Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
ఎదురీత
- కిరణ్మయి గోళ్ళమూడి -

రూప పేరుకు తగ్గట్లు చక్కని రూపసి. మంచిరంగు, పొడవుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. పెద్దజడ ఆమెకు మరో అదనపు ఆకర్షణ. ఆమెను త్వరగా గుర్తు పెట్టుకునేందుకు అది ఒక కారణం కూడా.

ఆఫీస్‌లో ఎంత పని ఉన్నా అలసట కనబడనివ్వదు. మితభాషిణి కూడా కావటం, రిజర్వుడుగా ఉంటూ తన పనేదో తాను చూసుకుని పనిలో మంచి ఫలితం ఇవ్వటంలో ముందు ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటుందని అహంభావిగా ముద్రపడి పోవటం మైనస్ పాయింట్ అయినా అది ప్లస్‌గానే కనిపిస్తుంది ఆమెకు. ‘నా జోలికి ఎవరూ రాకుండా కాపాడుతుంది’ అంటుంది నవ్వుతూ. ఆ నవ్వు వెనుక తన అనుభవాల పరదా ముడిపడి ఉంటుంది.

ముప్పయి ఏళ్ళు వస్తున్నా పెళ్లికి సుముఖంగా లేని రూప ‘పెళ్లి’ మీద వెలిబుచ్చే అభిప్రాయాలు విచిత్రంగానే ఉంటాయి. పురుషుల మనస్తత్వాలను తూర్పారబడుతున్న ఆమెను ‘పురుషద్వేషి’ అని మొహం మీదే చెప్పినా కాదనదు పైగా నవ్వేస్తుంది. ‘నిజం కూడానూ’ అంటుంది సరదాగా నవ్వేస్తూ.

“పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా?” అని ఎదురు ప్రశ్నలు అడుగుతుంది. అలా అయితే ఇన్ని విడాకుల కేసులు రోజురోజుకూ ఎందుకు పెరుగుతున్నాయి అంటుంది. ఆమె ప్రశ్నలు అన్నీ లాజిక్‌తో కూడి ఉండటం వలన ఎవరూ నోరు ఎత్తరు. ఆమె నిప్పులాంటిది అని కూడా అందరికీ స్పష్టం అయింది.

“బాస్ పిలుస్తున్నారు!” అని ప్యూన్ చెప్పటంతో ఛాంబర్‌లోకి వెళ్ళింది.

“హాయ్! రూపా!” అంటూ చేయి చాపాడు రవీంద్ర. ఆమె నమస్కరించటంతో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అసంతృప్తిగా. ‘రూప ఎప్పుడూ ఇంతే’ అని మనసులో తిట్టుకుంటూ ఆమెను తినేసేలా చూస్తూ, కూర్చోమని చెప్పాడు రవీంద్ర.

అతని కేబిన్‌లో సీసీ టివి తన సీట్‌ని ప్రాజెక్ట్ చేస్తూ ఉండటం గమనించి ఆమె మొహం ఎర్రబడింది. రవీంద్ర తన ఛాంబర్‌లో కూర్చుని రూప ప్రతి కదలికని గమనిస్తున్నాడని తెలియగానే, ఒళ్ళంతా తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్లు ఉంది.

“రూపా! నేను చెప్పిన విషయం ఏమి ఆలోచించావ్? అది మన ఇద్దరి మధ్యే ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం రూపా! నిన్ను చూడకుండా నేను ఉండలేక పోతున్నాను. కనులు మూసినా తెరచినా నువ్వే కనబడుతున్నావ్!” టేబుల్‌పై ఆమె ముందుకు వంగుతూ రవీంద్ర.

“సర్! మీరు పెద్దవారు. మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి!” అంది రూప వెనక్కి జరుగుతూ.

“నా వయసు గురించి ఆలోచించకు! నా స్టేటస్ కూడ పెరుగుతుంది. నిన్ను యువరాణిలా చూసుకుంటాను! నువ్వు ఊ అంటే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను! చెప్పు రూపా!” స్థిరంగా ఉంది రవీంద్ర గొంతు.

“మరి దాదాపు నా వయస్సు ఉన్న మీ పిల్లల్ని ఏం చేస్తారు?” సూటిగా అడుగుతున్న రూపను మింగేసేలా చూస్తూ “అది పెద్ద విషయం కాదు రూపా!” అంటున్న అతన్ని మధ్యలోనే ఆపేస్తూ… “విషయం కాకపోవటం ఏమిటి? మీకు నాకు దాదాపు 20 ఏళ్ల తేడా ఉంది. నేను ఇప్పటి వరకు పెళ్లిచేసుకోకపోవటానికి నాకు అనేక కారణాలు ఉన్నాయి. మీరు ఇలా బరితెగించి మాట్లాడటానికి సిగ్గుగా లేదూ?” చిరాకుగా అంది రూప…

“నిన్ను నా దారికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు! నీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ పెండింగ్‌లో ఉంది. నువ్వు నన్ను తప్పించుకుని ఎక్కడికీ పోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్లినా అక్కడకు నీ బాస్‌గా వస్తాను. నీ ప్రమోషన్ కూడా నాచేతిలో పనే గుర్తుంచుకో! నేను చెప్పినట్లు వింటే నీకే మంచిది!” ఆమె లేచి బయటకు వస్తోంటే వెనక నుండి అతని మాటలు విషం కక్కుతున్నాయి.

సీట్లో కూర్చున్నదే కానీ చాలా చిరాకుగా ఉంది. రోజురోజుకూ రవీంద్ర రెచ్చిపోతున్న తీరు విభ్రాంతిని కలిగిస్తోంది. తన ట్రాన్సఫర్ ఆర్డర్ వచ్చి మూడు నెలలు అవుతున్నా ఏదో ఒక కారణం చూపుతూ రిలీవ్ చేయటం లేదు. ఇప్పుడు ప్రమోషన్‌కి కూడా అడ్డం పడతాడు. అతడిని ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఆమెకు స్పష్టంగా తెలుసు. అతను ‘మేకవన్నె పులి’ అని అందరికీ తెలియదు. అతని నిజస్వరూపం ఎలా బయట పెట్టగలదు తను? పై వాళ్లకు ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటారని తనకు నమ్మకం లేదు. అతనికి ఉన్న పలుకుబడి అలాంటిది. తను అవివాహిత కావటం, పైగా వివాహానికి తాను సుముఖంగా లేదన్న విషయం తెలిసినప్పటి నుండి అతడు మరింత అలుసుగా తీసుకుంటున్నాడు. ఎలా ఈ పరిస్థితినుండి బయటపడాలి? రకరకాల ఆలోచనలతో ఆమె తల పగిలిపోతోంది.

“హాయ్! రూపా!” అన్న పిలుపుతో తలెత్తింది. ఎదురుగా లీగల్ ఆఫీసర్ సరిత.

“ఏమిటి రూపా! లంచ్‌కు రాలేదు?” అంది సరిత.

“పదండి వస్తున్నా!” అంటూ బాక్స్ తీసుకుని ఆమె వెనక నడిచింది.

ఇద్దరూ ఓ కార్నర్‌లో కూర్చున్నారు. రూప అన్యమనస్కంగా ఉండటంతో సాలోచనగా చూసింది సరిత. రూప ముక్కుసూటి మాటతీరు, ప్రవర్తన ఇష్టపడేవారిలో సరిత ఒకరు.

“ఏమయ్యింది రూపా అలా ఉన్నావ్?” చనువుగా అడిగింది సరిత.

ఈ విషయం పంచుకోవాలా వద్దా అని ఆలోచిస్తోంది రూప. విన్నాక ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో? ఆమెకు బాస్‌మీద మంచి అభిప్రాయం ఉంది. అతని తెలివితేటలు, ప్రవర్తన, పలుకుబడి గురించి ఆమెకు తెలుసు. కానీ అతని అంతరంగం ఎలాంటిదో తెలియదు. ఇప్పుడు తన మాటలు ఆమె నమ్ముతుందా? నెమ్మదిగా బాస్ ప్రవర్తన గురించి వివరించింది రూప.

ఆమె ఊహించినట్లుగానే సరిత ముందు ఉలిక్కిపడింది. నమ్మలేకపోయినా ఆమెలో వివేకం మేలుకొంది. సాటి ఆడదానిగా రూప పడుతున్న అంతర్మథనం అర్థం చేసుకుంది. ఈరోజు జరిగిన విషయంతో పాటు మునుపు కూడ, ఓసారి రూప ఇదే విషయం చెప్పటం, తను అంతగా దృష్టి పెట్టకపోవటం గుర్తు వచ్చింది.

బాస్ ఒక ‘గోముఖ వ్యాఘ్రం’ అని రూప తేల్చి చెబుతుంటే వింతగా ఉంది. నిజమే... ఏదైనా తనదాకా వస్తే గాని ఎవరికీ తెలియదు. కార్యాలయాలలో ఆడపిల్లలు ఇలా ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలా ఎదురు ఈదాలో తెలియాలి. భయపడుతూ కూర్చుంటే ఇలాంటి సమస్యకు పరిష్కారం దొరకదు.

నిజానికి ఎన్ని కార్యాలయాలలో మహిళల సమస్యల కొరకు పోరాడే ప్రత్యేక విభాగాలు ఉన్నాయి? కొన్ని చోట్ల ఉన్నా అవి ఎంత మందికి ఉపయోగ పడుతున్నాయి? ఇలాంటి లైంగిక వేధింపులను ఎంతమంది ఆడవాళ్లు నోరు తెరచి సిగ్గు పడకుండా చెప్పగలరు? ఎంతమందికి పరిష్కార దిశగా జవాబు దొరుకుతోంది? రూపకు ఎలా అయినా సహాయపడాలి అనుకుంది సరిత.

“రూపా, ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావు!” అంది సరిత.

“నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకు పెళ్లి అంటే భయం ఉన్న మాట వాస్తవం! నాకు తెలిసిన చాలామంది పెళ్లి అనేది ఇద్దరి మధ్య సర్దుబాటు అని చెబుతూ సర్దుకోలేక విడాకుల వరకూ వెళ్ళటం ఆశ్చర్యంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇలా బలి అయిపోయిన వారే. మా ఇంట్లో రోజూ ఏదో రూపంలో యుద్ధం జరుగుతోంది నా వివాహం విషయంలో.

ముప్పయి ఏళ్ళు నిండిపోతున్నాయి అని అమ్మ ఒకటే గొడవ. నా మనస్తత్వానికి సర్దుబాటు పడదండీ. అలా అని నాకు ఇగో లేదు! రెండు మంచి సంబంధాలు చేతిలో ఉన్నాయి. ఏదో ఒకటి తేల్చుకోమంటుంది అమ్మ. కానీ నాకు భయంగా ఉంది!” అంది రూప.

“అయితే త్వరలోనే మాకు పప్పన్నం పెట్టిస్తారు మీ పేరెంట్స్!” అంది సరిత వాతావరణం తేలిక చేస్తూ.

“ఏం పప్పన్నమో? మధ్యలో ఈ బాస్ గోల ఒకటి మనశ్శాంతి లేకుండా!” రూప గొంతులో చిరాకు ధ్వనించింది.

రూప ఎంతగా మనస్తాపం చెందుతోందో అర్థం అవుతోంది. పెళ్లి ఆలస్యం అయిన అమ్మాయి అంటే మగాళ్లకు ఎందుకింత చిన్నచూపు? ఎవరి అభిప్రాయాలు వారివి అని ఎందుకు వారు గ్రహించరు. బాస్‌లాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలి?

సరిత మనసులో ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. కొన్ని విషయాలు విపులంగా చర్చించి వ్యూహాత్మకంగా పావులు కదపాలి అని సూచించింది.

“ఇది వర్క్ అవుట్ అవుతుందా మేడం! అతను చాలా తెలివైన వాడు. అందర్నీ బురిడీ కొట్టించగల నేర్పరి... పైగా ఆఫీస్‌లో అందరికీ అతనిపై సదభిప్రాయం ఉంది! సందర్భాన్ని తనవైపు అనుకూలంగా మలుచుకోగల అవకాశవాది అతను. నాకు సపోర్ట్‌గా నిలబడతారా ఎవరైనా?” సందేహంగా అంది.

“మన ప్రయత్నం మనం చేద్దాం రూపా! ఆచి, తూచి అడుగు వెయ్యి. నువ్వు కూడా అవకాశం వస్తే వదులుకోకు. జాగ్రత్తగా వ్యవహరించు. సాధ్యమైనంతవరకూ అతనికి దూరంగా ఉండు. నేను చెప్పినవి పాటించు. చూద్దాం ఎవరు సపోర్ట్‌గా వస్తారో? బెస్ట్ ఆఫ్ లక్!” అంది సరిత.

అప్పటికి ఆ విషయం సద్దుమణిగింది. రూప తల్లిదండ్రులకు కూడా ఆఫీస్‌లో పరిస్థితి వివరించింది. తండ్రి ఆశ్చర్యపడితే, తల్లి కంగారుపడింది. ఆడపిల్లకు పెళ్లి ఎంత ఆవశ్యకతో తల్లి వివరించింది.

“పెళ్లి అనేది సమాజంలో భద్రతను కల్పించటమే కాకుండా గౌరవాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఉండే నిశ్చింత మరెక్కడా రాదు. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము. మా బాధ్యత తీరితే మాకు నిశ్చింత!” అంటూ రూపను పెళ్లిదిశగా ఒప్పించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు ఇరువురూ.

ఫలితంగా అన్నివిధాలా యోగ్యుడు అయిన మాధవ్‌ని వరుడిగా ఎంపిక చేసుకుంది రూప. ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. మాధవ్ విషయంలో ఆమె ఎంపిక సరయినదే అని అతనితో మాట్లాడేక రూఢి అయింది అందరికీ.

రూపకు పెళ్లి నిశ్చయం అయిన సంగతి ఆఫీస్‌లో అందరికీ తెలిసి ప్రతిఒక్కరూ పేరుపేరునా అభినందించారు. అటెండెన్స్ రిజిస్టర్ బాస్ టేబుల్ పైన ఉంది అని తెలిసి లోపలికి వెళ్ళింది. అతడిని తప్పించుకు తిరుగుతోంది అని బాస్ చేసిన మార్పు అని గ్రహించింది.

విష్ చేసి సంతకం పెట్టి వస్తున్న ఆమెను ఆపి “రూపా! ఎందుకు నన్ను తప్పించుకు తిరుగుతున్నావ్? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు? చేసినా నేను చెప్పింది వింటున్నావు మౌనంగా. పిలిచినా లోపలికి రాకుండా కారణాలు చెబుతున్నావ్! పెళ్లి కుదిరిందని వంక చెబుతున్నావ్! నువ్వు నాకు కావాలి రూపా! నేను నిన్ను వదిలే ప్రసక్తి లేదు!” అంటూ చెయ్యి పట్టుకున్న అతన్ని విస్మయంగా చూసింది.

“మర్యాదగా నా చెయ్యి వదులు! నేను మామూలు ఆడపిల్లలా అరిచి గోల చెయ్యను. బాస్ కాబట్టి బ్రతికి పోయావు. వేరే ఎవరైనా అయితే ఈపాటికి నా చెయ్యి పట్టుకుంటే చెంప పగిలేది… వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించాలి!” ముక్కుపుటాలు అదురుతుండగా తలుపు తీసుకుని బయటకు వచ్చింది.

ఆమె పెళ్లి వారంలోకి వచ్చింది. పెళ్లికి రెండు వారాలు సెలవు కోరుతూ లీవ్ కోసం అప్లై చేసిన లెటర్ అతని చేతిలో నలుగుతోంది. చాలా కోపంగా ఉన్నాడు రవీంద్ర. శుభలేఖతో బాస్ క్యాబిన్‌లో అడుగుపెట్టిన రూప అతని ఉగ్రరూపం చూసి ఉలిక్కిపడింది. అయినా తమాయించుకుని శుభలేఖ అందించింది. శుభలేఖ విసిరేసి కోపంతో ఊగిపోయాడు.

“పెళ్లి కుదిరింది అని సంబరపడకు! నాకు అందనిది ఎవరికీ దక్కదు! నీ కాబోయే మొగుడికి మన మధ్య సంబంధం ఉందని చెబుతాను. నీతో కాపురం ఎలా చేస్తాడో నువ్వే చూద్దువుగాని. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఆలోచించుకో! పెళ్లయినా నిన్ను వదిలేది లేదు! నా పంజానుండి నువ్వు తప్పించుకోలేవు!” అక్కసుగా అంటున్న అతన్ని చిరునవ్వుతో చూసింది.

“మిస్టర్ రవీంద్రా! నీకు ఆ అవకాశం నేను ఎప్పటికీ ఇవ్వదలుచుకోలేదు! నేను నీ గురించి మాధవ్‌కి ముందే వివరించాను. కాబట్టి ఆ విషయంలో నాకు భయం లేదు! ఇప్పుడు నీ మాటలు అన్నీ మన ఎం డి గారు కాన్ఫరెన్స్ కాల్‌లో చక్కగా వింటున్నారు. నీ పాత ముచ్చట్లు కూడా రికార్డ్ చేసి ఆయనకు పంపించాను!” అంటూ ఫోన్‌లో వీడియో కాల్ ఆన్ చేసింది. ఎం డి గారు స్క్రీన్‌పై ప్రత్యక్షం కావటంతో కంగారుగా లేచి నిలబడ్డాడు రవీంద్ర జేవురించిన మొహంతో!

క్యాబిన్ బయట కూడా స్పీకర్లు ఆన్ చేయటంతో అందరికీ విషయం తేటతెల్లం అయ్యింది. బాస్‌కు సస్పెన్షన్ ఆర్డరు మెయిల్‌లో జారీ చేయబడింది. మొహం చేతుల్లో కప్పుకుని కుర్చీలో కూలబడ్డాడు రవీంద్ర.

తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన రూప తనకు చప్పట్లు కొడుతున్న స్టాఫ్‌కు ఆశ్చర్యపోతూ నమస్కరించింది. తన చెయ్యి పట్టుకున్న సరితకు కృతజ్ఞతలు తెలిపింది కళ్ళతో. ప్రతిగా బొటనవేలు చూపింది సరిత విజయ సూచకంగా ఆశీర్వదిస్తున్నట్లుగా!

తనకైతే సరిత లాంటి వాళ్ళు దిశానిర్దేశం చేశారు. మరి సామాన్య ఆడపిల్లల సంగతి ఏమిటి? తెల్లారి లేస్తే ఎన్నో సమస్యలు కొన్ని చెప్పగలిగేవి, మరి కొన్ని చెప్పుకోలేనివి సగటు ఆడపిల్లలు ఎదుర్కొంటున్నారు! ఆమె మనసులో ‘నేను సైతం ఎదురీతకు సిద్ధం’ అనే ఆలోచన రూపు దిద్దుకుంటోంది నెమ్మది నెమ్మదిగా!

*********

Posted in September 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *