ఎక్కడికి. ఎక్కువ?
టమాటో మాట
టోటల్గా ఎలక్షన్ల
ప్రచారానికన్న
మిన్నగా ఉంది.
ఎక్కడ చూచినా ఆ మాటే.
కానీ ఒక్కమాట.
కష్టించి పండించిన టమోటోలు
నష్టానికి అమ్ముకుంటూ,
అదీ కాకపోతే దారి పక్కన పారబోసి
రైతు రక్త కన్నీరు కారుస్తూ
రిక్త హస్తాలతో
బస్తినుండి తన బసచేరిన వైనం
ఎందరికెరుక?
ఓ చిన్న కవితైనా రాశారా? ఎవరైనా?
తనదాకా వస్తేగాని
తలనొప్పి బాధ తెలియదు మనకు.
ధరలెక్కినా, తగ్గినా
దగా పడేవాడు రైతన్నే.
దోచుక తినేది మధ్యన్నలే.
రాచరికపు కాలంనుండి రాక్షస కృత్యాలు
రాజులకు రాసక్రీడలే.
ఎంతైనా ఇచ్చి సినిమా సుత్తి కొట్టించుకొనే
అయ్యలారా! నెత్తిమీద
మృత్యువును పెట్టుకొని బ్రతికే
సైరికుడు చల్లగుండాలని స్మరింపుడి!!!