Image by WikiImages from Pixabay
£3 పన్ను (The £3 Tax)
బాలసుందరం కేసు వల్ల గాంధీజీకి అనేక ఒప్పంద (indentured) భారతీయ కూలీలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఆ సంపత్సరంలోనే (1894) నాటాల్ ప్రభుత్వం ఈ ఒప్పంద కూలీలమీద సంవత్సరానికి 25 పౌండ్లు (£25) పన్ను విధించింది. ఇంత భారమైన పన్ను విధింపు గాంధీజీని ఆశ్చర్యపరచింది. వెంటనే ఆయన ఈ విషయాన్ని Natal Indian Congress (NIC) సభ్యుల ముందు ఉంచి చర్చించటం జరిగింది. ఈ పరిణామాన్ని గాంధీజీ నాయకత్వంలో వ్యతిరేకించాలని సభ్యులు నిర్ణయించారు.
ఈ పన్ను పుట్టుక గాంధీజీ ఇలా వివరించారు:
“1860 ప్రాంతంలో నాటాల్ లో నివసించే యూరోపియనులు చెరకు (Sugarcane) పంట సాగుకు అచ్చట మంచి అవకాశాలు ఉన్నాయని గ్రహించిన దరిమిలా కూలీల అవసరం చాలా ఉందని భావించటం జరిగింది. విదేశాల కూలీలు లేకుండా చెరకు పంట సాగు, పంచదార తయారీ అసాధ్యం అని వారు గ్రహించారు. స్థానిక Zulus (జులు తెగవారు) ఇటువంటి కష్టతరమైన పనులకు సరిపోరు. అందువల్ల నాటాల్ ప్రభుత్వం భారత-బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భారత్ నుంచి కూలీలను తెప్పించుకునే అనుమతి తీసుకుంది. ఈ కూలీలను తెప్పించుకున్నప్పుడు వారు యజమాని వద్ద 5 ఏళ్ళు పని చేయాలనే ఒప్పందం మీద సంతకం పెట్టాలి. ఈ ఒప్పంద కూలీలు (Indenture Labour) 5 ఏళ్ళు పని చేసిన తరువాత వారు ఆ యజమాని వద్దనుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు వారు (ఒప్పందం నుంచి బయటకు వచ్చిన కూలీలు) తాము ఉన్న చోటనే భూమి కొనుక్కుని అచ్చట స్థిరపడే యాజమాన్య హక్కు ఉంటుంది. ఈ ఆశలు చూపించి పేద భారతీయులను నాటాల్ కు రప్పించాలని యూరోపియనుల ముఖ్యోద్దేశం. భారతీయుల కృషితో ఈ విధంగా నాటాల్ లో వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందాలని ఈ తెల్లవారు ఆశించారు.
కాని భారతీయ కూలీలు యూరోపియనుల ఊహలకు అతీతంగా పురోగతి సాధించటం జరిగింది. వారు కూరగాయలు కాయించారు. అనేక భారతీయ పంటల రకాలు తీసుకువచ్చి నాటాల్ లో ప్రవేశపెట్టి అత్యధిక దిగుబడులు సాధించారు. వారు క్రమేణా మామిడి పంటను ప్రవేశపెట్టారు. ఈ భారతీయుల ప్రతిభ వ్యవసాయంతోనే ముడిపడలేదు. వారు వ్యాపారంలో కూడా రాణించారు. భూమిని కొని తమ స్వంతానికి ఇళ్ళు, భవనాలు నిర్మించారు. కొన్నిటిని అద్దెకు కూడా ఇచ్చి ధనవంతులయ్యారు. ఈ పరిణామాలను గమనించి, గ్రహించి భారతావని నుంచి వ్యాపారులు (businessmen) నాటాల్ వచ్చి వాణిజ్యంలో అత్యంత ప్రతిభ చూపించారు. మొట్టమొదట వచ్చిన వారిలో కీ.శే. సేథ్ అబూబాకర్ అమోద్ నాటాల్ లో అన్ని చోట్ల విస్తృతంగా వ్యాపారాలు నిర్వహించారు.
ఈ విచిత్ర పరిణామాన్ని గమనించిన యూరోపియన్ వ్యాపారులు భయపడిపోయారు. ఆదిలో భారతావని నుంచి వచ్చిన వారి వ్యాపార నైపుణ్యం గురించి చాలా తక్కువగా పరిగణించారు. స్వతంత్ర వ్యవసాయదారులుగా వారిని భరించగలిగారు గాని, వాణిజ్యంలో పోటీ తెల్లవారు భరించలేకపోయారు. ఫలితంగా వీరికి భారతీయులు విరోధులయ్యారు. ఇతర కారణాలు కూడా ఆజ్యం పోయటానికి కారణమయ్యాయి. భారతీయుల జీవన విధానం, నిరాడంబరత, స్వల్ప లాభానికే సంతృప్తి పడటం, పరిశుభ్రత, పారిశుధ్యం విషయాలలో ఉదాసీనత, నివాస పరిసరాలను శుభ్రపరచుకోకపోవటం, నివాస గృహాలకు మరమ్మత్తులు చేసే విషయంలో పీనాసితనం, మరి ఇతర విషయాలలో భారతీయులంటే తెల్లవారిలో అత్యంత వ్యతిరేకత ఏర్పడింది.
ఈ వ్యతిరేకత శాసనాలద్వారా వ్యక్తం చేయాలని నాటాల్ శ్వేతజాతీయ శాసన సభ్యులు ఒప్పంద భారత కూలీల (Indentured Labour) మీద అత్యధిక పన్నులు వేయటం ప్రారంభించారు. వీటికే పరిమితమవ్వక వివిధ రూపాలలో వీరిని బాధించటం జరిగింది. ఈ కూలీలను బలవంతంగా స్వదేశానికి పంపిస్తే అప్పుడు ఒప్పందం (indenture) భారత్ లోనే రద్దవుతుంది. కాని ఈ ప్రతిపాదనను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి మరొక ప్రతిపాదనను అమలు చేయటం జరిగింది. అది ఈ విధంగా ఉంది.”
- ఒప్పందం పూర్తి అయిన తరువాత కూలీలు భారతదేశం తిరిగి వెళ్లి పోవాలి;
- ఆ కూలీ రెండు ఏళ్ల పరిమితికి మరొక ఒప్పందం మీద సంతకం చేయాలి; ఈ రెండేళ్ళకి ఎక్కువ జీతం లభిస్తుంది. ఈ రెండు ఏళ్ళ ఒప్పందం ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు.
- ఒక వేళ ఆ కూలి స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి నిరాకరిస్తే లేక అతను మరో ఒప్పందం మీద సంతకం చేయటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తి ఏడాదికి 25 పౌండ్లు పన్ను చెల్లించాలి.
ఈ ప్రతిపాదనలను Henry Binns (నాటాల్ అసెంబ్లీ సభ్యుడు) మరియు Mr. Mason కూడిన ఒక ప్రతినిధివర్గం 1894లో భారతావని వెళ్లి అచ్చట భారత-బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించి దాని ఆమోదం పొందాలని వెళ్ళింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయి Lord Elgin 25 పౌండ్ల ఎన్నికల పన్నును (poll tax) వ్యతిరేకించి దానిని 3 పౌండ్లకు తన అనుమతి తెలియజేశాడు. ఈ పన్ను విషయంలో వైస్రాయి Elgin పెద్ద తప్పు చేశాడు. ఆయన అంగీకారం ద్వారా భారత కూలీలకు చాలా అన్యాయం చేశాడు. నాటాల్ తెల్లవారికి కలిగే లాభం దృష్టిలో పెట్టుకుని భారతీయులకు నష్టం చేకూర్చాడు.
