Menu Close
Nagamanjari
సీతాకోకచిలుకలు (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

మేఘాలు లేకుండానే ఉరుముల ధ్వని వినిపించింది. అందరూ ఉలిక్కి పడ్డారు. ఆయుధాగారం ఎక్కడ ఉందో తెలిస్తే ఉపయోగించుకోవచ్చుననుకున్నాడు రుద్రుడు. పెద్దగా గాలి వీచింది. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని దగ్గరగా నిల్చున్నారు. బహుశా వారు దాచిన సంపద, ఆయుధాలు ఎవరికి దక్కడం ఇష్టం లేదేమో అనుకున్నాడు రుద్రుడు.

“కాలా, శోణా, శ్యామా మీరు లేనప్పుడు మీదైన సంపద, ఆయుధాల గురించి ఆశించడం తప్పే. శాంతించండి. మేము ఇక వాటి గురించి ఆలోచించము. మమ్మల్ని మన్నించండి.” చేతులు జోడించి ప్రార్ధించాడు రుద్రుడు. ఎంత హఠాత్తుగా ప్రారంభమయ్యిందో అంతే హఠాత్తుగా ఆగిపోయింది పెనుగాలి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

**********

మతి చెదిరి, బట్టలు చిరిగి పేలికలై వేలాడుతున్న ఒక యువకుడు అడవి పరిసర గ్రామాలలో తిరుగుతున్నాడు. “నా ఆయుధాలు ఆ కొండ గుట్టల్లో ఉన్నాయి. రండి తెచ్చుకుందాం.” అంటూ ఉంటాడు. ఎవరైనా దయతలచి పెడితే తింటాడు. లేదంటే లేదు. ఒకరిద్దరు ఆ యువకుని మాటలు విని అతడిని తీసుకుని కొండ గుట్టల్లోకి వెళ్లారు. “ఇదిగిదిగో ఈ గుట్టలో ఉన్నాయి. తవ్వండి తవ్వండి” అని కాసేపు తవ్వనిచ్చి, “ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ” అంటూ తిప్పేవాడు. దాంతో విసిగిపోయిన వారు మరి ప్రయత్నించడం మానేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ మతి భ్రమించిన యువకుడు ఏమైపోయాడో ఎవరికి తెలియలేదు.

వీరసేన యువకులు మాత్రం కొండగుహల్లో అపురూపమైన సంపద, అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయని తమ వారసులకు చెప్పేవారు. అలా ఆ విషయం తరతరాలకు అందింది. కానీ వాటికోసం ప్రయత్నిస్తే మృత్యువు తరుముతుందని కూడా ప్రచారం జరిగింది. దాదాపు వందేళ్లు గడిచిపోయాయి.

************

“ఏట్రా పొద్దుగాల నుంచి ఏదో మాదిరిగా ఉన్నావు. ఏటయ్యిందేటి? ఆతృతగా అడిగాడు శీను.

“ఏటి నేదన్నానా” కసిరాడు సుబ్బు.

“ఓసోస్… నాకు తెలీదేటి. ముకం జూత్తే ఏటో ఐనాదనిపిత్తాంది” చెప్పాడు శీను.

“అవున్రా, నిజంగానే దొంగలు డబ్బులు, నగలు కొండల్లో, అడవుల్లో దాత్తారంటావా?” అడిగాడు సుబ్బు.

“ఇప్పుడయ్యన్ని ఎందుకురా?” అడిగాడు మహేశు.

పంతులుగారు మజ్జిగ ఇచ్చాక, అందర్నీ ఇంటికి పంపేశారు. నడుస్తూ త్రోవలో మాట్లాడుకుంటున్నారు.

“అది కాదురా. నిన్న మీరందరూ సైన్యంలో చేరడం గురించి, దొంగల్ని పట్టడం గురించి మాట్లాడుకున్నారు కదా, నాకు నిద్దర్లో అదే కల వచ్చిందిరా. పెద్ద సావుకారు ఇంట్లో నిన్న కార్యం అయ్యింది కదా, అప్పుడు ఒక రాత్రి అయ్యాక దొంగలొచ్చినారట, ఆడోళ్ళందరి నగలు ఒలుచుకు పోయినారట. అప్పుడు మనందరం ఎల్లి, నెలకడం మొదలుపెట్టినామట. ఆకలేస్తే అక్కడే తిరిగే చిన్న మేకని కాల్చుకుని తినేసామట. అప్పుడు ఒక పాడుపడ్డ అమ్మవారి దేవాలయంలో దొంగలు దాచిన సొమ్ము సూసినామంట. అందరం కలిసి ఆ నగలన్నీ సావుకారు గారికి ఇచ్చేసినామంట. అప్పుడు ఆ బాబుగారు మనందరికీ బోలెడు బోలెడు డబ్బు ఇచ్చినారంట. ఆ డబ్బులతో నేను బోలెడన్ని మిఠాయిలు కొనుక్కొని మిఠాయిలతో ఇల్లు కట్టుకున్నానంట.

ఎంత మంచి కల వచ్చిందిరా… అసలు అది కల అంటే నమ్మేలా అనిపించలేదు తెలుసా. ఇప్పటికీ నిజం అనే అనిపిత్తోందిరా…” వివరంగా చెప్పాడు సుబ్బు.

పకాలుమని నవ్వేరు బుజ్జి, శీను. కానీ మహేశు నవ్వలేదు. ఆలోచిస్తూ ఉన్నాడు.

“ఒరే మా నాన్నమ్మ సెప్పినట్టు ఎక్కడో కొండల్లో కోనల్లో దొంగలు డబ్బులు, నగలు దాచే ఉంటారురా… అవి మనం ఎలాగైనా తెచ్చుకొని బాగా డబ్బున్నోల్లం అయిపోవాలి.” అన్నాడు మహేశు.

“సుబ్బూ… నీ కలలో దొంగల్ని పట్టడానికి నేను కూడా వొచ్చానేట్రా?” అడిగింది లష్మి.

“నువ్వు కూడా వొచ్చావు లష్మీ” చెప్పాడు సుబ్బు.

“అయితే మీరెప్పుడు దొంగల్ని పట్టుకోడానికి వెళ్లినా, నన్ను కూడా తీసుకెళ్లాలి.” చెప్పింది లష్మి.

అదో మాదిరిగా చూసాడు బుజ్జి. “ఆడపిల్లలు అడవుల్లంటా, కొండల్లంటా తిరక్కూడదమ్మి. మా యమ్మ సెప్పేది” అన్నాడు.

“ఒరే ముందు మనం పంతులుగోరు సెప్పినట్లు సదువుకుందాం రా… కొంచెం కత్తి తిప్పడం, కర్రసాము లాంటివి నేర్చుకుందాం. మనం దొంగల దగ్గర డబ్బు కొట్టేస్తే, ఆళ్ళు ఎంట పడితే ఒళ్ళు కాసుకోవాలి కదా…” అన్నాడు శీను.

“నువ్వు సెప్పేది కూడా నిజవేఁనురా. మనం అయ్యన్ని కూడా నేర్చుకోవాలి. అంతే కాదు పట్లుపట్టడం కూడా రావాలి. కుస్తీ చెయ్యాలి.” చెప్పాడు మహేశు.

“ఇయ్యన్నీ ఎప్పుడు నేర్సుకోవాల? ఎప్పుడు మనం ఆడివిలోకి ఎల్లాల?” చిరాగ్గా అన్నాడు సుబ్బు.

“ఒక పని సేద్దాం రా… రాబోయేది వానాకాలం. వానాకాలం తగ్గినాక, సంక్రాంతి పండగ సేసి మనం బయలుదేరిపోదాం. ఈ ఆరు మాసాలు సదువే నేర్సుకుంటామో, సాములే నేర్సుకుంటామో… ఏటంటావు?” అన్నాడు మహేశు.

అందరూ ఒప్పుకున్నట్లు తలాడించేరు.

**************

“వరదా! వరదా!” పిలుస్తున్నాడు మల్లిఖార్జున.

“వస్తున్నా మల్లిఖార్జున!” బయటకు వచ్చాడు వరదరాజులు.

“ఏమిటి విషయం? ఇలా వచ్చావు?” అడిగాడు.

“మనం గ్రంధాలయానికి వెళ్లి తాళపత్రాలు పరిశీలించాలి. మర్చిపోయావా?” అడిగాడు మల్లిఖార్జున.

“అయ్యో అవును కదా! ఈరోజు మా నాన్నగారు కూడా అటక మీద ఉన్న పాత గ్రంథాలు కిందకి దించమన్నారు. ఆ పనిలో ఉన్నాను.” చెప్పాడు వరద.

“సరే. వస్తావా అయితే.”

“ఆఁ. కాసేపు కూర్చో. ఒక్క ఘడియలో బయలుదేరుదాం.”

“ఆగు, నేను కూడా నీకు సహాయం చేస్తాను” మల్లిఖార్జున వరదరాజులుతో పాటు లోపలికి నడిచాడు. అటక మీద నుంచి నాలుగు జనపనార సంచులతో కట్టిపెట్టిన పుస్తకాలను దించాడు వరదరాజులు.

“అబ్బో పుస్తకాలతో పాటు, తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయే…” దించిన మూటలు విప్పి చూస్తూ అడిగాడు మల్లిఖార్జున.

“అవును మల్లికార్జున… తరతరాలుగా మా దగ్గర ఉన్న సంపద ఇదే. చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం వీటిని. శ్రీ పంచమి నాటికి వీటిని దించి, శుభ్రపరచి, పూజించి, మళ్ళీ లవంగాలు, దాల్చినచెక్క దంచిన పొడుములో కర్పూరం వేసి బట్ట మడతల్లో వేసి, ఈ గ్రంధాలన్ని జాగ్రత్తగా కట్టి పెడతారు. ఈసారి ఆ కార్యం మొత్తం నాచేత జరిపించాలని మా నాన్నగారి కోరిక.” చెప్పాడు వరదరాజులు.

“భద్ర పరచడం వరకేనా? వాటిలో ఏముందో ఎప్పుడూ చదవలేదా?” అడిగాడు మల్లిఖార్జున.

“నేను చదవలేదు మల్లి… ఇవి దాదాపు పద్నాలుగు వందల పైచిలుకు పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు. మా నాన్నగారికి తెలుసు. ఆయన చదివారు. వీటన్నిటి వివరాలు మా ఇంట్లో ఒక పుస్తకంలో రాసి పెట్టబడి ఉన్నాయి.” చెప్పాడు వరదరాజులు. “ఆ పుస్తకం నీకు చూపిస్తాను రా”

వరదరాజులు, మల్లిఖార్జున సహాధ్యాయులు.

పదిహేడేళ్ల నూనూగు మీసాల ప్రాయం వారు. నూతన విషయాలు పరిశోధించడంలోను, సాహిత్య గ్రంథాలు పఠించడంలోను, అధ్యయన గ్రంథాలు పరిశీలన చేయడంలోనూ అమితాసక్తి కనబరుస్తారు.

ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో అనేక విషయాలు ఉంటాయని, అసలు ఆ భాష అర్ధం చేసుకోవడమే కష్టమని, అర్ధం చేసుకుని చదివేకొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని సందర్భవశాత్తూ గురువుగారు చెప్పారు. అది మొదలు గ్రంధాలయానికి వెళ్లి, తాళపత్రాలను పరిశీలించే అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు మిత్రద్వయం. అమావాస్య, శుక్ల పక్ష పాడ్యమి విద్యాభ్యాసానికి సెలవు రోజులు. ఆ రెండు రోజులు గ్రంధాలయానికి వెళ్ళాలి అనుకున్నారు. అలాగే ఇరుపక్షాలలో వచ్చే అష్టమి తిథి, పౌర్ణమి కూడా సెలవులే. కానీ రానున్న శ్రీ పంచమి నాటి పూజకు వరదరాజులు అటక మీదనున్న పుస్తకాల సంచులు దింపడంతో ముందుగా అనుకున్న పనికి ఆటంకం కలిగింది.

వరదరాజులు తమ దగ్గర ఉన్న పుస్తకాల జాబితా తీసి చూపించాడు. చిన్న జాబితా అనుకున్నాడు మల్లిఖార్జున. చూస్తే అదే ఓ పెద్ద పుస్తకంలా ఉంది. రెండు పుటలు తిప్పగానే విషయసూచిక కనిపించింది.

  1. చారిత్రక పుస్తకాలు
  2. వైద్య శాస్త్ర గ్రంధాలు
  3. పౌరాణిక గ్రంథాలు
  4. కాళిదాసు రచనలు
  5. భవభూతి రచనలు
  6. అశ్వఘోషుని రచనలు
  7. శూద్రకుని రచనలు
  8. గాథాసప్తశతి
  9. క్షేమేంద్రుని సాహిత్యం
  10. నాట్య శాస్త్ర గ్రంధాలు
  11. సంగీత శాస్త్ర గ్రంథాలు
  12. శిల్ప శాస్త్ర గ్రంథాలు

ఇలా వరుసగా ఉన్నాయి. మరో రెండు పుటలు తిప్పేడు మల్లిఖార్జున. అక్కడ తాళపత్ర గ్రంథాల వివరాలు ఉన్నాయి. అయితే తాళపత్ర గ్రంథం పేరుతో పాటు సంక్షిప్త వివరాలు కూడా పొందుపరిచారు.

ఉదాహరణకు

  1. వేదములు: ఇవి వేదవ్యాస విరచితములు. సంస్కృత భాషలో కలవు. ఇవి నాలుగు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.
  2. శృంగార కావ్యాలు: స్మరదీపిక: కందుకూరి రుద్రకవి విరచితం. శృంగారకావ్యం. సరసజన మనోరంజనం: కందుకూరిరుద్రకవి విరచితం. రతిమంజరి, పంచసాయక, అనంగరంగ మొదలైనవి.
  3. జ్యోతిష్యశాస్ర్తం గ్రంథాలు
  4. పరాశర ధర్మ స్మృతి: పరాశర మహర్షిచే చెప్పబడిన ధర్మశాస్ర గ్రంథం
  5. రామాయణం - వాల్మీకి
  6. మహాభారతం - వేదవ్యాసుడు
  7. భాగవతం - వ్యాస మహర్షి
  8. కుహలాయనందం
  9. కేరళ సంప్రదాయమైన జ్యోతిష్య గ్రంథం
  10. ధర్మశాస్త్రం
  11. న్యాయశాస్త్రం - గౌతముడు
  12. ఆయుర్వేదం
  13. లోహశాస్త్రం
  14. తర్కం
  15. వ్యాకరణం
  16. అలంకారశాస్త్రం
  17. ఆధ్యాత్మిక స్తోత్రాలు
  18. వ్రత కథలు
  19. వైద్య శాస్త్రం
  20. ఖగోళ శాస్త్రం
  21. అష్టాధ్యాయి - పాణిని
  22. అర్ధశాస్త్రం - చాణక్యుడు
  23. మహాభాష్య - పతంజలి
  24. సత్సహసారిక సూత్రం - నాగార్జున
  25. బుద్ధచరిత - అశ్వఘోషుడు
  26. మహావిభాషాశాస్త్రం - వసుమిత్రుడు
  27. స్వప్నవాసవదత్త - భాసుడు
  28. కామసూత్ర - వాత్స్యాయనుడు
  29. కుమారసంభవం - కాళిదాసు
  30. అభిజ్ఞాన్శకుంతలం - కాళిదాసు
  31. విక్రమోర్వశీయం - కాళిదాసు
  32. మేఘదూతం - కాళిదాసు
  33. రఘువంశం - కాళిదాసు
  34. మాళవికాగ్నిమిత్రం - కాళిదాసు
  35. నాట్య శాస్త్రం - భరత ముని
  36. దేవి చంద్రగుప్తం - విశాఖదత్తుడు
  37. మృచ్ఛకటికం - శూద్రకుడు
  38. సూర్య సిద్ధాంతము - ఆర్యభట్ట
  39. బృహత్సంహిత - వరాహామిహిరుడు
  40. పంచతంత్రం - విష్ణు శర్మ
  41. కథాసరిత్సాగరం -
  42. అభిధమ్మకోష్ - వసుబంధు
  43. ముద్రారాక్షసం - విశాఖదత్తుడు
  44. రావణ సంహారం. - భట్టి
  45. కిరాతార్జునీయం - భారవి
  46. దశకుమార చరితం - దండి
  47. హర్షచరిత - బాణభట్టు
  48. కాదంబరి - బాణభట్టు
  49. వాసవదత్త -
  50. నాగానందం - హర్షవర్ధనుడు
  51. రత్నావళి - హర్షవర్ధనుడు
  52. ప్రియదర్శిక - హర్షవర్ధనుడు
  53. మాలతీమాధవం - భవభూతి
  54. కర్పూర మంజరి - రాజశేఖరుడు
  55. బృహత్కథామంజరి - క్షేమేంద్రుడు
  56. నైషధచరితం - శ్రీహర్షుడు
  57. విక్రమాంకదేవచరిత్ర - బిల్హణుడు
  58. గీతగోవిందం - జయదేవుడు
  59. పృథ్వీరాజరాసో - చంద్ బర్డై
  60. రాజతరంగిణి - కల్హణుడు
  61. శిశుపాల వధ - మాఘుడు
  62. ఐతరేయ బ్రాహ్మణం
  63. శతపథ బ్రాహ్మణం
  64. కౌషితకి బ్రాహ్మణం
  65. సాంఖ్యాయన బ్రాహ్మణం
  66. జైమినీయ బ్రాహ్మణం
  67. పంచవింశతి బ్రాహ్మణం
  68. తైత్తరీయ బ్రాహ్మణం69. ధనుర్వేదం
  69. గాంధర్వవేదం
  70. అర్థవేదం
  71. వైశేషిక దర్శనం - కణాద ముని
  72. యోగదర్శనం - పతంజలి ముని
  73. మీమాంస తత్వం - జైమిని ముని
  74. సాంఖ్య తత్వశాస్త్రం - కపిల ముని
  75. వేదాంత తత్వశాస్త్రం - వ్యాస ముని

ఇలా ఎన్నో తాళపత్రాల వివరాలు అందులో ఉన్నాయి.

ఆయితే వీటన్నిటి కంటే మల్లిఖార్జునను ఆకర్షించిన పుస్తకాలు రెండు. మొదటిది బొబ్బిలి యుద్ధం అయితే రెండవది పలనాటి యుద్ధం.

ఈ రెండు కావ్యాలుగా, నాటకాలుగా కూడా రచించబడ్డాయి.

★★★ సశేషం ★★★

రచయిత్రి పరిచయం:

Nagamanjariనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

Posted in August 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *