Menu Close
Shyama Sundara Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

భరణీ రాణి, సంగీత సామ్రాజ్ఞి, "భానుమతి”

Bhanumathi, Telugu actress

గాయని గా..నటి గా..సంగీత దర్శకురాలిగా..దర్శకురాలిగా, రచయిత్రి గా, నిర్మాత్రి గా..స్టూడియో అధినేత్రి గా ఎంత పేరు గడించిన....అహంభావి అని కొందరు ముద్దు పేరు పెట్టినా...అది కేవలం ఆత్మ గౌరవం అని మనస్సును జోకొడుతూ, మహిళలలో అరుదైన వ్యక్తిత్వంతో అలరారిన భరణీ రాణి, సంగీత సామ్రాజ్ఞి, చిరు పొగరు వగరు రంగరించిన స్వరధుని, నటీమణి శ్రీమతి పాలువాయి భానుమతి.

పాతిక వేలు పెట్టుబడి తో భరణి స్టూడియో..స్థాపించి..సొంత చిత్రాలు తీయడం ప్రారంభించి, రత్నమాల (1948), లైలా మజ్ను (1949), ప్రేమ (1952), చండీరాణి (1953)...ఇలా చక్కటి మూవీస్ ఎన్నో తీశారు మల్లీశ్వరి(1951) భానుమతి గారి సినీ జీవితంలో మైలురాయి. అలాగే బాటసారి, విప్రనారాయణ లాంటి సినిమాలు కూడా. ఎవరేమనుకున్నా నా దారి రహదారి..అని రజనీకాంత్ డైలాగ్..విసరగల ధీశాలి ...ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి ఫిమేల్ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగు సినిమాలలో మొట్టమొదటి స్త్రీ దర్శకురాలిగా చండీ రాణి సినిమాను డైరెక్ట్ చేసిన ఘనత ఆవిడదే. భారత్ దేశంలో అప్పట్లో భానుమతి గారు ఒక్కతే ఒక ఫిలిం స్టూడియో యజమాని. 1953లో భానుమతి గారు పురందర దాసు భజనలను ప్రైవేట్ గా రికార్డ్ చేయించారు ఆవిడ. త్యాగరాజ కృతులను తెలుగు సినిమాలలో పాడిన మొదటి గాయని (1939లో వరవిక్రయం సినిమా లో మొదట పాడారు).

భానుమతి రామకృష్ణల ప్రేమాయణం, వివాహం - ఆవిడ నటిగా ఆయన అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ప్రారంభమయింది "కృష్ణ ప్రేమ" షూటింగ్ లో డైరెక్టర్ చెప్పినట్లు భానుమతి పరుగెత్తి పడ్డది. కానీ బురద బాగా అంటుకోలేదు బట్టలకు. ఏమయ్యా...రామకృష్ణా (అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ని పిలిచి)..కొంచెం బురద తీసి భానుమతి బట్టలకు పుయ్యమన్నాడు. 16 ఏళ్ళ భానుమతి కి ఈ నటన అంటేనే విసుగు. కోపంగా చూస్తున్న ఆమె దగ్గరకు జంకుతూ వచ్చి...కొంచెం బురద బట్టలకు పులిమి..వెళ్ళి పక్కన నిల్చున్నాడు రామకృష్ణ. ఆ షూటింగ్ లోనే (1943) భానుమతి కి చెట్టు ముళ్ళు గుచ్చుకొని రక్తమొస్తుంటే ..కంగారుగా..నారద పాత్రధారి టంగుటూరి సూర్యకుమారి గారు...’అరెరే..రక్తమొస్తుంది..ఎవరైనా తడిగుడ్డ తెండి’ అని అరిస్తే...రామకృష్ణే తన తెల్లటి కర్చీఫ్ నీళ్ళలో తడిపి కట్టు లాగా కట్టాడు. ఇతనిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది...అనుకుంది భానుమతి. శాంతకుమారి భానుమతితో రామకృష్ణ గారి గురించి పందెం కాసి ఓడిపోతే భానుమతి గారికి ఆ రెండు రూపాయలు పాపం రామకృష్ణ గారి దగ్గర ఇప్పించారట భానుమతికి అందరూ కలసి. భానుమతి గారు స్వర్గస్తులయ్యేంత వరకు ...ఆ కర్చీఫ్, ఆ 2 రూపాయలు ఆవిడ పదిలంగా దాచుకున్నారట. ఆ విధంగా "కృష్ణ ప్రేమ” సినిమా బాగానే ఆడింది. రామకృష్ణ భానుమతుల ప్రేమ ఇంకా బాగా పండింది. తండ్రి నెదిరించి వివాహం చేసుకుంది. బొమ్మరాజు భానుమతి, పాలువాయి భానుమతి అయ్యింది.

ఇక సినిమాలకు స్వస్తి చెప్పి...హాయిగా సంగీత సాధన చేసుకుంటూ ఉండొచ్చు అనుకున్న భానుమతికి కొడుకు భరణి పుట్టాక...బి.ఎన్.రెడి & లింగమూర్తి బలవంతం మీద స్వర్గసీమ లో వాంప్ రోల్ ధరించక తప్పలేదు. స్వర్గసీమ చరిత్ర సృష్టించింది అప్పట్లో. ఇక భానుమతి కి తప్ప లేదు. వెను తిరిగి చూడనూ లేదు. అప్రతిహతంగా తన బాణీలో పాత్రలు పోషిస్తూ...పాడుకుంటూ..సుమారు అన్ని భాషల్లో కలిపి 200 పైగా చిత్రాలు చేశారు. ‘అసలు నాకు నటనంటే అంత ఇష్టమేమీ ఉండేది కాదు. కానీ నటించాను. సంగీతమే ప్రాణం. మా నాన్నగారు వెంకట సుబ్బయ్య గారికి మాట ఇచ్చాను. అందుకే ప్రతి సినిమాలో ..ఒక త్యాగరాజ కృతో, అన్నమయ్య కీర్తనో, క్షేత్రయ్య పదమో..ఏదో ఒక సంప్రదాయ గీతం పెట్టిస్తాను. నన్నొక ఎం.ఎస్.సుబ్బులక్ష్మి చేయాలని మా నాన్న అనుకుంటే...నేనేమో నటిగా రాణించాను. వ్రాత ఎవ్వరు తప్పించలేరు కదా!’..అన్న భానుమతి గారికి జ్యోతిష్యం, జాతకాలు చూడడం లోను మంచి నైపుణ్యముంది.

భానుమతి గారి చతురతకు ఒక ఉదాహరణ. రామారావు గారికి భానుమతి అంటే ప్రత్యేకమైన అభిమానం. ‘తాతమ్మ కల’ లో నటించేందుకు వారికి 25000 రూపాయల చెక్కు పంపారట ఎన్.టి.ఆర్. కానీ...అప్పుడు వాళ్ళ పారితోషికం 50000.ఎన్.టి.ఆర్. కూడా అంతే తీసుకునేవారట. మరి భానుమతి సీనియర్ కదా...మెయిన్ రోల్...ఆ చెక్కు నందమూరి కే తిప్పి పంపి, దీన్ని మీ పారితోషికంగా ఉంచండి. మీరు "మా అమ్మాయి పెళ్ళి" మూవీ లో నటించేందుకు...అని చీటీ రాసి పంపారట. ఎన్.టి.ఆర్. విధిలేక పాతిక వేల కే  'అమ్మాయి పెళ్లి’ మూవీలో నటించారట.

భానుమతి గారి సినీ ప్రస్థానంలో ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని తెలుసుకుందాం. తనకన్నా సీనియర్ అయిన ఘంటసాల గారితో పాటల రికార్డింగ్ సందర్భంగా ఏ మాత్రం మొహమాటం లేకుండా . "నాతో రికార్డింగ్ ఉన్న రోజు.. ఆ చుట్టలకు...కాస్త దూరంగా ఉండండి. ఆ వాసనంటేనే నాకు పడదు" అని ఘంటసాల గారికే ఆంక్షలు విధించింది. అలాగే విజయ ఫిలిమ్స్ చక్రపాణి గారితో మాట పట్టింపు వల్ల మిస్సమ్మ ఛాన్స్ వదులుకుంది. ఆ పాత్ర సావిత్రికి రావడం అందరికీ తెలిసిందే. భానుమతి గారితో ఆ మాట అంటే "నేను తప్పుకోబట్టి సావిత్రి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ పరిచయం అయింది” అని అంది. అలాగే ఎం.జి.ఆర్ తో భేదాభిప్రాయం వల్ల ఒక తమిళ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల బి సరోజా దేవికి ఆ ఛాన్స్ దక్కింది. ఆ విధంగా ఇద్దరు మేటి హీరోయిన్లను ఎంకరేజ్ చేసినట్లు అయింది. ఏ ఎన్ ఆర్, ఎన్ టి ఆర్ లాంటి అగ్ర నటులపైన కూడా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించేది.

భానుమతి గారికి ఆత్మ విశ్వాసం మెండు. ఆవిడ..అహంభావి ఎందరో అనుకుంటారు. ఆ విధంగా అనే ధైర్యం ఆవిడ సొంతం ఏ నాడు తన ధోరణికి ఏ మాత్రం జంకు బొంకు లేకుండా సినీ రంగములో రాణించింది. ఒకసారి ఒక పత్రిక విలేఖరి NTR, ANR లతో నటించేటప్పుడు మీ అనుభవం ఏమిటి అని అడిగితె "నాతో యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళను అడగండి" అని చెప్పింది. భానుమతి స్థానాన్ని ఎవ్వరూ భావి తరాల్లో భర్తీ చేయలేరని తనకు తానె సాటి ప్రకటించుకున్న కళాకారిణి భానుమతి గారు.

పద్మభూషణ్ అవార్డ్ తో కలిపి ఎన్నో అవార్డులు, బిరుదులు కైవసం చేసుకున్న భానుమతిగారు మద్రాసు మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పని చేశారు. పలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ లు సాహిత్య అకాడెమీ అవార్డులు పొందారు.

ఆ రోజుల్లో ప్రముఖ హీరోయిన్లు చాలామంది లక్స్ సబ్బుకు ప్రకటనలు ఇచ్చేవారు. లక్స్ కంపెనీ వారు భానుమతి గారికి ఎక్కువ డబ్బు ఆఫర్ చేసిన "నేను మీ సబ్బు వాడను అటువంటప్పుడు నేను ప్రకటనలో ఎలా పాల్గొంటాను" అని నిష్కర్షగా చెప్పిన హీరోయిన్ ఆవిడ ఒక్కతే అప్పట్లో. భానుమతి గారు మంచి రచయిత్రి గా కూడా రాణించారు ఆవిడ ఆత్మకధ "నాలో నేను" ఇంగ్లీష్ లో కూడా అనువదించబడింది. భానుమతి గారి "అత్తగారి కధలు” పుస్తకానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తనకు నటన కన్నా సంగీతం, కథా రచయితగా ఉండటమే ఇష్టం అని అంటుండేవారు. ఆవిడ లలిత కళా అకాడమీ సభ్యురాలిగా 5 ఏళ్ళపాటు, సాహిత్య అకాడమీ సభ్యురాలిగా 10 ఏళ్ళు పనిచేసారు. చెన్నై నగరంలో సాలిగ్రామము అనే ప్రాంతములో పేదలకు ఉచిత విద్య అందించడానికి డాక్టర్ భానుమతి రామక్రిష్ణ పేరుతొ ఒక మెట్రిక్యులేషన్ స్కూల్ ను ప్రారంభించారు. భానుమతి గారు చిల్డ్రన్ ఫిలిం సొసైటీ సభ్యురాలిగా 5 ఏళ్ళు ఉన్నారు. భారతదెశ మొదటి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆవిడ అభిమాని. సావిత్రి జమున వంటి అగ్ర హీరోయిన్లు మేము సినిమాల్లో చేరడానికి భానుమతి గారే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఇప్పుడున్న నటీమణులు విజయాలు సాధించిన వారు ఎవ్వరు కూడా భానుమతి గారిని అందుకోలేరు అన్న విషయం అందరు ఒప్పున్నదే. ఆవిడ సక్సెస్ లెవెల్ ఏ నటికీ చేరుకోలేని అంత ఎత్తులో ఉంటుంది. ఎం జి రామచంద్రన్ కన్నా వయస్సులో చిన్న అయినా సినీ రంగములో ఎవరు కూడా రామచంద్రన్ ను పేరు పెట్టి పిలిచేవారు కాదు. అటువంటిది భానుమతి రామచంద్రన్ అని పేరు పెట్టి పిలిచేది. అందరూ భానుమతి గారిని భానుమతి అమ్మా అని పిలిచేవారు. ఆ విధంగా సినీ రంగములో తనదంటూ ప్రత్యేక స్తానం ఏర్పరచుకున్న మేటి నటి భానుమతి గారు.

ఇంకా సత్కారాలు బిరుదు విషయానికి వస్తే 1966 లోనే పద్మశ్రీ, 2001 లో పద్మభూషణ్, నటనలో రాష్ట్రపతి అవార్డులు, నేషనల్ ఫిలిం అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఉన్నాయి. ఇంకా, చాలా విశ్వవిద్యాలయాలు గొరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై  భానుమతి గారిని "నడిప్పుక్కు ఇలక్కనం" అనే బిరుదు తో సత్కరించారు. 2025 లో ఆవిడ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆవిడా స్మృత్యర్థం కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.

***********

Posted in September 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *