Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

పర్యావరణం: అతిశయోక్తి – నిజాలు

భయాన్ని అమ్మే ప్రచారం కాదు… శాస్త్రం చెప్పే నిజాలు ప్రజలకు చేరే సమయం వచ్చిందా? మిత్రులారా నేను ప్రస్తావిస్తున్నది పర్యావరణ భయాందోళనల గురించి. నాన్నా పులి వచ్చింది అని మూడోసారి అన్న ఆ పిల్లవాడికి పట్టిన దురవస్థ గురించి మనం కథల్లో చదువుకున్నాము. అయితే పర్యావరణ భయాందోళనల విషయాలలో పులి కేక మూడు సార్లు కాదు, ఈ పాటికి ఏ మూడొందల సార్లో లేదా అంతకు పైచిలుకే వచ్చి ఉంటుంది. ఈ నెల రచ్చబండలో స్థలాభావం వల్ల మూడొందల కేకలు ప్రస్తావించడం కుదరదు కాబట్టి, ఓ ఐదు - ఆరు కేకలు గురించి చర్చిద్దాం. నాకు గుర్తెరిగి ఇంతకు మునుపు మన రచ్చబండ చర్చల్లో పర్యావరణ ప్రస్తావన లేదు కాబట్టి, ఈ నెల చర్చించడానికి మనకు ముడి సరుకు దొరికినట్లే. ఇంకేం మరి ఉపోద్ఘాతంతో మొదలెడదాం!

ఉపోద్ఘాతం: భయమే వార్తగా మారిన దశాబ్దం

గత పది–పదిహేను సంవత్సరాల్లో 'పర్యావరణం' అనే పదం ప్రజల్లో ఒక కొత్త రకమైన భయాన్ని సృష్టించింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరుగుదల, నీటి కొరత, సాంప్రదాయ శిలాజ ఇంధనం కొరత - ఇవన్నీ నిజమైన సమస్యలే. కానీ ఈ సమస్యలను కొంతమంది కార్యకర్తలు, స్వయంకృత నిపుణులు, మరియు కొన్ని మీడియా వేదికలు అతిశయోక్తిగా, 'విపత్తు రాబోతోంది' అన్నట్టుగా ప్రజలకు అదుపూ, అలుపూ లేకుండా అందించారు.

ఇలాంటి హెచ్చరికలు దశాబ్దాల తరబడి పత్రికల్లో, టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఉదాహరణకు "2030కి ప్రపంచం నివసించలేనిదిగా మారుతుంది", "హిమాలయాలు 2035కి పూర్తిగా కరుగుతాయి", "భారతదేశం నీటిలేని దేశం అవుతుంది", "సముద్ర మట్టం 10 అడుగులు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోతాయి" - ఇలాంటి అంచనాల్లో చాలావరకు తప్పు అని తేలింది. కొన్ని శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పబడినవి. కొన్ని మీడియా సెన్సేషన్ కోసం తయారైనవి. ఈ వ్యాసం ఆ తప్పు అంచనాలను పరిశీలించి, శాస్త్రం నిజంగా ఏమి చెబుతోందో వివరిస్తుంది.

గత 50 ఏళ్లలో తప్పు అని నిరూపితమైన అంచనాలు

పర్యావరణ అంచనాల చరిత్రను పరిశీలిస్తే, అతిశయోక్తి ఒక పాత సమస్య అని అర్థమవుతుంది. 2000 నాటికి ప్రపంచంలో చమురు పూర్తిగా అయిపోతుందని 1970ల్లో అనేకమంది పర్యావరణ కార్యకర్తలు హెచ్చరించారు. కానీ తరువాత షేల్ సాంకేతికత వచ్చింది; దాంతో ఇప్పుడు చమురు నిల్వలు 1970 కంటే ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తోంది.

షేల్ ఆయిల్ అనేది భూగర్భంలోని గట్టి షేల్ రాతి పొరల మధ్య సూక్ష్మ రంధ్రాలలో ఇరుక్కుని ఉండే ఒక రకమైన సాంప్రదాయేతర ముడి చమురు. సాధారణ బావులలా కాకుండా, దీనిని వెలికితీయడానికి భూమిలోకి అడ్డంగా మైళ్ల దూరం రంధ్రం చేసే 'హారిజాంటల్ డ్రిల్లింగ్', మరియు కెమికల్స్, ఇసుకతో కూడిన నీటిని అత్యధిక పీడనంతో పంపి రాళ్లలో పగుళ్లు తెచ్చే 'హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్' వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తారు. అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా షేల్ ఆయిల్ నిల్వలను కలిగి ఉండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగా, చైనా, అర్జెంటినా, కెనడా, మరియు రష్యాలలో కూడా ఈ నిల్వలు ఉన్నాయి అని తెలుస్తోంది. ఈ సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రావడం వల్లే అమెరికా దేశం ఇంధన రంగంలో పూర్తి స్వయంసమృద్ధి సాధించడానికి దగ్గర్లో ఉందని విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. షేల్ ఆయిల్, సాంప్రదాయ ఆయిల్ మొత్తం కలిపి అమెరికా ఇప్పుడు రోజుకు దాదాపు 1.36 కోట్ల బారెళ్లు ఉత్పత్తి చేస్తోంది, కానీ అమెరికా రిఫైనరీలకు రోజుకు 1.65 కోట్ల బారెళ్లు అవసరం. అంటే అమెరికా తన అవసరాల కంటే తక్కువే ఉత్పత్తి చేస్తోంది, అయితే ఈ తేడాను కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుండి ఆయిల్ దిగుమతుల ద్వారా పూరించుకుంటోంది. అయినప్పటికీ, అమెరికా ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగించే దేశం, ప్రపంచ మొత్తం వినియోగంలో దాదాపు 20% వాటా అమెరికాదే.

2035 నాటికి హిమాలయాలు పూర్తిగా కరుగుతాయని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) 2007 నివేదిక పేర్కొంది. తర్వాత దీనిని తీవ్రమైన పొరపాటుగా గుర్తించిన IPCC, 2010లో అధికారికంగా క్షమాపణలు చెబుతూ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. తగిన శాస్త్రీయ ఆధారాలను సరిచూసుకోకుండా నివేదికలో చేర్చడం వల్లే ఈ తప్పు జరిగిందని వారు అంగీకరించారు. అసలు పరిశోధన ప్రకారం హిమాలయాల మంచు పలకలు తీవ్రంగా కరిగిపోవడానికి 2350 సంవత్సరం పడుతుందని అంచనా వేశారు. కానీ, ఆ సంఖ్య IPCC 2007 నివేదికలో పొరపాటున 2035గా మారిపోయిందని నిపుణులు గుర్తించారు.

ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్ గతంలో భూతాపం తీవ్రతపై విపరీతమైన అంచనాలతో హెచ్చరికలు చేశారు. 2006లో ఆయన రాసిన పుస్తకంలో భూతాపం వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి (2100 నాటికి) కోట్ల మంది చనిపోతారని తీవ్రమైన హెచ్చరికలు చేశారు. అయితే, వాతావరణం తాను ఊహించినంత వేగంగా వేడెక్కడం లేదని గ్రహించి, 2012లో తానే స్వయంగా 'నేను అవసరానికి మించి పర్యావరణ భయాన్ని వ్యాప్తి చేశాను' అని బహిరంగంగా అంగీకరించారు.

అదేవిధంగా, 2020 నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో ఆవాసం ఉండే పోలార్ ఎలుగుబంట్లు అంతరించిపోతాయనే కొన్ని పాత అంచనాలకు భిన్నంగా, అనేక ప్రాంతాలలో వాటి జనాభా ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఆ తప్పుడు అంచనా ఎక్కడి నుండి వచ్చింది అని వెతుక్కుంటూ వెనక్కి వెళితే - యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) 2007లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, భూతాపం వల్ల ఆర్కిటిక్ మంచు కరిగిపోతే 2050 నాటికి ప్రపంచంలోని పోలార్ ఎలుగుబంట్ల జనాభాలో మూడింట రెండు వంతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని పత్రికలు, పర్యావరణ కార్యకర్తలు ఈ "2050" సంవత్సరాన్ని మరింత తీవ్రంగా చూపించడానికి, "2020 నాటికి అంతరించిపోతాయి" అని ప్రచారం చేశారు. 1973లో ఆర్కిటిక్ దేశాలు (అమెరికా, కెనడా, రష్యా, నార్వే, గ్రీన్‌లాండ్) వీటిని విపరీతంగా వేటాడటంపై కఠినమైన ఆంక్షలు విధించాయి. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా వీటి జనాభా పెరగడానికి అవకాశం దొరికింది. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ, పోలార్ బేర్లు ఆ వాతావరణానికి తట్టుకునేలా తమను తాము మల్చుకుంటున్నాయి. ఉదాహరణకు, నార్వేలోని 'స్వాల్‌బార్డ్' ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతున్నా, అక్కడి ఎలుగుబంట్లు కేవలం సీల్ జంతువులపైనే కాకుండా ఉత్తర ధ్రువపు దుప్పి, భారీ దంతాల సముద్రపు సీల్ లను ఆహారంగా తీసుకొంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మొత్తానికి అనేక ప్రతికూలతల మధ్య కూడా పోలార్ ఎలుగుబంట్లు తమ జనాభాను పెంచుకోవడం ఆసక్తికరం.

1988లో అప్పటి మాల్దీవుల పర్యావరణ శాఖ డైరెక్టర్ హుస్సేన్ షిహాబ్ మాట్లాడుతూ, సముద్ర మట్టాలు ఇలాగే పెరిగితే రాబోయే 20 నుండి 40 ఏళ్లలో (అంటే 2008-2028 లోపు) తక్కువ ఎత్తులో ఉండే కొన్ని మాల్దీవుల ప్రాంత దీవులకు భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ ప్రకటనను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు మరియు పర్యావరణ కార్యకర్తలు అతిగా ఊహించి "2020 నాటికి మాల్దీవులు పూర్తిగా మాయమవుతాయి" అని వాతావరణ భయాందోళనను (Climate Alarmism) సృష్టించారు. ప్రస్తుత నిజానికి వస్తే, 2025 దాటినా మాల్దీవులు మునిగిపోలేదు; పైగా పగడపు దిబ్బల సహజ ప్రక్రియ వల్ల గత 60 ఏళ్లలో కొన్ని దీవుల వైశాల్యం 8% పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం మాల్దీవులకు ముప్పు ఉందనేది నిజమే అయినప్పటికీ, అది ఈ శతాబ్దం చివరి నాటికి (సంవత్సరం 2100 నాటికి) జరిగే అవకాశం ఉంది కానీ 2020 నాటికే మునిగిపోతుందనే పాత ప్రచారాలు కేవలం తప్పుడు అంచనాలు మాత్రమే అని ఋజువైంది. మాల్దీవుల ప్రాంత దీవుల సగటు ఎత్తు సముద్ర మట్టానికి కేవలం 1 మీటర్ మాత్రమే ఉంటుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మాల్దీవుల ప్రభుత్వం నిర్మిస్తున్న కృత్రిమ దీవుల సాంకేతికత పుణ్యాన హుల్హుమాలే వంటి కృత్రిమ దీవులను ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సముద్ర మట్టానికి 2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించారు. మాల్దీవుల చుట్టుపక్కల ఉన్న సముద్రం నుండి సేకరించిన లక్షలాది టన్నుల ఇసుకను, పగడపు దిబ్బల చుట్టూ ఉన్న లోతు తక్కువ సముద్ర భాగాలలో నింపి సరికొత్త భూభాగాన్ని సృష్టించారు. దీనివల్ల భవిష్యత్తులో సముద్ర మట్టాలు పెరిగినా, సునామీలు వచ్చినా ఈ దీవులు మునిగిపోకుండా సురక్షితంగా ఉంటాయి.

ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఇలాంటి అతిశయోక్తి ప్రచారానికి ఒక ఉదాహరణగా నిలిచారు. 2018 జూన్ 21న ఆమె 'గ్రిట్ పోస్ట్' అనే వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక వ్యాసాన్ని షేర్ చేస్తూ, "రాబోయే ఐదేళ్లలో శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపకపోతే వాతావరణ మార్పు వల్ల మానవాళి పూర్తిగా అంతరించిపోతుందని ఒక అగ్రగామి వాతావరణ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు" అని ట్వీట్ చేశారు. ఈ వ్యాసం హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ ఆండర్సన్ ఇచ్చిన ఒక సెమినార్ ఆధారంగా రాయబడింది. అయితే, ఈ అంచనా నిజం కాలేదని తేలడంతో ఆ తర్వాత ఆమె ఈ ట్వీట్‌ను తొలగించారు. దీనిపై పలువురు సంప్రదాయవాద వ్యాఖ్యాతలు థన్‌బర్గ్‌ను దుమ్మెత్తిపోసారు. అయితే ఫ్యాక్ట్-చెకింగ్ సంస్థలు (ఆఫ్, స్నోప్స్, పాలిటిఫ్యాక్ట్ వంటివి) పరిశీలించగా, అసలు ఆ వ్యాసం, ట్వీట్ కూడా "2023 నాటికి మానవాళి అంతం అవుతుంది" అని నేరుగా చెప్పలేదని, కేవలం 2023 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే దశాబ్దాల తర్వాత తీవ్ర పరిణామాలు ఖాయమవుతాయని మాత్రమే సూచించిందని వెల్లడైంది. పైగా, ఆండర్సన్ స్వయంగా తన మాటలను వ్యాసం తప్పుగా ప్రచురించిందని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ అసలు సమస్య థన్‌బర్గ్‌ది కాదు, మూలవ్యాసంను మీడియా ఎంత అతిశయోక్తిగా, తప్పుగా ప్రచారం చేశాయన్నదే. ఈ ఉదంతం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది: ఒక్కోసారి శాస్త్రవేత్తల మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా, వాటిని మరింత నాటకీయంగా మలచి ప్రచారం చేయడం వల్ల, తర్వాత అది అతిశయోక్తిగా తేలినప్పుడు అసలు వాతావరణ శాస్త్రం పైనే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది.

భయపెడితే కొండ కూడా కదులుతుంది - అని అనుకొంటారేమో బహుశా పర్యావరణ భయాందోళనలను ఇబ్బడిముబ్బడిగా ప్రచారం చేసేవారు. కానీ వారు గుర్తించని విషయం ఏమిటంటే - భయప్రచారం ఎంత పెద్దదైనా, అది నిజాన్ని మార్చదు అని. అయితే “ముందుగా” భయం వ్యాపిస్తుంది, తరువాత “తాపీగా” నిజం బయటకు వస్తుంది. భిన్న సమయాలలో బయటకు వచ్చిన ఈ రెంటినీ బేరీజు వేసుకునే సమయం ఎవరికి ఉంటుంది?

నిజాలు: ప్రపంచం మారుతోంది, కానీ కుప్పకూలడం లేదు

కొన్ని పుకార్లు - అసలు నిజాలు తెలుసుకుందాం. ఉదాహరణకు మాయన్ క్యాలెండర్ ఆధారంగా 2012లో ప్రపంచం అంతమవుతుందని ప్రచారం జరిగింది. కానీ, అది కేవలం ఒక క్యాలెండర్ ముగింపు మాత్రమేనని, మరో కొత్త చక్రం మొదలవుతుందని శాస్త్రవేత్తలు, నాసా స్పష్టం చేశాయి. గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలోకి వస్తే భూమి నాశనమవుతుందనేది అపోహ మాత్రమే. వీటి వల్ల భూమిపై గురుత్వాకర్షణ ప్రభావం ఏమీ ఉండదు. నోస్ట్రాడమస్ జోస్యాల గురించి చెప్పుకుంటే, పాతకాలం నాటి కవితలను, భవిష్యవాణిని తప్పుగా అర్థం చేసుకుని, ప్రతి సంవత్సరం యుగాంతం అంటూ ఔత్సాహికులు కొందరు వదంతులు సృష్టిస్తుంటారు. భూమికి అంతం అనేది సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, అది మన జీవితకాలంలో గానీ, సమీప భవిష్యత్తులో గానీ జరిగే అవకాశం లేదు.

డాక్టర్ వేదవ్యాస్ (IAS) రాసిన '1999-కలియుగాంతం' పుస్తకంలో తన లెక్కలను శతాబ్దం ముగింపునకు ముడిపెట్టారు. 2000 సంవత్సరం నాటికి భారీ భౌగోళిక మార్పులు, ప్రపంచాన్ని ముంచెత్తే వరదలు వచ్చి, 'సత్యయుగం' ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ వాస్తవానికి 21వ శతాబ్దంలోకి మానవాళి ఎలాంటి ప్రపంచ వినాశనం లేకుండానే ప్రవేశించింది, ఈ భౌతిక యుగాంత ప్రచారం కూడా తప్పు అని నిరూపితమైంది. ఆయన రాసిన పుస్తకంలోని తేదీలు, భౌతిక వినాశనం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ జోస్యం పూర్తిగా అబద్ధమైంది. భూమి సురక్షితంగానే ఉంది. కానీ, ఆధునిక మానవ సమాజంలో వస్తున్న నైతిక పతనాన్ని ఒక ఆధ్యాత్మిక హెచ్చరికగా చూస్తే మాత్రం, ఆయన చెప్పిన సమాజ లక్షణాలు నేటికీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయి అని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. డాక్టర్ వేదవ్యాస్ తాను ముందే ఊహించినట్లుగా 2000 సంవత్సరంలో ప్రపంచం అంతం కాకపోవడంతో, తన సిద్ధాంతాన్ని మరియు పుస్తకాలలోని లెక్కలను సమర్థించుకుంటూ ఆధ్యాత్మిక మరియు కాలగణన వివరణలను మార్చారు. ఆ తర్వాత ఆయన భౌతిక యుగాంత ప్రచారాల జోలికి వెళ్లకుండా, తన "యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్" ద్వారా వేదాలలోని సైన్స్, ఖగోళ శాస్త్రం మరియు ప్రాచీన భారతీయ చరిత్రను నిరూపించే పరిశోధనాత్మక గ్రంథాలను రాయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు.

పర్యావరణ సమస్యలు నిజమైనవని శాస్త్రం నిరూపించినప్పటికీ, అవి నెమ్మదిగా జరిగే మార్పులు మాత్రమే కానీ ప్రపంచం అకస్మాత్తుగా అంతమైపోయే విపత్తులు కావు. నోబెల్ గ్రహీత విలియం నోర్డ్‌హౌస్ చెప్పినట్లు, వాతావరణ మార్పు అనేది ఒక దీర్ఘకాలిక సవాలు. దీనిని భయప్రచారంతో కాకుండా సమర్థవంతమైన విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు విప్లవాత్మక సాంకేతిక ఆవిష్కరణల ద్వారా మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కోగలం.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ప్రపంచంలోని అగ్రగామి వాతావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ మార్పులను తీవ్రంగా పరిశోధిస్తున్నారు - కానీ వారు అతిశయోక్తి అంచనాలను తిరస్కరిస్తున్నారు. ఉదాహరణకు ..

డాక్టర్ మైకేల్ మాన్ (పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ) "వాతావరణ మార్పులు తీవ్రమైనవే, కానీ కొందరు చూపిస్తున్నట్లుగా అకస్మాత్తుగా ప్రపంచం ముగిసిపోయే పరిస్థితి లేదు" అని చెప్పారు.

డాక్టర్ జూడిత్ కరీ (జార్జియా టెక్ యూనివర్సిటీ - మాజీ అధ్యక్షురాలు) ఈ అంచనాల్లో అనిశ్చితి చాలా ఎక్కువ, పైగా అతిశయోక్తి అంచనాలు శాస్త్రం కాదు అని చెప్పారు.

డాక్టర్ రిచర్డ్ లిండ్జెన్, ఎంఐటీలో పనిచేస్తున్న వాతావరణ భౌతికశాస్త్రవేత్త, "వాతావరణ నమూనాలు ప్రమాదాలను అతిశయోక్తిగా చూపుతాయి. కానీ వాస్తవం మరింత మితమైనది" అని అన్నారు.

డాక్టర్ బ్జోర్న్ లాంబోర్గ్, పర్యావరణ ఆర్థికవేత్త, "భయం హెడ్డింగ్స్‌ను అమ్ముతుంది, కానీ డేటా మాత్రం ప్రశాంతమైన ఆలోచనను కోరుతుంది" అని మనం ఏమి చేయాలో చెప్పకనే చెప్పారు.

డాక్టర్ విలియం నోర్డ్‌హౌస్, నోబెల్ బహుమతి గ్రహీత (వాతావరణ ఆర్థికశాస్త్రం), "వాతావరణ మార్పులు దీర్ఘకాలిక సవాలు - కానీ తక్షణ విపత్తు కాదు" అని అన్నారు.

ఎటు చూసినా ఈ వ్యాఖ్యలు సారాంశంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి: పర్యావరణ సమస్యలు నిజమే, కానీ భయప్రచారం శాస్త్రం కాదు. విన్నది వంద, చూసింది ఒక్కటి – మీడియా చెప్పే అతి హెచ్చరికలకన్నా శాస్త్రం చూపించే డేటా ముఖ్యం అని తెలుస్తోంది. ఊదితే ఉప్పెన, కూస్తే కుంభవృష్టి - చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించే అతిశయోక్తి ప్రచారానికి సరిపోయే సామెత ఇది. పర్యావరణవేత్తలు గోరంతలు కొండంతలు చేస్తున్నారా అని కొన్ని సందర్భాలలో అనిపించడం కద్దు.

పరిష్కారాలు: భయాన్ని కాదు, బాధ్యతను పెంచాలి

పర్యావరణ సమస్యలను నిజంగా పరిష్కరించాలంటే భయాందోళనలను వీడి, అందరం బాధ్యతతో వ్యవహరించడం ఎంతో అవసరం. దీనికోసం శాస్త్రీయ అంచనాలను ఖచ్చితమైన నిజాలుగా కాకుండా 'సమర్థవంతమైన సంభావ్యత'గా ప్రజలకు చెప్పడం శాస్త్రీయ నిజాయితీ అనిపించుకుంటుంది. సమాజంలో భయాన్ని కాకుండా, పౌరులు వ్యక్తిగతంగా చేయగలిగే పనులపై స్పష్టమైన సమాచారాన్ని ఇస్తూ అవగాహన పెంచాలి. అలాగే, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం మరియు పునర్వినియోగ శక్తి వంటి పరిష్కారాలను ఏదో విపత్తు ముంచుకొస్తోందని కాకుండా, ఒక 'తెలివైన జీవనశైలి' గా భావించి ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా ముందడుగు వేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా, మీడియా సంస్థలు టీఆర్‌పీ రేటింగ్స్ కోసం రెచ్చగొట్టే శీర్షికలతో సమాజాన్ని భయాందోళనల మధ్య నెట్టకుండా, వాస్తవాలు, డేటా మరియు పరిష్కారాలను బాధ్యతాయుతమైన వార్తలుగా అందించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.

భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మొత్తం భారీ జలవిద్యుత్ సామర్థ్యంలో దాదాపు 45% నుండి 50% వరకు విద్యుత్ హిమాలయ నదులు లేదా వాటిపై నిర్మించిన డ్యామ్‌ల ద్వారానే లభిస్తోంది. మరి హిమాలయాలు పూర్తిగా కరిగిపోతే ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిలో కోత పడినట్లే కదా! అలాగే పరిమితంగా ఉన్న బొగ్గు నిల్వలు తరిగిపోయి థర్మల్ విద్యుత్ కేంద్రాలు పడకేస్తే ఆ మేరకు కూడా విద్యుత్ ఉత్పత్తిలో కోత పడినట్లే కదా! తాజాగా భారత సంస్థ INCOIS అంచనాల ప్రకారం, భారతదేశ సముద్ర జలాల నుండి ఏటా 9.2 లక్షల టెరావాట్ల "బ్లూ ఎనర్జీ" (సముద్ర విద్యుత్) ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, ఇది దేశానికి దాదాపు 575 సంవత్సరాల కరెంటు అవసరాలను తీర్చగలదు. సముద్ర అలలు, ఆటుపోట్లు మరియు నదులు-సముద్రాల సంగమం ప్రాంతంలో సహజంగా ఉండే లవణీయత తేడాల ఆధారంగా ఈ విద్యుత్‌ను వెలికితీసేందుకు భారత్ కసరత్తు చేస్తోందని, అండమాన్‌లో రాబోయే 2-3 ఏళ్లలో ఒక పైలట్ ప్రాజెక్టు సిద్ధమవుతుందని సంస్థ డైరెక్టర్ డా. బాలకృష్ణన్ నాయర్ తెలిపారు. అయితే, సౌర విద్యుత్ ఏర్పాటుకు మెగావాట్‌కు రూ. 3-4 కోట్లు ఖర్చవుతుంటే, టైడల్ విద్యుత్‌కు గరిష్ఠంగా రూ. 60 కోట్ల భారీ పెట్టుబడి అవసరమవ్వడం ప్రస్తుతానికి పెద్ద అడ్డంకిగా మారింది. అయినప్పటికీ, భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఈ వ్యయాన్ని సమర్థవంతంగా అధిగమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ముగింపు: భయంతో కాదు - నిజాలతో ముందుకు

పర్యావరణ సమస్యలు నిజమే. వాటిని పట్టించుకోకపోవడం అజ్ఞానంగా భావించవచ్చు. కానీ అవసరానికి మించిన భయం, అతిశయోక్తి అంచనాలు, తప్పు ప్రచారం - ఇవి సమాజానికి హాని చేస్తాయి. శాస్త్రం చెప్పేది స్పష్టంగా ఉంది, పర్యావరణ మార్పులు జరుగుతున్నాయి, కానీ అవి నెమ్మదిగా జరుగుతున్నాయి, మనం వాటిని కొంతవరకు నియంత్రించగలం. దానికి కావాల్సినది భయం కాదు - జ్ఞానం, బాధ్యత, మరియు సమిష్టి కృషి. పర్యావరణం మన భవిష్యత్తు. దాన్ని రక్షించడానికి అతిశయోక్తి ప్రచారం కాదు, శాస్త్రాన్ని ఉపయోగించాలి. వదంతులను కాదు, నిజాలను నిర్భయంగా మాట్లాడాలి. పర్యావరణ సమస్యలపై శాస్త్రీయ నిజాలకు, మాధ్యమాల అతిశయోక్తి ప్రచారానికి మధ్య చాలా తేడా ఉంది. శాస్త్రం ఎల్లప్పుడూ ఖచ్చితమైన డేటా, సంభావ్యత మరియు దశలవారీ మార్పుల ఆధారంగా పరిష్కారాలను సూచిస్తే; మీడియా మాత్రం టీఆర్‌పీ రేటింగ్స్ మరియు సోషల్ మీడియా వైరల్ మెసేజీల కోసం 'ఇంకా పదేళ్లలో ప్రపంచం అంతమైపోతుంది' అనే తరహా భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ విధమైన ఆకర్షణ కోసం రాసే శీర్షికలు మరియు తక్షణ విపత్తు హెచ్చరికల వల్ల ప్రజల్లో నిజమైన శాస్త్రంపై నమ్మకం పోవడమే కాకుండా, అనవసరమైన భయాందోళనలు పెరిగి, చివరికి ప్రభుత్వాల పాలసీలు - పెట్టుబడులు కూడా తప్పు మార్గంలో రూపొందే ప్రమాదం ఉంది. అందుకే సమాజం ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించినప్పుడే, అనవసర భయాలను వీడి నిజమైన పర్యావరణ సమస్యల పరిష్కారంపై సరైన దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది.

వెనకటి ఎవడో అన్నాడంట - నేను కానీ చెయ్యి వేస్తే గోదారి పొంగుతుంది అని. వాస్తవానికి సదరు వ్యక్తి చెయ్యి వేస్తే మహా అయితే నిండుకున్న గ్లాసో లేదా కుండలో ఉన్న నీళ్ళు పొంగుతాయేమో కానీ గోదారి పొంగదు కదా! ఏతా వాతా పర్యావరణ ఆందోళనాకారులు వారు ఊహించిన స్థితి నిజానికి అంత భయంకరం కాదు అని తెలుస్తోంది. కాబట్టి మిత్రులారా, ఈ నెల చర్చను ఇంతటితో కంచికి చేర్చి మనం రచ్చబండ దిగి ఇంటికి చేరదాం. చివరగా, ‘సిరిమల్లె’ పదకొండవ వార్షిక సంచిక సందర్భంగా పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల రచ్చబండ అంశంపై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వచ్చే నెల మరో ఆసక్తికరమైన చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!

నమస్కారములతో, మీ వెంకట్ నాగం.

Posted in August 2026, వ్యాసాలు

1 Comment

  1. Sarma Danturthi

    Many years ago I was at Bhopal railway Station waiting for a train. I was chatting with another guy who was from that state (MP). I did not like the area (it was hot, humid or pretty cold) and told him that “you are all digging the state for minerals and such and finally only huge holes will remain and there is no agriculture or anything here.” His reply stunned me, “When we reach that stage we will have new technology and will adapt to that.” That is positive thinking. Even to this day, researchers say “these are our results, and they confirm one thing – This is what we know NOW and this is not everything but this is what helps and can change as we progress, or move forward.” And as Malcom character in the Jurrasic Park movie says, “Life will find a way!” Indeed it will. We can only contribute – yes either in a positive way or in a negative way. Choice is ours.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *