Menu Close
G.S.S. కళ్యాణి
జగన్మాయ (కథ)
G.S.S. కళ్యాణి

సమయం మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. అకాశం కారుమేఘాలతో నిండి ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కిటికీలోంచీ చూస్తున్నాడు ముప్ఫయ్యేళ్ళ సుదర్శనం. అంతలో కళ్ళు చెదిరే ఉరుము... ఆ వెంటనే భువనమంతా దద్దరిల్లేలా దూరంగా పడిందొక పిడుగు! ఆ శబ్దానికి ఇంటిగోడలు అదిరినట్లనిపించింది సుదర్శనానికి.

"అబ్బ! ఎంత పెద్ద పిడుగో! ఉలిక్కిపడ్డారా?", సుదర్శనాన్ని నవ్వుతూ అడిగింది సుమతి.

సలాసలా మరుగుతున్న నీళ్ళతో ఉన్న గిన్నెను గుడ్డతో జాగ్రత్తగా పట్టుకొచ్చి తను పడుకుని ఉన్న మంచం పక్కన నిలబడి ఉన్న సుమతివంక చూసి, "భయమెందుకూ? నా జీవితంలో పడిన పిడుగుకన్నా అది చిన్నదేలే", అన్నాడు సుదర్శనం నిర్లిప్తంగా వర్షాన్ని చూస్తూ.

కారుమబ్బులనే కష్టాలు జీవితాన్ని కమ్మేస్తే, సూర్యుడనే భగవంతుడి కరుణకు దూరమై వెచ్చని ఆశాకిరణాలు కనపడక బ్రతుకంతా చీకట్లు నిండినప్పుడు, ఆ బాధను అనుభవిస్తున్న గుండె ఆగని కన్నీళ్ళ వర్షంలో తడిసిపోతున్నట్లనిపించింది సుదర్శనానికి.

"అధైర్యపడకండి! మనకీ మంచి రోజులొస్తాయ్", అంది సుమతి ఒక చిన్న చేతిగుడ్డను వేడి నీళ్ళల్లో ముంచుతూ.

సుమతి చిరునవ్వు సుదర్శన్లో ఏదో ధైర్యాన్ని రగిలిస్తోంది. ఆమెకున్న సహనం భూదేవిని తలపిస్తోంది. నీళ్ళతో తడిసిన గుడ్డను పిండి సుదర్శన్ కాళ్లకు కాపడం పెడుతోంది సుమతి. ఆ వెచ్చదనం సుదర్శన్ కు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

"గత జన్మలో నువ్వు సతీ సుమతివేమో!", అన్నాడు సుదర్శనం.

"అంతటి పతివ్రతతోనా నా పోలిక!", అంది సుమతి. పొగడ్తను అంగీకరించని సద్గుణం సుమతి మాటల్లో కనిపించింది సుదర్శనానికి.

చదువు పూర్తయ్యక ఏడాదిపాటూ ఉద్యోగం కోసం అన్వేషించిన సుదర్శనానికి అయిదేళ్ల క్రితం హై స్కూల్లో విద్యార్థులకు సైన్స్ బోధించే టీచర్ ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో సుమతిని ఒక గుళ్ళో చూసి ప్రేమించాడు సుదర్శనం. సుమతి తండ్రి ఈశ్వరయ్యకి ఆస్తిపాస్తులేవీ లేవు. తనకున్న చిన్న పొలంలో వ్యవసాయం చేసి తన ఒక్కగానొక్క కూతురు సుమతిని పెళ్ళే లక్ష్యంగా పెంచి పెద్ద చేశాడు ఈశ్వరయ్య. పిల్లను చదివించడానికి ఎలాగో తమకున్న డబ్బు సరిపోదుకాబట్టి సుమతి విషయంలో ఈశ్వరయ్య ఆశయానికి అడ్డు చెప్పలేదు అతడి భార్య కృష్ణమ్మ. అంతేకాకుండా సుమతికి కృష్ణమ్మ పతియే ప్రత్యక్షదైవమని చిన్ననాటినుంచీ నూరిపోసింది.

సుమతి పెద్దగా చదువుకోలేదని ఈశ్వరయ్య సుదర్శనానికి చెప్పినప్పుడు, "సుమతి చదువుకోకపోతేనేం? నాకు చదువుంది కదా మావయ్యా! సుమతికి ఏలోటూ లేకుండా నేను చూసుకుంటా", అని ఈశ్వరయ్యకు హామీ ఇచ్చాడు సుదర్శనం.

ఊళ్ళోని శ్రీరాములవారి గుడిలో ఉన్నంతలో ఘనంగా జరిగింది సుదర్శనం, సుమతిల వివాహం. పెంపకం తీరువల్ల సుమతి ఏనాడూ సుదర్శనం మాటకు ఎదురు చెప్పలేదు. దాంతో సుదర్శనం వైవాహిక జీవితం కొంతకాలం హాయిగా గడిచిపోయింది.

అయితే కొద్ది నెలల క్రితం బండి నడుపుతూ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సుదర్శనం, అదుపుతప్పి ఒక పెద్ద గోతిలో పడిపోయాడు. అతడి కాళ్ళకూ, వెన్నెముకకూ పెద్ద దెబ్బలు తగలడంతో అప్పటినుంచీ మంచానికి అంకితమైపోయాడు సుదర్శనం. సుదర్శనం పనిచేస్తున్నది ప్రైవేట్ స్కూల్ కావడంతో ఆ స్కూల్ యాజమాన్యం సుదర్శనం ఆరోగ్యం గురించి ఆరాతీసి, అతడు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండటంతో అతడిని ఉద్యోగంలోంచీ తొలగించి మరొకరిని ఆ స్థానంలో నియమించింది. ఉన్నట్లుండి నెలజీతం ఆగిపోయేసరికి సుదర్శనం ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఎటూపాలుపోని స్థితిలో సుదర్శనం ఇంట్లోనే పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. సుదర్శనం కదలలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతడు పాఠాలు చెప్పేందుకు సుమతి సహాయం చేస్తూ ఉండేది.

డాక్టర్ సూచనల ప్రకారం ప్రతిరోజూ వేడినీళ్ళతో సుదర్శనం కాళ్ళకూ, వెన్నుకూ కాపడం పెట్టడం సుమతి దినచర్యలలో ఒక భాగమైపోయింది.

"అయిదవుతున్నా ఇంకా పిల్లలు ట్యూషన్ కి రాలేదేంటీ?", గడియారంవంక చూస్తూ సుమతితో అన్నాడు సుదర్శనం.

"పెద్ద వర్షం పడుతోంది కదా! ఇవాళ పిల్లలు వస్తారో రారో మరి", అనుమానం వ్యక్తం చేసింది సుమతి.

అంతలో విజయేంద్ర అనే పిల్లవాడు వర్షంలో తడుస్తూ వచ్చాడు.

"ఏం విజయ్? నీ స్నేహితులేరీ?", విజయేంద్రను అడిగాడు సుదర్శనం.

"వాళ్లందరికీ జలుబులూ, జ్వరాలూ సార్! ఇవాళ వాళ్ళంతా రారు", సమాధానం చెప్పాడు విజయేంద్ర.

సరేనని సుదర్శనం విజయేంద్రకు పాఠం చెప్పి పంపించేశాడు. పాఠం చెప్తున్నంతసేపూ విజయేంద్ర తుమ్ముతూ, దగ్గుతూ ఉన్నాడు. విజయేంద్ర వెళ్ళిపోయిన కొద్దిసేపటికి సుదర్శనం ఒళ్ళు వెచ్చబడింది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న సుదర్శనానికి తలనొప్పీ, దగ్గూ మొదలయ్యాయి. రెండు రోజులు గడిచేసరికి సుదర్శనానికి చేసిన జలుబు తీవ్రమయ్యింది. మందులు వాడటంతో లక్షణాలనుండి కాస్త కోలుకున్నాడు సుదర్శనం. వెంటనే ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సుదర్శనం పిల్లలకు కబురు పంపించాడు.

"ఇవాళ మీరు చాలా నీరసంగా ఉన్నారు. ట్యూషన్ క్లాసులు చెప్పడం కష్టం. పిల్లలను రేపు రమ్మని చెప్తాను. ఇవాళ్టికి విశ్రాంతి తీసుకోండి", అంది సుమతి సుదర్శనంతో.

"పిల్లల తల్లిదండ్రులు బోలెడు డబ్బులు కట్టి, వాళ్ళు బాగా చదువుకోవాలని నా దగ్గరకు పంపుతున్నారు. నేను ఇప్పటికే అనారోగ్యం పేరుతో రెండు రోజులు సెలవు తీసుకున్నాను. మరిన్ని రోజులు సెలవు తీసుకోవడం భావ్యం కాదు. క్లాసులు జరిగేది మూడు గంటలేగా! ఎలాగో కష్టపడతాలే", అన్నాడు సుదర్శనం మాస్క్ ముఖానికి పెట్టుకుంటూ.

పిల్లలు ట్యూషన్ కి వచ్చారు. సుదర్శనం సైన్సు పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. వారంతా ఆసక్తిగా వింటున్నారు. అంతలో సుదర్శనానికి గొంతులో విపరీతమైన మంట మొదలైంది. కంఠంలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా మాట పెగలట్లేదు. చల్లని నీళ్ళు త్రాగాడు. సుమతి ఇచ్చిన తేనె గొంతులో పెట్టుకున్నాడు. వేడినీళ్ళు పుక్కిలించి చూశాడు. ఏం చేసినా ప్రయోజనం కలగలేదు. గొంతు నొప్పి తగ్గలేదు. సుదర్శనం బాధను అర్థం చేసుకుంది సుమతి. వెంటనే సుమతి సైన్సు పుస్తకం తన చేతిలోకి తీసుకుని పిల్లలకు పాఠం వివరిస్తూ క్లాసు పూర్తిచేసింది. అది చూసి అమితాశ్చర్యానికి గురయ్యాడు సుదర్శనం.

పిల్లలు ఇళ్ళకు వెళ్ళిపోయాక, "సుమతీ! నువ్వు చదువుకోలేదు కదా! సైన్స్ పాఠం పిల్లలకు అంత అద్భుతంగా ఎలా చెప్పగలిగావూ?", అడిగాడు సుదర్శనం.

"గత ఆరు నెలలుగా మీరు చెప్తున్న పాఠాలన్నీ పక్కనే ఉండి వింటున్నానుగా. వచ్చేశాయి", అంది సుమతి నవ్వుతూ.

"సమస్యకు పరిష్కారం ఎదురుగా పెట్టుకుని ఇన్నాళ్ళూ అనవసరంగా అందోళన పడిపోయాం. నీకు భగవంతుడు అందంతోపాటూ మంచి తెలివితేటలను ఇచ్చాడు. నువ్వు ప్రైవేట్ గా పరీక్షలకు కట్టి పై చదువులు చదువుదువుగాని. నేను నీకు అందుకు తగిన శిక్షణ ఇస్తాను. సరేనా?", అడిగాడు సుదర్శనం.

"మీ ఇష్టమే నా ఇష్టం", అంది సుమతి వినయంగా.

నాలుగేళ్ళు గడిచాయి. సుమతి సుదర్శనం సహకారంతో సైన్స్ లో డిగ్రీ సంపాదించింది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పట్టుదలతో పూర్తి చేసింది. ఆ వెంటనే కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం సాధించి సుదర్శనం చేతిలో తన నియామకాన్ని తెలియజేస్తున్న ఉత్తరం పెట్టింది సుమతి.

"సరస్వతితోపాటూ లక్ష్మి కూడా అనుగ్రహించింది!", అన్నాడు సుదర్శనం ఆనందభాష్పాలు రాలుస్తూ.

ఇంకా అంతగా చలనం రాని తన కాళ్ళకు దణ్ణం పెడుతున్న సుమతిని చూసి ఉప్పొంగిపోయాడు సుదర్శనం. అదే సమయానికి కిటికీలోంచీ వీస్తున్న చల్లటిగాలి అప్పుడే తడిసిన మట్టివాసనను మోసుకొచ్చింది. ఆకాశంవంక చూశాడు సుదర్శనం. మళ్ళీ ఆకాశమంతా నల్లటి మబ్బులు పట్టాయి. కుంభవృష్టి మొదలైంది. కానీ ఇప్పుడా మబ్బులు వేసవితాపాన్ని పోగొట్టి హాయినిచ్చే నీడనిస్తున్నాయి. కురుస్తున్న వర్షం వీనులవిందైన సవ్వడి చేస్తూ ప్రకృతిని అలరిస్తూ జలవనరులను నింపడానికి తొందరపడుతోంది. తళుక్కున మెరిసిన తెల్లని మెరుపు నింగి ఫక్కున నవ్విన నవ్వులా తోచింది సుదర్శనానికి. మనలోనే ఆత్మగా ఉంటూ మన మనసులకు మాత్రం అందని శ్రీకృష్ణుడు, వరుణుడి రూపంలో ఆనందాన్ని తెచ్చి ఒక మధురమైన పులకింతగామారి హృదయాలను తాకిన అనుభూతిని కలిగిస్తోందా వర్షం!

'ఆహా! కొన్నాళ్ళ క్రితం ఇదే వర్షం నాలో అలజడిని రేపింది. కానీ ఇవాళ ఈ వర్షం నాకు అహ్లాదాన్ని కలిగిస్తోంది. మానసికస్థితి మన ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేస్తుందో కదా! ఒకే దృశ్యం సంతోషంగా ఉంటే అందంగానూ దుఃఖంతో ఉంటే భయంకరంగానూ కనపడుతుంది. అంతా కనపడని మనసు చేసే జగన్మాయ!', అనుకున్నాడు సుదర్శనం.

********

Posted in August 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *