471.
ఏమని చెప్పను స్వామి
ఎంతని చెప్పను స్వామి
ఎంత తెలిసినా
ఏదో తెలియని వింతను చూపే నీ ఆటను,
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
472.
ఏమని చెప్పను స్వామి
ఎంతని చెప్పను స్వామి
శృంగార కుహరంలో చిక్కుకుని
జన్మల పంజరంలో బందీ అయినా జీవుడి బాధను
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
473.
ఏమని చెప్పను స్వామి
ఎంతని చెప్పను స్వామి
జనన మరణాల అంచుకు ఊగిపోతున్న
ఈ ఆశల ఊయల అల్లరిని
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
474.
ఏమని చెప్పను స్వామి
ఎంతని చెప్పను స్వామి
నాది నాదియని నాట్యమాడి
నీది పిలుపు రాగానే
జీవన సోదిని వదిలి సొమ్మసిల్లే దేహమును...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
475.
పుట్టుకన్నది
కలయికలో కలబోసుకున్న కణమా...
కణము చేసే పయనం, నిత్య జీవన రణమా
అమ్మ కడుపు నుంచి నేల కడుపు దాక
సాగే యుద్ధంలో గెలుపు శూన్యమా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
476.
చనుబాల తీపి
పెరిగిన వయసుకు చేదా...
తన వయసు చనువులతో సైయాటకై మోజా
తీపి చేదుల మోజులో బ్రతుకు భూజా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
477.
వయసు ఉరుకులు
వలపు సొగసులు
ప్రేమ భావన పరుగులు
కలిగి మెలిగి కరిగిపోయే కథల మలుపులు
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
478.
బాల్యపు ఆశ
యవ్వనపు ఆశ
తనువులతో తనువులు పుట్టే తమాషా
ఆ తమాషా మనుగడకు ప్రాణం ఆశ
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
479.
మనిషిని ఇంతలా వేదిస్తున్న
మనసు లోతు
మనసు ఎత్తు
మనసు పొడవు
మనసు వెడల్పు ఎంత స్వామి
శూన్యమా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
అసలు ఏది
కొసరు ఏది
నీది ఏది
నాది ఏది
అంతా కాటిది
కాకిని కూడా తినే కాలమది
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.