Menu Close
వీరాంజనేయులు శివరాత్రి
రణక్షేత్రంలో పసికూనలు (కథ)
వీరాంజనేయులు శివరాత్రి

శరీరమంతా ప్రవహించిన రక్తం — గుండె వైపు పరుగులు తీసింది. కానీ అక్కడ గుండె లేదు — శరీరం నుండి వేరై ఎక్కడో పడిఉంది. గుండె లేని ఆ ఛాతిలోకి రక్తం మడుగులా వచ్చి చేరింది. ఆ గుండెను పెకలించిన యోధునిలో ఎన్నాళ్లుగానో అణిచివున్న ఆవేశం, ఆక్రోశం ఒక్కసారిగా పెల్లుబికాయి. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు. ఆ రక్తాన్ని దోసిళ్లతో తాగి ప్రతీకార దాహం తీర్చుకున్నాడు.

***

కొన్ని వేల సంవత్సరాల క్రితం…

Meadow

ప్రాతఃకాలం… ప్రశాంతంగా, ఆహ్లాదంగా విరాజిల్లుతున్న ఒక విశాలమైన మైదానం. మృదువుగా చల్లని గాలి చెట్ల ఆకులను తాకుతూ మెల్లగా వీస్తోంది. ఆ మైదానం మధ్యలో ఓ చెట్టు. ఆ చెట్టు కొమ్మల మధ్య ఓ చిన్న గూడు.

ఆ గూడులో ఓ పక్షి తన రెండు గుడ్లను ప్రేమగా పొదుగుతోంది. తన గుడ్లని చూసుకుంటూ, మురిపెంగా కౌగిలించుకుంటూ—

“నా చిన్నారి పిల్లలని త్వరలో చూస్తాను…” అని తన్మయత్వంతో ముద్దాడింది.

అంతలో…

ఆ ప్రశాంతమైన మైదానంలోకి అకస్మాత్తుగా లక్షలాది మంది మనుషులు చేరుకున్నారు.

అంతవరకు లాలించిన చిరు గాలి శబ్దం ఆ మనుషుల రణగొణ ధ్వనుల మధ్య మాయమయింది.

ఆ మనుషుల ముఖాల్లో ఆవేశం… వారి చేతుల్లో పదును తేలిన ఆయుధాలు— మనుషుల మాంసాన్ని చీల్చి— రక్తం రుచిచూడటానికి సిద్ధంగా ఉన్నాయి.

శంఖారావాలు హుంకరించాయి. కత్తులు కవచాలతో ఢీకొంటూ ఖణఖణ మోగాయి… గుర్రపు డెక్కలు నేలను ధడధడా దంచాయి… ఏనుగుల ఘీంకారాలు గుండెలని వణికించాయి.

మానవ మారణహోమం మొదలైంది… యుగాల పాటు మానవుల మదిని కలవరపెట్టే ఓ మహాసంగ్రామం…

***

చెట్టు మీద గూడులో… గుడ్లు నెమ్మదిగా పగులుతున్నాయి. రెండు చిన్న జీవాలు బయటికి వస్తున్నాయి. అవి కన్నులు సరిగా తెరవలేని పక్షి పిల్లలు.

ఇంతలో…

Warrior-rooting-out-treeమహాకాయుడైన ఓ యోధుడు ఉగ్రుడై ఆ చెట్టుని వేళ్ళతో సహా నేల నుండి పెకలించి తన శత్రువులపైకి విసిరాడు. ఆ భారీ చెట్టు క్రింద పడి హాహాకారాలు చేస్తూ కొందరు మరణించారు.

తన పిల్లలని కాపాడుకునే ప్రయత్నంలో వారి మధ్యన పడి నలిగిపోతూ… చివరిసారిగా… కీచుమంటూ ఆ తల్లి పక్షి చేసిన ఆక్రందన … ఆ మనుషుల హాహాకారాల్లో కలిసిపోయింది.

ఆ విసురులో ఆ పక్షి పిల్లలు దూరంగా ఒక చిన్న గుంతలో ధడేలున వచ్చి పడ్డాయి. ఆ కుదుపుతో ఈ ప్రపంచంలోకి మొదటిసారి కళ్ళు తెరిచాయి. ఒంటినిండా గాయాలయ్యి శరీరం చీరుకుపోయి బాధతో కీచుకీచుమని ఏడవటం ఈ ప్రపంచంలో వాటి మొదటి అనుభవం.

అమ్మ అంటే తెలియని పిల్లలు… నొప్పికలిగితే అమ్మని పిలవాలని తెలియని పిల్లలు… అప్పుడే తెరిచిన కళ్ళతో అయోమయంగా చుట్టూ చూశాయి..

“అయ్యో! నా బిడ్డలు..నా బిడ్డలు” అని ఆ తల్లి ఆత్మ.. ఏ లోకాలనుండి నిస్సహాయంగా విలపించిందో!!

ఆ రణక్షేత్రం సైనికుల హాహాకారాలు, పెడబొబ్బలతో దద్దరిల్లుతోంది. ఖడ్గాల కిరాతక నృత్యంలో ఛిన్నాభిన్నమవుతున్న మానవ శరీరాలు… కాళ్లు విరిగి ఆక్రోశంతో హీంకరిస్తున్న గుర్రాలు… భళ్లాల తాకిడికి అల్లాడుతూ ఘీంకరిస్తున్న ఏనుగులు… యుద్ధం భయంకరంగా జరుగుతోంది.

ఇద్దరు మహా యోధులు ఒకరినొకరు ఢీకొని పిడిగుద్దులతో దాడి చేసుకుంటూ వచ్చి ఆ పసికూనలున్న గుంత సమీపంలో ధడేలున పడ్డారు. అంతకు ముందర చెట్టును పెకలించి విసిరిన మహాకాయుడు వారిలో ఒకడు. ఆ యోధుడు తన ప్రత్యర్థిని కూలదోసి, అతని గుండెలపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం కర్కశంగా తన వేళ్లను అతని ఛాతిలోకి బలంగా లోతుగా గుచ్చి ఛాతీని చీల్చాడు— ఆ లోపలి గుండెను పెకలించి దూరంగా విసిరేసాడు.

శరీరమంతా ప్రవహించిన రక్తం— గుండె వైపు పరుగులు తీసింది. కానీ అక్కడ గుండె లేదు—శరీరం నుండి వేరై ఎక్కడో పడిఉంది. గుండె లేని ఆ ఛాతిలోకి రక్తం మడుగులా వచ్చి చేరింది. ఆ గుండెను పెకలించిన యోధునిలో ఎన్నాళ్లుగానో అణిచివున్న ఆవేశం, ఆక్రోశం ఒక్కసారిగా పెల్లుబికాయి. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు. ఆ రక్తాన్ని దోసిళ్లతో తాగి ప్రతీకార దాహం తీర్చుకున్నాడు.

***

విస్తుపోయి అటే చూస్తున్నాయి ఆ పక్షి పిల్లలు—

“ఆ ఇద్దరూ ఒకే జాతి వాళ్లు — మనుషులు… మనుషులు మనుషులని చంపుకోవడం ఏమిటీ!” ఆశ్చర్యపోయాయి ఆ లేత హృదయాలు.

అంతలో వాటికి ఆకలివేస్తున్న విషయం గుర్తుకొచ్చింది. పుట్టిననాటి నుండి ఏమీ తినలేదు. భయంకరమైన ఆకలి. ఆ పసికూనలు ఒకదానినొకటి చూసుకున్నాయి.

“ఈ మనుషుల్లాగ… తాము కూడా ఒకరినొకరు చంపుకుని తినాలా?”

ఆకలిని మించిన క్రూరమైన ప్రేరణ ఈ ప్రపంచంలో మరేదైనా ఉందా?

కానీ ఆ తలంపే వాటికి జుగుప్సగా తోచింది. తన తోబుట్టువుని చంపాలనే ఆలోచన నీచమనిపించింది. వాటి వివేకం ముందర ఆకలి ఓడిపోయింది.

ఒకదానినొకటి కౌగిలించుకుని, మౌనంగా కన్నీరు కారుస్తూ, ఆకలితో మరణించడానికి సిద్దపడ్డాయి.

మనుషులు మాత్రం ఒకరినొకరు సంహరించుకోవడంలోనే పూర్తిగా మునిగిపోయారు. ఆకలి కన్నా క్రూరమైన ప్రేరణ ఏదో వారిని ఉరకలెత్తిస్తోంది.

***

దూరం నుండి ఓ రధం వేగంగా వస్తోంది. దానిపై ఒక సారధి— పసుపు రంగు వస్త్రాలు, తలపై నెమలి పించం.

ఆ రధం పక్షి పిల్లలకు దగ్గరగా వచ్చి ఓ గుంతలో ఎగిరిపడి పరుగు పెట్టింది. ఆ ఎగరడంలో ఆ సారధి వస్త్రాల మడతల్లోంచి కొన్ని అటుకులు వచ్చి ఆ పిల్లల దగ్గర పడ్డాయి.

ఎటు చూసినా ఆక్రందనలువ హాహాకారాలు ప్రతిధ్వనిస్తున్న ఆ మారణక్షేత్రంలో ఆ చిన్నారుల మొర ఏ దేవుడు విన్నాడో. అమ్మలేని ఆ పిల్లల ఆకలి ఏ దేవత కన్నదో…

ఆ అటుకులు ఆబగా తిని ప్రాణాలు నిలుపుకున్నాయి.

***

మరుసటి రోజు…మళ్లీ అదే రధం. మళ్లీ అదే మార్గం. మళ్లీ కొన్ని అటుకులు. అలా ప్రతీ రోజు…

మానవుల రక్తదాహం తీరిందో… లేక చంపడానికి మనుషులే మిగలలేదో… యుద్ధం ముగిసింది.
ఎటు చూసినా మానవ కళేబరాలు గుట్టలుగా పేరుకుపోయాయి. నక్కలు, తోడేళ్లు కడుపునిండా తిని ఊళలు వేస్తున్నాయి. ఎగిరే రాబందులతో ఆకాశం దట్టంగా కమ్ముకుంది.

ఆ భయంకర భీతావహ దృశ్యాల మధ్య… ఓ మూల చిన్న గుంతలో, ఎవరి కంటా పడకుండా… మిగిలిన అటుకులు తింటూ, బిక్కుబిక్కుమంటూ, తమ రెక్కలకి బలం ఎప్పుడు వస్తుందా అని కళ్ళు మిటకరించి ఎదురు చూస్తున్నాయి ఆ పక్షి పిల్లలు.

***

ప్రపంచం క్రమంగా మారుతోంది. తాము పుట్టి కళ్ళు తెరిచి చూసిన ఆ భయంకర దృశ్యాలు క్రమంగా కరిగిపోయాయి. ఆకాశంలో రాబందుల గుంపులు కనిపించడంలేదు. నేలపై నక్కలు, తోడేళ్ల ఊళలు వినిపించడం లేదు.

ఈలోగా ఆ పిల్లలకు రెక్కలు మొలిచాయి.

ఒకదానితో ఒకటి కూడబలుక్కుని, తమలో తాము ధైర్యం నింపుకుని ఆకాశంలోకి ఎగిరాయి… పశ్చిమ దిశగా ఎగిరి ఎగిరి చివరకు సముద్రతీరాన ఓ నగరానికి చేరుకున్నాయి.

ఆ నగరపు పొలిమేరలోని ఒక చిన్న ఇంటి చూరులో ఆగాయి.

***

ఇంటి బయటి నుండి ఎవరో పిలిచారు—
“సుధామా…” అని.

ఇంట్లో నుంచి ఒక సాదాసీదా మనిషి బయటికి వచ్చాడు. ఆయన ముఖంలో సౌమ్యత… ప్రశాంతత…

ఆ వచ్చిన వారితో ఎదో మాట్లాడి పంపించాడు.

లోపలికి వెళ్తూ… ఆ చూరులో ఉన్న పక్షి పిల్లలను గమనించాడు. వాటి కళ్ళలోని దైన్యం అతని మనసుని తాకింది. లోపలికి వెళ్లి కొన్ని అటుకులు తీసుకొచ్చి వాటి ముందు చల్లాడు.

ఆ పిల్లలు కిందకి దిగి ఆ అటుకులను గబగబా నోట్లో వేసుకున్నాయి. ఆ రుచి…ఆ రుచి వాటికి తెలుసు.

అవి ఒకదానినొకటి చూసుకున్నాయి.

“ఇవి… ఆ అటుకులే…”

ఇప్పుడు తమ ఆకలి తీర్చిన సుధాముడికి…అప్పుడు ఆ భయంకర సంగ్రామ క్షేత్రంలో ఇవే అటుకులు తమకు చేరవేసి తమ ప్రాణాలు కాపాడిన నెమలి పింఛం సారథికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంతో స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

Flying-birds

********

Posted in September 2026, కథలు

4 Comments

  1. C. Ramakrishna

    Manasuku hathukunela chala bagundi. Bharatha sangramam tho jodinchi rayatam chakkati prayogam. Rachayitha gari oohaa Shakthi ki joharlu. Rachana shyli kuda bagundi

  2. NAMBURU RAMESH BALAJI

    కథనం మరియు కథావస్తువు బాగున్నాయి
    పశు పక్షాదులకు ఉన్న కనీస ఙ్ఞానం మనుషులకు లేకుండా పోయింది
    మన మనసులు స్వచ్ఛమైనవి అయితే దేవుడు ఏదో రూపంలో కాపాడుతాడు అనడానికి పసి కూన లకు అటుకులు దొరకటమే గొప్ప ఉదాహరణ
    చాలా తక్కువ వాక్యాలలో ఎక్కువ మెసేజ్ ఉంది.
    పొట్టి కథ లో పెద్ద మెసేజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *