ఇది 1925వ సంవత్సరం నాటి ఒక కుటుంబ కథ. శ్రీ రామాంజనేయ శర్మ గారికి భార్యా, ఐదుగురు మగ సంతానం ఇద్దరు ఆడ సంతానం ఉండేవారు. ఆయన ఒక బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. అవి స్వతంత్ర సమరం జరుగుతున్న రోజులు. గాంధీ గారి పిలుపుతో అందరూ నూలు వడికేవారు. నేత దుస్తులు ధరించే వారు. అంతవరకే వాళ్ల ఇంట్లో వారు ఆచరించేవారు. పెద్ద పిల్లలకు పెళ్లిళ్లు చేసి కోడళ్లను తెచ్చుకున్నారు. 20 ఏళ్ల లోపలే ఉద్యోగంలో పెట్టించి వేరు కాపురాలు పెట్టించారు.
ఇప్పుడు మన అసలు హీరో ప్రభాకర్, రామాంజనేయులుగారి మూడవ పుత్ర రత్నం. పది వసంతాలకే స్వాతంత్ర్య సమరం అంటే ఆసక్తి పెంచుకున్నాడు. ఒకసారి వాళ్ల ఊరిలో జరిగిన సభకు హాజరై వాళ్ళను అనుసరిస్తూ ఆ ఊరేగింపుతో ఎటో వెళ్లి నాలుగు రోజుల తరువాత మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో ఇల్లు చేరాడు. ఆ నాలుగు రోజులు తను విన్నవి తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు నెల రోజులు చెప్పాడు. తండ్రి అతనికి బుద్ధి చెప్పి మళ్లీ పాఠశాలకు పంపాడు. కొడుకు దారి తప్పుతాడని స్నేహితుని కూతురు ఎనిమిదేండ్ల సుశీలతో అతని పదమూడవ ఏట వివాహం జరిపించాడు. సుగుణవతి, శాంత స్వభావురాలైన సుశీల అతని మాటలు శ్రద్ధగా వినేది. అత్తగారైన రుక్మిణమ్మ గారికి చేదోడు వాదోడుగా సాయపడుతూ, ఆడపడుచులను, మరుదులను తన తోబుట్టువులలాగా చూసుకొంటూ ఇంట్లో కలిసిపోయింది. ప్రభాకర్ ని తండ్రి షావుకారు వద్ద పనిలో పెట్టించాడు. సుశీల తన పద్నాల్గవ ఏట కొడుకుని, పదహారవ ఏట కూతురిని కన్నది. ఆపై ప్రభాకర్ ఇల్లు వదిలి విప్లవకారులలో కలవడానికి షావుకారు ఇంట్లో చేతికందిన సొమ్ము తీసుకుని వెళ్లిపోయాడు. అలా వెళ్లిన ప్రభుకి విప్లవకారులను కలవడానికి సంవత్సర కాలం పట్టింది. తెచ్చుకున్న సొమ్ము అయిపోవడంతో ఎన్నో కూలి పనులు చేస్తూ సత్రాలలో తల దాచుకుంటూ గడిపాడు. ఎట్టకేలకు ఒక విప్లవకారుల దళంలో చేరగలిగాడు. ఆంగ్లేయులను ఎదిరించటానికి వారు శిక్షణ రహస్యంగా ఇచ్చేవారు. ఒకానొకరోజు వీరి శిబిరాన్ని సైనికులు చుట్టుముట్టారు. వారు జరిపిన కాల్పులలో ప్రభుకి తూటా కాలిలో దిగింది. అతను పడిపోవటంతో పట్టుకుని కారాగారంలో బంధించారు. తుపాకులతో పట్టుబడ్డవారిని వేరే కారాగారానికి తీసుకుని పోయారు. ఎన్నో రోజులు సంరక్షణ లేక కుడి కాలు నుంచి చెడు వాసన, విపరీతమైన బాధ, తిండి సహించక మనిషి శరీరం క్షీణించింది. పడినప్పుడు బెసగిన ఎడమ చేయి మణికట్టు వద్ద వంకర పోయింది. ఎట్టకేలకు అతని కాలు మోకాటి వరకు తొలగించి కట్టు కట్టారు. అక్కడ షావుకారు ఫిర్యాదు చేయడంతో రామాంజనేయులు గారిని ప్రభాకర్ కి బదులుగా చెరసాలలో వేశారు. కొడుకు మీద, భర్త మీద బెంగతో రుక్మిణమ్మ మంచం పట్టారు. వారి చిన్న కొడుకులకు ఎవరు పని యివ్వక పోవడంతో ఇంటి బరువు బాధ్యతలు సుశీల పైనే పడ్డాయి. పెద్ద మరదలు సాయంతో పాలు పిడకలు అమ్మి, ఇంటి పనులలో సాయానికి పోయి, పిల్లలకు పూల జడలు కుట్టి, తనకు చేతనైన పని దొరికినవి దొరికినట్టు అంది పుచ్చుకొని చేస్తూ ఇల్లు నెట్టుకు వచ్చేది. ఈమె పనితనం తెలియడంతో ఊరివారు అవసరానికి పిలిపించుకుని చేతనైన సాయం చేసేవారు. అంత పనిలోనూ తన మామగారిని ఉంచిన చెరసాలకు పులిహోర పొట్లాలు కట్టి ఖైదీలకు పెట్టమని ఇచ్చేది. జైలు అధికారి ఆ ఊరి వాడే అవడంతో ఆమెకు ఆ ఖైదీలకు ఆహారం వండే పని ఇచ్చి సాయం చేశాడు. తన భర్త ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో అన్న బెంగతో ఇంటి ముందుకు ఎవరు ఆకలితో వచ్చినా తన వంతు వారికి ఇచ్చి వారి ఆకలి తీర్చేది. అది ఆ ఇంట్లో వారికి ఒక అలవాటుగా మారి ఎవరు ఇంటి ముందుకు వచ్చి ఆకలన్నా ఇంటిలోని వారిలో ఎవరో ఒకరు వారి భాగం పంచే వారు. అలా కాదని రోజు పులిహోర, మజ్జిగ గిన్నె బయటి వారికి చేసి ఉంచి అక్కడ ఒక దిబ్బిన ఉంచింది. ఉన్నవారు వారికి తోచినది వేసేవారు. ఆ సొమ్ముతో సరుకులు కొని అప్పడాలు, తినుబండారాలు చేసి అమ్మేవారు. నెమ్మదిగా వారి అన్నదానం పెరిగింది. పెళ్లిళ్లకు వంటలు చేసే వారు. ఇంటి పద్దతి నచ్చి ఆడపడుచులను అడిగి మరీ పెళ్లిళ్లు చేసుకుని తీసుకు పోయారు. మరుదులకు పెళ్లిళ్లు చేసి తోడికోడళ్లను తెచ్చుకొని వారి సాయంతో ఇల్లు చక్కబెట్టుకొనేది. అత్తగారు బెంగతో బాధపడుతుంటే మరుదులతో అర్జీ పెట్టించి పైకం కట్టి మామగారిని విడిపించుకొచ్చారు. కానీ ఇన్నిరోజుల కారాగారవాసంలో మామగారి ఆరోగ్యం దెబ్బతిని ఒక ఆరునెలల వ్యవధితో ఇద్దరూ కన్ను మూసారు. అది తెలుసుకొని వచ్చిన బావగార్లు, ఇంటిని నిలబెట్టింది నువ్వే కనుక అందులో మాకేమీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. పక్క స్థలంలో పందిరి వేసి అత్తగారు మామగారి పటాలుంచి దానిని అన్నదాన సత్రంగా తయారు చేసింది. ఊరిలోని మోతుబారులు ధాన్యం బస్తాలు దానంగా పంపి సాయపడేవారు. ఉన్న అర ఎకరం పొలంలో కూరలు పండించి నిర్విరామంగా అన్నదానం చేసేవారు. ఒకసారి వారి ఊరిలోఒక సభ వాళ్ల ఇంటికి ఎదురుగానే కావడంతో కుండలు ఏర్పాటు చేయించి పిల్లలతో అందరికీ మంచి నీరు అందించి సాయం చేయించింది. ఎక్కడో ఆమెకు భర్త వస్తాడేమోనన్న ఆశ ఉందని ఇంట్లో వారంతా ఆమె చెప్పినట్లు చేసేవారు. సైనికులు రావటం తుపాకులు పేల్చి చెల్లా చెదురు చేయడంతో జనమంతా కాకవికలైపోయారు. ముగ్గురికి తుపాకీ గుండ్లు తగిలి తీవ్రంగా గాయపడి ఉండటంతో వారిని రహస్యంగా ఇంటికి తెచ్చి, సపర్యలు చేశారు. రక్షక భటులు తెలిసిన వారవటంతో వారిని గాయాలు నెమ్మదించేదాక వీరి ఇంట్లో ఉంచి కారాగారానికి తరలించారు. ఈ విషయం జరిగిన నాటినుంచి సుశీలకు ఒక విధమైన బెంగ పట్టుకుని, ప్రభు ఇంటికి వస్తాడన్న ఆశ నశించింది. ఆమె కుమార్తె రాజ్యలక్ష్మికి పొరుగూరు గుమాస్తగిరి చేసుకునే కుర్రాడితో వివాహం జరిగింది. కొడుకు ఇంటి పనులు బాబాయిలతో కలిసి చూసుకొంటూ చదువుకునేవాడు. కాలం గడుస్తూ ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చింది. ప్రజలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వీళ్ళ ఇంట్లో ఏ మార్పు లేదు. ఎప్పటిలానే రోజులు గడుస్తున్నాయి. సుశీల ఎదురుచూస్తూనే ఉంది. ఒకరోజు ఒక అవిటి మనిషి గుమ్మం ముందు స్పృహతప్పి పడిపోయి ఉన్నాడని తెలిసి తెప్పించి భోజనం పెట్టి అతనిని ఆదరించారు. రెండు రోజుల తరువాత అతని మాటల ద్వారా అతను ఆ ఊరి వ్యక్తేనని తెలిసింది. అప్పుడు అతనిని తేరి పార చూసిన సుశీలకు అతనిలో ప్రభు పోలికలు కనిపించాయి. పెద్ద మరిదిని పిలిచి తన అనుమానం వ్యక్తం చేసింది. అతను ఆ మనిషికి స్నాన సంస్కారాలు చేయించి, అతని విషయాలు సేకరించాడు. ఆయనే ప్రభాకర్ అని ధృవపరుచుకొని వదినగారికి విషయం తెలియ చేశాడు. ప్రభాకర్ కూడా కోలుకొని తమ్ముళ్లని ఇంట్లో వాళ్ళని వాళ్ళని గుర్తు పట్టాడు. తమ్ముళ్ల ద్వారా ఇంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. కూతురు అల్లుడు, చెల్లెళ్లు బావలు, అన్నలు వదినలు ఒకరొకరుగా వచ్చి చూసి వెళ్లారు. అందరి నోట సుశీల మాటే, అంత గొప్పది ఇంత గొప్పది, ఇల్లంతా చక్కబెట్టింది అని. ఇంట్లో వారే కాదు ఊరిలో ఎవరు కలిసినా ఆమె సౌశీల్యతా, నేర్పరితనం గురించే. ఆమె అది చేసింది ఇది చేసింది అని చెప్పేవారే. తమ్ముళ్లు మరదళ్ళు వాళ్ల పిల్లలు కూడా ఆమెని గౌరవంగా చూడటం చూసి ఆశ్చర్య పోయాడు. తన ఊహలో దీన స్థితిలో ఉన్న భార్య పిల్లలు ఇక్కడ లేరు. వారికి ఇక్కడ ఎంతో గౌరవం వుందని తెలుస్తోంది. ఏదో సాధిద్దామని వెళ్లి ఏమీ చేయలేని తనకి, ఉన్నంతలో తనకు చేతైనంత సాయపడుతూ పరిస్థితులు చక్కబెట్టిన సుశీలకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించి బాధ పడ్డాడు. సుశీలను పలకరించాలని అభినందించాలని చాలా మనసు పీకుతోంది కాని ఆమెకు తను చేసిన అన్యాయానికి జంకాడు. అటు సుశీల మనస్థితి వేరుగా ఉంది. మనసంతా ప్రశాంతంగా ఉంది. గుండెల మీద ఉన్న బరువంతా ఎవరో తీసినట్లు మాయమైంది. అలాగని ఆనందంతో మనసు గంతులూ వెయ్యట్లేదు. కూతురు వచ్చి తల్లి దగ్గర కూర్చుని అడిగింది. సంతోషంగా ఉందా అమ్మా? నాన్న వచ్చారుగా అని. నవ్వి, నీకు సంతోషంగా ఉందా అని అడిగింది. ‘నాకు ఆయన తెలిస్తే కదా? నేను చిన్నగా ఉన్నపుడే వెళ్లిపోయారు. పెళ్ళై నేను వెళ్లి పోయాక వచ్చారు’ అని అనే కూతురుతో ‘నాకు ఆయనతో పరిచయం 6 నుంచి ఏడు సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆయన బాధ్యతలు ఆయనకు సక్రమంగా పూర్తి చేసి అప్పచెప్పేస్తున్న తృప్తి మాత్రమే ఉంది’ అని చెప్పింది. అతని అవిటి తనానికి ఆసరా కోసం మరుదులతో చెప్పి చెక్కతో ఆదరువు తయారు చేయించింది. అతనికి వసారాలో గది ఏర్పాటు చేయించి అన్ని సదుపాయాలు అమర్చింది. గత కొంత కాలంగా మరుదులు, కొడుకు అన్ని పనులూ చూసుకుంటున్నారు. ఆమె పై పై పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వంటా వార్పు లో సాయం చేయటం, పెరటి మొక్కల పెంపకం వంటి పనులు మాత్రమే చేసుకుంటూ గడుపుతోంది. సాయంత్రం గుళ్లో పంతులుగారు చెప్పే పురాణ కాలక్షేపానికి వెళ్లి వస్తుంది. అక్కడే ఎవరైనా వారి సాధన బాధకాలు చెబితే తోచిన సలహాలు చెబుతుంది. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జెండా ఎగుర వేయమని ఊరి పెద్దలు సుశీలమ్మను పిలిచారు. ఇంటి ముందే అవడంతో కాదనలేక పోయింది. ఊరంతా పండుగ వాతావరణంతో సందడిగా ఉంది. సంగతి తెలుసుకున్న ఆడపడుచులు, కూతురు, బావగార్లు కుటుంబాలతో సహా వచ్చారు. ఖద్దరు చీరతో వేలుముడి కొప్పుతో సాదా సీదాగా వెళ్లిన సుశీల జండాను ఆవిష్కరించి “భారతమాతకి జై, భారతమాతకు జై, భారత్ “ అంటూ నేలకి ఒదిగి పోయింది. అంతటా ఒక్క క్షణం నిశ్శబ్దం. ప్రేక్షకులలో నుంచి ఒక వైద్యుడు వచ్చి నాడి పట్టి చూసి ఆమె మరణాన్ని ధ్రువ పరిచాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా దుఃఖమయమై పోయింది. ఆమెను ఇంటి ముందు పడుకోపెట్టారు. గుంపులు గుంపులుగా జనం చుట్టూ పక్కల నాలుగు ఊళ్ల నుంచి వచ్చారు. పెద్ద ఊరేగింపుతో ఆమెను శ్మశాన వాటికకు సాగనంపారు. ఆ వైభవం చూసిన ప్రభాకర్ తన అర్ధాంగిగా ఆమెను తను ఆదరించలేక పోయినందుకు, ఆమెను అశ్రద్ధ చేసినందుకు పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు. కొడుకు ఆమె చితికి నిప్పంటిస్తుంటే ఏమీ కానీ వాడిలా దూరంనుంచే వీడ్కోలు పలికాడు. తనకు ఇంకొక జన్మ ఉంటే ఆ ఇల్లాలితో కలిసి ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుడికి నమస్కరించుకున్నాడు. కర్మ కాండలు ముగిసి పోయాక తన తమ్ముళ్లు తనకు అన్ని అప్ప చెప్పి వెళ్లి పోతుంటే, కరువు తీరా ఏడ్చి, ఆమె ఆదర్శాలు, ఆశయాలు మీకు తెలిసినంతగా నాకు తెలియవు కాబట్టి మీరు ఇక్కడే వుంటూ ఈ పద్ధతి మారకుండా చూసుకొని ఆమె మనస్సుకు శాంతి కలిగించమని ప్రాధేయపడ్డాడు. అందుకు అంగీకరించి అందరూ కలిసి ఆ కుటుంబ రధాన్ని కొనసాగించారు.