Menu Close
Uma Bharathi Kosuri
ముళ్ళ గులాబి….. (కథాభారతి)
కోసూరి ఉమాభారతి

'మారుతున్న యువత దృక్పధాలకి, నాటి తరం మనస్తత్వాలకి నడుమ సంఘర్షణే ‘ముళ్ళ గులాబి’ లోని కధాంశం’

Mulla Gulabi

“మమ్మీ! కరెక్ట్ గా ఆరు గంటలకి, మిల్పిటాస్ బాబా టెంపుల్ కి వచ్చేయి. నేను, మాలిని అక్కడ నిన్ను కలుస్తాము. తరువాత డిన్నర్ కి వెళదాము.. సరేనా?" అన్నాడు ఫోన్ లో కిరణ్. ఉత్సాహంగా ఉన్నాడు మా వాడు. న్యూయార్క్ కాలేజీ నుండి ‘లా’ డిగ్రీ తీసుకొని, బిజినెస్ MBA చేసాడు. ఆరు నెలల క్రితమే శానోజే, కాలిఫోర్నియాలో ఉద్యోగంలో చేరాడు. తన స్నేహితురాలు, మాలిని, న్యూయార్క్ నుంచి మమ్మల్ని కలవడానికి వస్తుందని రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఊరెళ్లిన మా వారు రేపు సాయంత్రం ఇంటికి వచ్చే లోగానే నన్ను కలుస్తానని మాలిని తొందర పడితే ఇలా ఏర్పాటు చేసాడు కిరణ్. సాయిబాబా టెంపుల్ దగ్గరే వాళ్ళ పిన్ని ఇంట ఉందిట ఆ అమ్మాయి.

"వర్క్ నుంచి బయలుదేరి మాలినిని తీసుకొని రావడానికి గంట పైనే పడుతుంది మమ్మీ” అన్నాడు కిరణ్...

అంత ప్రత్యేకంగా ఆ అమ్మాయి మమ్మల్ని కలవడానికి రావడమంటే, విషయం మేమూహించేదే అయ్యుంటుంది. సాయంత్రం వరకు నాకు ఎన్నో ఆలోచనలు. మా కిరణ్ ఎంచుకున్న అమ్మాయిని మేము కాదనేది ఉండదు కాబట్టి, త్వరలో మా ఇంట కోడలు అడుగెడుతుందన్న మాట. మనస్సంతా సంతోషంతో నిండిపోయింది.

గుడికి కాస్త ముందుగానే బయలుదేరాను. కిరణ్ అపార్ట్మెంట్, తన వర్క్ కి దగ్గరగా, మాకు వంద మైళ్ళ దూరంగా ఉంటుంది. వీకెండ్ ఇంటికి వస్తుంటాడు. ఆలోచించుకుంటూ గుడి ఆవరణలోకి వచ్చేసాను. గురువారం గణేష చతుర్ది కూడా కావడంతో ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయుంది. ప్రసాదాలు,  పువ్వులు పట్టుకొని మెట్లెక్కుతున్న చిన్న పిల్లల్ని గమనిస్తూ పైమెట్టు మీద కూర్చున్నాను.

పది నిముషాలకి దూరంగా కిరణ్, పక్కనే మాలిని వడివడిగా నా వైపు వస్తూ కనబడ్డారు. నీలి రంగు పంజాబీ డ్రెస్ వేసుకొని, కిరణ్ ప్రక్కన పొట్టిగా, సన్నగా ఉంది మాలిని. దగ్గరగా వచ్చి నన్ను కలిసి చేతులు జోడించి "నమస్తే ఆంటీ, మీరొచ్చి చాలా టైం అయ్యిందా?" అంది మృదువుగా. మా పిల్లలు తెలుగు మాట్లాడినట్టే ఉంది.

తెల్ల గులాబీలా సుకుమారంగా అనిపించింది. దేవుణ్ణి దర్శించుకొని, ప్రసాదం తీసుకొని మెట్లపై కూర్చున్నాము.

"కిరణ్ మంచి స్నేహితుడు ఆంటీ. మా అమ్మావాళ్ళకి కూడా కిరణ్ అంటే చాలా ఇష్టం," అంది. కిరణ్ పై ఆ అమ్మాయికున్న అభిమానానికి ముచ్చటేసింది.

"ఇవాళ డిన్నర్ వద్దులే, ఆలస్యమయిపోయింది. శనివారం ఇంటికి వచ్చి డాడీని కలవండి," అని ఇద్దరికీ చెప్పి ఇంటి ముఖం పట్టాను.

***

ఇంటికొచ్చి ఎంతో ఉత్సాహంగా మా వారికి ఫోన్ చేసి మాలిని గురించి చెప్పాను. "అమ్మాయి నాకు నచ్చింది. శనివారం కిరణ్ తో ఇంటికి వస్తుందిమీరూ కలుస్తారుగా! దీవించేస్తే మన కిరణ్ ఓ ఇంటివాడవుతాడు" అన్నాను మురిసిపోతూ.

ఎదిగి ప్రయోజకుడైన మా తనయుడు కోరి వరించిన అమ్మాయిని ఆనందంగా ఆమోదిస్తాముఆహ్వానిస్తాము’ అనుకుంటూ ఆనందంతో రాత్రి నిద్ర పోలేదు. 

***

శనివారం వంట ముగించేసరికి కిరణ్, మాలిని వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిచింది.

“అంకుల్, మీకూ కిరణ్ కి చాలా పోలికలున్నాయి.” అంటూ మా వారితో తన కుటుంబం గురించి కూడా ఎన్నో కబుర్లు చెప్పింది మాలిని.

***

మా అమ్మాయి నిషి, మాలిని కూడా మంచి స్నేహితులయ్యారు. మాలినితో మాకందరికీ సాన్నిహిత్యం ఏర్పడింది.

"అమ్మాయి బాగా నచ్చింది కూడాగా నీకు. కిరణ్ తో ప్రస్తావించి, ఇక వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించు." అని మా ఆయన ప్రోత్సహించారు. మంచి రోజు చూసి, మాలిని వాళ్ళ కుటుంబాన్ని ఆహ్వానించాము.

***

కిరణ్, మాలినికి ప్రొపోజ్ చేసి, మా ఇరు కుటుంబాల సమక్షంలోనే డైమండ్ ఉంగరం వేలికి పెట్టాడు. మరి కొంతకాలం సంతోషాలు, సమావేశాలు. కాబోయే  వియ్యంకులతో కబుర్లు, కమామీషు. ఉత్సాహంగా గడించింది. మాలిని పరివారంతో చిరకాల స్నేహితుల్లా మెలిగాను. మాలిని తల్లితండ్రులు లక్ష్మి, నారాయణ గారు, మాలిని చెల్లెళ్ళు, అంతా మమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు.

"కిరణ్ లాంటి అబ్బాయి అల్లుడు అవడం మా అదృష్టం. అంతకన్నా ఎక్కువ మీ వంటి అత్తగారు దొరకడం, మాలిని చేసుకున్న పుణ్యం," అని పొగిడేసింది లక్ష్మిగారు. నారాయణగారు కూడా అంత సంతోషాన్నీ వ్యక్తపరిచారు. కిరణ్ అంటే ఇష్టపడే అమ్మాయే కాదు, కుటుంబమంతా అభిమానంగా ఉన్నారు. వాళ్ళకి అబ్బాయిలు లేరు కనుక, కిరణ్ని వారి సొంత కొడుకులా భావిస్తారు కూడానని అనిపించింది. ఆ మాటే వాళ్ళతోనూ అన్నాను. ఇరువురూ పెళ్లి చేసుకుని వందేళ్ళు సుఖంగా గడపాలనే అందరి అభిలాష.

***

ఇక జరగవలసిన కార్యక్రమం నిశ్చితార్దం. ఎక్కడ జరగాలి? ఎవరి సాంప్రదాయం? దేవుని గుడిలోనా? కళ్యాణ మండపంలోనా? ప్రశ్నలు, సందేహాలు. సంప్రదింపులు, సన్నాహాలు. వీటన్నిటి నడుమ వేసవి కాలం వచ్చేసింది. మా ఇంట మొదటి శుభ కార్యానికి అమ్మమ్మ తాతయ్యల దీవెనలుతో పాటు, ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు కోసం హైదరాబాద్, తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము.

"ఆంటీ! కిరణ్ తో, మీతో ఇండియా వెళ్ళాలని ఉంది. మీకు ఓకే కదా! మీతో పాటే వెళ్ళేలా ప్లాన్ చేసుకోనా? మా అమ్మా వాళ్ళకి అభ్యంతరమే లేదు." అని మాలిని ఫోన్ చేయడంతో… మాలినితో పాటు బయలుదేరాము.

***

ఇండియాలో మా కుటుంబంతో, చుట్టాలతో ఆణుకువగా మెదిలింది మాలిని. నాలుగు రోజులు మాత్రం జబ్బు పడింది. నేను, కిరణ్ దగ్గరుండి చూసుకున్నాము. ఢిల్లీ, ఆగ్రా వెళ్ళడం మానుకొని, తన ఆరోగ్యం తేలికయ్యాక తిరుపతి వెళ్ళాము. దైవ దర్శనం బాగా జరిగింది. బంధువులందరిని చూసాము, అంతటా తిరిగాము. తిరిగి ఆనందంగా అమెరికా చేరాము.

***

నిశ్చితార్దానికి ముహూర్తాలు పెట్టించాము. మాలిని వాళ్ళ ఊరు న్యూయార్క్ లో జరగనుంది నిశ్చితార్ధం. కెంపులు చెక్కిన వజ్రాల హారం, పగ్గాల మీద నుండి ప్రత్యేకంగా తెప్పించిన చెంగావి పట్టుచీరతో పాటు అద్దాల గాజులు, జలతారు వోణీలు తయారు చేయించి మాలినికి కానుకలుగా తెప్పించాము.

ఓ రోజు ముందే న్యూయార్క్ చేరాము. శుభ ముహూర్తానికి... శుభాకాంక్షలతో శివారుల్లోని ఆలయానికి బయలుదేరాము. మా కిరణ్ ఉల్లిపొర రంగు టస్సూర్  సిల్క్ దుస్తుల్లో, నుదుట తిలకంతో, చెంపన దిష్టి చుక్కతో… ఉదయించే సూర్యుడిలా వెలిగిపోయాడు. ప్రతినిత్యం వాణ్ణలా అందంగా, ఆనందంగా చూడాలని, మనస్సులోనే దేవుడికి దణ్ణం పెట్టుకొన్నాను.

తాంబూలాలు, కట్నకానుకలు సర్దుకొన్నాము. సపరివార సమేతంగా బయలుదేరామో లేదో.. .. కోవెల నుండి మాలిని పిలుపు. "ఇదిగో వస్తున్నామే తల్లీ!" అంటూ నవ్వుకున్నాను.

కానీ.. అటునుండి బిగ్గరగా కిరణ్ తో ఫోన్ లో.. మాలిని వాదిస్తున్నదని అర్ధమయి అవాక్కయ్యాను. మమ్మల్ని తోడ్కొని వెళ్ళడానికి వచ్చిన మాలిని తండ్రి, నారాయణ గారు నచ్చజెపుతున్నా … మాలిని బిగ్గరగా అరవడం వినబడుతూనే ఉంది. అదురుతున్న గుండెల్ని అదుపు చేసుకొని అసలు సంగతేమిటని వాకబు చేసాము.

తన కుటుంబాన్ని పట్టించుకోకుండా.. ఇక్కడే మా విడిదిలో మా పరివారం నడుమ కిరణ్ ని పెళ్లికొడుకుని చేసే తంతు జరిగినందుకు, అర్ధం లేకుండా మా వాడిని నిష్కర్షగా తిట్టింది ఆ అమ్మాయి. అనూహ్యమైన ఆమె వైఖరి నన్ను కలవరపెట్టింది. ఉద్వేగంతో దు:ఖం ఆగలేదు, ఆలోచన సాగలేదు.

అదిరింపులు, బెదిరింపులు ఎరుగని వాడు, సుకుమారంగా, రాకుమారుడిలా ఎదిగినవాడు మా కిరణ్. సున్నిత మనస్కుడు. తనకి తెలిసిన మాలినియేనా అన్నట్టుగా ఉన్నాడనిపించి క్రుంగిపోయాను.

తనపై కూడా ఫోన్ లో బిగ్గరగా అరుస్తున్న కూతురితో, నారాయణ గారు “సరే, ఇంక శాంతించు. ఆంటీ చాల బాధపడుతున్నారు. మేము బయలుదేరుతున్నాము.” అంటూనే… మాకూ సర్ది చెప్పి మమ్మల్ని బయలుదేర దీశారు.

