Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
శా. “గోవిందా” యను నామ మందె నిలుచున్ ‘‘గోదా” స్వయంభూవిధిన్
     “గోవిందా” కడుప్రీతిపాత్రమగుఁగా గోపాలకృష్ణయ్యకున్
     దావిం దాల్చు సుమాలమాలలను దాఁ దాల్చెన్ గదా గోదయే
     గోవిందార్పణ ముందు, విందగు నదే కొల్వొందె నామాళిగా(1)
               (1) గోవిందనామాలుగా 301

‘తొలి’విశిష్టత
సీ. తొలినోటి మా “టమ్మ” తెలుగింటఁ బుట్టినఁ; 
           దొలికోడి కూఁత మేల్కొలుపు జగతి;
     తొలిపల్కు(1) మూలమ్ము తెలియ నేదైనను,
           బరమాత్ము నెఱిఁగించు పట్టుగొమ్మ;
     తొలిసూర్యకిరణాలు గిలిగింతలనుబెట్ట
           మేల్కొని వికసించు మేలుతమ్మి;
     తొలిసంజ మనము నిర్మలకుశాగ్రంబయి
           స్పష్టతఁ జేకూర్చుఁ బదములకును;
     తొలిపూజ చెల్లును దొండమయ్య(2)కె; తొలి
           యేకాదశియె క్రొత్తయేఁట నాంది
     పలుకుఁ బర్వములకుఁ; దొలిగడపే వేంక
           టేశుదర్శనప్రాప్తి కెంతొ ప్రియము;
     తొలిభిక్షువు శివుండు; దొలి హరిపూర్ణావ
           తారంబు దేవకీతనయుఁ డిలను;
     తొలియడుగే బహుదూరప్రయాణంబు
           సేయ ముఖ్యంబగు జీవులకును;
     వడుగున నూతనవటునకుఁ దొలిభిక్ష
           వేయ మాతకె చెల్లు వేదవిధిని;
     తొలిప్రేమ జంటనుఁ గలుపు, సార్థకమైనఁ
           బండించు రెండు జీవనము లెపుడు;
     తొలిరంగనాట్యంబు, తొలికళాఖండంబు
           తొలిరోజు బడిగుడిదొరతనంబు,
     తొలిపరిచయములు, తొలిజీత మందినఁ
           గలుగు నుత్సాహంబు గరువ(3), మింట
     తొలిమొగ్గ తొడిగిన తోఁటమొక్కయుఁ, దొలి
           బిడ్డ పుట్టుక యిడు పెద్దముదము;
     తొలివార్షికోత్సవతూర్యమానితపత
           కాహ్లాదముల్(4) వాణి(5) కగునె తెలుప?
     తొలిచిన్కులే భూమిఁ బులకింపఁజేయుచుఁ
           బర్వు సుగంధముఁన్ బలుదెసలను;
     తొలిఁ దాను బూజింపఁ గలిగిన ఫలమని 
           త్యాగయ్య కీర్తించె దాశరథిని;
తే.గీ. తొలివి(6) గలవెన్నొ సృష్టినిఁ దెలియఁ, దెలుపఁ
       దెలివి కలవియె(7)? కడలిలోఁ గల యలలనఁ
       దెఱలు తెఱలుగ జనియించి తీరమునకుఁ
       దరలి యరుదెంచు మఱల సుందర మగుచును 
            (1) వేదము (2) తొండమయ్య=వినాయకుడు 
            (3) గర్వము (4) మొదటి వార్షికోత్సవము నాటి
                వాద్యాలు, మన్నింపబడిన పతకాల వలని సంతోషాలు
            (5) వాక్కు/సరస్వతి (6) మొదటివి (7) అలవి యగునా 302

కవిత్వము
ఉ. నే నొక మాధ్యమంబు నయి నిత్యము సేవ యొనర్తు మాధవా!
    ధ్యానము సేయు వేళఁ బరమాత్మునిపై నెద నిల్పి, లేక తా
    జ్ఞానవిలోచనంబులను గాంచెడి వేళనొ కమ్రదృశ్యముల్,
    మానితపద్యముల్ నుడివి మాధురిఁ బంచఁగ మూర్తి యింటిలో 303

ఉ. మంచితనంబు సద్గళము మంగళదాయకనిత్యమాధురీ
    సంచితవాగ్ఝరీహృతరసజ్ఞమనమ్ముల నిచ్చి పెంచి దీ
    వించి తరింపఁజేతువు; మదీయకృతజ్ఞత నందఁజేయఁ బ
    ద్యాంచితపాదపద్మముల నాత్మ భజింతు మదంబ! శారదా! 304

అభిషేకదర్శనము
ఉ. నీ యభిషేకదర్శనము నిత్యశుభప్రద మయ్య! శంకరా!
    కాయము నీ వొసంగినదె కల్గఁగ జన్మము మానవాళిలోఁ,
    జేయున దెల్ల భక్తిమెయిఁ జేతు సమర్పణ నీకె యీశ్వరా!
    మాయ హరించి బ్రోవుమ యుమాధవ! మాధవ! మాధవప్రియా! 305

ఉ. కీసరవాస! భక్తజనకిల్బిషదోషహరా! విభూతిరే
    ఖాసమపుండ్రలేపితసుగంధసుకుంకుమయుక్తతండులో
    ద్భాసితదివ్యలింగ!(1) రఘువంశశిరోమణిరామపూజితా!
    నీ సమదైవ మెందుఁ గననేరము, కావర, నిత్యశంకరా!
           (1)విశేషము
    [కీసరగుట్టలోని స్వయంభూలింగమైన రామలింగేశ్వరస్వామిమూలవిరాట్టుకు
    అభిషేకము చేసిన తర్వాత మూడు వ్రేళ్ళతో విభూతిరేఖలను అడ్డపుండ్రముగా
    వ్రాసి, మధ్యలో గంధమును దిద్ది, అది తడి ఆరకముందే దానిమీద గుండ్రముగా
    బియ్యమును అద్ది, ఆ బియ్యము మీద మధ్యభాగములో కుంకుమబొట్టును
    గుండ్రముగా అలంకరించడము నిత్యము జరిగే ప్రక్రియ. దీని తర్వాత పుష్పా
    లంకరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. అభిషేకము జరిగిన 
    ప్రతిసారి ఇలా చేయడము ఆలయసంప్రదాయము] 306
Posted in September 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *