చెబితే నమ్మరు కానీ శృంగారం ఓ బాధే...
తీయని బాధంతే...
చెబితే నమ్మరు కానీ పుట్టడం ఓ బాధే...
తల్లికి పురిటినొప్పులు, పిల్లవాడికి ఏడుపులు
రెండు భరించలేని భరింపక తప్పని అయోమయ బాధలంతే...
చెబితే నమ్మరు కానీ బుడి బుడి అడుగుల వేళ
పడడం, పడి లేచి ఏడ్వడం ఓ బాధే
అది అర్థమవని చిన్నతనపు చిత్రమైన బాధంతే...
చెబితే నమ్మరు కానీ ఎదిగిన నాడు
ఏదో కోరితే ఏదో జరిగిందని, ఏదేదో ఊహించుకుని
ఉల్కిపడి లోలోన మధనపడే విచిత్రమైన బాధ
మనిషిని బట్టి మారుతూ మనసును పట్టి పీడించే బాధంతే...
పుట్టడం నుంచి పోవడం వరకు అన్నీ బాధలే...
భాధల తీరు వేరంతే...
బాధ పెట్టేవాడివి, బాధతీసేవాడివి
బోధ చేసే వాడివి నీవైనప్పుడు...
పడ్డానని, లేచానని,
విరిగిందని, విజయం వచ్చిందనే బాధ నాకేలా సదాశివా....
నను చంపుకుతిన్నా...
ఆకాశపు అందలం ఎక్కించినా...
అది నీ ఆటలో భాగమైన బాధంతే...
అన్నింటిని ఇచ్చే ఆదిదేవుడివి
నాకు ఆవేదన ఏ కర్మను తీయడానికి ఇచ్చావో...
నీకే తెలుసు...
ఆట నీదీ...
ఆవేదన పొందిన మనసు మాటు ఆత్మ కూడా నీదే
నాదేముంది అజ్ఞానం...
కన్నులతడి బిందువులతో నీకు అభిషేకం అంతే...
నీకు నీవే సాటి భళా సదాశివ...