Menu Close
Balluri Umadevi
శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు (పద్యకవిత)
డా. బల్లూరి ఉమాదేవి
11.ఆ.వె: మదిని తలచి నంత మరు నిమిషము నందె
          కనిపించి మనకు కలత బాపు
          నట్టి దైవ మింక నగపడడు మనక
          టంచు నెరుక పరచె నగ్రజునకు
12.ఆ.వె: శౌరి సతుల తోడ సాగుచు నుండగ
          దుష్ట బుద్ధి పూని తొయ్యలులను
          చుట్టుముట్టి ఖలులు పట్టి బంధించగా
          చేతకాని వాని నైతి నేను
13.ఆ.వె: విధి వశమ్మున యదు వీరులు మత్తులో
          మైమరచుచు బాసి రసువులచట
          నాదు బలమదెల్ల నశియించనిశ్శక్తు
          డైతి ననుచు పల్కెనార్తి తోడ
14.ఆ.వె: కాల అంత, గతిని దాట కాదెవ్వరికి సాధ్య
          మనుచు నా కిరీటి నన్న గారి
          కెల్ల సంగతులట నెరుక పర్చుచునిల్చె
          మ్లానవదనుడగుచు మౌన మూనె
15.ఆ.వె: కంటకమ్ము తోడ కంటకము ను తీసి 
          వేసినట్టు గాను వెన్ను డిలను
          శిష్ట జనుల కాచి. దుష్టుల శిక్షించి 
          తనువు వీడిచనియ ధరణి నుండి.
16.ఆ.వె: ఫల్గుణా కిరీటి పార్థుడాయని నన్ను
          ప్రేమతోడ పిలుచు వెన్నుడింక 
          కాన రాడ టంచు కంసారితో గల 
          బంధములను తలచి బాధపడియె
17.ఆ.వె: యాదవుల మరణము మాధవు నిర్వాణ 
          మరసి నట్టి పృథయు నార్తితోడ
‌          వెన్నుని మది నిలిపి వీడెను తనువును
‌          శాంత చిత్తమూని జగతి నుండి
18.ఆ.వె: కలియుగమ్ము వచ్చె క్రౌర్య మెల్లడనిండె 
          విస్తరించె హింస విస్తృతముగ
          ననుచు మది నెరింగి నర్జున పౌత్రుని 
          ప్రభువుగ నొనరించె పాండువిభుడు.
19.ఆ.వె: ఇంద్రియముల నెల్ల నిమ్ముగా బంధించి
          ముక్త కేశు డగుచు ముందు గాను
          బంధ ముక్తు డగుచు ప్రస్థాన మొనరించి
          సాగె ధర్మజుండు జవముగాను
20.ఆ.వె: శ్రీహరి పదములను చిత్తమందున నిల్పి
          విష్ణు లోకమునకు వేగిరముగ
          తగిన రీతిగాను దానములను చేసి
          యనుసరించి రనుజు లన్నబాట
21.ఆ.వె: వాసుదేవుడు మరి పాండవులు పయన
          మైన కథల నెల్ల నాలకించి
          నట్టి జనుల కెల్ల నందు కైవల్యమ
          టంచు శుకుడు దెలిపె నవనిపతికి.

రచయిత పరిచయం

Balluri Umadevi

నా పేరు డా. బల్లూరి ఉమాదేవి. కర్నూల్ జిల్లా లోని ఆదిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా (తెలుగు) పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాను. వివాహానంతరం బి ఏ, యం ఏ పూర్తి చేశాను. 2005 లో (నా 52 వ ఏట) తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీల పాటలు పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాను. మా తాతగారు, తండ్రిగారు, పెదనాన్నలు తెలుగు పండితులే కావడం వల్ల తెలుగు భాష పట్ల చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువగా వుండేది. అప్పుడప్పుడు పద్యాలు కవితలు రాసే నేను, పదవి విరమణ తర్వాత శంకరాభరణం గ్రూప్ వారి 'సమస్యా పూరణల'తో మరలా రచనకు శ్రీకారం చుట్టాను.

నా ముద్రిత గ్రంథములు (13)

1.శ్రీరామదూత శతకము 2.అక్షర వనం 3. మనో గీతికలు 4.తెలుగు బిడ్డ శతకము 5.శ్రీనివాస శతకం 6.దేవి శతకము 7.శ్రీ రామచంద్ర శతకం 8.శివపురాణ మహత్యము 9.శారదాంబ శతకం 10.హనుమత్ శతకము 11.హనుమోదాహరణము 12.కనకదుర్గ శతకము 13.శ్రీమద్భాగవతము- ఆణిముత్యాలు.

అముద్రిత గ్రంథములు: 1. హిమపవనాలు 2. ఖండకావ్య సమాహారం 3. 'ఆసరా' ఐదు ఆశ్వాసంలో సామాజిక పద్య ప్రబంధము 4. 'జీవన స్రవంతి' ఐదు అంకముల (పద్య నాటకం) 5. విష్ణు దేవ శతకము.

వాల్మీకి రామాయణంలోని అన్ని కాండలలోని కొన్నిసర్గలకు తేటగీతి ఛందస్సు 500 వరకు పద్యాలు రచించాను. వివిధ అంశములపై (సమస్యా పూరణాలు, దత్తపదులు) 5000 పద్యాలు రచించాను.

2000 వరకు కవితలను, 300 పాటలను రచించాను. కొత్త ఛందస్సులలో 100 పద్యములు రచించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు పొందాను. జాతీయ సదస్సులలోను ప్రముఖ పత్రికలలో నా వ్యాసములు ప్రచురితమైనవి. కర్నూలు రేడియో కేంద్రంలో వివిధ అంశములపై ప్రసంగములు చేశాను.

పొందిన బిరుదులు:

సహస్ర కవిరత్న, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి చక్రవర్తిని, సహస్రపద్యశ్రీ, (10500 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారిని చేతుల మీదుగా సహస్రపద్యశ్రీ బిరుదము అందుకున్నాను) కవితా భూషణ, కవిత విభూషణ, మహతి సాహితీ చక్రవర్తి ,కవివరా మొదలగు బిరుదులతో పాటు నారీ శక్తి పురస్కారం, కీర్తిరత్న పురస్కారం అందుకున్నాను.

అనేక అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పలుమార్లు నిషిద్ధాక్షరికి పృచ్ఛకునిగా పాల్గొన్నాను.

Posted in September 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *