నకిలీ విత్తనాలు ఆట
మకిలీ దళారు ఆట
ఇప్పుడు వర్షం బధిలీ ఆట
రైతు జీవితమే ఎండుతున్నది ఈ పూట
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
మొక్క వాడుతున్నది
మన్ను వాడుతున్నది
రైతు ముఖం వాడుతున్నది
నీ వల్లకాడు నవ్వుతున్నదా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
నీ నెత్తిన నీరు
భూమిలో ఇంకి పోతున్నది
నీ పెంకితనం మాని
మా పంటకు కంకి వచ్చే దారి చూపవా దక్షిణామూర్తి
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
విత్తు ఆకులేసింది
ఆకులకు దాహమేసింది
దాహం తీసే మేఘం ముఖం చాటింది
రైతు దేహం నిలబడుతుందా నీలకంఠ
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
నీరే కదా నీకు అభిషేకం
నీరే కదా మొక్కలకు ప్రాణం
నీరే కదా జీవన వైవిధ్యం
నీరే కన్నీరైనది వాన రాక
నీ మాయ ఎటుపోయేనో ఇక
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
వరి ఉరికొయ్యకు తలలా వేలాడుతున్నది
పత్తి గాలికత్తికి సొమ్మసిల్లి చూస్తున్నది
వేరుశనగ వేదనను మోస్తున్నది
మట్టి కష్టం కొట్టినట్టు కనబడడం లేదా నీ మూడు కన్నులకు
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
మేఘం పోతున్నది
ఆకాశం చూస్తున్న రైతు కన్నుల మీదుగా
వాన చినుకు వచ్చేదెప్పుడో
వాడి పోతున్న పంటచేను మీదుగా
మట్టి మనిషి జీవితం కిందా మీదా చేయకయ్యా శివయ్యా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
సముద్రంలో వచ్చిన మార్పు
మేఘాల్లో వచ్చిన మార్పు
వాతావరణంలో వచ్చిన మార్పు
అన్నదాతను చూసి పురుగులమందు నిట్టూర్పు
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
చినుకు లేక చితుకున్న బతుకులోనా
భరోసా తడి బీడు బారి పోతున్నది
కరువు రాకాసి గడప గడప తాండవిస్తున్నది
కథకు కంచి లేదా పరమేశ్వర
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
పంచభూతాలు దారి తప్పాయి
కరువు కష్టాలు దాపురించాయి
కన్నీటి వరదలు ముంచుకొచ్చాయి
ఈ వ్యధలు తీరే తారక మంత్రం ఏమీ లేదా
విశ్వనాధ
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.