నా హృదయవీణను మీటి
ప్రణయరాగాలు ఆలపించావు,
నా ఎదలో శయనించి...
కలలోకవ్వించి దోబూచులాడావు
వేదమంత్రాల సాక్షిగా
నీతో కలిసి వేసిన ఏడడుగులు
ఏడారిలాంటి బ్రతుకులోకి
నన్ను నడిపించినా...
కన్నవారి కానుకలు భారీగా తరలివచ్చినా
వంటింటి సామ్రాజ్యానికి
అలుపెరుగని పట్టపురాణిని చేసినా
కష్టాలెన్నో కాటువేసినా,
అత్తింటి ఆరళ్ళు మౌనంగా భరించి
కన్నీటిని కనుకొలకుల్లో దాచుకొని
నీ వారసుల్ని నీకు దీటుగా అందించిన నన్ను...
ఆడపిల్లలను కన్నానన్న మిష తో
నన్ను నా పుట్టింట వదిలి కనుమరుగైనావు.
పసివాడని వసంతంలా నేనున్నది
ఒయాసిస్సులాంటి నీ ఓదార్పు కోసం,
నిరాశా..నిస్పృహలతో
ఎదురుతెన్నులు చూసేది నీ రాక కోసం,
చల్లని నీ చిరునవ్వు కోసం,
ఏనాటికైనా మమతగా అందించే
నీ అనురాగం కోసం....
కలవాల్సింది అడుగులు కాదు
మన మనసులు,
నీ రాక కోసం చూస్తూ కవితలల్లాను
కనులు మూసినా నువ్వే,
కనులు తెరిచినా నువ్వే,
నా మదినిండా నువ్వే,
నా గుండె గుడిలోనూ నువ్వే
నా మనసంతా నువ్వే.