Menu Close
Vemuri Venkateswararao
శాస్త్రవేత్తల జీవిత సంగ్రహాలు
వేమూరి వెంకటేశ్వర రావు

2. యల్లాప్రగడ సుబ్బారావు

Yellapragada Subbarao

(12 జనవరి 1895-8 ఆగస్టు 1948)

గ్రీకు భాషలో ‘అనైమియ’ (anaimia = an + haima) అంటే ‘రక్తపు లేమి’ అని అర్ధం. ఇదే ఇంగ్లీషులో ‘ఎనీమియా’గా మారింది. రక్తం లేకపోవటమేమిటీ, నా మొహం కాకపోతే? ఇక్కడ “రక్తంలో ఎర్ర కణాలు తక్కువగా ఉన్నాయి” అని వ్యాఖ్యానం చెప్పుకోవాలి, లేదా రక్తంలోని ఎర్ర కణాలలో ఉన్న రక్తచందురం (హిమోగ్లోబిన్) ఉండవలసిన మోతాదులో లేదని భాష్యం చెప్పుకోవాలి. ప్రాణాధారమైన జీవన ప్రక్రియలు సజావుగా జరగాలంటే మనం పీల్చిన గాలిలో ఉన్న ఆమ్లజని శరీరం నాలుగు మూలలో ఉన్న జీవకణాలకి చేరాలి. ఆమ్లజనిని రవాణా చేసే బాధ్యత రక్తచందురానిది. రక్తంలో చాలినంత రక్త చందురం లేకపోతే శరీరావయవాలకి కావలసిన ఆమ్లజని అందదు. అప్పుడు జీవకణాలకి ‘ఊపిరి ఆడక’ చచ్చిపోతాయి. కనుక ఈ దోషం ఉంటే రకరకాలైన జబ్బులు వస్తాయి.

రక్తపు లేమికి ఒక ముఖ్య కారణం మన ఆహారంలోని పోషక పదార్ధాలలో ఇనుము లేకపోవడం. ఈ రకం రక్తపులేమి వస్తే దానికి మందు ఇనప ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్న ఆహారం తినటమే. కాని ఇనుముకి లొంగని మరొక మొండిరకం రక్తపులేమి ఉంది. దానిని ‘మొండి రక్తపు లేమి’ అని తెలుగులోనూ ‘పెర్నిషస్ ఎనీమియా’ అని ఇంగ్లీషులోనూ అంటారు. ఇంగ్లీషులో ‘పెర్నిషస్’ అంటే మొండి అని అర్ధం. సా. శ. 1926లో మినో (George R. Minot) అనే ఆసామీ ఈ మొండి రక్తపులేమి మీద పరిశోధనలు చేసి, దీనికి కారణం ఒక విటమిన్ లోపం అని కనుక్కుని 1934 లో నోబెల్ బహుమానం గెలుచుకున్నాడు. ఆ లోపించిన విటమిన్ పేరు బి–12. ఈ (B–12). శాకాహారాలలో ససేమిరా దొరకదు; జంతు సంబంధమైన ఆహారాలు తిని తీరాలి. అలాగని మాంసం తినక్కరలేదు. పాడి పదార్థాలు తిన్నా సరిపోతుంది. (పులిసిన తరవాణి వంటి ఆహారాలలో కూడ కొద్దిగా బి–12 ఉంటుందని ఈ మధ్యనే విన్నాను. నిజమో కాదో రూఢిగా తెలియదు.)

