Menu Close
Satyam-Mandapati
కరివేపాకు (కథ)
సత్యం మందపాటి

మా లాన్ ఫ్రీజింగ్ చలికి వణికిపోతూ, భరించలేక తెల్లటి మంచు దుప్పటిని వెచ్చగా కప్పుకున్నది.

సంక్రాంతి రోజున ప్రహ్లాద్ వంటిట్లో తీరిగ్గా పులిహోర చేస్తున్నాడు.

పక్కనే కూరలు తరుగుతున్న శిరీషతో అంటున్నాడు ప్రహ్లాద్. “ఇవాళ పులిహోర ఎంత బ్రహ్మాండంగా వస్తుందో చూడు. చాలామంది పోపు పెట్టేటప్పుడు ఐదారు ఎండు మిరపకాయలు వేస్తారు. అప్పుడు సువాసన రాదు. ఒకటో రెండో చాలు. వాటిని వేయించి, తుంచి చిన్నచిన్న ముక్కలుగా వేస్తే కావలసిన కారమూ వస్తుంది. మంచి సువాసనా వస్తుంది. అలాగే కరివేపాకు కూడా. ఇరవయ్యో, ముఫ్ఫయ్యో ఆకులు వేసే బదులు నాలుగైదాకులు సన్నగా తరిగి పులిహోరలో వేస్తే ఘుమాయిస్తుంది. అప్పుడు కరివేపాకులు పారేయకుండా, తెలియకుండానే తినేస్తారు” అన్నాడు.

“నాకు తెలుసు నలభీముడూ. నువ్విది నూట పదహారోసారి చెబుతున్నావు. నువ్వెలా చేస్తావో చూద్దాం” అన్నది శిరీష నవ్వుతూ.

కొంచెం ఆగి, ఆలోచిస్తూ అన్నది శిరీష. “నా చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది”

“ఏమని? నేను చెప్పిందేనా?”

“కాదు. ఒకావిడ కరివేపాకులాటిదని” శిరీష అంది.

“అదేమిటి? ఏమా కథ?” అన్నాడు ప్రహ్లాద్. బెండకాయలు తరుగుతూ అన్నది శిరీష.

“ఆవిడ పేరు మంగమ్మగారు. నేనప్పుడు స్కూల్లో చదువుకునేదాన్ని. ఆవిడది నిరుపేద కుటుంబం. ఆవిడ తండ్రి స్కూల్లో తెలుగు మాస్టారు. భార్య చనిపోయాక తనకున్న చిన్న పెంకుటిల్లు అమ్మేసి మంగకి చిన్నవయసులోనే పెళ్ళిచేశారు. ఆమె భర్త ఉద్యోగంలో నిలకడలేక, తాగుడికి అలవాటుపడి రోజూ భార్యని కొడుతూ హింసించేవాడు. ఆ బాధలు చూడలేక తండ్రి చనిపోయాడు. ఆమె భర్త ఇంకో ఆవిడతో ఎక్కడికో వెళ్ళిపోవటంతో జీవితం దుర్లభమయింది. అమ్మే మంగని దగ్గరుంచుకుని వంటావార్పూ, ఇంటి పనులూ నేర్పి ఆవిడకు తిండి ఖర్చు లేకుండా చేసింది. నెల జీతమూ ఇచ్చేది. ఎవరింట్లోనో ఒక గది అద్దెకు తీసుకుని అక్కడే వుంటుండేది ఆవిడ. సమయం వున్నప్పుడల్లా చుట్టుపక్కలవారికే సహాయం కావాలన్నా చేసేది. వాళ్ళే పిలిచి పిల్లలకి మధ్యాహ్నం బేబీ సిట్టింగో, పెళ్ళిళ్ళలో అవీఇవీ పనులో చేయమని అడిగేవారు. రాత్రీ పగలూ అనేది చూడకుండా ఎప్పుడూ ఆమె సిద్ధమే. వాళ్ళు డబ్బులిచ్చినా తీసుకునేది కాదు. మర్యాదగా తిరస్కరించేది. ‘ఒంటరిగా మిగిలిపోయిన నన్ను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరే నా కుటుంబం. మరి నావాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటానా అనేదిట. అమ్మ ఆవిడకు డబ్బులు తీసుకోమనీ, అవి ఆవిడ ఖర్చులకి వాడుకోమనీ నచ్చజెప్పాక వాళ్ళు ఎంతిస్తే అంతే తీసుకునేదిట. ఇవ్వకపోయినా అడిగేది కాదుట”. శిరీష చెప్పటం ఆపి, వంట మొదలుపెట్టింది.

“ఆ రోజుల్లో అలాటి మనుష్యులుండేవారుగానీ ఇప్పుడా బంధాలూ, అనుబంధాలూ ఎక్కడున్నాయి? పాపం బ్రతుకుతెరువు కోసం ఎంత కష్టపడిందో ఆవిడ” అన్నాడు ప్రహ్లాద్ కొంచెం సానుభూతిగా.

“అవును ఆవిడ తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుంటూ జీవించింది. అంతేకాదు ఆమె మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, కొంతమంది ఆవిడ చేత ఎంతో ఊడిగం చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేవారుట. అయినా ఆవిడ నిస్వార్ధంతో వారి అవసరాలకు ఆదుకునేదిట. ఆ చుట్టుపక్కల వున్నవారంతా ఆవిడ కుటుంబ సభ్యులే. ఆవిడది ఏకాకి బ్రతుకే అయినా, సిరివన్నెలగారు చెప్పినట్టు జగమంతా ఆవిడని తమ కుటుంబంగానే చూసేవారుట. అయినా ఒకతనేదో అవసరానికి ఇంటికి పిలిచి వయసులోవున్న మంగని బలాత్కారం చేయబోయాడుట. ఆమె తప్పించుకు పారిపోయి, బయట ఎవరితోనూ ఏమీ రాద్ధాంతం చేయకుండా అమ్మతో చెప్పి ఏడ్చిందిట. ఇలాటివి మా అమ్మ చెప్పటమేకాక, నేను పెద్దవుతున్నకొద్దీ గమనించే దాన్ని. ఎన్నో కష్టాలుపడ్డా ఇరుగుపొరుగు వారికి ఉచిత సహాయం మానలేదు. తర్వాత మంగ, మంగమ్మగారయింది. ఎంత కష్టపడుతున్నా ఆవిడ ముఖం చిరునవ్వుతో ప్రశాంతంగా వుండేది. ఎక్కడా అలసట కనపడకుండా పని చేసేది. తన జీవితమే సమాజ సేవకు అర్పించింది”

“మరి ఆవిడకు అనారోగ్యమో, అవసరమో వస్తే…” అడిగాడు ప్రహ్లాద్.

“డాక్టర్ని చూస్తే ఎంతో ఖర్చవుతుందని ఆ నొప్పులన్నీ భరించి వూరుకునేదిట. అప్పుడే మా ఇంటికెదురుగా వుండే హోమియోపతి డాక్టర్‍గారది తెలుసుకుని ఆవిడకి ఉచితంగా వైద్యం చేసేవారు. ఆ ఉచిత వైద్యానికి ఇష్టపడక, ఆయన పిల్లల్ని స్కూల్లో దించటం, తీసుకురావటంలాటి పనులు చేసేది. ఒక పెళ్ళిలో ఎవరిదో నెక్లెస్ పోతే పోలీసులని పిలిచారుట. వడ్డనలో సహాయం చేస్తున్న ఆవిడని పోలీసులు అనుమానించారు. ఆ ఇంటావిడ ఆవిడటువంటి మనిషి కాదని చెప్పి పోలీసులని వెనక్కి పంపించింది. తర్వాత ఆ నెక్లెస్ అక్కడ ఎక్కడో కుర్చీ క్రిందనే కనపడింది. ఆ సంఘటన ఆవిడ నిజాయితీకే ఒక గొప్ప ఉదాహరణగా చెప్పేది అమ్మ”

“మనిషిగా పుట్టినందుకు మనిషిగా జీవిస్తున్న నిజమైన మనిషి ఆవిడ. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఆవిడని చూడాలని వుంది” అన్నాడు ప్రహ్లాద్ మెచ్చుకుంటూ.

ఆ రోజు రాత్రి శిరీష ఇండియాకి ఫోన్ చేసింది, సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారని అడుగుతూ.

“నేనూ మీ నాన్నా ఇద్దరమేగా. ఒక్కగానొక్క కూతురివి అమెరికాలో వున్నావు. అరడజను గారెలు చేసి, వాటిలో మీనాన్నకి ఇష్టమని రెండు గారెలు పెరుగులో వేశాను. క్రింద సెల్లారులో కొంతమంది గొబ్బెమ్మలు పెట్టి, కోలాటం చేస్తుంటే చూసొచ్చాను. మీ నాన్నేమో మోకాళ్ళ నొప్పని టీవీలో ఏదో సినిమా చూస్తూ కూర్చున్నారు. మీరెలా చేసుకున్నారు సంక్రాంతి పండుగని?” అడిగింది అమ్మ రాజేశ్వరి.

నవ్వింది శిరీష. “నేను మామూలు వంటే చేశాను. ప్రహ్లాద్ పండుగ స్పెషల్ కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి పులిహోర చేశాడు. అంతకన్నా ఇంకేమీ చేయలేదు” అన్నది.

“ఆఁ! మర్చిపోయాను. నువ్వు కరివేపాకంటే గుర్తుకొచ్చింది. వారం రోజుల్నించీ మంగమ్మకి ఒంట్లో బాగాలేదు. మన హోమియో డాక్టర్‍గారే మందులిస్తున్నాడు” రాజేశ్వరి అన్నది.

“ఏమయింది?” అడిగింది శిరీష.

“ఏమో… మంచం మీదనించీ లేవటం లేదు. ఎలావుందని అడిగితే ఏమీ చెప్పదు. మళ్ళీ గట్టిగా అడిగితే, కొంచెం నీరసంగా వుంది, రేపటినించీ పనిలోకొస్తానమ్మా అంటుంది. నేనే వద్దన్నాను. ముందు పూర్తిగా తగ్గనీ, మాకేం ఫరవాలేదన్నాను. ఆవిడా వయసులో పెద్దదైపోయింది. నెమ్మదిగా ఆరోగ్యం సడలిపోతున్నది” అంది రాజేశ్వరి.

“మంగమ్మగారిని జాగ్రత్తగా చూసుకో అమ్మా” అని, ఫోన్ పెట్టేశాక ఆ విశేషాలన్నీ ప్రహ్లాద్‍కి చెప్పింది శిరీష.

“అయ్యో పాపం. అలాటి మంచి మనిషి అనారోగ్యంతో బాధ పడకూడదు” అన్నాడు ప్రహ్లాద్.

“అవును. షి డజంట్ డిజర్విట్” అన్నది శిరీష.

మూడు రోజుల తర్వాత రాజేశ్వరే కూతురికి ఫోన్ చేసింది.

ఆవిడ మాట్లాడుతుంటే, శిరీష ఫోన్ స్పీకర్లో పెట్టి ప్రహ్లాద్‍ని వినమని సంజ్ఞ చేసింది.

“మంగమ్మగారు ఒళ్ళు తెలియకుండా అలానే పడుకునుంది. ఆవిడుంటున్న ఇల్లుగలవాళ్ళకి అనుమానం వచ్చి చూస్తే బలహీనంగా కనిపించిందిట. ఆవిడ పడుకున్న తెల్ల దుప్పటి మీద కొన్ని రక్తపు మరకలూ వున్నాయిట”

“అయ్యో, ఏమయింది?” అడిగింది శిరీష.

“ఏమో తెలియదు. హోమియో డాక్టర్‍గారు ‘వెంటనే హాస్పిటల్లో చేర్పిస్తే, అక్కడే స్కానింగ్ మొదలైన పరీక్షలు చేసి, వాళ్ళే రోగ నిర్ణయం చేసి ఏంచేయాలో చెబుతారు. అలాటి పరికరాలేవీ మా దగ్గరుండవు’ అన్నారుట. ఆవిడేమో ‘నేను అనుకున్న జీవితం సంపూర్ణంగా జీవించాను. ఆసుపత్రికి వెళ్ళను. ఇక్కడే చచ్చిపోతాను’ అన్నదిట. మేమెవరం చెప్పినా వినటం లేదు” అన్నది రాజేశ్వరి.

శిరీష ఒక నిమిషం ఆలోచించి అంది, “నాన్నతో చెప్పించు. ఆయనంటే ఆవిడకెంతో గౌరవం. ఒప్పుకుంటుంది”

“అవును. ఆయనతో చెప్పించి చూస్తాను” అన్నది రాజేశ్వరి.

ప్రహ్లాద్ మాట్లాడలేదు. అతనొక మానవతావాది. ఇలాటి సంఘటనలు అతన్ని త్వరగా కదిలిస్తాయి. మర్నాడే శిరీష అమ్మతో మాట్లాడింది.

“నువ్వు చెప్పినట్టే నాన్నతో చెప్పించాను. అయినా ఆవిడ ఒప్పుకోలేదు. నాన్న గట్టిగా చెప్పి ఒప్పించారు. ఇక్కడే ఒక మంచి హాస్పిటల్లో చేర్పించాము. ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పరీక్ష చేశారు. రక్త పరీక్షలు, స్కానింగులు ఇంకా ఏవేవో పరీక్షలు చేయించమన్నారు. ఎన్నో లక్షల్లో ఖర్చవుతుంది వద్దన్నది మంగమ్మ. అప్పుడేం జరిగిందో చెబితే నమ్మవు. ఆవిడ సహాయం తీసుకున్న కొందరు ముందుకొచ్చి, ‘ఎంతయినా సరే ఏంచేయాలో అన్నీ చేయండి. మా స్థోమతనిబట్టి తలో చేయి వేస్తాం’ అన్నారు. మంగమ్మనీ ఒప్పించారు” అన్నది రాజేశ్వరి. ఆమె గొంతు గాద్గదికమైంది.

అక్కడే నుంచుని అంతా వింటున్న ప్రహ్లాద్ “ఎవరూ ఇవ్వనఖ్కర్లేదు అత్తయ్యగారు. మొత్తం ఎంతవుతుందో చెప్పండి. అంతా నేను పంపిస్తాను. ఇన్నాళ్ళూ ఇతరుల కోసం ఆవిడ కష్టపడింది. ఇప్పుడు ఆవిడ ఋణం తీర్చుకునే అవకాశం మనకి వచ్చింది. తోటిమనిషి కష్టాల్లో వున్నప్పుడు ఆమాత్రం చేయలేకపోతే మనకి ఈ సంపాదనెందుకు?” అన్నాడు.

అతని కళ్ళల్లో మెరిసిన నీటి చుక్కలని చూసి, అతని భుజం మీద చేయి వేసి మృదువుగా నిమిరింది శిరీష.

రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డదేమో!

“అవునమ్మా. ఎంత ఖర్చయినా మేము చూసుకుంటాము. ఆవిడ ఆరోగ్యంగా వుంటే చాలు” అన్నది.

మర్నాడే కొంత డబ్బు పంపించాడు ప్రహ్లాద్.

శిరీష తల్లితో రోజూ ఫోన్లో మాట్లాడి ఆవిడ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూనే వుంది.

వీపు మీద పై భాగంలో ఎత్తుగా వుందని స్కానింగ్‍లో తెలిసిందిట. లోపలున్న ఆ లంప్‍ని తీసేయటం, దానిలో ఒక చిన్న ముక్కని బయాప్సీకి పంపించటం చేస్తే, అది కాన్సర్ సంబంధమా కాదా అని తెలుస్తుందని చెప్పారుట. తర్వాత రెండు రోజుల్లో ఆపరేషన్ కూడా చేశారు. మంగమ్మగారు రికవరీలో వున్నారనీ, తేరుకుంటున్నారనీ చెప్పారు.

ఇంకో రెండు రోజుల తర్వాత అసలు శుభవార్త తెలిసింది. బయాప్సీలో కాన్సర్ లేదనీ, ఇక ఏమీ ఫరవాలేదనీ, వారం రోజులు హాస్పిటల్లో వుండి, అంతా తగ్గిపోయాక ఇంటికి వెళ్ళిపోవచ్చుననీ డాక్టర్లు చెప్పారుట.

రాజేశ్వరి ఇది చెబుతున్నప్పుడు, ఆమె గొంతులో మహదానందం తెలుస్తూనే వుంది. శిరీష కూడా పక్కనే వున్న ప్రహ్లాద్ కళ్ళలోకి సంతోషంగా చూసింది.

ప్రహ్లాద్ అన్నాడు, “మంచి శుభవార్త అత్తయ్యగారు. మంచివాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆవిడ మానవత్వమే ఆవిడని కాపాడుతున్నది. మొత్తం ఖర్చెంతయిందో కనుక్కోండి. నేను వెంటనే పంపిస్తాను” అన్నాడు.

ఫోన్ పెట్టేశాక ప్రహ్లాద్ శిరీషని అడిగాడు, “అత్తయ్యగారు మంగమ్మగారిని కరివేపాకు అనేవారన్నావు కదా! ఎందుకు?” అని.

శిరీష నవ్వుతూ అన్నది.

“ప్రతివాళ్ళకీ కూరల్లోనూ, పులిహోరలోనూ కరివేపాకు ఘుమఘుమలు కావాలి. కానీ తినేటప్పుడు కరివేపాకు ఆకుల్ని చాలమంది ఏరి పారేస్తుంటారు. ప్రతి ఆకునీ సన్నగా తరిగి చిన్న ముక్కలుగా వేస్తే ఘుమాయింపులింకా ఎక్కువవుతాయని నువ్వేగా చెప్పావు. అలాగే ఆవిడ చుట్టూ వున్న సమాజాన్ని ప్రేమిస్తుంది కాబట్టి, తనలోని ప్రేమని ఏ ఒక్కరికోకాక, ఎంతోమందికి తనకి చేతనైనంతవరకూ పంచి ఇస్తుంది. నువ్వే ఒకసారి ఏదో పాట విని అన్నావు, ‘ప్రేమించు, ప్రేమని పంచు, ప్రేమగా జీవించు’ అని. అదే నీ కరివేపాకు కథ” అంటూ మళ్ళీ నవ్వింది.

ప్రహ్లాద్ శిరీషని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

********

Posted in August 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *