ఎగ్జామ్స్ అయిపోవడంతో ప్రణవి హమ్మయ్య అని ఊపిరి పిల్చుకుంది.
పిల్లలకి పండగ సెలవులు ఇచ్చేసారు. టీచర్లను మాత్రం స్కూల్ కి వచ్చి పేపర్లు దిద్దేసి ఇచ్చి వెళ్ళమని చెప్పారు.
ప్రణవి కీ స్కూల్ బస్ సదుపాయంలేదు. చార్జీలకు డబ్బులు అడగాలంటే జంబేష్ ముందే కస్సుబుస్సులాడుతున్నాడు. ఏం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. మొదటి రోజు తన దగ్గర వెతుక్కుని ఆ డబ్బులు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళింది.
ఆఫీసు రూమ్ నుంచి ఎవరి పేపరు కట్టలు వారు తెచ్చుకుని దిద్దడం మొదలుపెట్టారు.
ప్రతిరోజు పేపర్లు దిద్దడం పూర్తి అయ్యేవరకు వచ్చి, లంచ్ బ్రేక్ వరకు ఉండి అయినంత వరకు పేపర్లు దిద్ది, వెళ్ళాలి. దిద్దేటివి అయిపోయిన పేపర్ల బండిల్ కు మార్క్స్ మెమో సిద్ధం చేసి, పేపర్ బండిల్ మీద పెట్టి, రబ్బర్ బ్యాండ్ తగిలించేసి, పక్కన పెట్టింది.
అటుగా వచ్చిన సురేష్ ఆ పేపర్స్ కట్ట విప్పి, కొన్ని పేపర్లను తీసుకుని చెక్ చేశాడు. ఒక పేపర్ తీసి, ప్రణవి కి చూపిస్తూ... "ఇక్కడ ఈ అమ్మాయి రాసిన దానిని ఎందుకు కొట్టేసారు?" అని అడిగాడు.
"ఆ అమ్మాయి తప్పు రాసింది కదా! అందుకే కొట్టేసాను," అంది.
"ఏం తప్పు రాసింది?"
"అడిగిన ప్రశ్నకు తగ్గ జవాబు రాయలేదు. ఒకసారి చదవండి సర్," అంది ప్రణవి.
"నేను చదివే మిమ్మల్ని అడుగుతున్నా! చిన్నపిల్లలు ఏదో రాసారు. వాళ్ళు రాసిన దానికి ఎన్నో కొన్ని మార్కులు వేయాలి. అంతేగానీ ఇలా కొట్టేయకూడదు. రాసారా లేదా అనేది చూడాలి. ప్రిన్సిపల్ గారు ఈ మార్కులు చూసారంటే... మీరు సరిగ్గా చెప్పడంలేదు అంటారు. చూసుకోండి... మళ్ళీ నన్ను అనొద్దు," అని చెప్పి వెళ్ళిపోయాడు.
పక్కనే కూర్చున్న అనితతో... "తప్పు రాసినా మార్కులు వేయాలా? ఇంక వాళ్ళేం నేర్చుకుంటారు. నూరు శాతం మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! నేను సరిగ్గా చెప్పకపోతే... అందరికీ తక్కువ మార్కులే రావాలి కదా! ఉద్యోగం తీసేస్తారు అనే బెదిరింపు ఒకటి. తప్పు చేస్తే ఉద్యోగం తీస్తారు కానీ, ఏ తప్పు లేకుండా ఉద్యోగం తీయడమేంటి? తప్పులు రాసిన వాళ్ళకి మార్కులు వేయటం ఏంటి? మా చిన్నప్పుడు సోషల్ మాస్టారు ఒకరు ఉండేవారు. ఆయన మొదలు చివరా ఇచ్చిన ప్రశ్నతో కూడి ఉన్నదా లేదా అనేది చూసి... మధ్యలో ఉన్న మేటర్ ని స్కేల్ తో కొలిచి మార్కులు వేసేవారు. ఈ విషయం కనిపెట్టిన ఒక స్టూడెంట్... మొదలు చివర ప్రశ్నకు జవాబు లాగా రాసి మధ్యలో అంతా అడవిరాముడు సినిమా స్టోరీ రాసేసింది. ఆయన దానికి ఎనిమిది మార్కులు వేసారు. ఆ విషయం ఫ్రెండ్స్ కి చెప్పింది... విషయం తెలుసుకున్న హెచ్ఎం పాపం ఆ మాస్టారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలా ఉండాలి గాని ఇదేంటి? తప్పులు రాసిన మార్కులు వేయమని చెప్పడం," అంది గుసగుసగా.
"నీకు ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ అర్థంకాలేదనుకుంటా. నువ్వు ఇంకా పాత తరం ఆలోచనలలోనే ఉన్నావు. మారుతున్న సమాజంతోపాటు, విద్యా వ్యవస్థ మారింది.. నీకు ఇది మొదటి అపాయింట్మెంట్ అవ్వటం వల్ల అంతా వింతగా ఫీల్ అవుతున్నావు. నువ్వు అప్డేట్ అవ్వాలి... స్కూలు యాజమాన్యం నాడిని, పిల్లలు నాడిని పట్టుకోవాలి. మారుతున్న కాలానికి అనుకూలంగా నువ్వు కూడా మారాలి. బ్రతుకుతెరువుకు వచ్చిన దానివి బ్రష్టు పడుతున్నారనే ఆలోచన నీకెందుకు? నువ్వు ఒక్కదానివి ఉద్ధరించేది ఏమీ లేదు. నీ హెడ్ చెప్పింది ఫాలో అయ్యి, పిల్లలు ఏం రాసినా...శల్య పరీక్ష చేయక ఎన్నో కొన్ని మార్కులు వేయి," అంటూ సలహా ఇచ్చింది అనిత.
ప్రణవి మళ్లీ తను దిద్దిన పేపర్లు తీసుకొని రీ చెకింగ్ చేసి ఆ కొట్టివేతలని టిక్కు లాగా సరిచేస్తూ... వాటికి కొన్ని మార్కులు వేస్తూ వచ్చింది. అలా ప్రతి పేపర్ ని రీ చెకింగ్ చేసింది.
అయినంతవరకు పూర్తి చేస్తున్న పేపర్లను కట్టలు కట్టేసి, ఆఫీసులో ఇచ్చేశారు స్టాఫ్ అందరూ.
ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ప్రణవి. ఇంతలో అనిత వచ్చి, ప్రణవి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని, అందులో కొంత డబ్బు పెట్టింది. అనిత కు ప్రణవి పరిస్థితి చూచాయగా తెలుసు. అందుకే కొంత డబ్బు చార్జీలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రణవికి ఇచ్చింది.
"ధన్యవాదాలు అనిత. నా పరిస్థితిని అర్థం చేసుకుని, డబ్బులు ఇచ్చావు. జీతం రాగానే నీ అమౌంట్ నీకు తిరిగి ఇచ్చేస్తాను," అంది ప్రణవి.
"పర్వాలేదు... ఉంచుకో. అప్పుగా ఏమి ఇవ్వలేదు," అంది అనిత.
"నీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ నేనలా తీసుకోను. సమయానికి అడగకుండా ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. డబ్బులు రాగానే నీకు ఇచ్చేస్తాను కాదనకు," కృతజ్ఞత భావంతో అంది ప్రణవి.
***
చీటికి మాటికి అయినదానికి కాని దానికి, పిల్లల్ని కొడుతుంటే పిల్లలు జంబేష్ ను చూస్తే భయపడిపోయేవారు. బెల్ట్ తీసుకుని కొట్టారంటే, దెబ్బ తగిలిన దగ్గర శరీరం కమిలిపోయేది.
ఓ రోజు జంబేష్ ఆఫీస్ కి అని చెప్పి వెళ్ళాడు. వెళ్లిన వెంటనే తిరిగి వచ్చి, వాళ్ళ అబ్బాయి సుభాష్ ను గట్టిగా పిలిచాడు.
ప్రణవి ఏమి జరిగిందో తెలియక భయపడుతూ బయటకు వచ్చింది.
బయట కోపంతో ఊగిపోతూ నుంచున్నాడు జంభేష్. అప్పటికే అతని ప్యాంటు నుంచి తీసిన బెల్ట్ చేతిలో రెడీగా ఉంది.
"ఏమైంది?" అంటూ భర్తను అడిగింది ప్రణవి.
అతను ఏమి జవాబు చెప్పలేదు. మళ్లీ గట్టిగా, "సుభాష్ రా...రా... పెంట లం...కొడుకా....!" అంటూ అరిచాడు.
అతని ఉగ్రం చూసి, పిల్లవాడు ఏం చేస్తాడో నని ప్రణవికి భయం పట్టుకుంది.
'వీడేం తప్పు చేశాడో... నాకు తెలిసి ఏ తప్పూ చేయలేదు. మరి ఎందుకు బెల్టు తీసాడు!'
తనలో తానే భయపడుతూ కొడుకు కోసం చుట్టూ చూస్తూ... వాడు రాకుండా ఉంటేనే బాగుంటుంది వస్తే దెబ్బలు తింటాడు అని దేవుడికి దండాలు పెట్టుకుంటూ నుంచుంది.
గట్టిగా పిలిచి సుభాష్ రాకపోయేసరికి తిట్టుకుంటూ కోపంగా బాత్రూం దగ్గరికి వెళ్ళాడు జంబేష్.
బాత్రూం వెనకాతల భయంతో నక్కి కూర్చున్న సుభాష్ జుట్టు పుచ్చుకుని, ఇవతలకు లాక్కొచ్చి, బెల్ట్ తీసుకుని బాధడం మొదలుపెట్టాడు.
"ఏం చేసాడు? ఎందుకు పసిపిల్లవాడిని అలా కొడుతున్నారు?" అంటూ అడిగింది.
"ఎందుకు కొడుతున్నానో నీకు చెప్పి కొట్టాలా?
ఇదంతా నీ ట్రైనింగే కదా!" అన్నాడు.
"నేనేం ట్రైనింగ్ ఇచ్చాను. వాడు ఏం తప్పు చేశాడు?" అని అడిగింది.
"పిల్లల కి భయం పెట్టేటప్పుడు నువ్వు మధ్యలో దూరక. తర్వాత నీ కొడుకునే అడుగు. వెళ్ళు అవతలికి," అంటూ ప్రణవిని ఒక్క తోపు తోసాడు.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.