడాలనిపించేది. బ్రిటిష్ పాలనలో ఉన్న లోపాలు ఆయనకు అవగతమైనా జాతీయ గీతం ఆమోదయోగ్యమైనది అని భావించారు. బ్రిటిష్ పాలనలో కొన్ని లోపాలు ఉన్నా మొత్తం మీద పాలింపబడేవారికి లాభకరం అని ఆ రోజులలో నమ్మటం జరిగింది.
బ్రిటిష్ సంప్రదాయానికి విరుద్ధంగా ఆఫ్రికాలో శ్వేత జాతీయులు కానివారి యెడల పక్షపాతం ఉన్నా, ఇది కేవలం తాత్కాలికమేనని, స్థానికమేనని గాంధీజీ నమ్మారు. అందువల్ల బ్రిటిష్ సింహాసనం పట్ల ఉన్న విధేయత విషయంలో ఆయన తెల్లవారితో పోటీ పడ్డారు. పట్టుదలతో జాతీయ గీతం నేర్చుకుని ఇతరులతో పోటీ పడి పాడేవారు గాంధీజీ. కాని ఆయన జీవితంలో ఈ విధేయతను ఏనాడూ స్వార్ధానికి వినియోగించు కోలేదు. అది తన బాధ్యత అని భావించారు గాని ప్రతిఫలం ఆశించలేదు. ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వివరించారు:
“నేను భారతావని వెళ్ళినప్పుడు విక్టోరియా రాణి Diamond Jubilee (60 వ సింహాసనోత్సవం) సన్నాహాలు జరుగుచున్నాయి. రాజ్ కోటలో ఈ ఉత్సవం నిర్వహించే కమిటీలో నన్ను చేరమని ఆహ్వానిస్తే నేను చేరటం జరిగింది. ఈ కమిటీ కేవలం ఆర్భాటానికి మాత్రమే ఏర్పడిందని తరువాత తెలిసింది. వంచనతో కూడిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. కాని నాకు కేటాయించిన పనిని సమర్ధవంతంగా నిర్వహించాను.
కమిటీ మొక్కలు నాటాలని ప్రతిపాదిస్తే, కొంత మంది సభ్యులు కేవలం అధికారులను సంతృప్తిపరచటానికి మాత్రమే నామకః పనిచేశారు. నేను మాత్రం నాకు ఇచ్చిన పనిని పూర్తిగా శ్రద్ధగా చేసి, నాటిన మొక్కలకు నీరు పోసి, వాటిని చాలా రోజులు సంరక్షించాను…. అలాగే నా కుటుంబంలోని పిల్లలకు బ్రిటిష్ జాతీయ గీతం నేర్పాను. వారికి నేర్పినా నా అంతరంగంలో అహింస పరిపక్వత అవుతున్న ఆ సమయంలో ఈ గీతం వినటం చాలా కష్టం అనిపించింది. ఏ భారతీయుడికైనా ఇటివంటి విరుద్ధమైన అనుభూతే కలుగుతుంది. ఈ గీతం మధ్యలో నాలుగు పంక్తులు ఇలా ఉన్నాయి:
శత్రువులను చెల్లాచెదురు చేయి (Scatter her enemies)
మరియు వారు పతనం అయ్యేటట్లు చేయి (And make them fall)
వారి రాజకీయాలను గందరగోళపరచు (Confound their politics)
వారి వంచనతో కూడిన కుయుక్తులను విఫలం చేయి (Frustrate their knavish tricks)
భారతీయల యెడల పక్షపాతివైఖరి ప్రదర్శించే బ్రిటిష్ అధికారులకు ఈ గీతం అత్యంత ప్రియమైనది అయినా స్థానిక ప్రజలతో పాటు అనేక మంది నిస్వార్ధ ఆంగ్లేయులు దీనిని గర్హించటం జరిగింది. ఆనాటి నుంచి గాంధీజీకి భారతావనిలోని ఆంగ్లేయ పాలకుల యెడల ద్వేషం అంకురార్పణ అయ్యింది.
****సశేషం****
వచ్చే సంచికలో గాంధీజీ కలిసిన వివిధ భారతీయ నాయకులు, నిర్వహించిన సభలు, ఉపన్యాసాలు, తదితర విషయాల గురించి తెలుసుకుందాము.