పోషక పదార్ధాల లోపం వల్ల వచ్చే మరొక రకం రక్తపులేమి ఉంది. దీనికీ మన పవిత్ర భారత దేశానికీ ఒక బాదరాయణ సంబంధం ఉంది. ఈ రకం రక్తపులేమి మొట్టమొదట బొంబాయిలోని బట్టలు నేసే కర్మాగారాలలో పనిచేసే కార్మికులలో కనిపించింది. సా. శ. 1928 లో లూసీ విల్లిస్ అనే కుర్ర వైద్యురాలు అప్పుడే చదువు పూర్తి చేసి ఈ కొత్త రకం రక్తపులేమి గురించి విని, దీనిని అధ్యయనం చెయ్యడానికి బొంబాయి ప్రయాణం కట్టింది. అప్పటికే ఆమెకి మినో చేసిన పని గురించి, మొండి రక్తపులేమి గురించి, దాని మీద రామ బాణంలా పని చేసే బి–12 గురించి తెలుసు. కనుక బొంబాయిలో ఓడ దిగి రక్తపులేమితో తీసుకుంటూన్న కార్మికుల మీద బి–12 బాణం ప్రయోగించింది కాని ప్రయోజనం కనబడలేదు. ఆమెకి ఏమి చెయ్యాలో తోచలేదు. తను రొట్టెలమీద రాసుకుందుకని ఇంగ్లండు నుండి తెచ్చుకున్న నల్లటి, చిక్కటి ఈస్టుతో చేసిన పదార్ధం (దానిని మార్మైట్ అంటారు. అప్పట్లో ఈ మార్మైట్^ని  ఇంగ్లండు లోనూ ఆస్ట్రేలియా లోనూ విరివిగా వాడేవారు.) వాళ్ళకి కూడ తినమని పెట్టింది. మార్మైట్ తిన్నవాళ్ళంతా క్రమేపీ కోలుకోవడం గమనించి ఆ మార్మైట్^లో ఉన్న అదృశ్యమైన పోషక పదార్ధానికి "విల్లిస్ కారణాంశం" అని తన పేరే పెట్టేసుకుంది. తరువాత తెలిసింది ఈ విల్లిస్ కారణాంశం లోగుట్టు. దీనినే ఆధునిక పరిభాషలో ఫోలిక్ ఏసిడ్ అని కాని ఫోలేట్ అని కాని వ్యవహరిస్తున్నారు. ఇది కాయగూరలలోనూ, పళ్ళల్లోనూ లభ్యం అవుతుంది. ఇది కూడ బి–జాతి విటమినే.

ఈ ఫోలిక్ ఆమ్లానికి మన శరీరంలో చాల కీలకమైన పాత్ర ఉంది. మన జీవకణాలలో ఉండే వారసవాహికల, అంటే డి.ఏన్.ఏ., నిర్మాణానికి ఇది అత్యవసరం. కణ విభజన జరిగినప్పుడల్లా ఈ వారసవాహికలకి నకళ్ళు తయారవాలి కదా. ఆ సందర్భంలో కణంలో ఫోలిక్ ఆమ్లం లేక పోతే ఆ నకలు సరిగ్గా తయారవదు. రక్తంలో ఉన్న కణాలు అతి జోరుగా – రోజుకి 300 బిలియను చొప్పున – తయారవాలి కనుక రక్తకణాల తయారీలో ఫోలిక్ ఆమ్లం పాత్ర కీలకం. ఈ తయారీ అంతా మన ఎముకలలోని మజ్జలో జరుగుతుంది. అంటే, మజ్జ రక్త కణాలని తయారుచేసే కర్మాగారం అన్నమాట. ఈ కర్మాగారం నడవటానికి శరీరంలో ఫోలిక్ ఆమ్లం మోతాదు తగ్గకుండా ఉండాలి. కార్మికుల శరీరంలో ఉన్న ఈ కర్మాగారాలు సరిగ్గా పని చేస్తూన్నంత సేపే ఆ కార్మికులు పని చేసే నేత కర్మాగారాలు లాభదాయకంగా నడవగలవు!

ఫోలిక్ ఆమ్లం కథ ఇంత వివరంగా ఎందుకు చెప్పుకొచ్చేనంటే ఈ కథకీ కేన్సరు వ్యాధికీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధం. ఈ సంబంధం అర్ధం అవాలంటే కాల ప్రవాహంతో 1946 వరకు ముందుకి కదలాలి. సా. శ. 1946 లో సిడ్నీ ఫార్బర్ అనే కేన్సరు వైద్యుడు బోస్టన్ నగరంలో ఉండేవాడు. ఆయన చిన్న పిల్లలకి వచ్చే రక్తపు కేన్సరు వ్యాధిని కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తూన్న రోజులవి. రక్తానికి వచ్చే కేన్సరుని లుకేమియా అంటారు. బొంబాయి కర్మాగారాలలో కార్మికుల రక్తం వ్యాధిగ్రస్తం అయినప్పుడు దానిని ఫోలిక్ ఆమ్లంతో లూసీ విల్లిస్ నయం చేసిందన్న వార్త ఈయన పత్రికలలో చదివేడు. అదే బాణం కేన్సరుతో బాధ పడుతూన్న పిల్లల మీద కూడ పని చేస్తుందా అన్న అనుమానం రానే వచ్చింది. ప్రయత్నించి చూద్దాం అని ఫోలిక్ ఆమ్లాన్ని ప్రయోగించి చూసేడు, కాని ఫలితం శూన్యం. అప్పుడాయనకి మరొక ఆలోచన వచ్చింది: “ఫోలిక్ ఆమ్లానికి ప్రతిద్వందిగా పని చేసే “ప్రతి–ఫోలేట్” (‘ఏంటీ ఫోలిక్ ఆమ్లం’ లేదా folic acid antagonist) అనే మందు ఉంటే ఎలాగుంటుందో? ఈ ప్రతి–ఫోలేట్ చేత కణాలలో ఉన్న ఫోలిక్ ఆమ్లంని మింగించేసి, కణాలలో ఫోలిక్ ఆమ్లం సరఫరా ఆపు చేసెస్తే అప్పుడు వారసవాహికలు రెండుగా చీలడానికి వీలు కాదు. అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. అప్పుడు కేన్సరు వ్యాధికి ‘పురిట్లోనే సంధి కొడుతుంది.’ ఇదీ ఆయన పథకం.

ఊహ బాగానే ఉంది. కాని ఈయన ఊహించిన ‘ప్రతి–ఫోలేట్’ అనే మందుని ఎవ్వరూ ఇంతవరకు కనిపెట్టలేదు. "మందు లక్షణాలు చెప్పి ఆ రకం మందు కావాలి అని మనం అడిగితే ఆ కోరిక తీర్చగల సమర్ధులు ఎవ్వరు?" అని ఫార్బర్ ఆలోచించడం మొదలు పెట్టేడు. అప్పుడు ఆయన మనస్సులో తళుక్కున యల్లాప్రగడ సుబ్బారావు మెరిసేడు.

డా. యల్లాప్రగడ సుబ్బారావు 1923 లో కట్టుబట్టలతో, జేబులో పైస కూడ లేకుండా, బోస్టన్లో దిగేడు. ఉష్ణమండలాలలో ఉండే జబ్బుల మీద హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధన చెయ్యాలనే కోరికతో ఆయన బోస్టన్ నగరం చేరుకున్నాడు. ఇండియాలో వైద్యం చదివినా అమెరికాలో లైసెన్సు లేక వైద్య వృత్తి చేసి నాలుగు రాళ్ళు గణించుకుని పొట్ట పోషించుకోడానికి అవకాశం లేకపోయింది. కనుక రాత్రులు సామానులు మోసే కూలి పని చేసేవాడు. తరువాత బిఘం స్త్రీల ఆసుపత్రిలో తలుపులు తెరచి పట్టుకోవడం, పడకల మీద దుప్పట్లు మార్చడం, రోగులు మంచం పక్కనే మలమూత్రాదులు విసర్జిస్తే ఆ డొక్కులు బయటకి తీసికెళ్ళి కడిగి శుభ్రం చెయ్యడం, వంటి పనులు చేస్తూ పగలు చదువుకునేవాడు. (కళ్ళ వెంబడి నీళ్లు కారడం లేదా?)

కాలక్రమేణా కొంచెం కాలు నిలదొక్కుకుని, స్నేహితులని సంపాదించి, వారికి తన ప్రతిభ చూపించి, విశ్వవిద్యాలయంలోని జీవరసాయన విభాగంలో (బయోకెమిస్ట్రీ) ఒక పరిశోధకుడిగా ఉద్యోగం సంపాదించేడు. ఆ ఉద్యోగంలో ఆయన చెయ్యవలసిన పని జీవకణాల పొట్టలని కోసి వాటి లోపల ఏముందో చూడటం. (అంటే, ఈయన ఉద్యోగం జీవకణాల మీద ‘ఆటోప్సీ’ చెయ్యడం. ఆటోప్సీ అంటే ‘స్వయంగా చూడడం’ అని అర్థం. అందుకనే, శవాలని కోసి చావుకి కారణం నిర్ధారించడాన్ని కూడ ఆటోప్సీ అనే అంటారు.) అంటే జీవకణాలలో ఉన్న బృహత్ బణువులని విడదీసి, వాటిని శుద్ధి చేసి, ఛేదించి, ఆ బణువుల నిర్మాణ శిల్పం అర్ధం చేసుకుని, వాటి కట్టడిలో ఉన్న అణువుల అమరిక అర్ధం చేసుకుని, వాటి కథా కమామీషు తేల్చడం. ఇదంతా నడ్డి విరగ్గొట్టుకునే వెట్టి చాకిరీ. గొణగకుండా, విసుక్కోకుండా, లక్ష్యశుద్ధితో ఈ పనంతా చేసి చివరికి ‘ఎ.టి.పి.’ (ATP, Adenosine Triphosphate) బణువు యొక్క నిర్మాణ శిల్పాన్ని నిర్ధారించేడు. ఈ ఎ.టి.పి. శరీరాలలో ఉండే అత్యంత ముఖ్యమైన రసాయన బణువు. జీవకణాలలో శక్తిని పుట్టించడానికి ఇది కావాలి. ఇదే ఉద్యోగం చేస్తూ ‘క్రియటిన్’ అనే బణువు నిర్మాణ శిల్పాన్ని కూడ ఈయన నిర్ధారించేడు. మరొక తెల్లవాడు ఈ రెండింటిలో ఏ ఒక్క పని చేసినా వాడిని కళ్ళకి అద్దుకుని హార్వర్డ్ యూనివర్సిటీలో శాశ్వత ఆచార్య పదవి ఇచ్చి గౌరవించి ఉండేవారు. కాని ఆ రోజులలో నల్ల తొక్క ఉండి, యాసతో ఇంగ్లీషు మాట్లాడే భారతీయులకి కూలిపని కూడ దొరికేది కాదు. ఇంత పని చేసినా, ఇతని పై అధికారి (Cyrus Fiske), కేవలం ఒక విద్యార్ధికి ఇచ్చినపాటి గుర్తింపు కూడ ఇవ్వకపోయేసరికి సుబ్బారావు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సలాం కొట్టేసి అమెరికన్ సయనమిడ్ కంపెనీవారి లెడర్లీ లేబరెటోరీలో ఉద్యోగం వస్తే నూయార్కు వెళ్ళిపోయేడు.

లెడర్లీలో ఈయన చెయ్యవలసిన పని ఏమిటంటే జీవ కణాలలో ఉన్న రసాయన బణువుల లాంటి బణువులని కృత్రిమంగా తయారు చేసి వాటిని, వీలయితే విటమిన్ మాత్రలులా చెయ్యడం. అప్పుడు కంపెనీ వారు ఆ మాత్రలు ప్రజలకి అమ్ముతారు. (అమెరికాలో ఇప్పటికీ, అవసరం ఉన్నా లేకపోయినా, విటమిన్ మాత్రలు మింగడం అనేది ఒక వేలం వెర్రి.) లెడర్లీ కంపెనీ వారికి ఈ ఊహ ఎలా వచ్చిందంటే అప్పటికే ఈలై లిలీ కంపెనీ వారు 1920 లలో బి–12 విటమినుని మాత్రల రూపంలో అమ్మి బాగా డబ్బు చేసుకున్నారు. కనుక, మన తెలుగు సినిమా వాళ్ళల్లా, అదే ఫక్కీలో మరొక విటమిన్ చేసి అమ్మి డబ్బు గణించాలని లెడర్లీ వారి ఆశ.

ఈలై లిలీ వారు బి –12 తయారు చేసి డబ్బు చేసుకుంటే లెడర్లీ వారు ఫోలిక్ ఆమ్లం (Folic acid or  Vitamin B9) కాని, తత్సంబంధమైన ఫోలేట్‌ని కాని తయారు చేసి విక్రయించ వచ్చని సుబ్బారావు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేరు. మొదట్లో పందుల కాలేయాలనుండి ఈ ఫోలేట్‌ని విడదియ్యడానికి ప్రయత్నించేరు. అది పని చెయ్యలేదు. అప్పుడు రసాయన విశ్లేషణ ద్వారా ఫోలేట్‌ని తయారు చెయ్యటానికి సమకట్టేరు. ఈ ప్రయత్నంలో అక్కడ పని చేసే హేరియట్ కైట్ అనే అమ్మాయి ఆయనకి ఎంతగానో సహాయపడింది. వీరిద్దరు కలసి ఒక్క ఫోలిక్ ఆమ్లమే కాకుండా ఈ తయారీకి మార్గమధ్యంలో అవసరమైన ఎన్నో రసాయనాలని పుంఖాను పుంఖంగా తయారు చేసేరు. ఈ మధ్యంతర రసాయనాలలో ఒకటి మనం ఇందాకా ప్రస్తావించిన, ఫార్బర్ కి కావలసి వచ్చిన, మందు. అందుకని ఆయన మందుల మాంత్రికుడైన మన సుబ్బారావుని ఆశ్రయించేడు. యల్లాప్రగడ సుబ్బారావు 1947 ఆగస్టు నెలలో మొదటి దఫా మచ్చులు (amethopterin) ఫార్బర్ కి పంపేడు. ఈ మందులు ఉపయోగించి అదుపు లేకుండా రక్తంలో పెరిగిపోతూన్న తెల్ల కణాల పెరుగుదలని ఆపటానికి ఫార్బర్ పునాది వేసి, కేన్సరుని అరికట్టడానికి ‘రసాయన వైద్యం’ (కీమోథిరపీ) అనే సరి కొత్త మార్గానికి దర్శకులయారు. ఈ మందుని కాసింత మరమ్మత్తు చేయగా వచ్చినదే methotrexate అనే కేన్సరు మందు. కొన్ని రకాల కేన్సర్‌లని (ఉదా. acute lymphoblastic leukemia, non-Hodgkin lymphoma, osteosarcoma, and colon cancer) అదుపులో పెట్టడానికి ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది.

ఇవే కాకుండా బోదకాలు (Filariasis) ని తగ్గించడానికి Diethyl carbamazine citrate (brand name: Hetrazan) తయారు చేసేరు. సుబ్బారావు పేరుతో ముడిపడిన మరొక ముఖ్యమైన మందు Chlortetracycline (Brand Name: Aureomycin) అనే broad-spectrum tetracycline జాతి antibiotic. దీనిని 1945 లో ఈయన Benjamin Duggar తో కలసి రూపుదిద్దేరు. (Although Benjamin Duggar is credited with the specific identification of the fungus that produced aureomycin, the successful discovery and development of the drug occurred under Subbarow’s leadership and within his team at Lederle.) పెనిసిలిన్ 1928లో కనిబెట్టబడింది కనుక నోబెల్ బహుమానం దానికి వెళ్ళింది.

ఈ కథనం చదువుతూ ఉంటే సుబ్బారావు తెల్లవాడై ఉంటే ఆయనకి మూడొంతుల ముప్పాతిక నోబెల్ బహుమానం వచ్చి ఉండేదేమో అని అనిపించక మానదు. నోబెల్ కమిటీవారు సుబ్బారావుని విస్మరించడానికి కారణం ఏమై ఉంటుంది? సుబ్బారావు అహంకారంతో సొంతడబ్బా కొట్టుకునే రకం కాదు. తన పనేదో తాను ఏకాంతంగా చేసుకుపోతూ ఉండేవాడు. దీనికి తోడు ఆయన హార్వర్డ్ విశ్వావిద్యాలయంలో ATP మీద చేసిన పనికి ఆయన పై అధికారి గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చెయ్యడం. మూడవ కారణం ఆయన అతి చిన్న వయస్సులో మరణించడం; ఆయన 1948లో తన 53 వ ఏట చనిపోయేరు.

మహాత్మ గాంధిని, యల్లా ప్రగడ సుబ్బారావుని నోబెల్ గ్రహీతల జాబితాలో చేర్చుకోకపోతే నష్టపోయింది ఈ వ్యక్తులు కాదు – ఆ సంస్థ. సుబ్బారావు లాంటి మొదటి తరం భారతీయులు అమెరికాలో అష్టకష్టాలకీ ఓర్చుకుని తమ ప్రతిభ చాటబట్టే ఈ నాడు దరిదాపు నాలుగు మిలియనుల భారతీయులు అమెరికాలో మంచి ఉద్యోగాలు సంపాదించుకుని అభివృద్ధిలోకి వచ్చేరు. ఇదంతా ఆ మొదటి తరం వాళ్ళు పడ్డ కష్టాల చలవ!

**********

Posted in Science, September 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *