Menu Close
ఆర్. శర్మ దంతుర్తి
తెలుగు పద్య రత్నాలు 62
ఆర్. శర్మ దంతుర్తి

విజయనగరం దగ్గర అరసవిల్లి అనగానే మనకి వెంఠనే గుర్తు వచ్చేది సూర్యనారాయణ స్వామి గుడి. ఒరిస్సాలో ఉన్న కోణార్క్ మందిరంలాగానే ఈ గుడికి కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. అక్కడ నివసించిన మరద వెంకయ్య (క్రీ.శ. 1550 – 1650) అనే పదహారో శతాబ్ధానికి చెందిన ఆయన సూర్య భగవానుని భక్తుడు. ఈయనే భాస్కర శతకం అనేది రాసారు. భాస్కర శతకం తెలుగులో బాగా ప్రాశస్త్యం పొందిన నీతి శతకాలలో ఒకటి. ఈ పద్యాలకు మకుటం, “భాస్కరా” అనే పదం. భాస్కర శతకంలో చాలా చోట్ల నైతిక విలువల గురించి, మనిషి ప్రవర్తన, ఆలోచన, త్యాగం అనే విషయాలు ప్రస్తావిస్తూ రాసారు, భర్తృహరి నీతి శతకంలో రాసినట్టే. ఈ నెల పద్యం భాస్కర శతకంలోనిది.

చం. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
.......చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
.......బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
.......పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

ఎంత చదువుకున్నా రసజ్ఞత కొంచెం (ఇంచుక) ఉండాలి. లేకపోతే జ్ఞానులనేవారెవరూ (గుణ సంయుతులెవ్వరు ) మెచ్చుకోలేరు. అటువంటి రసజ్ఞత లేని చదువు ఎలాంటిదంటే నలపాకంతో చేసిన కూర అయినా ఉప్పులేకపోతే రుచి రాదు కదా (నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు).

ఈ పద్యంలో ఉండే గూడార్ధం మనకి రోజువారీ జీవితాల్లో స్పష్టంగా కనిపించడం చూడవచ్చు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా నోరు విప్పేసరికి సంస్కారం లేని మాటలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అనేక మంది దేశాధ్యక్షులతో పాటు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా నోరు విప్పితే ‘అయ్యో ఇంత చదువు చదివి ఈయన ఇలా మాట్లాడుతున్నాడే?’ అనే శంక మనకి ప్రతీరోజు కలగడం లేదా? విశ్వవిద్యాలయాల్లో, పెద్ద పెద్ద పారిశ్రామిక వాడల్లో, ఆఖరికి కంపెనీ బోర్డ్ మీటింగ్ లలో ఈ నీతి పాటించకపోవడం మనం మరింతగా చూడవచ్చు. మీరేదో పనిచేసారు. ఎంతో కష్టపడ్డారు. చేసినది అతి ముఖ్యమైనది కానీ కొన్ని తప్పులు దొర్లాయి. దాన్ని ఏదో పత్రంగా రాసి ఒకచోటకి పంపారు ప్రచురణకి. ఆ పత్రిక వారు వంద తప్పులు చూపించారు. అవి మీకు ఇంతకు ముందు కనిపించనివి. వారు చూపించినవి చూసి మీకు బుర్ర పాడైంది. తిట్లు కురిపించారు. అయితే మీరు చేసిన పని తప్పు కాదు కానీ అందులో మీకు కనిపించని తప్పులు వాళ్ళు చూపించారు. వాటివల్ల మీకు మరింత నేర్చుకునే అవకాశం వచ్చింది. అది మర్చిపోయి తిట్లు కురిపిస్తే రసజ్ఞత లోపించినది మీకా సంపాదకులకా? మన కళ్ళకి కనబడని తప్పులు ఎత్తి చూపించినవారికి మనం కృతజ్ఞత చూపించాలి. అదీ లేకపోతే రసజ్ఞత లేనట్టే, మనకి చదువు వచ్చినా సంస్కారం రానట్టే. సహృదయతలో స్వీకరించే మనఃస్తత్వం ఉండి తీరాలి పైకి ఎదగాలంటే.

ఇదే మనం రాజకీయ నాయకుల్లో, దేశాధ్యక్షులలో, రోజువారీ వారు మాట్లాడే భాషలో చూడవచ్చు. వీరు మాట్లాడే భాషనే మిగతా వారు అనుకరిస్తున్నారు అనేది వీళ్ళకి పట్టదు. నోటికొచ్చినట్టు వాగడమే. చలన చిత్రాల్లో రాసే పాటలూ, పత్రికలలో వాడే మాటలూ కూడా ఇదే విధంగా ఉంటున్నాయి ఈ మధ్య. అయితే ఈ చిత్రాలని ముందు చూసి ఫలానా మాట బాగోలేదు తీసేయాలి అనే సంఘం ఒకటి ఉంది కానీ అందులో పనిచేసేది మన స్వంత రాజకీయనాయకుల కాళ్ళు నాకే జనమే కాబట్టి అందులో కూడా ‘కానీయ్ పోనీయ్’ అంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.

మహాభారతంలో దీనికో ఉదాహరణ చూపించవచ్చు. కర్ణుడు అంటాడు కృష్ణుడితో – “నేను పుట్టగానే మా అమ్మ నన్ను వదిలేసింది. నేనెవరో తెలిసీ తెలియగానే గురువు నన్ను శపించాడు. ప్రపంచం అంతా నన్ను వెలివేసినప్పుడు ఈ రారాజు దుర్యోధనుడు మాత్రమే నన్ను ఆదుకున్నాడు కనక అతని వెంటే ఉంటాను ఆయన చేసేది అధర్మం అయినా.” అప్పుడు కృష్ణుడు చెప్తాడు. “పుట్టగానే నన్ను కూడా మా అమ్మ రాత్రికి రాత్రి వదిలిపెట్టేసింది యాదవకులంలో. మొత్తం ప్రపంచంలో రాజులందరికీ నేను ప్రధమ శత్రువుని మొత్తం జీవితంలో. జరాసంధుడు నామీద దాదాపు పద్ధెనిమిది సార్లు దండెత్తుకు వస్తే నేను పారిపోయి సముద్రంలో నగరాన్ని నిర్మించుకోవలసి వచ్చింది. అయినా సరే నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదు.” ఎందుకంటే చదువు, సంధ్యా రాగానే మన ఇష్టం వచ్చినట్టూ చేయకూడదు. మనం ఇలా చేస్తున్నాము అని తెలియగానే మిగతా వారు కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాదాపుగా ఇదే విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే (భగవద్గీత 3.13)

మిగతావారితో పోలిస్తే కృష్ణుడు ఏమి చదువుకున్నాడు? ఒకే ఒక నెలలో లేదా అంతకంటే తక్కువ లో శ్రీకృష్ణ బలరాములు సాందీపనీ ఆశ్రమంలో చదువుకోసం గడిపినట్టు తెలుస్తుంది అంతే. అయితే మొత్తం మహాభారతంలో ఎక్కడా కృష్ణుడు ఒక్కసారి తప్పుగా మాట్లాడటం కనిపించదు. ఇదే రసజ్ఞత అంటే.

గమనించారా? తెలుగులో మనం ‘చదువు వేరు సంస్కారం వేరు’ అనడం చూస్తూ ఉంటాం? అదే ఈ భాస్కర శతక పద్యంలో చెప్తున్నారు వెంకయ్య కవి.

********

Posted in August 2026, సాహిత్యం

3 Comments

  1. తాడిగడప శ్యామలరావు

    ఆధునికవికృతభావజాలపు కళ్ళద్దాల నుండి చూస్తే సత్యాసత్యాలను సరిగా గ్రహించలేరు సరికదా తమదృక్కోణమే శ్రేష్ఠమైనదన్న భ్రమకూడా అమితంగా ఉంటుంది. ఇది మేధావులను ఉద్దేశించి మనం చెప్పుకోవలసిన మాట. వారికి కావలసినది సనాతనధర్మంపై ఆధారపడిన వ్యవస్థను విచ్చిన్నం కావటమే. వారి ప్రభావం ఎంత తీవ్రంగా సమాజంలో వ్యాపించిపోయిందంటే మనలో హెచ్చుమందిమి దానిప్రభావంతో తెలియకుండానే వారిధోరణిని అప్పుడప్పుడూ అనుకరించేస్తూ ఉంటాము. ఒకోసారి అటువంటి అనుకరణ పరిథులు దాటక సమంజసంగానూ ఉంటుంది. ఈకథనంలో అలాగే ఉందని చెప్పాలి.

    కర్ణుడి మాట భారతంలో “ఆదిత్వవచనాశ్చైవ జాతం మాం సా వ్యసర్జయేత్” అని. అంటే, తల్లి తనను సూర్యభగవానుని ఆదేశానుసారం పుట్టగానే విడచిపెట్టేసింది అన్నాడు. తన తల్లి తప్పు చేసిందన్న భావనతో అతడు లేడని స్పష్టంగా తెలుస్తోంది.

    ఇకపోతే, కర్ణుడి సుదీర్ఘమైన ప్రసంగం తరువాత చిరునవ్వుతో శ్రీకృష్ణభగవానుడు చెప్పిన మాటల్లో ఈకథనంలో ఉటంకించినట్లుగా పుట్టగానే నన్ను కూడా మా అమ్మ రాత్రికి రాత్రి వదిలిపెట్టేసింది వంటి మాటలు అస్సలు లేనేలేవు.

    కథకులు ఇది మహాభారతంలోని ఉదాహరణ అంటూ చెప్పారు కాబట్టి ఈమాటలు వ్రాయవలసి వచ్చింది. ఇది మహాభారతంలో లేని ఉదాహరణ. ఈవాక్యం ఉపసంహరణార్హం. కల్పనను కల్పనగానే ఉండనీయండి. భారతంలో ఉందని అపోహను సృజించవద్దు.

    మూలాన్ని దాటి కల్పనలు చేయటంలో కవికి స్వాతంత్యం తప్పకుండా ఉంది – మూలఛ్చేది కానంతవరకూ, పాత్రలనో కథనో వక్రీకరించనంత వరకూ. ఆ దృష్టితో చూస్తే ఇక్కడ కృష్ణవచనంగా చెప్పించిన మాటలు మనోహరంగా ఉన్నాయని చెప్పకతప్పదు.

  2. vasudeva yerikalapudy

    . “పుట్టగానే నన్ను కూడా మా అమ్మ రాత్రికి రాత్రి వదిలిపెట్టేసింది యాదవకులంలో. మొత్తం ప్రపంచంలో రాజులందరికీ నేను ప్రధమ శత్రువుని మొత్తం జీవితంలో. జరాసంధుడు నామీద దాదాపు పద్ధెనిమిది సార్లు దండెత్తుకు వస్తే నేను పారిపోయి సముద్రంలో నగరాన్ని నిర్మించుకోవలసి వచ్చింది. అయినా సరే నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదు.” this is a real message

  3. Gopal Nemana

    అర్సవల్లి గుడికి రాయి విసురు దూరంలో 3×6 అడుగుల గదిలో పుట్టి అమెరికాలో స్ధిరపడ్ద ఒక వయోవృఉద్ధుడి శుభాశీస్సులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *