కదంబం - సాహిత్యకుసుమం
మన భాష తేట తెలుగు
మన యాస జిలుగు వెలుగు
మాట తీరులెన్నున్న
కట్టు బొట్టు వేరైనా
తెలుగు భాష చెణుకు
యాసతో అల్లుకున్న మల్లెల పందిళ్ల
కులుకుల సొగసు.
తిక్కన పుట్టిన నెల్లూరు
యాసలకే నెరజాణ
తెలుగు భాష యాసకు
ఆభరణం రాజమహేంద్రవరం
విశాఖ యాస వెన్నెల చల్లదనం
కోనసీమ యాస కోవెలలో దివ్వె
శ్రీకాకుళం యాస సిరులకే సీమంతం.
త్యాగయ్య కలంలో కలుపుకొని
కదిలింది తెలుగు
ఒదిగొదిగి పోతన ఒరవళ్లల్లో
ఉరిమింది తెలుగు
వేమనగా తరతరలుగా
సాగింది తెలుగు
మన ఆడపడుచు మొల్ల
తనవంతు అల్లింది తెలుగు
రమ్య రామాయాణ గాథ.
తెలంగాణ పలుకుల్లో
సాహిత్య సరిగమపదనిసలు, యాసలు
కూసో అన్నా, కూర్చో అన్నా, కూకో అన్నా
అన్నీ చెణుకుల విసురులే
మాట కరుకు, మనసు చెరుకు
ఇదే తెలంగాణ కులుకుల పాలపుంత
రాయలంటి కవి భాషల్లో
‘తెలుగు భాష లెస్స’ అని
పలికిన హైలెస్స మన
తెలుగు యాస
ఆత్రేయ మనసులో వికశించిన
మల్లెల తెలుగు
దాశరధి రచనలు
కరుణాపయోనిధీ కావ్యాలు
గద్దరు గళంలో గాన తెలంగానం
సినారే కలం చిత్ర సీమలో హలం
కడలిని మీటుతూ తరలింది తెలుగు.
దేశదేశాలలో తేజమై
మెరిసింది తెలుగు
సాంప్రదాయ సంస్కృతికి
పెట్టింది పేరు
తెలుగు ఆచారాలకు
హరివిల్లు లోని వర్ణాలు తెలుగు
యాసలలో తుమ్మెదల
ఝంకారాల సందళ్ళు తెలుగు
వేదాల కొసలందు వెలుగొందే తెలుగు
యాసలు వేరైనా భాష భావం ఒక్కటే
అక్షరాలు కొన్నైనా అవి చేసే యజ్ఞాలు ఎన్నెన్నో!!!!