నిస్స్వార్ధ కృషితో, ఇతరుల జీవితాలలో శాంతి సంతోషాల వెలుగులు నింపిన ఓ త్యాగమయి గాధ....
“కాఫీ టిఫిన్ తయ్యార్!” అంటూ పొద్దున్నే ఎలుగెత్తి పిలవడం సరదాగా ఉండేది, ఎనిమిదేళ్ళప్పుడు నాకు. పొద్దున్నే నాన్నకి, నలుగురన్నలకి, అవ్వకి.. సత్తు గ్లాసుల్లో కాఫీతో పాటు అందరికీ ఇత్తడి మూతల్లో జొన్న రొట్టెతో ఉల్లికారం పెట్టేదాన్ని.
మరోసారి గట్టిగా, "అన్నయ్యా, అవ్వా అందరూ త్వరగా రండి ‘కాఫీ టిఫిన్ తయ్యార్!," అంటూ పిలిచేదాన్ని. గబగబా నేనూ తినేసి, అంతే వేగంగా అంట్లన్నీ కడిగేసేసి, పొట్లం కట్టిన సగం రొట్టెని పుస్తకాల సంచిలో పెట్టుకొని, అన్నయ్యల వెంటే బడికి పరుగు పెట్టేదాన్ని.
దారిలో, చూపులేని రామయ్య తాత చేతిలో రొట్టె పెట్టగానే, బోసినోటితో సంతోషంగా నవ్వేవాడు.
నాకు బాగా గుర్తు. నేను బడికి వెళ్ళడం మొదలు పెట్టినప్పుడే, మెయిన్ రోడ్డు మీద బస్ స్టాండ్ పక్కన 'టిఫిన్ సెంటర్' తెరిచారు. అక్షరాలు చదవడం మొదలెట్టాక, ముందుగా నేను చదివింది, 'టిఫిన్ సెంటర్' బోర్డుల మీద అక్షరాలే. అన్నిటికన్నా, కిటికీలోని బోర్డుపై ఎర్రని తళుకులద్దిన 'కాఫీ టిఫిన్ తయ్యార్!’ అన్న అక్షరాలు నా కళ్ళల్లో మెరుపులు చిందించేవి. అమ్మకి వంట పనిలో సాయం చేయడం మొదలు పెట్టాక, వంటకం ఏదైనా సరే నేను మాత్రం 'టిఫిన్ సెంటర్' లో లాగా ఎలుగెత్తి అందరినీ తినమని పిలిచేదాన్ని.
అవతలి వీధి మొదట్లో ఉన్న ఫ్యాక్టరీలో నాన్న వాచ్ మాన్ ఉద్యోగం చేసేవాడు, ఫ్యాక్టరీ పక్కనే ఉన్న యజమాని గారింట్లో, అమ్మ వంట చేసి వచ్చేది. కుటుంబానికి పెద్ద దిక్కు మా అవ్వ. ఇంటి అరుగుల మీద కూర్చుని, అందరికి చేతనయిన మాట సాయం చేస్తూ, చుట్టూ ఉన్న అమ్మలక్కలతో కాలక్షేపం చేసేది. ఎదురింటి పూజారిగారి తల్లి మా అవ్వకి, రోజూ నాలుగు కొబ్బరి చిప్పలు ఇచ్చేది.
భోజనానికి తరచుగా పప్పుచారు, కొబ్బరి సెనగపప్పు కూర, కొబ్బరిపచ్చడి చేసేవాళ్ళం. వంటింట్లో పనయ్యాక, “భోజనం తయ్యార్! అంతా రండి” అంటూ పిలవగానే వచ్చి, వంటకాలు చూసి,
"దీనికే పెద్ద భోజనమో అని కేకెట్టాలా?" అని నెత్తిన మొట్టేవాడు పెద్దన్నయ్య.
"చాల్లే ఊరుకో బడుద్దాయ్, కాశీ అన్నపూర్ణమ్మ దయతో మన ఇంట వెలసిన ఆడపిల్ల కాబట్టే, ప్రతి పూట అన్నం వడ్డించి అందరినీ పిలుస్తదిరా," అని వాడిని గదమాయించేది అవ్వ.
"పేరుకు తగ్గట్టు నలుగురికి అన్నం పెట్టేదానివే అవ్వాలి నువ్వు కాశీ," అంటూ ప్రేమగా నా తల నిమిరేది. అవ్వకి నేనంటే ప్రాణం.
పక్కింటి వంటల వాసక్కతో పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్లి, స్వీట్స్, కారాలు, వంటకాలు చేయడానికి సాయపడడం నాకు సరదాగా ఉండేది. నన్ను మెచ్చుకోనేది వాసక్క. "అమ్మో, అమ్మో, కాశీ అన్నపూర్ణమ్మా! త్వరలో నన్ను మించి పోయి, నా ఖాతాలన్నీ లాగేస్తావేమోనే," అనేది ఆమె నాతో.
వెళ్ళి వంటలు చేసిన వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళు కానుకగా ఇచ్చిన కొద్ది తినుబండారాలు తెచ్చి గొప్పగా ఇంట్లో అందరికీ రుచి చూపించేదాన్ని.
***
పదో తరగతి వేసవి సెలవల్లో, నేనున్నానని నమ్మకంతో, వాసక్క ఎన్నో వంటపనులు ఒప్పుకొంది. బయట ఊళ్ళకి మాత్రం రానని చెప్పాను. అమ్మకి ఓపిక లేదు, పైగా అన్నయ్యలు ఇంట్లో ఉంటారు. ఇంట్లో అవసరం ఉంటది.” అన్నాను వాసక్కతో. ఆమెకి ఎన్నడూ లేనిది చాల కోపం వచ్చింది.
"పొగరెక్కి పోయిందే నీకు, నా వల్ల అన్నీ నేర్చావు, జైలుజుబ్బాల్లాంటి బట్టల నుండి జలతారు వోణీలు వేస్తున్నావు, యువరాణి ననుకోకు. నాకూడా వస్తావు కదాని పనులు ఒప్పుకున్నాను, డబ్బు కూడా పుచ్చుకున్నాను, ఇలా నట్టేట ముంచేదానవని తెలీలేదు," అంటూ కేకలేసింది. “అసలైనా ఇకనుండి నీతో నాకు అవసరం లేదు పోవే," అని తిడుతూ వెళ్ళిపోయింది ఆమె.
నేను అవాక్కయ్యాను. కళ్ళవెంట నీళ్ళతో చేతలుడిగి నిలబడి పోయాను. నేనేమి తప్పు చేసానో తెలియక ఎంతో కష్టమనిపించింది.
***
వాసక్కతో గొడవతో నా సంపాదన లేక ఇంట్లో కటకట లాడుతుంది. ఫ్యాక్టరీ యజమాని గారి ఇంట్లో నన్ను, చిన్నన్నయ్యని కొద్ది రోజులు పనిలోకి రానిచ్చారు. అక్కడ తోటపని, బయటపని, పిల్లల్ని ఆడించడము చేసాము.
అలా నెల రోజులు కొలువు చేసాక, జీతం తీసుకొని నేనూ, అన్నయ్యా ఇంటి దారి పట్టాము. దారిలో అన్నయ్య టీ బడ్డీ దగ్గర ఆగి పకోడీ కొని పొట్లం కట్టించాడు.
"అక్కడ కూర్చుని తినడానికి స్థలం లేదుగా, అందుకే ఈ పాకెట్ కట్టించాను," అన్నాడు దారిలో.
వాడన్న ఆ మాటతో, ఒక్క క్షణం నా గుండె బయటకి ఎగిరి గంతేసింది. అవే పకోడీలు నేనూ చేసి బయట అరుగు మీద పెట్టి అమ్మవచ్చు కదా! అని అనిపించిన ఆలోచనకి నేను ఉక్కిరి బిక్కిరయ్యాను.
అన్నయ్యతో ఆ మాటే అన్నాను. నా తలంపుకి మెచ్చుకున్నాడు. ఆఘమేఘాల మీద ఇంటికి వచ్చి, నా ఆలోచన ముందుగా అవ్వ, అమ్మలతో చెప్పాను. నాన్నని, అన్నయ్యలని కూడా ఒప్పించాను. "సరేలే సెలవలేగా, ఇంకా రెండు నెలల వరకు పర్వాలేదు."
"ఇదిగో, మరి ఈ డబ్బు పెట్టి సరుకులు తెచ్చుకో" అంటూ ఓ వెయ్యి రూపాయలు ఇచ్చారు నాన్న.
శనగపప్పు వడలు, ఉప్మా, పకోడీలు, రవ్వకేసరి, చాయ్ తో మొదలు పెట్టి, ముందు రెండు వారాల వరకు మధ్యాహ్నం నాలుగ్గంటలకి.. చుట్టూ ఉన్న పై తరగతి కుటుంబాలకి, చదువుకునే కుర్రవాళ్లకి, టైప్ ఇన్స్టిట్యూట్ లకి, చిన్నన్నయ్య సైకిల్ మీద వెళ్లి అందించేలా ఏర్పాటు చేసాము.
***
ఒక నెలయ్యేప్పటికి చుట్టు పక్కలనున్న చిన్న వ్యాపారాల వాళ్ళు, ఇతర కుటుంబీకులు.. మా అరుగుల ముందు బారులు తీరసాగారు. ఎక్కడినుండో పది పాత బెంచీలు తెచ్చి వీధి వాకిలి వరకు, వేయించాడు అన్నయ్య. అవ్వ, అమ్మ మాకు కూడా సాయం చేయవలసి వచ్చింది. చెట్టుక్రింది రామయ్య తాతకి, తప్పనిసరిగా కాస్త ఉప్మానో, కేసరో అందించేవారము. దిక్కులేని తాతకి చూపు కూడా లేదని బాధనిపించేది.
రెండు నెలలు ముగిసాక, లెక్కకడితే, వెయ్యికి ఐదువేలు వచ్చింది. అంటే చేసిన పనికి నాలుగు వేలు ఆదాయమన్న మాట. డబ్బు సహాయ పడింది. నాకు సంతోషం మిగిలింది.
***
మొదలవ్వబోతున్న అన్నల డిగ్రీ చదువులు, పెరుగుతున్న ఖర్చులు తట్టుకోవాలంటే, నా అత్తెసర మార్కుల చదువులు మానేసి, కాలేజీ క్యాంటీన్ లాంటి వ్యాపారం చేయడమే సరైనదనే ఆలోచన వచ్చింది. ఇంటి వద్ద అమ్మ, అవ్వ 'టీ స్టాల్' చూసుకునేలా ఒప్పించడం కష్టమేమీ కాదు అనిపించింది.
నాన్న పని చేసే ఫ్యాక్టరీ యజమాని గారు, కాలేజి స్థాపించిన పెద్ద. ఆయన్ని సాయం అడిగితే నాక్కావలసిన కాంటీన్ వసతి తప్పక దొరుకుతుందని ఆలోచిస్తూ, ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను.
***
తెల్లావారుతూనే, నాన్నకి ముందు నా ఆలోచన గురించి చెప్పి, అలా జరిగితే, ఆయనక్కూడా ఆర్ధికంగా పరిస్థితి మెరుగవుతుందని వివరించాను. మిగతా వాళ్ళని ఒప్పించడం అంత కష్టమవ్వలేదు. దేవుడుకి దణ్ణం పెట్టుకొని నాన్నతో పాటు అయ్యగారిని కలిసాను.
దేవుడి దయ వల్ల సులభంగా ఆ పని కూడా అయింది. అంతే, ఇక వారం రోజుల పాటు కాలేజిలో మా కొత్త క్యాంటీన్ మొదలెట్టే పనుల్లో పడ్డాను.
"ఎంతో కష్ట పడుతున్నావే తల్లీ, నీ ఆలోచన, చేయూత వల్లే ఈ కుటుంబం ఇలాగైనా సాగుతుంది," అంటూ నా దగ్గర కూర్చుని, నా కాళ్ళు పట్టేది, అవ్వ.
"ఉన్నారు నలుగురు బడుద్దాయిలు. ఇంటినిండా, దేనికీ పనికి రాని వెధవలు. నీతో చాకిరీ చేయించుకొని, నీ సంపాదన ఖర్చు చేస్తారు కాని, ఆడపిల్లవని కొంచెమైనా నీ మీద అపేక్ష ఉందా వాళ్లకి?" అంటూ వాపోయింది అవ్వ.
అప్పటి వరకు అలా నేను ఏనాడు ఆలోచించలేదు. "అందరి మీద నాకు ప్రేమే, పోనిలే అవ్వ, అంతా నా వాళ్ళేగా," అని ఆమెని బుజ్జగించి అవ్వ దగ్గరే పడుకున్నాను. మరునాడే క్యాంటీన్ మొదలుపెట్టే రోజు.
***
చాల సంతోషంగా చిన్నన్నయ్య, నేను కలిసి పొద్దున్నే కాంటీన్ అంతా సర్దేసాము. సరిగ్గా ఎనిమిది కల్లా ‘కాఫీ టిఫిన్ తయ్యార్’! అన్న బోర్డు క్యాంటీన్ కిటికీలో సర్దగానే బిలబిలమంటూ వచ్చేసారు కాలేజి చదువుల కుర్రకారు, నా వయసు ఆడపిల్లలు.
లొట్టలేస్తూ, అడిగి అడిగి టిఫిన్లు, కాఫీ టీలు ఆరగించారు. అలా ప్రతి పూట అనుకొన్న దానికంటే, ఇష్టమయి తినే కస్టమర్స్ తో పాటు రాబడి కూడా హెచ్చుగానే ఉంది. పొద్దున ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు కాలేజి క్యాంటీన్ పని, తరువాత ఇల్లు, లెక్కలు, మరుసటి రోజుకి తయారవడం.
క్యాంటీన్ ఓ ప్రక్కగా గేటు లోపలకి ఉండడంతో, రామయ్య తాతని, పెంపుడు కుక్క జాని తో పాటు చెట్టు క్రింద నుంచి క్యాంటీన్ చూర క్రిందకి మకాం మార్పించి, అప్పుడప్పుడు అవసరమైన వైద్యం చేయించే దాన్ని. అందరితో మాట్లాడుతూ తాత ఆనందంగా ఉండేవాడు. కాలేజి వాచ్ మాన్ సాయంతో తాతకి వసతి బాగానే అమర్చ గలిగినందుకు తృప్తిగా ఉండేది.
***
ఓ రోజు కాలేజీకి గబగబా నడుస్తున్నాను. అప్పట్లో, అకారణంగా పోట్లాడిన పక్కింటి వంటల వాసక్క నాతో నడవడం మొదలెట్టింది. తనే ముందుగా, "ఏమే కాశీ, బాగా వృద్ధిలోకొచ్చావు. కుటుంబం కోసం పాటు పడుతున్నావు. మీ ఇంట్లో నీ గురించి ఆలోచించరు. నువ్వే మంచివాడిని చూసుకొని పెళ్లి చేసుకోవే. మా బాబాయి కొడుకు, వాసు, అకౌంటెంట్. అందంగా పొడుగ్గా ఉంటాడు. నువ్వు ఊ అంటే అయిపోతదే నీ పెళ్లి," అంది. మారు మాట లేకుండా నడుస్తున్నాను. కాలేజి వచ్చేసింది. వాసక్క వంక చూసి నవ్వేసి ఊరుకున్నాను.
"ఆలోచించి చెప్పు,” అంటూ వాసక్క వెళ్ళిపోయింది.
***
క్యాంటీన్ రాబడి చలవతో అన్నయ్యలిద్దరు టీచర్లు అయ్యారు. ఇంట పండుగలు, సందడులు వరసగా జరిగేవి. కొన్నాళ్ళకి బేషుగ్గా అన్న పెళ్ళి కూడా జరిగింది. అవ్వ పట్టుబట్టి ఆ యేడు 'శ్రీ కాశీ అన్నపూర్ణ కాఫీ విలాస్' అని క్యాంటీన్ కి నా పేరు పెట్టించింది. నాకు ఎంతో గర్వంగా సంతోషంగా అనిపించింది. నామీద ఎంతో అపేక్ష అవ్వకి. వయస్సు పైబడినా, ఆమె ఆరోగ్యం షుమారుగా ఉండేది. చుట్టుపక్కల ఆడవాళ్ళ తో స్నేహాలు కబుర్లు ఎప్పటిలా సాగిస్తూ కాలం గడిపేది.
***
ఆ రోజు, తెల్లారితే ఆదివారం అనగా, అర్దరాత్రి అవ్వ నన్ను నిద్ర లేపి, "నీ చేత్తో కాసిని టీ నీళ్ళు ఇవ్వమ్మా, ఛాతిలో మంటగా ఉంది," అంది. టీ తాగేసి, కబుర్లు చెబుతూ నా పక్కనే పడుకొని నిద్ర పోయింది.
***
తెల్లవారుతూనే "అవ్వా," అని చెయ్యేస్తే చల్లగా ఉన్న శరీరం తగిలింది. పరిస్థితి అర్ధమయ్యి అవ్వ మీద వాలి, భోరుమని ఏడ్చాను. నేనంటే ప్రాణంగా ఉండే అవ్వ నన్నొదిలి పోయిందన్న బాధ, నన్ను బాగా కృంగదీసింది. చిన్నకాశీ పట్టణం నుండి ఇరవైయేళ్ళ తరువాత, అవ్వ చెల్లెలు శివమ్మ, తమ్ముడు సాంబయ్య మూడో రోజుకి వచ్చారు.
అవ్వ పెద్దదినం చేసాము. శివమ్మ, సాంబయ్య వెళ్ళిపోయే ముందు రోజు నా గదిలోకి వచ్చారు. తల నిమిరి ఆప్యాయంగా మాట్లాడారు. "వెళ్లి పోతుండాము కాశీ, ఎప్పుడన్నా మమ్మల్ని తలుచుకోవాలి నువ్వు," అంటూ..
“నీ సొంతవారు కాకున్నా, అమ్మా నాన్నా అన్నయలు అంటూ ఎంత ప్రేమగా ఉన్నావో, అనాధవైనా తనకి దొరికిన పెన్నిదిలా భావించేది మీ అవ్వ నిన్ను. ఎంతైనా, గొప్ప పుణ్యాత్మురాలివే కాశీతల్లీ! నువ్వు" అన్నశివమ్మ మాటలు విని నేను స్తంభించి పోయాను. వాళ్లు గది నుండి వెళ్లిపోయింది కూడా గమనించలేదు. నా కాళ్ళ క్రింద నేల జారినట్టు మంచం మీద ఒరిగిపోయాను.
***
మనస్సు మొద్దుబారి పోయింది. ఎలాగోలా ఓ రెండు రోజులు గడిచాయి. అసలు నేనెవర్ని? నా ఉనికికి అర్ధం ఏమిటి? నేను అనాధనా? మరి ఈ కుటుంబం, తల్లీ తండ్రి అంతా ఎవరు? నా ప్రశ్నలకు జవాబులు ఎవరు చెబుతారు? అసలేమిటిదంతా?
ఓ రోజు పొద్దుటే .. నాన్న గదిలోకి వెళ్ళాను. నాన్నని నా ప్రశ్నలతో నిలదీసాను. ఆయన ముందు నిర్ఘాంతపోయినా, "నీకు ఇదంతా చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. సమయం ఇప్పటికి వచ్చిందన్నమాట," అంటూ మొదలెట్టారు.
ఆయన చెప్పిన విషయాలని బట్టి, అవ్వ కాకినాడ దగ్గర దక్షిణకాశి నివాసి అట. భర్త అనారోగ్యంతో కన్నుమూయడంతో, పొలము, పుట్రా కూడా కరిగిపోయి, ఆమె జీవనం భారమయిందట. ఆ సమయంలో కాకినాడ ఇవతల ఓ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు ఊకుమ్మడిగా ఇతర కార్మికులతో అవ్వ కూడా వలస పోయిందట. అప్పుడు ఇరవైయేళ్ల తాను అమ్మమ్మ వద్దే ఉండి చదువుకున్నాడట.
అవ్వ ఉప్పరి వాళ్ళ గుడిసెల్లో వుంటూ, ఫ్యాక్టరీ యజమాని ఇంట, వంట చేస్తూ పిల్లల్ని ఆడిస్తుండేదట. అప్పుడే, రత్న అనే ఓ దిక్కులేని అమ్మాయిని చేరదీసి, సొంత కూతురిలా చూసుకొనేదట కూడా. ఆ మూడేళ్ళల్లో ఫ్యాక్టరీ యజమాని కుటుంబానికి సేవ చేస్తూ తన మంచితనంతో బాగా దగ్గరయిందట అవ్వ. తన కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని యజమానిని అర్ధించి, తనకి వాచ్ మాన్ ఉద్యోగమే కాక, ఉండడానికి పక్కవీధి లోని ఓ పాత డాబా ఇల్లు కూడా ఇప్పించుకొన్నాక, తాను భార్యా పిల్లలతో ఈ వూరికి వచ్చేశాడట నాన్న.
తాము వచ్చేప్పటికే, అవ్వ పెంపుడు కూతురు రత్న, బిడ్డని కని పురిటిలోనే చనిపోతే, అనాధ అయిన ఆ పసిగుడ్డు ‘కాశీ అన్నపూర్ణ’ ని తనే పెంచుకోసాగిందట. అప్పటి నుండి ‘కాశీ’ ని, తమ పిల్లల్లో ఒకరిలా పెంచుకున్నారట నాన్న వాళ్ళు. ఆ కాశీయే నేను. కథ ముగించి ఊపిరి తీసుకొన్నాడు నాన్న. దు:ఖం ఆపుకుంటూ అక్కడి నుండి బయట పడ్డాను.
ఎలా అనుకోవాలో, ఏమనుకోవాలో తెలియని స్థితి. ముందే ఈ విషయం నాకు తెలుపనందుకు కోపం తెచ్చుకోవాలా? ఎవరి మీదా? నాన్న మీదా? ఎందుకు? ఏమో. అయోమయంలో కొద్ది రోజులు గడిపాను. అప్పుడైనా, ఇప్పుడైనా నేను ఏమీ చేయలేని పరిస్థితే అని అర్ధం చేసుకొని, సర్డుకుపోయే ప్రయత్నం చేసాను.
***
రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మరో ఐదేళ్ళకి, పెద్దవాళ్ళు అమరులయ్యారు. అందరిలో చిన్నదాన్ని అయినా, అన్ని బాధ్యతలకి యింటి పెద్దనే అయ్యాను. నాన్న పోయాక మాత్రం, ఫ్యాక్టరీ నుండి మేనేజర్ గోపాలం గారు వచ్చి, రెండు లక్షల రూపాయిలు ఇచ్చి, ఎప్పుడైనా, ఏమైనా అవసరం ఉంటే తనని కలవమని చెప్పి వెళ్ళారు.
చిన్నన్నయ్య కూడా చదువు ముగించి, క్యాంటీన్ విషయంలో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఏడాదికి వాడిక్కూడా పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంటికి కాపురానికి తెచ్చాను. తరువాత ఆరునెలలకి కాకినాడ వెళ్ళిపోయారు. చిన్నన్నయ్య నా గురించి గానీ, క్యాంటీన్ గురించి గానీ ఏమీ ఆలోచించలేదని అర్ధమయ్యి మనస్సు చివుక్కుమంది. వయస్సు మళ్ళుతున్న రామయ్య తాతని, మెరుగైన వృద్ధాశ్రమంలో చేర్పించాను. ప్రతివారం వెళ్లి కొంత సమయం గడుపుతున్నాను.
***
కాలచక్రం ఆగదుగా! నలభైయ్యో పడిలో పడ్డాను. పండగలకి, పుట్టిన రోజులకి వస్తారు అన్నయ్యలు, పిల్లలు. డబ్బుకి కొదవ లేదు కనుక అందరికీ కానుకలు, చీర, సారె పెట్టి సంతోష పెడుతుంటాను. అన్నలంతా వారి కుటుంబాలతో దూరతీరాలకి తరలిపోయారు. చాలా ఒంటరిదాన్నయ్యాను. కష్టంగానే అనిపిస్తుంది. మనస్సు కూడా ఒక్కోసారి ఉదాసీనంగా అయిపోతుంది. నాకు ఎవ్వరూ లేనట్టు, నా అనుకున్న నా వారికి నా ధ్యాసే లేనట్టు అనిపించి, దిగులేసేది.
***
ఓ రోజు మేనేజర్ గోపాలంగారు ఇంటికి వచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా నాకు, మా కుటుంబానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహాయం చేసిన ఫ్యాక్టరీ యజమాని, పరంధామయ్యగారి నుండి రాయబారం తెచ్చారు. యజమాని గారి తమ్ముడు యాభైఆరేళ్ళ శ్రీనివాసగారితో, నాకు వివాహం చేయాలని ఆ పెద్దాయన సంకల్పం అట.
శ్రీనివాస్ గారికి భార్య పోయి చాల కాలం అయిందట. పిల్లలు లేరట. ఆయన జీవితం అంతా, శిశు సంక్షేమ కార్యక్రమాలు చేబడుతూ, అనాధ ఆశ్రమం, వృద్ధాశ్రమం నడుపుతూ, మరెన్నో సంక్షేమ సంస్థలు స్థాపించే సన్నాహాల్లో ఉన్నారట. ఆయన ఆస్థులకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఆశ్రమాలకి, నేను వారసురాలనైతే బాగుoటుందని, పెద్దాయన ఉద్దేశమట. నాలుగు వారాల తరువాత మళ్లీ వస్తాననీ, ఈ లోగా ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు గోపాలంగారు.
ఆలోచనల్లో వారాలు గడిపాను. మనస్సు, మెదడు అలిసి పోయేంత మటుకు సమాలోచించాను. జరగవలసిన నా పెళ్లి గురించి, వివాహ జీవితాన్ని గురించి నేనేనాడు పెద్దగా ఊహించుకోలేదు. పరంధామయ్యగారు పంపిన పెళ్లి సంబంధం కబురుతో, ఇప్పుడు నలభైఐదోయేట ఆ విషయమై అలోచించవలసిన అవసరం వచ్చింది. అనాధ బాలలకు, వృద్ధులకు సేవ చేస్తూ, వారి సంక్షేమానికి పాటుపడే అవకాశంగా మలుచుకోవచ్చు అనిపించింది. అలా నా మనస్సు, నా ఆలోచనలు ఒకేలా సాగి నిర్ణయం తీసుకొన్నాయి.
గోపాలంగారు అన్నట్టుగా నెలయ్యాక.. ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చారు. నా నిర్ణయం తెలియజేశాను. ఆ పైవారం, వివాహం జరిగి, ఇల్లాలినై, కోట్లకు అధిపతురాలనై, వెంటనే మా వృద్ధాశ్రమ, అనాథాశ్రమాల బాధ్యతలు చేబట్టాను.
ఆశ్రమ వృద్ధుల సేవలలో, అనాధ పిల్లల సంరక్షణలలో, హాయిగా మొదలైంది నా జీవితంలో ఓ కొత్త అధ్యాయం. వారి జీవితాలలో ప్రతి పొద్దు వెలుగు నింపు సూర్యునితో పాటు, “కాఫీ టిఫిన్ తయ్యార్'! అంతా వచ్చి తినాలి త్వరగా!" అంటూ సరిగ్గా ఎనిమిది గంటలకు, డైనింగ్ హాల్ గంట కొడుతూ, ద్వారం వద్ద నిలబడి, ఆనందంగా పిల్లల్ని ఆహ్వానిస్తాను. ఆ అభాగ్యుల ఆకలి తీర్చగలగడమే నా జీవితానికి సార్ధకత అవడంతో పాటు, మా ఆశ్రమం లోనే చరమ దశలో ఉన్న రామయ్య తాతకి సేవ చేసుకొనే భాగ్యం కూడా నాకు దక్కినందుకు ఆ కాశీ అన్నపూర్ణమ్మ కి వేయి నమస్కారాలు అర్పిస్తాను.
(ఆంధ్రభూమి ఆదివారం ప్రత్యేక కథ గా ప్రచురింపబడి.. ఆడియో కథ గా జనాదరణ పొందిన కథనం.)
*****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్