***

కిరణ్ మనసు మలిన పడకుండా ఏమి చేయాలి? వాడిని ఎలా ఆదుకోవాలి? ఆగని కన్నీటితో కలలోలా కదిలాను. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మా వారు నా కన్నీళ్ళకి చలించిపోయారు. మనసు పాడయి జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనలేదు. మాతో వచ్చినా, నిశ్చితార్ద తంతు నుంచి దూరంగా గుడిలోనే ఉండిపోయారు. నేను మాత్రం కిరణ్ కోసం, వాణ్ని అంటిపెట్టుకొనే ఉన్నాను. నిషి నా వెంటే ఉంది. నిశ్చితార్థం అంటూ జరిగిన కార్యక్రమం.. మా వారు అక్కడ లేకుండానే జరిపించారు. మాట మంతీ లేకుండా తిరిగి విడిది చేరుకొన్నాము. ఆపై ఊరు వెళ్ళిపోయాము.

నా ఆలోచనంతా కిరణ్ గురించే. ఇక మీదట మా జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో అని ఆలోచించి నా మనసు చెదిరిపోయింది.

***

మూడు నెలల వ్యవధి తరువాత, ఇరు కుటుంబాల నడుమ సామరస్యానికి కిరణ్ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మాలిని వంటి మొండి అమ్మాయితో వాడి జీవితం ఎలా ఉంటుందోనని, కిరణ్ విషయంలో భయం వేసింది. అంతటితో ఆగని ఆ అమ్మాయి వీరంగం… ‘వటుడు అంతై అంతంతై’ అన్న సామెతగా నన్ను దుయ్యబట్టేంత వరకూ వచ్చింది. కిరణ్ కి ఏవో అప్రస్తుతపు మాటలు చెపుతూ, వాడికి నా పై కోపం రావాలని, బాహాటంగానే నన్ను తూలనాడుతూ, మాటల్లోనే కాక లేఖలు కూడా రాసింది. తానంటే ఇష్టపడక, తన కంటే అందం, అంతస్తు ఉన్న కోడలి కోసం నేను ఆరాట పడుతున్నానని, నా మీద అబద్దపు అభాండాలు మోపింది. నా ముఖం చూడనంది. మా నుండి వాడిని వేరుచేయడమే ఆ అమ్మాయి ధ్యేయమయ్యిందని అర్ధమైపోయింది. కుమిలిపోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. మంచిచెడు తెలిసిన వాడు మా కిరణ్ అన్న నమ్మకంతో మిన్నకుండిపోయాను.

***

ఇంతా జరిగాక, పరిస్థితుల్లో ఎటువంటీ మార్పు లేకుండానే తాము నిర్ణయించిన సమయానికే వివాహం జరగాలని పట్టుబట్టింది మాలిని. వివాహ వేడుకకి నన్ను దూరముంచుతానని నిర్మొహమాటంగా ప్రతిజ్ఞలు కూడా చేసింది. పైగా యివన్నీ రాసేది మా వాడికీ, నాకూను. ఇంతటి వెరపు లేనిదనం, తెగింపు, పాపభీతే లేని కరుకుదనం, ఓర్వలేనితనం ఎందుకో? తెలియక విలవిలలాడాను. మనస్సు రాయి చేసుకొన్నాను. నా మంచితనం, నా న్యాయం నేను నిలుపుకోవాలి. పిల్లలికి నేను అన్యాయం చేయలేను.

ఏదోలా మాలినిని మళ్లీ మచ్చిక చేసుకోవచ్చునేమో, మనసు మార్చవచ్చునేమో, నా మీద కలిగిన అయిష్టత, అనుమానం దూరం చేయవచ్చునేమో అని ఆలోచించాను. తను చిన్నపిల్లేగా, మా అమ్మాయి నిషిలానే కదా. తెలియకే ఇలా చేస్తుందేమో అని కూడా అనుకొన్నాను. కిరణ్ సుఖం, సంతోషమే నాకు ముఖ్యం కనుక మాలిని పుట్టినరోజున, నేనొక్కతినే వెళ్లి ఆ అమ్మాయిని కలవాలని కూడా అనుకొన్నాను.

నా ఒక్కగానొక్క కొడుకు మనసు భాధ పెట్టి, ఇలా పోట్లాటలు పెంచి, జీవితాన్ని దుర్భరం కానివ్వదలుచుకోలేదు. కానైతే, ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. మాలిని నన్ను చూడ్డానికి ఇష్టపడలేదని అర్ధమయ్యింది. అయినా కిరణ్ తో, "కన్నా, నీవే ఎలాగో మమ్మల్ని కలుపు. లేదా పెళ్లి చేసేసుకో. అన్నీ సర్డుకుంటాయిలే," అన్నాను.

వాడి నుండి నాకు వచ్చిన జవాబు నన్ను నిశ్చేష్టురాలిని చేసింది. తనకి అత్తింటి వారి ఉనికే వద్దనీ, లేదంటే పెళ్లి జరగదని కిరణ్ కి చెప్పిందట మాలిని. పైగా మంటపం ఛాయలకే, నేను రాగూడదని కిరణ్ కి ఆదేశాలు జారీ చేసిందట కూడా. వింత షరతులు విధించి, కాబోయేవాణ్ణి వేధించే ధోరణి అవలంబిస్తుంది మాలిని. నేనేరుగని ఓ కొత్త సాంప్రదాయం అన్నమాట.

వాళ్ళ అమ్మనాన్నలతో నేను మాట్లాడాలని మెసేజ్ పంపాను. "అంతా నా ఇష్టమే, వాళ్ళ ప్రేమేయమే లేదు, కాబట్టి నేనెలా అంటే అలా జరగాలి." అని జవాబిచ్చింది.

***

ఇతరుల సుఖసంతోషాల్ని హరించాలనుకొనే మాలిని లాంటి వారు ఉంటారన్నమాట. ఈ క్లిష్ట సమస్యనుండి బయటపడే మార్గం అన్వేషిస్తూ మనస్సు అలిసిపోయేది.

పాతికేళ్ళగా నా ప్రపంచమే నా పిల్లలుగా ప్రశాంతంగా సాగిన నా జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది. మా బిడ్డని మానుండి చీల్చాలని వేచి ఉన్న ఓ తోడేలులా అనిపించింది.. సుకుమారంగా కనబడే విషపూరిత ముళ్ళగులాబి మాలిని.

విద్యా విజ్ఞానాలతో పాటు కొందరిలో ఓ తెగింపు, ధిక్కార ధోరణి వల్ల ఇలాంటివి జరుగునేమోనని కూడా అనుకొన్నాను. వివాహబంధంతో ఏర్పడే  బాంధవ్యాలన్నా, బాధ్యతలన్నా ఈ నాటి యువతలో అయిష్టత, అసహనమే కన్పిస్తుంది. అర్ధంకాని మాలిని ప్రవర్తనకి నిర్ఘాంతపోయినా, అయోమయావస్థలో ఉన్న ఆ అమ్మాయిపై జాలి వేస్తుంది.

***

కాలం నత్త నడకలు నడుస్తూ మరో నెల గడిచింది. ఈ మధ్య కిరణ్ బిజీగా ఉంటున్నాడు. చూసి కూడా నెల దాటింది.

శనివారం పొద్దున్నే ఫోన్ చేసి, "ఐ యామ్ కమింగ్ ఇన్ టెన్ మినిట్స్, మీ ఇద్దరితో మాట్లాడాలి," అన్నాడు. కాస్త ఆదుర్దాగా ఉన్నా, వాడికి ఇష్టమైన ఎగ్ కర్రీ, పూరి చేయడంలో ఉండిపోయాను.

ఓ అరగంటలో వచ్చి, నన్ను, వాళ్ళ డాడిని లైబ్రరీలో కూర్చోబెట్టి ఎదురుగా కార్పెట్ మీద చతికిలబడ్డాడు కిరణ్. మా వంక చూస్తూ, "ఎంతగానో ఆలోచించి, నేను మాలినితో బ్రేక్అప్ కే డిసైడ్ అయ్యాను. మాలినిది, చాల అసమంజసమైన నడవడిక అనిపిస్తుంది. నాకు నచ్చలేదు. ఎవరికీ మంచిది కాదు. అందరు అన్ హాపీగా ఉండడం బాగా లేదు." అంటూ పైకి లేచి, "సో, అదీ సంగతి, నేను కూడా జాబ్ లో బిజీగా ఉండబోతున్నాను. నువ్వు, డాడి ఇక ఏమీ దిగులు పడవద్దు", "ఐ యామ్ హంగ్రీ, ఫుడ్ ప్లీజ్," అంటూ కిచెన్ లోకి దారి తీసాడు కిరణ్.

*****

రచయిత్రి పరిచయం ....

Uma Bharathi Kosuri‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in September 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *