3. రామలక్ష్మి మోచర్ల
అంశం: మొదలు నేనిస్తా... ముగింపులు మీరివ్వండి. శీర్షిక:"అజ్ఞాతం"
రకరకాల ఆలోచనలతో అరణి చాలా సేపు మేలుకొనే ఉంది. ఆమెకు అది కొత్త కాదు. బాల్యపు నీలి నీడలు ఎప్పుడూ ఆమెను తరుముతూనే ఉంటాయి. అవి తలపులోకి వచ్చినప్పుడల్లా వాటి నుంచి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటుంది. బుక్స్ చదవటం, మెడిటేషన్ చేయటం, ప్రకృతి దృశ్యాలను చూడటం ఇలా.
ప్రస్తుతం ఆమె బస్సులో ప్రయాణిస్తోంది. బస్సు కిటికీ లోంచి బయటకు చూసింది. కటిక చీకటి కావడంతో కంటికి ఏమీ కనిపించలేదు. హెడ్ ఫోన్ ద్వారా ఫోన్లో... పాటలు పెట్టుకుని వింటూ కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర లోకి జారుకుందో తెలియదు. బస్సుకు సడెన్ బ్రేక్ పడేసరికి కళ్ళు తెరిచింది. బస్సుకి ఏదో అడ్డం వచ్చినట్టుంది. అందుకే సడెన్ బ్రేక్ వేశాడు. రోడ్డు క్లియర్ అయ్యాక బస్సు మళ్లీ స్టార్ట్ అయింది. ఇంక అరణి కి నిద్రపట్టలేదు. కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థం కాలేదు...
ఇక కొనసాగించండి.....
నా ముగింపు:
"ఏమిటా శబ్దం."
“ఏమయ్యింది" అందరి హృదయాలలో రేకెత్తిన ఒకే ఒక ప్రశ్న, సమాధానం రాని, నిశ్శబ్దం.
నిశీథిలో కన్నుపొడుచుకున్నా, ఏమీ కనిపించటంలేదు. అందరికీ భయంతో గొంతుపూడి, పెదవులు బిగిసిపోయి మాట పెగలటంలేదు.
"ఏమయ్యింది" ఏమయ్యిందో "చెప్పండిరా"..
"సమస్య ఎదురైతే మూతులు మూత పడకూడదు. అరవాలి కళ్ళుతెరవాలి చేతులు కలపాలి"
"చేతలు కావాలి” అంటూ ఉద్రేకంగా ఊగిపోతూ, ఉద్యమానికి ఊపిరి, ఊదినట్టుగా అందరిలో వేడిపుట్టేట్టు, అరిచింది. 75ఏళ్ళ ఓ పెద్దావిడ అరణి అమ్మమ్మ సోమిదేవమ్మ.
“అమ్మమ్మా ..అమ్మమ్మా ...నువ్వు ...నువ్వు మాట్లాడావు, మాట్లాడావు”, అంటూ అరణి, సోమిదేవమ్మ భుజాలుపట్టి కుదిపింది.
బస్సులో ఉన్నప్రయాణీకులందరిలో ఆశ్చర్యంతోపాటు, మెల్లమెల్లగా కదలిక మొదలయినది. కొందరు సెల్ ఫోను లైట్ వేసి బస్సుకు ముందువైపు దృష్టి సారించారు. మరికొందరు ధైర్యంగా, బస్సు దిగారు. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. చేతిలో గన్, నల్లని దుస్తులు ధరించి కాళికాదేవిలా ఉన్న ఓస్త్రీమూర్తి, బస్సుదిగి తనను సమీపిస్తున్న వారికేసి చూసి,
"అరణి"...అంటూ అవ్యాజ ప్రేమతో పలకరించింది. ఆ పిలుపులోని ఆపేక్షతో పులకించి అమ్మా.......మీరు, శాంతి ఆంటి కదూ, బాగున్నారా, అంటూ ఆనందంతో కేకపెట్టింది అరణి.
“బ్రతికే ఉన్నాను, బ్రతుకుతాను. చట్టం నుంచి తప్పించుకొన్న పిచ్చికుక్కలను, సమాజాన్ని భ్రష్టు పట్టించే చీడపురుగులను కాల్చేస్తున్నాను. తుపాకి శబ్దంవిని పారిపోయారు పిరికిపోతులు. భయంలేదు.ఇక బయలుదేరండి" అంది శాంతి.
అయోమయంగా ఉన్నా, తమని ఆదుకున్న ఆమెకేసి అభిమానంగా చూస్తూ,
“గన్ ధరించిన ఆదిశక్తిలా ఉన్నావు, మా ప్రాణమానాలు రక్షించావు తల్లి. నువ్వు అడ్డుకోక పోతే మాలో ఎవరు మిగిలేవారో? నీలాంటి అమ్మలే ఊరూవాడా కాపాడే గ్రామదేవతలు" అంటూ, కృతజ్ఞతలు తెలిపి అంతా బస్సు ఎక్కారు.
శాంతి ఎవరూ? అరణి ఎవరు? సోమిదేవమ్మకు మాట రావటమేమిటి? అనే ప్రశ్నలు అందరిలో ఉద్భవించాయి. వారి ఉత్కంఠ గమనించిన అరణి వారికేసి దృష్టి సారించి చెప్పటం మొదలుపెట్టింది.
ఇంచుమించుగా ఏడాది క్రితం ఇదే బాటలో పయనిస్తున్న బస్సుని నలుగురు దుండగులు అడ్డగించారు. “బస్సులో ఉన్న ఎవర్ని ఏమి చెయ్యం. రేపు హైకోర్టులో కోటేశ్వరబాబుగారి అబ్బాయి ఫణిబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఈ బస్సులో ఉన్నారని మాకు వార్త అందింది. వాళ్ళు దిగిపోతే అందరూ బ్రతికిపోతారు. లేకపోతే మొత్తం అందర్నిఏసేత్తాం” అంటూ అరిచాడొకడు.
“చూడు బాబు కొంచెం ఆలోచించు. అలాంటివారు ఇలాంటి బస్సుల్లో రారు. ప్రత్యేక కారుల్లో వెడతారు. బస్సు పోనీయండి బాబు” అంటూ బ్రతిమాలింది సోమిదేవమ్మ.
“ఏయ్...ముసలమ్మ గమ్మునుండు. నోరెత్తితె పీకకోస్తా” అంటూ విసురుగా ఒకడు ఒక తోపుతోసాడు.
పడిపోతున్న ఆమెను పడకుండా పట్టుకుని, కూర్చోపెట్టాడు రాజీవ్. “ఏంట్రా నువ్వోపెద్ద హీరో ననుకుంటున్నావా? ఆ ముసల్ది నీచుట్టమా?” అంటూ వెకిలిగా నవ్వాడు ఒకడు.
“చేవచచ్చి, చీము నెత్తురు లేనోళ్ళలా ఉన్నారు. వీళ్ళు బతుకున్నశవాలు, సాక్షాలు ఇవ్వలేరు పదండి పోదాం.” అన్నాడు మరొకడు.
సరిగ్గా అదే సమయానికి ఓ పెద్దాయన గుండెనెప్పితో గిలగిలలాడుతున్నాడు. “ఈ బస్సులో వైద్యం తెలిసినోళ్ళు ఉంటె దయఉంచి ఈయన్ని బ్రతికించండి. ఈయన బ్రతకాలి, తప్పకుండా బ్రతకాలి” అంటూ ఓ పెద్దావిడ ప్రాధేయపడుతుంది.
“అమ్మా ధరణి...సత్యం మాస్టారిని బ్రతికించు” అంది సోమిదేవమ్మ. ఆ మాట విన్న దుండగులు బస్సు
దిగకుండా ఆగిపోయారు.
“ధరణి అంటే......ఆ చచ్చినపిల్ల ...ప్రీతి పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చింది నువ్వే కదా, చెప్పు” అంటూ ఆమె భుజాలమీద చేతులేసి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆమెను రక్షించే ప్రయత్నంల్లో రాజీవ్ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. రెప్పపాటుకాలంలో అనూహ్యంగా ఓ పెద్ద శబ్దం. గన్ పేలుళ్ళు, బస్సు అద్దాలు, లైట్లను రాళ్ళతో కొట్టి పగలకొట్టారు. ఆ చిమ్మ చీకటిలో దారుణమైన శబ్దం విని అమ్మమ్మ హడిలిపోయింది. తన కూతురు ధరణి, అల్లుడు రాజీవ్, మనవరాలిని నేను ఏమైపోయామో అన్న షాక్ లోకి వెళ్ళిపోయింది. మాటతో పాటు, ఓ ఏడాది జ్ఞాపకాన్ని కూడా కోల్పోయింది. మళ్ళా అలాంటి శబ్దాల పేలుడుతో కంపించి, మనలోకి వచ్చింది. అంటూ ఆగింది అరణి.
సాక్ష్యం ఇవ్వాలనుకున్న ఆ డాక్టరమ్మ ధరణమ్మ, కేసు వాదించే లాయర్బాబు, రాజీవ్ లను ఆ దుర్మార్గులు పొట్టనెట్టుకున్నారు. వాళ్ళ పాపం ఊరికేపోదు, కుళ్ళిచత్తారు. అంటూ చెడుమీద నిరసన చూపించారంతా. మౌనంగా ఉండిపోయిన అరణి కేసి చూస్తూ,
“ఏరే, మీ అమ్మానాన్న, మాస్టారు కనిపించరే” అంది సోమిదేవమ్మ. వాళ్ళని, శాంతి ఆంటి వేరే కారులో తీసుకెళ్లింది. అంది. పాపం, అమ్మమ్మని దక్కించుకోటానికి ఆ పిల్ల సమయానుకూలంగా అబద్దం చెపుతోంది అనుకున్నారు.
అరణి నిజమే చెప్పింది కానీ వాళ్ళు నిజం అనుకోవటం లేదు. ఆమె ఆలోచనలలో గతం తాలూకు నీలినీడలు కదలాడాయి.
అరణి, ప్రీతి, ఫణి సత్యం మాస్టర్ దగ్గర ప్రవేటుకు వెళ్ళేవారు. ముగ్గురూ పోటిగా చదివేవాళ్ళు. ఫణి చాల అందంగా ఉండేవాడు. మీ ఇద్దరంటె నాకు చాల ఇష్టం మరి మీకు? అని అడిగేవాడు. నాకూ అంతే, మీ ఇద్దరంటే ఇష్టం. అని ఒకేసారి ప్రీతి అరణి అనేవారు.
ఒకరోజు ప్రీతివాళ్ళ ఇంట్లో, లాన్ లో కూర్చుని చదువుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు టెన్త్ క్లాసు. ‘ఆంటిలా నేను డాక్టర్ అవుతా అంది’ ప్రీతి. ‘నేను శాంతి ఆంటీలా పోలీస్ ఆఫీసర్ అవుతా.’ అంది అరణి.
నువ్వు అని ఫణినడిగితె మా నాన్నలా బిజినెస్ చేస్తానన్నాడు. లాన్లో కూర్చుని వీళ్ళ మాటలు వింటున్న ప్రీతి తండ్రి శరత్, ముందు చదువుమీద ఫోకస్ పెట్టాలి. ఆ తరవాత అన్నీ అన్నాడు.
“అలాగే అంకుల్, ఈ రోజు సినిమా కు వెడతాం మేం ముగ్గురం” అన్నాడు ఫణి.
“రేపు పరిక్ష పెట్టుకుని సినిమాలేంటి శ్రద్ధగా చదువుకోండి” అన్నాడు శరత్.
“మీనాన్నఇంతే ఏదడిగినా నోఅంటాడు, నాన్నఅంటే మా నాన్నలా ఉండాలి. ఏదడిగినా నో అనడు, పదండి పోదాం” అన్నాడు ఫణి.
“ఈ మధ్య నీ మాటలు బాగుండటం లేదు. మేం నీతో రాము” అన్నారు, ప్రీతి అరణి.
“వీడు వద్దన్నాడనేగా మీరు రావటం లేదు” అంటూ అంటుమొక్కల మధ్య ఉన్న గునపం తీసి శరత్ నెత్తి మీద కొట్టాడు. శరత్ స్పృహ తప్పి రక్తం మడుగులో కొట్టుకుంటుంటే ప్రీతి, అరణి ‘దుర్మార్గుడా చంపేసావురా’ అంటూ ఏడుస్తూనే ‘ముందు అంకుల్నిహాస్పటల్ కు తీసుకెళ్దాం. ఆ తరవాత వీడి సంగతి శాంతి ఆంటీకి చెపుదాం’ అంది అరణి.
“హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి వీల్లేదు, వీడు బ్రతికితే నేను చావాలి” అంటూ ఇద్దరిని ఒక్కతోపు తోసాడు, “మీరు నోరుమూసుకోండి. మీరు నా మీద చెపితె మీ ఇద్దరే అంకుల్ని చంపేసారని అందర్ని నమ్మిస్తా. నేను కొట్టానని ఎవరికన్నా చెపితే మీ అమ్మానాన్నని, వీళ్ళ అమ్మని కూడ చంపేస్తా” అంటు బెదిరించాడు.
ఆ రోజు ధైర్యం చేసుంటే, నిజం చెప్పి ఉంటె, అంకుల్ బ్రతికేవారేమో. వాడిని జైలులో పెడితె ప్రీతి మానప్రాణాలు నిలిచేవి. భర్తని, కూతురుని పోగొట్టుకున్న ఆంటికి న్యాయం జరగలేదు. చట్టం, న్యాయం అమ్ముడు పోవటంతో, సంఘంలో శాంతిభద్రతలు నిలపవలసిన పోలీసు ఆఫీసర్ అజ్ఞాతంలో ఉండి సంఘ విద్రోహులను, హతమారుస్తోంది.
ఆ...రోజు సాక్షులను చంపటానికి వచ్చిన గూండాలను హతమార్చి, సాక్షులను రక్షించింది. ఆ చీకటిలో అమ్మనాన్నలను తప్పించింది.
“అమ్మమ్మను జాగ్రత్తగా చూసుకో, ఓ ఏడాదిలోగా రాక్షస సంహరణ పూర్తి అవుతుంది. మా ముగ్గురిని కోటేశ్వర్ మనుషులు బంధించారని, డబ్బుల లెక్కలు తేలక గొడవపడి మమ్ము వదిలేసారని చెపుతాం. ఆ తరువాత మనమిద్దరం చేయి కలిపి, చట్టాన్నికాపాడుదాం. ఆ తరుణం కోసమే వేచి ఉందాం అరణి" అన్న శాంతి మాటలు ఆమె చెవులలో ధ్వనిస్తున్నాయి.
‘ఏడాది "అజ్ఞాతం" సమాప్తం అయింది. వైద్యం, న్యాయం, చట్టం, వెలుగులోకి రావాలి, అందరికీ అందుబాటులో వుండాలి. జనుల యోగ క్షేమాలకు అడపాతడపా "అజ్ఞాతము” అనివార్యమే’ అనుకుంది అరణి.