ఆంధ్రా మిల్టన్ "కీ.శే. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు”
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పేరు చెబితే మొదటగా గుర్తు వచ్చేది ఆయన రచించిన గణపతి అనే హాస్య నవల. ఈ నవల బహుళ ప్రచారం పొందింది. ఆకాశవాణిలో శ్రవ్య నాటికగా పలుమార్లు ప్రసారమైంది. హాస్యానికి చిరునామాగా నేటికీ గుర్తింపు పొందింది. తెలుగు సాహిత్యంలో హాస్యత్రయం గా పేరుగాంచిన చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు, మొక్కపాటి నరసింహం గారు, పానుగంటి నరసింహం గార్లలో అగ్రగణ్యుడు చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు. చిలకమర్తి ఆశువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు పద్యం, స్వతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది. గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథ లోని పలు భాగాలు విద్యార్థులకు తెలుగు వాచకంలో పాఠంగా నిర్దేశించారు. పాక్షికంగా అంధుడైన చిలకమర్తివారు కళ్ళు సరిగా ఉన్నవారు సైతం సాధించని పలు మహాకార్యాలు సాధించారు. అందువల్ల ఆయనను "ఆంధ్రా మిల్టన్" గా వ్యవహరించేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ సాహిత్యములో మిల్టన్ పాక్షికంగా అంధుడైనప్పటికీ పేరడైజ్ లాస్ట్, పేరడైజ్ రిగైనెడ్ అనే అద్బుతమైన కావ్యాలను రచించాడు.
చిలకమర్తి నరసింహం గారు కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సు లో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. లక్ష్మీనరసింహం గారు 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం లోని ఖండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాల గా మారింది. ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది. 1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్ర విజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు. 30వ ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపునకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు.
1908లో ఒక ప్రెస్ స్థాపించారు. లక్ష్మీ నరసింహం గారు మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికే దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు 1916 లో మనోరమ అనే పత్రిక స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేసారు. అంధుడైనప్పటికి చిలకమర్తి వారి దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ లాండ్ ఎంతగానో ప్రశంసించారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.
కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశారు. చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు. కలకత్తా లోని బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి గారు నేటివ్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించారు. ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు. భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు. 21 అధ్యాయాల్లో రాసిన ఆయన స్వీయ చరిత్రములో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం. గ్రంథరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నత పాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్ యాత్ర, హితకారిణీ సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – ఇవన్నీ సవివరంగా రాశారు. చిలకమర్తి గారు ఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించారు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశారు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకంలో (తరవాతి కాలంలో ముఖ్యమంత్రి అయిన) టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుడి వేషం వేసేవారు.
ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం గారు ఎన్నో రచనలు చేశారు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తర్వాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించారు. ఆయన రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశారు. ఇంకా అనేక రచనలు చేశారు. లక్ష్మీ నరసింహం గారు 1946, జూన్ 17 న పరమపదించారు కానీ అయన రచనలు తెలుగు సాహిత్యములో మైలు రాళ్లుగా నిలిచిపోయాయి.