నాటాల్ ప్రభుత్వం వెంటనే బ్రిటిష్ వైస్రాయి ఇచ్చిన అనుమతిని ప్రవేశపెట్టి భారతీయ కూలీల మీద 2 పౌండ్లు పన్ను విధించింది. మూడేళ్ళ తరువాత ఈ పన్నును ‘కూలీ భార్య’ మీదా విధించబడింది. అంతటితో ఆగక అతని 16 ఏళ్ళు దాటిన పుత్రుడు మీద, 13 ఏళ్ళు దాటిన కుమార్తె మీద కూడా ఈ పన్ను విధించబడింది. అంటే నలుగురు సభ్యులున్న కుటుంబం సంవత్సరానికి 12 పౌండ్లు పన్ను చెల్లించాలి. భర్త (కూలీ) సగటు నెల ఆదాయం 14 షిల్లింగులు మించనప్పుడు, ఆ వ్యక్తి నలుగురు ఉన్న కుటుంబం 12 పౌండ్లు (240 షిల్లింగులు; ఒక పౌండుకు 20 షిల్లింగులు) పన్ను ఎలా చెల్లించగలడు? ఇంత దుర్మార్గపు దారుణమైన చర్య ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
అందువల్ల మేము ఈ పన్నుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాము. ఈ విషయంలో NIC (Natal Indian Congress) ఆరంభంలో మౌనంగా ఉండి ఉంటే వైస్రాయి Elgin 25 పౌండ్లు పన్నుకు ఆమోదించేవాడు. అప్పుడు మేము చేసిన ఆందోళన వల్లనే ఈ పెద్ద మనిషి దానిని 3 పౌండ్లకు తగ్గించి తన అనుమతి ఇచ్చాడు. ఈయన భారతావని సంక్షేమాన్ని తన బాధ్యతగా తీసుకునే ఈ వైస్రాయి అయి ఉంటే భారత కూలీల మీద ఇంత అమానుషమైన పన్నును ఆమోదించేవాడు కాదు.
ఈ పరిస్థితిలో పన్నును పూర్తిగా నిర్మూలించి ఒప్పంద కూలీలు ఇంతవరకు చెల్లించిన పైకాన్ని వారికి తిరిగి ఇప్పించటం మా NIC సంస్థ ముందున్న సవాలు. ఈ పన్ను సమస్య నాటాల్ ఒప్పంద కూలీలకే పరిమితం కాలేదు; దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ప్రతి భారత కూలీకి కూడా ఇది పెద్ద సమస్య అయింది. అందువల్ల దేశంలోని అందరు ఒప్పంద కూలీలు ఈ అన్యాయాన్ని సమ్మెల ద్వారా ఎదుర్కొన్నారు. ఈ సమ్మెలలో కొంతమంది పోలీసుల కాల్పులవల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. 10,000 మందికి పైగా జైళ్ల పాలయ్యారు.
చివరికి పన్ను రద్దు అయింది; న్యాయం గెలిచింది. భారతీయుల ఓర్పు, వారికి న్యాయం మీద అపార నమ్మకం, వారి నిరంతర కృషి వల్లనే ఈ విజయం లభించింది. NIC వారిని సరిఅయిన మార్గం లో నడిపించకపోతే దక్షిణ ఆఫ్రికా లోని భారతీయులు చాలా కాలం పన్నులు చెల్లించవచ్చేది. వీరి ఓటమి భారతావని లోని భారతీయులకు శాశ్వతమైన అవమానకరంగా ఉండేది.”
మతాల గురించి గాంధీజీ తులనాత్మక పరిశీలన
సమాజసేవలో గాంధీజీ నిమగ్నుడవటానికి ముఖ్యకారణం స్వీయ-అవగాహన (స్వీయ-సాక్షాత్కారం) యెడల బలమైన ఆయన కోరిక. మానవసేవలోనే దేవుడి సాక్షాత్కారం లభిస్తుందని ఆయన నమ్మకం. ఈ సేవ భారతావనికి చేయాలనే తపన ఆయనలో నిగూఢమై ఉంది. తనకు దాని యెడల ఆయనకు అభిరుచి, యోగ్యత ఉంది కాబట్టే ఆ అవకాశం అనుకోకుండా నాటాల్ లో వచ్చింది. కథియవార్ లో ఆయన ఎదుర్కొన్న కుట్ర కుతంత్రాలను గమనించి భరించలేనందువల్లనే దక్షిణ ఆఫ్రికాలో వచ్చిన అవ కాశాన్ని అందిపుచ్చుకుని అచ్చటకు వెళ్ళటం జరిగింది. కాలక్రమేణా దైవ శోధనలో నిమగ్నమవ్వాలనే కోరిక ఆయనలో బలంగా ఉంది.
ఈ ప్రయాణంలో తన అనుభవాల గురించి గాంధీజీ ఇలా వివరించారు:
“క్రైస్తవ మిత్రులు వారి జ్ఞాన బోధనలతో నా కడుపు నింపేశారు. నన్ను ప్రశాంతంగా ఉండనీయలేదు. డర్బన్ లో ఒకాయన (Spencer Walton) నాతో స్నేహం పెంచుకుని తన కుటుంబంలో వ్యక్తిగా పరిగణించాడు. దానికి ముఖ్య కారణం ప్రిటోరియా (Pretoria) లోని అనేకమంది క్రైస్తవులు నాకు తెలుసు. ఆయన భార్య అతి సౌమ్యురాలు. వారితో క్రైస్తవ మతం మీద దీర్ఘంగా చర్చించటం జరిగింది. వారితో నేను తరచుగానే సమావేశం అయ్యేవాడిని. మనస్సులో మాత్రం ఎదో అసంతృప్తి మిగిలి ఉండేది.
ఆ సమయంలో గుజరాత్ లో జన్మించిన ‘రాజచంద్ర’ (రాయచంద్ భాయి), ఆత్మ సాక్షాత్కారం పొందిన మహర్షి నాకు మార్గదర్శకుడయ్యారు. ఒక స్నేహితుడు నాకు ‘నర్మదాశంకర్’ (Narmadashankar Lalshankar Dave) రచించిన ‘ధర్మ విచార్’ (Dharma Vichar; రచన: 1886) పుస్తకం నాకు పంపిస్తే అది నాకు చాలా ఉపయోగపడింది. అలాగే ఫ్రాన్స్ లో ఒక Bohemian కవి జీవన శైలి గురించి వ్రాసిన పుస్తకం చదవగా అది నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ అన్వేషణ క్రమంలో ‘మాక్స్ ముల్లర్’ (Max Müller) పుస్తకం ‘India: What Can It Teach Us?’ చాలా ఆసక్తితో చదివాను. అలాగే భారత్ లోని Theoso-phical Society ప్రచురించిన ‘ఉపనిషత్తులు’, ‘భగవద్గీత’ ఎంతో ఉత్సాహంతో చదవటం జరిగింది. ఈ గ్రంథాలు సనాతన ధర్మం (Hinduism) మీద నాకున్న గౌరవం చాలా పెంచాయి. వీటి ప్రభావం నామీద చాలా పడింది.
అలా అని నేను ఇతర మతాలమీద పక్షపాతం చూపలేదు. Washington Irving రచించిన ‘Life of Mahomet’, ఇతర మహ్మదీయ రచనలు చదువగా 'ముహమ్మద్’ గురించి నా అంచనా పెరి గింది. అలాగే ‘The Sayings of Zarathustra’ అనే పుస్తకం కూడా చదివాను. “నేను కొన్ని రష్యన్ కవి ‘Tolstoy’ రచించిన పుస్తకాలు (Gospels in Brief; What Is to Be Done?); ఇతర రచనలు చదవగా అవి నా మీద లోతైన ముద్ర వేశాయి. క్రెస్తవ చర్చి నామీద ప్రభావం చూపలేదు. అచ్చటి బోధనలు, ఉప న్యాసాలు స్ఫూర్తి విహీనమైనవి.
అలా నాకు వివిధ మతాల విజ్ఞానం తెలిసింది. ఈ పరిశీలన నాకు ఆత్మపరిశీలన యెడల ఉత్తేజం కలిగించింది. ఇది నాకు నచ్చిన విషయాన్ని ముందు నేను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. వెంటనే యోగసాధన మొదలుపెట్టాను. యోగాసనాల గురించి సనాతనధర్మ గ్రంధాలను చదివాను. కాని అవి నాకు సాధ్యం కానప్పుడు భారత్ కు తిరిగివచ్చినప్పుడు ఒక యోగ నిపుణుడి సహాయం పొందాలనుకున్నా అది నెరవేరలేదు. క్రమక్రమంగా మానవుల యెడల సార్వత్రిక ప్రేమ (uni-versal love) చూపటానికి అనంతమైన అవకాశాలున్నాయని గ్రహించాను.”
