ఏరు దాటాక తెప్ప తగలేయడం (సామెత కథ)
సాయంత్రం వేళ కావడంతో జున్నుబాబుతో పాటు అతని స్నేహితులు కూడా కాశీ తాత చుట్టూ చేరారు.
“తాతా ఈరోజు మాకొక మంచి కథ చెప్పు” అని అడిగాడు జున్నుబాబు.
కాశీతాత తన కళ్లద్దాలు సరిచేసుకుని, "పిల్లలూ! ఈరోజు మీకు ఒక ఎద్దు కథ చెబుతాను వినండి” అని చెప్పడం ప్రారంభించాడు.
“ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర 'బసవన్న' అనే ఎద్దు ఉండేది. ఎన్నో ఏళ్లుగా బసవన్న ఆ రైతు పొలాన్ని దున్నింది, బండి లాగింది, రాముకు ఎంతో సేవ చేసింది. కొంతకాలానికి బసవన్న ముసలిదై, నడవలేని స్థితికి వచ్చింది.
అప్పుడు రాము ఏం చేశాడో తెలుసా?" అని పిల్లల్ని అడిగాడు కాశీతాత.
"ఏం చేశాడు తాతా?" అని ఆత్రుతగా అడిగారు పిల్లలు.
"బసవన్న వల్ల ఇక ఎలాంటి లాభం లేదని భావించిన ఆ రైతు, దానిని దగ్గరలో ఉన్న అడవిలో వదిలేసి వచ్చేశాడు. ఆ అడవిలో ఒక చెట్టు కింద నీరసంగా పడుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న బసవన్న దగ్గరకు ఒక కాకి వచ్చి వాలింది."
"ఏమైంది బసవన్న? ఈరోజు ఇలా అడవిలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు?" అని అడిగింది కాకమ్మ.
"ఏం చెప్పమంటావు కాకమ్మ? నా చిన్నతనం నుండి ఆ రైతు కోసం రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశాను. కానీ నా ఒంట్లో ఓపిక తగ్గగానే నన్ను ఇలా అడవిలో వదిలేశాడు. మనం ఎంత సేవ చేసినా మనుషులకు కృతజ్ఞత ఉండదేమో!" అన్నాడు బసవన్న నిట్టూరుస్తూ.
"అయ్యో పిచ్చి బసవన్నా! నువ్వు ఇంకా మనుషుల గురించి తెలియక బాధపడుతున్నావు. వారు తమ అవసరం తీరేవరకు ఒకలా, తీరాక మరోలా ఉంటారు. వారి నుంచి ఏమీ ఆశించకూడదు" అంది కాకమ్మ నవ్వుతూ.
"అవును కాకమ్మా.. కానీ ఇంత సేవ చేసినందుకు కనీసం చివరి రోజుల్లో కాస్త గడ్డి పెట్టి పోషిస్తాడనుకున్నాను" అంది బసవన్న బాధగా.
"బసవన్నా! నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చావు, అతను తన ధర్మాన్ని మర్చిపోయాడు. మనం చేసే మంచి మన మనసుని ప్రశాంతంగా ఉంచాలి కానీ, అవతలి వారు తిరిగి మనకు ఏదో చేస్తారని భ్రమలో ఉండకూడదు. అయినా మనుషులు 'ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు” అని సముదాయించింది కాకమ్మ. అలా కథ ముగించాడు తాతయ్య.
“ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఏంటి తాతా?” అని అడిగాడు జున్నుబాబు.
“మనం నది దాటడానికి తెప్ప సహాయం తీసుకుంటాం. నది దాటాక ఆ తెప్పకు కృతజ్ఞతగా దాన్ని భద్రపరచాలి కానీ, ఇక దానితో పని అయిపోయింది కదా అని తగలబెట్టకూడదు.
అలాగే మనకు కష్టకాలంలో సాయం చేసిన వారిని, సేవ చేసిన వారిని అవసరం తీరిపోగానే మరచిపోవడం చాలా పెద్ద తప్పు. అవసరం ఉన్నంత వరకు ఒకరిని వాడుకుని, ఆ అవసరం తీరగానే వారిని నిర్లక్ష్యం చేయడాన్ని లేదా హాని తలపెట్టడాన్ని 'ఏరు దాటాక తెప్ప తగలేయడం' అనే సామెతతో చెబుతాము” అని వివరించాడు తాతయ్య.
“బాగుంది తాతయ్య... ఎద్దు కథ ద్వారా మంచి విషయం చెప్పారు” అన్నారు పిల్లలు సంతోషంగా.
***********
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 500 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.