కదంబం - సాహిత్యకుసుమం
ఓ కవిశేఖరా..!
అక్షర సేనలని నడిపే
అసమాన సేనానివి నీవు
పదాలకు పదును పెంచే
పరుశురాముడివి నీవు
నీ భావాల వీచికలు
మౌనశంఖం నుండి వెలువడే
ఓం కారాలై ప్రతిధ్వనించగా...
అక్షరాల ఆకాశంలో
వెలిగే ధ్రువతారవు నీవు
నీ ఊహల ఉప్పెనలు...
దిగంతాలను తాకే
జ్ఞానగంగలై ఉరకలెత్తగా,
కవితా వనంలో పూసిన
పారిజాత కుసుమానివి నీవు
ఓ కవిశేఖరా..!
నీ భావాల మెరుపులు
మేఘమాలికలై
చిరుజల్లులై కురియగా
అక్షరాల మాగాణిలో
పండే పచ్చని పంటవు నీవు
సాహిత్య గగనాన విహరించే
స్వేచ్ఛా విహంగానివి నీవు
అలల తాకిడికి కదలని
పర్వత శిఖరానివి నీవు
పదాల వెల్లువలో గలగల
ప్రవహించే అక్షర గంగవు నీవు
ఓ కవి శేఖరా..!
నీ కలం నుండి జాలువారే
ప్రతి అక్షరం ఒక అగ్నిపర్వతం
సాహిత్య క్షేత్రంలో నీవు
సాటిలేని సాహిత్య కృషీవలుడివి
నీ కలాన్ని కరవాలంలా మార్చి
సామాజిక శత్రువుల వెన్నులో
వణుకు పుట్టిస్తావు, మట్టి కరిపిస్తావు
అక్షరాల ఆకలి మంటలు ఆర్పే
పచ్చని పంటవు నీవు, వంటవు నీవు
బంగారు భావాలతో లోకానికి
అక్షర వెలుగుల్ని పంచే
బాల భాస్కరుడివి నీవు
ఓ కవిశేఖరా..!
నీ ప్రతి అడుగు ఒక అక్షర యజ్ఞం!
నీవు అధిరోహిస్తావు అక్షర సింహాసనం
సకల కవి లోకానికి నీవు ఒక దిక్సూచివి
సరిలేరు నీకెవ్వరు ఇలలో ఓ కవిశేఖరా..!