అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
శ్రీరాముఁడు తరలి సారవిశిఖు రామవిభుని సత్యవిభవు ధార్మికో ద్ధారవిబుధు లోకవిదితుఁ దత్వవిదుని జానకీ మారవపుని శ్రీదచరణు మానితగుణు దైత్యసం హారనిపుణు త్రాసహరణు నాత్మ స్మరణ సేసెదన్ 294 [లక్షణము భ-స-న-జ-న-ర 11 యతి] వేంకటేశ్వరుఁడు మ.కో. వేంకటేశునిదర్శనంబు(1) సవిస్తరంబుగ వేదనల్ సంకటమ్ములఁ బారఁద్రోలును శాంతి, సన్మతి గల్గఁగా; నింకఁజేయు(2) నఘహ్రదంబుల(3); నింకఁజేయు(4) కృతుల్ నిరా తంకభాగ్య మొసంగుఁ దత్కృప దాసకోటి తరింపఁగన్ (1) స్వామి యొక్క దర్శనము/ స్వామిని చూపునది (2) ఇంకిపోవునట్లు చేయును (3) పాపములు అనే కొలనులను (4) ఇక ముందు చేయునట్టి 295 వేంకటేశ్వరుఁడు చం. తిరుమలవాస! సంతతప్రతిధ్వనితాసమదివ్యవేంకటే శ్వరమధురాక్షరామృతరసఃపరిపూర్ణమనోవికాసబం ధురనతదాస! ప్రస్ఫుటతనూభవ(1)భాస! రమావిలాస! సుం దరముఖవాసహాస! గతదంతిదళాధిపత్రాస! కావరా (1) శరీరమునుండి పుట్టిన 296 మత్తకోకిల వేలసూర్యులకాంతిమంతము వేంకటేశ్వరరూప మే వేళ నన్యము చింతసేయక వీడ కాత్మను నమ్మినన్ బాలనమ్మునుఁ దానె చేకొని బాధ్యతన్ వహియించు భ క్తాళి యోగము క్షేమమున్ గన, నా దయాళు భజించెదన్ 297 సీ. కను లున్న వెందుకు – నినుఁ గాంచుటకుఁ గాదె? కమలామనోహరా! కంధివాస! చెవు లున్న వేలనొ – చెంతఁ జేరకముందె తనివి తీరగ నామమును వినంగ చేతు లున్న వవేల – చేష్ట లన్నియు నీదు సేవఁ జేసి తరింప శ్రీనివాస! పదము లున్నవి దేని – కదను వచ్చినయంత నీ దరిఁ జేరఁగా నీలగాత్ర! మన మున్న దెందుల – కనుదినంబును గొల్వ మందిరమును జేసి యిందిరేశ! వాక్కున్నదేల – నీ వైభవంబును నోటఁ బూటపూటకుఁ బల్క మోహనాంగ! జన్మ మెత్తిన దేల – తన్మయతను గొల్చి కైవల్య మొందఁగా గరుడగమన! తే.గీ. సప్తపాదాల నుడివిన సచ్చరిత్ర సప్తశైలనివాస! యీ జన్మ లోన విడక జీవించు భాగ్యమ్ము వేగ నిడుమ వేంకటేశ్వర! శుభకర! సంకటహర! 298 సీ. ఎలుగెత్తి పిల్చిన నేలుకొ మ్మంచును బరువెత్తి(1) చేరెడు పాలకుండు గళమెత్తి నామంబు గానంబు గావింప నిలువెత్తు దైవమై నిలుచువాఁడు కయిలెత్తి(2) శిరముపైఁ గైమోడ్పు సేయఁగా తెరలెత్తు(3) కృపఁ గాంచు దిక్కు తానె తనువెత్తు ప్రతిజీవితనుమనోబాధలఁ(4) గరమెత్తి(5) తఱిమెడు కన్నతండ్రి తే.గీ. ఎత్తు శిఖరాల నెక్కలే కెవరు వేఁడ చిత్తమునుఁ జిక్కఁబట్టుక(6) చెంతఁజేర సరసహృదయుఁడు వేంకటేశ్వరవిభుండు కొండ దిగివచ్చు కొండంత యండ యగుచు (1) పరుగెత్తి (2) చేతు లెత్తి (3) పొంగు (4) ప్రతి ప్ర్రాణి శారీరిక, మానసిక కష్టములను (5) చెయ్యి పైకెత్తి (6) గట్టిగా పట్టుకొని 299 సీ. నీ దివ్యపాదాబ్జనిత్యపూజయె కదా రక్షయౌ మాకు సర్వత్ర స్వామి! నీ దేవియైన శ్రీగోదాప్రణీతమౌ పాశురంబులు భద్రభాసురములు నీ పుత్రరత్నమౌ నీరజాసనుసేవ బ్రహ్మోత్సవంబుగా వఱలు భువిని నీ పుణ్యతీర్థాలు నిజదాసకిల్బిష క్షాళన గావించు సప్తగిరులఁ తే.గీ. గలియుగాంతంబు వఱకును నిలిచి భువినిఁ గలిమలహరంబు గావించు కంధివాస! నిత్యకల్యాణదానందనిలయవాస!(1) గతనతత్రాస! కరుణింపు కలితభాస! (1) అనుదినము శుభప్రదమైన ఆనందనిలయమున వసించువాడా!/నిత్యకల్యాణదా! నందనిలయవాస! 300
2