? ప్రశ్నాకృతం -- గంగిశెట్టి ల.నా.
నేను ప్రశ్నాకృతిని...
నిలువునా లేచి నిదురిస్తున్న మిన్నాగుని...
నా తలలో విప్పుకొన్న పడగ
నాకే అగుపడుతోంది
నుదుట మాటి మాటికీ
నాలుక చాస్తూ దేన్నో వెర్రిగా వెదుకుతోంది
నడి నెత్తిన మణి
సౌరమండలాన్నే అన్వేషిస్తోంది
ఎందుకు సగం చీకటై పోతావని సూర్యచంద్రుల్ని కళ్ళుగా పెట్టుకొని ప్రశ్నిస్తోంది
సకల భూగోళాన్ని మూలబిందువు చేసుకొని
స్వాధిష్టమై నిటారుగా లేచి వెన్ను నిలిపిన క్రొన్నాగు
శిరసు వంచి నిత్యం శేషప్రశ్నగా మారిపోతోంది
మిన్నాకృతుల ప్రాపునర్థిస్తూ ప్రశ్నార్థకమై మిగిలిపోతోంది....
❓
నేను నిత్య ప్రశ్నాకృతిని
ప్రశ్న కాంతిలో పురోగతి వెదుక్కొంటున్న మర్త్యాకృతిని
కలవో లేవొ -- బులుసువేంకటేశ్వర్లు
కలవో లేవొ యుగాంత కాలములు మా కన్నీరు మున్నీరుగా కలగం జొచ్చిన యీ ముహూర్తములె పో గాఢ వ్యధo గూర్చు ,వి హ్వలగోపీజన వేదనానుసర నా దాంకూరముల్ ఘోషలై తలసూపన్ ఇటు ఘోష నామమది సా ర్ధక్యమ్ము గా జేసితే!!
ఆమె ఓ ఆదిమ గీతం: --- డా. రవూఫ్
అప్పటి చిర్నవ్వుల
నక్షత్ర కాంతి గుచ్ఛమే కదా తను !
ఆ నక్షత్రాలే కదా
ఇప్పటికీ నా కవిత్వాక్షరాలై
పలుకుతున్నాయి !
నాకు చేరువగా వచ్చి ....
అలై ముంచెత్తి వెనక్కి మళ్ళిన
ఆమె అడుగుల సవ్వడి
ఇప్పటికీ వినపడుతూనే ఉంది.
నా నెత్తుటి ప్రవాహంలో ఎడ్రినాలిన్ పరవళ్ళ గగుర్పాటే తను!
హృదయంలో ఉప్పొంగిన
అప్రతిహత సంస్పందనల అలజడే తను!
కలై ఒలికి కన్నీటి తెరై కదలాడే తను ;
పదిలపడిన ఎప్పటి జ్ఞాపకమో అనుకున్నాను కానీ,
నేను పుట్టే నాటికే
నాలో మిళితమై పలుకుతోన్న
ఆదిమ గీతమని ....
అనాది జీవితమని ఇప్పుడు కదా
తెలిసింది.
జయహో యోగా -- పి. లక్ష్మణ్ రావ్
వేద కాలం నుండి
ఆమోదయోగ్యమైనది
ఆరోగ్యాన్ని
స్వీయ అధీనంలో ఉంచేది
యోగా అమోఘమైన మార్గం!
శరీరాన్ని
ఆటబొమ్మలా చేసుకొని
మనసుని ఆధీనంలో ఉంచుకొని
మనల్ని మనం నియంత్రించుకునే
ఘనమైన పద్దతి యోగా!
ఊపిరితో
విన్యాసాలు చేయించి
శ్వాసను స్వాధీనం చేసుకొని
ఏకాగ్రతను సాధించే
ఏకైక మార్గం యోగా !
నియమాలతో నియంత్రించుకొని
ధ్యానంలో మునిగిపోయి
స్వీయ శిక్షణకు మరో రూపం
క్రమశిక్షణకు మారు పేరు యోగా !
వ్యాధుల్ని దరిచేరనీయకుండా
యోధుల్ని తయారుచేసి
ఆయుష్షుని పెంచే
మహా శక్తి శాలి యోగా !
వత్తిడిని దూరం చేసి
ఆత్మన్యూనతను పటాపంచలు చేసి
ఆత్మవిశ్వాసాన్ని
అణువణువునా నింపే
వర ప్రదాయని యోగా !
యోగాతోనే అందం
యోగాతోనే ఆనందం
యోగాతోనే ఆరోగ్యం
యోగా మహాభాగ్యం !
యోగా మెగా ఉపకారి
సాహో యోగా
జయహో యోగా !
మళ్ళీమొలవాలని.. వచనకవిత -- చక్రవర్తి
ఆధునికమైన హంగులతో
కట్టిన భవంతిలో
సజీవస్వరంతో
మళ్ళీ జీవితపాఠాలు చెప్పాలనిఉంది.
కొత్తగా రంగులు పులుముకున్న భవనంలో
లోకం పూసుకున్న రంగుల పొరలను
మానవబాల్యాల ముందు
ఒలిచెయ్యాలని ఉంది.
పచ్చదనమై అప్పుడప్పుడే అంకురిస్తున్న
విశాలప్రాంగణంలో
ప్రభుత్వం లెక్కలో
రాలిపడిన పండైన నాకు
ఒజ్జగా మళ్ళీ మొలకెత్తాలని ఉంది.
పసి మేధలకు
నా అనుభవాల ఆకురాతితో
పదనెక్కించాలని ఉంది.
ఆర్భాటాల సౌకర్యాలనడుమ
నలిగిపోయిన అసలైన చదువును
అటకమీదనుంచి దింపి
జ్ఞానమాధుర్యాన్ని
పిల్లవేల్పులకు పంచాలని ఉంది.
కళకళలాడే బాలభాస్కరుల
కిరణకాసారంలో
నా అజ్ఞానాన్ని కడుక్కోవాలని ఉంది.
బతుకునిచ్చిన
చదువులమ్మ ఒడిలో
ప్రాతగొంతుతో
క్రొత్తపాఠం చెప్పాలని ఉంది.
(ప్రయాణంలో KGBV కొత్త భవనాలు చూసినప్పటి స్పందన)