గృహస్తుడుగా గాంధీజీ అనుభవం
ఒక గృహస్తుడి జీవితం గడపటంలో గాంధీజీ కి ఏమాత్రం అనుభవం లేదు. నాటాల్ లో ఆయన జీవితానికి బొంబాయి, లండన్ లలో ఆయన అనుభవించిన జీవితాలకు ఏమాత్రం తేడా లేదు. కాని నాటాల్ లోని జీవితానికి చేసే ఖర్చులో అత్యధిక భాగం ప్రతిష్ట కోసం చేసిందే. అచ్చట బారిష్టర్ గా ఒక సంస్థకు ప్రతినిధిగా పరువుతో కూడిన జీవితం గడపాలంటే ఈ ఖర్చు తప్పనిసరి అని ఆయన భావించటం జరిగింది. ఒక ప్రముఖమైన ప్రాంతంలోఅన్ని సౌకర్యాలు ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆయన నివాసం ఏర్ప రచుకున్నారు. సాధారణమైన భోజనమయినా తరచుగా ఆంగ్లేయ మిత్రులను, భారతీయ-సహా ఉద్యో గులను ఆహ్వానించటం వల్ల గృహ నిర్వహణ ఖర్చులు భారీగా ఉండేవి. ఈ గృహాన్ని నడపాలంటే ఒక సేవకుడు తప్పనిసరి. కాని ఆయనకు ఒక సేవకుడిని నియమించుకుంటే అతనితో ఎలా పని చేయించుకోవాలో తెలియదు.
ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతనితో పాటు ఒక వంటచేసే వ్యక్తి కూడా ఉన్నాడు. స్నేహితుడిని నా కుటుంబ సభ్యుడుగా పరిగణించాను. అతనితోపాటు ఒక నా ఆఫీస్ గుమాస్తా కూడా నా ఇంట్లోనే ఉండి భోజనాదులు కూడా చేసేవాడు. అంతా సరిగ్గా జరుగుచున్నప్పుడు ఒక రోజు చేదు సంఘటన జరిగింది.
నా స్నేహితుడు చాలా తెలివైనవాడు. అతను నాతో విశ్వాసంతో ఉంటాడని ఆశించాను. కాని నేను మోసపోయాను. అతనికి నాతో ఉన్న ఆఫీసు గుమాస్తా అంటే అసూయ. ఈ స్నేహితుడు ఎంత చిక్కు కథ అల్లాడంటే నేను గుమస్తాను అనుమానించే పరిస్థితికి తీసుకువచ్చాడు. అతను (గుమాస్తా) కోపంతో తన ఉద్యోగాన్ని, నా ఇంటిని వదలి వెళ్ళిపోయాడు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను అతనికి అన్యాయం చేశానని అనిపించింది. నా మనసాక్షి చివుక్కుమని, బాధపడింది.
ఈ సమయంలో వంటచేసే వ్యక్తి కొద్ది రోజులు సెలవు మీద వెళ్లగా, మరొక వ్యక్తిని ఈ పనికి నియమించాను. ఈ క్రొత్త వంటవ్యక్తి మోసగాడని తెలిసింది. కాని అతను ఉన్నప్పుడు జరిగిన సంగతులు తెలుసుకుని ఇతనిని దేవుడే పంపించాడని అనిపించింది. ఇతను వచ్చిన రెండు-మూడు రోజులకు నాకు తెలియకుండా నా ఇంట్లో జరిగే అవకతవకలు గురించి చెప్పి నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. నేను ‘సులభంగా నమ్మే వ్యక్తిని, సూటిగా మాట్లాడే వ్యక్తిని’ అని అందరికి తెలుసు. నా ఇంటి చూరు క్రింద మోసాలు జరుగున్నాయనే విషయం నాకు తెలిసి ఆశ్చర్యపోయాను.
అసలు విషయం ఇది. ప్రతి రోజూ నేను ఆఫీసు నుంచి ఇంటికి మధ్యాహ్న భోజనానికి వెళ్ళే వాడిని. ఒక రోజు పగలు 12 గంటలకు ఈ క్రొత్త వంటవాడు ఆయాస పడుతూ ఆఫీసుకు వచ్చి నాతో ‘మీరు వెంటనే ఇంటికి రండి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం చూపిస్తాను; ఇప్పుడు రాకపోతే మీరు విచారపడతారు’ అని అన్నాడు.
నేను అతడు, ఒక ఆఫీస్ గుమస్తా తో కలిసి ఇంటికి వెళ్ళాను. వంటవాడు నన్ను పై అంతస్తు కు తీసుకువెళ్లి, తలుపు తరచి ‘మీరే చూడండి’ అన్నాడు. నేను తలుపు తట్టితే సమాధానం లేదు.
అప్పుడు నేను తలుపును గట్టిగా బాదాను. తలుపు తెరవగా నా స్నేహితుడితో ఒక వేశ్య కనిపించింది. ఆమెను వెంటనే వెళ్లిపొమ్మని, మళ్ళీ ఎప్పుడూ రావద్దని గట్టిగా చెప్పాను. నా స్నేహితుడితో ‘నిన్ను నమ్మినందుకు నన్ను పూర్తిగా మోసం చేశావు. నిన్ను నమ్మి నేను అవివేకినయ్యాను. నీ మీద ఉన్న నా నమ్మ కాన్ని వమ్ము చేశావు.’ అని కోపంతో అన్నాను. అతను చేసిన తప్పుకు సిగ్గు పడకపోగా నన్ను భయపెట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు నేను ‘నాకు దాయటానికి ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చింది చెప్పుకో! నీవు తక్షణం నా ఇంట్లోనుంచి వెళ్లిపో’ అని ఆదేశించాను.
కాని అతను కదలలేదు. అప్పుడు నేను ఆఫీస్ గుమాసాను పిలిచి ‘నీవు పోలీస్ సూపరిం టెండెంట్ దగ్గరకు వెళ్లి నా ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి నాతో, నా ఇంట్లో అనుచితంగా ప్రవర్తించాడు. అతనిని నేను ఇచ్చట ఉంచుకోలేను. బయటకు వెళ్లిపొమ్మన్నా అతను వెళ్లటంలేదు. అందువల్ల పోలీసులు వచ్చి అతనిని బయటకి పంపిస్తే నేను ఆయనకు చాలా రుణపడిఉంటానని చెప్పు’ అని పంపించాను. దీనికి అతను భయపడి నాకు క్షమాపణలు చెప్పి, పోలీసులను పిలువవద్దని బ్రతిమిలాడి వెంటనే నా ఇంట్లోనుంచి ఖాళీచేసి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన నాకు ఒక పాఠం నేర్పింది. అతను చెడ్డ గుణం కలవాడని తెలిసికూడా నామీద అతనికి ఉన్న విశ్వసనీయతను నమ్మి, అతనిని సంస్కరించగలననే నమ్మకంతో నాదగ్గర ఉండనిస్తే నాకే ద్రోహం తలపెట్టాడు. ఇతర స్నేహితులు ముందే హెచ్చరించినా నాకు అతనిమీద ఉన్న ఇష్టం నన్ను పూర్తిగా గుడ్డివాడిని చేసింది. కాని సమయానికి దేవుడు నన్ను రక్షించాడు. ఈ తొలి అనుభవం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది.
అంతకు ముందు స్నేహితుడి మాటలు నమ్మి నీతి, నియమాలున్న గుమస్తాను అనవసరంగా అనుమానించి అతను నా ఇంటినుంచి వెడలి వెళ్లిపోవటానికి కారణభూతుడయ్యాను. అవినీతి పరుడయిన స్నేహితుడు మోసగాడని మొదట ఈ గుమస్తా చెప్పినా నేను నమ్మలేదు. ఈ క్రొత్త వంటవాడు ఈ స్నేహితుడు నిజంగానే మోసగాడని నా కళ్ళు తెరిపించి నాకు ఉపకారం చేశాడు.
ఈ సంఘటన జరిగిన తరువాత ఈ క్రొత్త వంటవాడు నాతో ‘మీరు చాలా తేలికగా మోసపోయే వ్యక్తి. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. నామీద ఎవరయినా చేదుగా చెప్పినా నమ్మవచ్చు కూడా. అందువల్ల నేను మీ మీతో పనిచేయలేను’ అని అంటే అతనిని వెళ్లనివ్వక తప్పలేదు.
నా కారణంగా అన్యాయంగా నా ఇంటినుంచి వెళ్లిపోయిన గుమస్తాకు చేసిన తప్పును సరిదిద్దు కోటానికి చాల ప్రయత్నం చేశాను. అతనిని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాను. తప్పు తప్పే. దీనికి నివృత్తి లేదు.”
……..సశేషం……
గాంధీజీ స్వదేశానికి పయనం, భారతావనిలో పర్యటన గురించి సెప్టెంబర్ 2026 సంచికలో తెలుసుకుందాము.