Menu Close
వీక్షణం-167వ సాహితీ సమావేశం
- ప్రసాదరావు రామాయణం -
vikshanam-167

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 167 వ అంతర్జాల సమావేశం జూలై 17, 2026 నాడు అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా గీతామాధవిగారి స్వాగత వచనాలతో ఈ రోజు సభ ఆరంభమైంది.

వారి తొలిపలుకులలో ఈరోజు స్వీయ పరిచయ కార్యక్రమ ప్రాసంగీకులు శ్రీ మౌనశ్రీ మల్లిక్, డా.కందేపి రాణి ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానించారు. గత మూడు సమావేశాలుగా కవుల స్వీయపరిచయం అనే నూతన ప్రక్రియ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈరోజు రెండు విభిన్నమైన జీవన నేపథ్యాలనుండి వచ్చిన కవుల ప్రసంగం అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉంది.

డా. కందేపి రాణి ప్రసాద్ గారి జీవన నేపథ్యం వడ్డించిన విస్తరి. వారి తల్లిదండ్రులు, పూర్వీకులు సాహిత్యానికీ సేవ చేసిన వారు. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న శ్రీ రావూరి భరద్వాజ, విశ్వనాథ వారితో వారి కుటుంబానికి బాగా పరిచయం. రాణి గారి భర్త డాక్టర్ గారు, ఈమె హాస్పిటల్ అడ్మిన్ కావడం చేత చిన్నపిల్లల అనారోగ్యాలు, వాటి నివారణపై అనేక కవితలు వ్రాశారు. దాదాపుగా అరవై కవితా సంపుటులను ప్రచురించారు.

రాణి ప్రసాద్ గారు వెలుగులోంచి దివిటీ పట్టుకుని వెలుపలికి వస్తే, శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు చీకటిలోనుండి సాహిత్య దివిటీ ఎగురవేశారు. మల్లిక్ గారిది నిరుపేద కుటుంబం. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అందరూ బడికి పోతుంటే తనూ బడికి వెళ్లారు. అత్తెసరు మార్కులతో పాస్ అయ్యారు. అలాగే పట్టుదలతో మాస్టర్స్ చేశారు. లైబ్రరీకి వెళ్ళి విస్తృతంగా పుస్తకాలు చదివారు. తాను మాత్రం ఎందుకు కవితలు వ్రాయకూడదనే భావంతో కవితలు మొదలెట్టారు. వ్రాసిన ప్రతి కవితకూ ఏదో ఒక బహుమతి రావడంతో తన సాహితీ ప్రయాణాన్ని మొదలెట్టారు.

కొందరు పెద్దలు 'సినిమాలలో ప్రయత్నించరాదా' అన్నా కూడా చాలా కాలం చిన్న చిన్న పనులు చేస్తూ ఉదరపోషణ చేసుకుంటూ సినిమాపాటలు వ్రాయడానికి అవసరమైన విషయ, వస్తు సేకరణ చేసిన అనంతరమే సినిమాలలో ప్రవేశించి షుమారు 1200 పాటలు వ్రాశారు. టీవీ సీరియళ్లలో వ్రాసిన కవితలు లెక్కే లేదు.

కేవలం సినిమా పాటలేకాక "దిగంబర" "గరళం" లాంటి కొన్ని పుస్తకాలు వ్రాసి సాహిత్యానికి దగ్గరగానే వున్నానని తెలిపారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి వీరొక గొప్ప ఉదాహరణ. వారి ప్రసంగానికి ప్రేక్షకులు చప్పట్లు చరిచారు.

తరువాత వారిరువురి ప్రసంగాలపై సభికులు తమ స్పందనలను తెలియజేసారు. తమ స్పందనను తెలియజేస్తూ ఎంత బిజీగా ఉన్నా కొంత సమయమైనా సామాజిక సాహిత్యానికి కేటాయించవలసిందిగా ప్రసాదరావు రామాయణం విజ్ఞప్తి చేసారు. తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, శ్రీ బిటవరం శ్రీమన్నారాయణగారి ద్వంద్వ నిర్వహణలో కవిసమ్మేళనం ఆరంభమైంది.

ఆనవాయితీగా తొలిగా గీతామాధవి గారు "కలల కలకల" అనే శీర్షికతో అద్భుతమైన భావుకత నింపిన కవిత చదివారు. తరువాత పరిమి వెంకట సత్యమూర్తి గారు గంధర్వ లోకానికి గానకోకిల జానకమ్మ అంటూ దివంగత గాయనిపై మంచి కవిత చదివారు. తరువాత శ్రీ మల్లిక్ గారు 'నిన్ను పూజించాలి' అంటూ చదివిన భావకవిత అందరినీ ఆకట్టుకుంది.

డా.రాణి ప్రసాద్ గారు మూత్రపిండం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ చదివిన కవిత విజ్ఞాన స్పోరకంగా ఉంది. కొత్తూరు వెంకట్ గారు ఉపనయనాన్ని గురించి ఒక పాట పాడారు. ఆదిగారి మింగలేక మొండి శివుడు కవిత ఒక సెటైర్.

అయ్యలరాజు సోమయాజులు ప్రసాద్ గారు రాజస్థాన్లో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై చదివిన కవిత బావుంది. చీదెళ్ళ సీతాలక్ష్మిగారు కంటిరెప్పపై పద్యాలు చదివారు. లలితా చండీగారు వానలమ్మ అని కవిత చదవగా, వైరాగ్యం ప్రభాకర్ గారు ఒక ట్రాన్స్ జండర్ మనో వేదనను తన కవితలో చూపారు.

అవధానం అమృతవల్లి గారు ప్రపంచమే ఒక వేదిక అనగా, ఆనం ఆశ్రితారెడ్డిగారు అక్షరాల అమరిక గురించి చెప్పారు. భానుప్రియగారు వావివరసలు మరిచిన అక్రమ సంబంధాలపై కవిత చదవగా, కోదాటి అరుణగారు పూరీ జగన్నాథుని రథయాత్రను కుటుంబ సంబంధాలతో సమన్వయించి చదివిన కవిత బావుంది.

రామాయణం ప్రసాదరావు అనే నేను కృళ్ళిన ఈ సమాజాన్ని వదలి ప్రకృతి వడిలో సేదతీరుతాను అను కవిత చదివాను. ఉప్పలపాటి వెంకట రత్నం గారు చిగురించే కొమ్మలు ఎప్పుడూ తల్లులే అన్నారు. హరితంలేని సృష్టి ఏముంటుంది?

శ్రీమతి పరాంకుశం కృష్ణవేణిగారు మోదుగ పూలు కవిత అందరినీ అలరించింది. శ్రీ బంతికట్ల నాగేశ్వరరావు గారు తాను వ్రాసిన రామాయణంలోని కొన్ని పద్యాలను చదివి వినిపించారు.

డా.బృందగారు గాయని జానకమ్మపై ఒక పాట శ్రావ్యంగా పాడారు. బుక్కపట్నం రమాదేవిగారు నిచ్చెన మెట్లు అనే కవిత చదవగా భోగెల ఉమామహేశ్వరరావుగారు వృద్ధుల మనోగతాన్ని వివరించారు. మేడిశెట్టి యోగేశ్వరరావుగారు జడపై చెప్పిన కవిత ప్రాసలతో, లయబద్ధంగా ఉండినది. బలుసాని వనజ గారు మేఘమా అంటూ ఆలపించినపాట మధురం! దేవులపల్లి పద్మజ గారు శ్రీ శ్రీ గురించి కవిత చదివారు.

కాదంబరి కృష్ణ ప్రసాద్ గారు జానకమ్మ గాత్ర వైభవం గురించి కవిత చదివారు. కాకర్ల రమణయ్య పల్లె జీవనం గురించి చదవగా, బిటవరం శ్రీమన్నారాయణగారు పరమపూజ్యం బడిజీవితం అంటూ అద్భుతంగా చదివారు.

చివరగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ఎందుకు కవిత్వం వ్రాస్తున్నావు అంటూ తన గంభీరమైన స్వరంతో అందరినీ ఆకట్టుకొన్నారు.

మూడు గంటల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన సభ గీతగారి వందన సమర్పణ తో ముగిసింది. ఈ 167వ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

********

Posted in August 2026, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *