Image by WikiImages from Pixabay
డర్బన్ ఓడ రేవు వద్ద ఓడ దిగ్భంధనం, గాంధీజీకి వ్యతిరేకంగా అల్లర్లు
గాంధీజీ ప్రయాణించిన ఓడ 1896 డిశంబర్ 18 న డర్బన్ రేవు చేరుకున్నప్పుడు 2 ఓడలు అప్పటికే లంగరు వేసి ఉన్నాయి. అప్పటికే అధికారులకు భారతావనిలో, ముఖ్యంగా బొంబాయిలో, ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉందని తెలిసింది. అందువల్ల వైద్యులు ప్రతి ప్రయాణికుడిని పరీక్షించి ఆరోగ్యవంతంగా ఉన్నాడని ధృవీకరిస్తేనే వారిని ఓడ దిగి నగరంలోకి అడుగుపెట్టటానికి అనుమతి ఇస్తారు. కాని వైద్యులు పరీక్షించేముందు 5 రోజులు ప్రయాణీకులు ఓడలోని దిగ్భందం (quaratine) లోనే ఉండాలి. దాని ప్రకారం వైద్యులు అనుమతి ఇస్తే గాంధీజీ ప్రయాణించిన ఓడలోని వ్యక్తులు డిశంబర్ 24/25 న బయటకు వెళ్లవచ్చు. కాని ఈ ఓడకు ఒక ప్రబలమైన కారణం వల్ల ప్రయాణీకులు బయటకు వెళ్ళలేకపోయారు.
అప్పటికే డర్బన్ ప్రజలకు దక్షిణ ఆఫ్రికాలో శ్వేతజాతీయులు వలస-భారతీయుల ఎడల జరిపే దాడులకు, ఘటనలకు వ్యతిరేకంగా భారతావనిలో గాంధీజీ చేసిన ఉపన్యాసాలు, జరిపిన విషయాలు అచ్చటి తెల్లవారికి తెలిసిపోయాయి. అందువల్ల ఆ నౌకలోని ప్రయాణీకులందరిని వెనక్కి భారతదేశానికి పంపించివేయాలని జరిగిన ఆందోళనలు అచ్చటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం జరిగింది. ప్రయాణీకులకు జరిగిన నష్టపరిహారం ఇవ్వటానికి కూడా వారు సిద్ధమయ్యారు. కాని ఓడ యజమాని సేథ్ అబ్దుల్లా దానికి అంగీకరించలేదు. కాని కొందరు అధికారులు, డర్బన్ లోని వలస-భారతీయుల యెడల ప్రేమ చూపించే కొందరు శ్వేతజాతీయుల సహకారం వల్ల చివరకు ఓడ లంగరు వేసిన తరువాత 23 రోజులకు ప్రయాణీకులు దిగటానికి అనుమతి లభించింది.
శ్వేతజాతీయుల అసలు లక్ష్యం వేరే ఎవరు కాదు, గాంధీజీయే. ఈయన మీద రెండు నిందారోపణలు ఉన్నాయి. అవి:
- ఆయన భారతావనిలో ఉన్నప్పుడు నాటాల్ తెల్లవారిమీద అకారణంగా నిందారోపణలు చేశారు.
- నాటాల్ ను భారతీయులతో నింపి స్థిరపడేటట్లు చేయటానికి వారిని రెండు ఓడలలో ఇక్కడకు తీసుకువచ్చారు.
ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వ్యాఖ్యానించారు.
“నా బాధ్యత నాకు సంపూర్ణంగా తెలుసు. నా వల్ల దాదా అబ్దుల్లా కంపెనీ ప్రమాదానికి గురిఅయి చాలా నష్టం జరుగుతుందని నాకు తెలుసు. అంతేకాదు నాతో పాటు వచ్చిన నా భార్య, పిల్లలను కూడా ప్రమాదంలోకి నెట్టాను...... ఖచ్చితంగా నిరపరాధినే. కాని నేను భారతావని నుంచి ఎవరినీ నాటాల్ వెళ్ళమని చెప్పలేదు. ప్రయాణికులు ఓడ ఎక్కినప్పుడు నాకు ఎవరూ తెలియదు. ఇద్దరు అతి దగ్గర బంధువుల పేర్లు, చిరునామాలు మినహా, ఇతర ప్రయాణికుల పేర్లు, వారి వివరాలు నాకు తెలియవు. అలాగే,
నేను భారత్ లో ఉన్నప్పుడు నాటాల్ లోని తెల్లవారి గురించి ఇక్కడ (నాటాల్ లో) చెప్పని మాటలు ఒక్కటి కూడా అక్కడ (భారత్ లో) చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్పిన వాటికి సాక్ష్యం ఉంది.
నాకు మొదటినుంచి నాటాల్ లోని తెల్లవారి నాగరికత, వారు ఇతర జాతీయుల ఎడల చూపే చులకన భావం, అసమానతలు నచ్చలేదు. అది నాటాల్ లో ఉన్నప్పుడే బహిరంగంగానే వ్యతిరేకించాను. అది వారికి (తెల్లవారికి) కూడా తెలుసు……నేను ఓడ కెప్టెన్, ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు ఇవన్నీ వివరించాను. పశ్చిమ దేశీయుల నాగరికతకు తూర్పు దేశీయుల నాగరికతకు చాలా వ్యత్యాసాలున్నాయని వారికి చాలా ఓపికతో వివరించాను.”
అహింసా సూత్రాలు భారతావని నాగరికతకు మూలమయితే పాశ్చాత్య నాగరికత బలం, బలవంతం, బెదిరింపులమీద ఆధారపడుతుంది. ఈ రెండు నాగరికతల మధ్య ఉన్న తేడాలు కూడా వివరించాను. అప్పుడు కెప్టెన్ నన్ను ఇలా ప్రశ్నించాడు: ‘ఒకవేళ తెల్లవారు వారి బలం, బెదిరింపులు నిజంగా చేపడితే మీ అహింసా సూత్రాలు ఇప్పుడు నిన్ను ఎలా కాపాడుతాయి?’
దీనికి నా సమాధానం ఇలా ఉంది.
దేవుడు నీకు అవసరమైన ధైర్యం ఇస్తాడని, ఆయన నామీద దాడిచేయాలనే వారిని అడ్డగించి నన్ను కాపాడుతాడని నా ధృడ నమ్మకం! అలాగే వారి తప్పులను క్షమిస్తాడని నేను నమ్ముతాను. నాకు వారి మీద కోపం లేదు. వారి అజ్ఞానానికి, సంకుచితత్వానికి జాలిపడతాను. నిజం తెలిసినప్పుడు, వారి తప్పు వారికి అగవతమైనప్పుడు వారు చాలా విచార పడతారని నా నమ్మకం. అందువల్ల వారి మీద నాకు కోపం ఉండటానికి తగిన కారణం లేదు.”
గాంధీజీ మీద నాటాల్ శ్వేతజాతీయుల దాడి, ఆయన హత్యకు ప్రణాళిక
ఓడ రేవుకు తీసుకువెళ్ళగానే ప్రయాణికులందరు దిగి ఒడ్డుకు వెళ్ళటం ప్రారంభించారు. కాని నాటల్ లోని న్యాయవాది గాంధీజీకి మిత్రుడు, Harry Escombe, ఓడ కెప్టెన్ కు ఒక సందేశం పంపించాడు. ‘తెల్లవారు గాంధీజీ అంటే చాలా ఆగ్రహం ఉన్నందువల్ల ఆయన ప్రాణానికి అపాయం ఉంది కాబట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని రాత్రి పూట మాత్రమే దిగేటట్లు చేయమని సలహా ఇచ్చాడు; అప్పుడు ఓడ రేవు (Port) సూపరింటెండెంట్ Mr. Tatum వారిని వారి ఇంటివద్ద దిగబెట్టటానికి వీలవుతుంది’. ఈ సందేశం గాంధీజీకి తెలియజేయటం జరిగింది.
కాని ఒక అరగంట తరువాత అబ్దుల్లా కంపెనీ న్యాయ సలహాదారు Mr. Laughton ఓడలోకి వచ్చి తాను రహస్యంగా అర్ధరాత్రి గాంధీజీని, కుటుంబాన్ని తీసుకువెళ్ల గలనని చెప్పి అనుకున్న సమయానికి వారిని 2 మైళ్ళ దూరంలో ఉన్న Rustomjee Ghorkhodu గృహానికి తీసుకువెళ్లటం జరిగింది. ఆ విధంగా గాంధీజీ, ఆయన కుటుంబం డర్బన్ లో 1897 లో జనవరి 13 వ తేదీన కాలు పెట్టారు.
కానీ, అచ్చటకి సురక్షితంగా చేరే లోపల సుమారు 6,000 ఆందోళనకారులు గాంధీజీని చీకటిలో కూడా గుర్తించి మండిపడుతూ ఆయనచుట్టూ ఒక వలయం లాగా ఏర్పడి ఆయన మీద కంకర రాళ్లు, కుళ్ళిన కోడిగ్రుడ్లు విసిరారు. ఒకడయితే ఆయనను పట్టుకుని తలపాగా లాగేస్తుంటే కొందరు కొట్టటం, పిడి గుద్దులు గుద్దటం, తన్నటం మొదలెట్టారు. ఈ ఉత్పాతానికి గాంధీజీ శోష తప్పి రోడ్డు మీద పడిపోయాడు. వాళ్ళు ఆలా హింసిస్తుంటే గాంధీజీకి తెలిసిన పోలీస్ సూపెరింటెండెంట్ భార్య (Mrs.Alexander) చూసి తన గొడుగు విప్పి ఆయనకు దుండగుల మధ్య నిలుచుని గుంపుని చెల్లాచెదరు చేసి గాంధీజీ ప్రాణానికి హాని లేకుండా కాపాడింది.
ఈలోపల వలస భారత యువకులు పోలీస్ స్టేషన్ కు పరుగెత్తి పోలీస్ సూపరింటెండెంట్ (Alexander) కు ఈ సంగతి చెప్పగా ఆయన పోలీస్ దళాన్ని పంపించి గాంధీజీ చుట్టూ వలయం ఏర్పాటు చేసి వారి సంరక్షణలో ఆయనను, ఆయన కుటుంబాన్ని సురక్షితంగా Rustomjee ఇంటికి చేర్చటం జరిగింది. గాంధీజీకి తగిలిన గాయాలకు వైద్యుడు Dadibarjor తగిన చికత్స చేశారు.
మారువేషంలో గాంధీజీ తప్పించుకోవటం
గాంధీజీ Rustomjee ఇంట్లో ఉన్న రాత్రి సమయంలో చాలామంది తెల్లవాళ్లు ఆ ఇంటి బయటనుంచి “మాకు గాంధీ కావాలి, మాకు అప్పగించండి” అని అరుస్తున్నారు. పోలీస్ సూపరింటెండెంట్ వారిని నియంత్రించటానికి శాయిశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఆయన గంభీరంగా ఉన్న పరిస్థితిని అంచనా వేసి గాంధీజీకి ఒక సందేశం పంపించాడు. అది “మీ స్నేహితుడు Rustomjee ఇంటిని, అతని కుటుంబాన్ని కాపాడాలంటే మీరు అక్కడనుంచి మారువేషంలో ఇంకొక చోటికి వెళ్లిపోండి.”
ఏమిచేయాలి, ఎక్కడకి వెళ్లి తలదాచుకోవాలో అని ఆలోచిస్తున్నప్పుడు సూపరింటెండెంట్ సలహామేరకు ఒక భారతీయ పోలీస్ కానిస్టేబుల్ (Constable) ఆహార్యం (dress) వేసుకుని, మదరాసీ (మద్రాసు వ్యక్తి) కండువాను (Scarf) హెల్మెట్ (Helmet) లాగా తలకు చుట్టి చీకట్లో ఇంట్లో నుంచి ఒక భారతీయ వ్యాపారి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. వెంట ఇద్దరు రహస్య భటులు (detectives) కూడా ఆయన వెంట వెళ్లారు. కాని వ్యాపారి ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే భద్రత ఎక్కువ ఉంటుందని గాంధీజీ అక్కడికి వెళ్లటం జరిగింది. ఆయన వెంట భార్య కస్తూరిబాయి, పిల్లలు కూడా ఉన్నారు.
గాంధీజీ సురక్షితంగా పోలీస్ స్టేషన్ చేరినట్లు అలెగ్జాండర్ తెలుసుకుని తెల్ల రౌడీ మూకలతో “గాంధీజీ Rustomjee ఇంట్లోనుంచి వెళ్లిపోయారు; మీరు ఆయనకోసం ఎదురుచూడటం నిరుపయోగం; మీరు మీ ఇళ్లకు వెళ్లిపోండి; మీరు నమ్మకపోతే మీలో ఒకరు, ఇద్దరు లోపలి వెళ్లి చూసుకోటానికి నేను కూడా వెంట వస్తాను; ఆయన అక్కడ లేకపోతే మీరు అందరూ ఇళ్లకు వెళ్ళిపోవాలి” అని గట్టి స్వరంతో తెలియజేశాడు. రౌడీ మూకలో ఇద్దరు Rustomjee ఇంటిలోకి వెళ్లి పరిశీలిస్తే గాంధీజీ కనపడలేదు. ఇది తెలిసి రౌడీలందరు కోపంతో వెళ్లిపోయారు.
ఈ దారుణమైన సంఘటనను తెలుసుకుని పై అధికారులు ఈ దుండగులను అరెస్టు చేసి, విచారించి తీవ్రంగా శిక్షించాలని నిర్ణయించి గాంధీజీని వారి మీద కేసు పెట్టమని కోరగా ఆయన
“నేను ఎవరినీ శిక్షించ దలచుకోలేదు. వారిని నేను తప్పుపట్టను. నాటాల్ లోని తెల్లవారి గురించి భారతావనిలో నేను చేసిన ప్రకటనలను నమ్మి ఆగ్రహం చెందారు. అది వారి తప్పు కాదు. అసలు తప్పు ఇచ్చటి నాయకులది మాత్రమే. లండన్ లోని Reuter సంస్థ నాటాల్ కు పంపించిన నా వ్యాఖ్యలకు ఈ నాయకులు విపరీత అర్ధాలు తీసి, వాటిని ప్రజలలో తీవ్ర ప్రచారం చేశారు. దాని పరిణామమే ఆగ్రహించిన కొంత మంది నామీద దండయాత్ర చేయటానికి పూనుకోవటం, నా ప్రాణం తీయటానికి సంసిద్ధులవటం. యదార్ధం తెలుసుకున్నప్పుడు ఈ రౌడీలు తాము చేసిన పనికి సిగ్గుపడతారు.
నేను దీనిమీద ఎవరినీ సంప్రదించదలచుకోలేదు. నేను వారిని శిక్షించమని కోరను. ఈ విషయాన్ని వ్రాత పూర్వకంగా మీకు సమర్పిస్తాను” అని ఆయన తన నిర్ణయాన్ని ఆదికారులకు వ్రాసి ఇచ్చారు. ఈ సంఘటన తరువాత అనేక వార్త పత్రికల ప్రతినిధులు గాంధీజీని జరిగిన విషయాల గురించి అనేక ప్రశ్నలడిగారు. ఆయన తనమీద వచ్చిన ఆరోపణలను సమర్ధవంతంగా ఖండించారు. ఫెరోజ్ షా (Pheroz Shah) సలహా మేరకు గాంధీజీ తాను భారతావనిలో వ్రాతపూర్వకంగా ఇచ్చిన వార్త ప్రతులను ఈ ప్రతినిధులకు ఇవ్వటం జరిగింది. తాను ఓడలలో భారతావని నుండి అనేక మంది భార తీయులను తీసుకువచ్చాడనే ఆరోపణ ఆధార రహితమని గాంధీజీ వారికి నిరూపించారు. అందులో చాలామంది నాటాల్ లో నివసించే వలస భారతీయులు మంచి అవకాశాలకు Transvaal వెళ్లేవారే అని ఆయన నిరూపించారు.
పత్రికా ప్రతినిధుల సమావేశంలో తాను దుండగులమీద కేసులు పెట్టి శిక్షించదలచుకోలేదని గాంధీజీ వెల్లడించటం జరిగింది. ఈ సమావేశ విషయాలను పత్రికలలో ప్రముఖంగా ప్రస్తుతించటం వల్ల డర్బన్ పట్టణంలోని తెల్లవారు (దుండగులు) తమ ప్రవర్తనకు సిగ్గుపడిపోయారు. విలేకరుల సమాఖ్య గాంధీజీ అమాయకుడని, ఏ తప్పు చేయలేదని ప్రకటించి రౌడీ మూకల చర్యను ఖండించటం జరిగింది. గాంధీజీని కొట్టడం, ఆయనపై జరిగిన కారణంగా ఆయనకు నాటాల్ లో విపరీతమైన ప్రాచుర్యం, సానుభూతి లభించింది. తద్వారా దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులో గాంధీజీ పరపతి పెరిగిన దరిమిలా ఆయన కార్యకలాపాలు నిర్వహించటం సులభమైంది.
ఇది జరిగిన మూడు, నాలుగు రోజులకు గాంధీజీ, కస్తూరిబాయి, పిల్లలు ఆయన నివాస గృహంలో స్థిరపడ్డారు. ఈ సంఘటన వల్ల ఒక్కసారిగా ఆయన న్యాయవాది వృత్తి బాధ్యతలు పెరిగాయి. ఆ తరువాత 5 నెలలకు (మే 4, 1897) గాంధీజీ దంపతులకు మూడవ పుత్రుడు ‘రామదాస్’ జన్మించాడు. మూడు సంవత్సరాల తరువాత (మే 22, 1900) ఈ దంపతులకు నాలుగవ (కనిష్ట) పుత్రుడు ‘దేవదాస్’ జన్మించటం జరిగింది.
గాంధీజీ పిల్లల విద్య
జనవరి 1897 లో నాటాల్ చేరేటప్పటికి గాంధీజీ-కస్తూరిబాయి దంపతులకు ఇద్దరు పుత్రులున్నారు.
వీరు: హరిలాల్ గాంధి: 8 ఏళ్లు; మణిలాల్ గాంధి: 4 ఏళ్లు. వీరే గాక గాంధీజీ అక్క పుత్రుడు గోకుల్ దాసు కూడా వారితోనే ఉన్నాడు.
ఆ కాలంలో యూరోపియన్ పిల్లలకు ఉన్న ఇంగ్లీషు బడులలో తన పిల్లలను అక్కడ చదివించటం గాంధీజీకి ఇష్టం లేదు. అసలు భారతీయుల పిల్లలకు వాటిల్లో చదవటానికి అనుమతి లేదు. అదీ గాక క్రిస్టియన్ లు స్థాపించిన ఆ బడులలో తన పిల్లలను చదివించటం గాంధీజీకి ఇష్టం లేదు. ఆయనే వారికి గృహంలోనే విద్యాబోధన చేయటం కష్టం కాబట్టి గుజరాతీ ఉపాధ్యాయుడు కోసం తగిన వ్యక్తి కొరకు చేసిన అన్వేషణ ఫలించలేదు.
చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో ఇంట్లో బోధించే ఒక ఆంగ్లేయ మహిళా గురువును నెలకు £7 జీతంతో గాంధీజీ నియమించారు. కాని ఆమె బోధన అంత సంతృప్తికరంగా లేదు. గాంధీజీ, కస్తూరి బాయిలతో సంభాషణల వల్ల, సాంగత్యం వల్ల పిల్లలు గుజరాతీ భాషలో మాత్రమే వారికి పరిజ్ఞానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులతో వేరుచేసి దూరంగా భారతావనిలో ఉంచటం ఆయనకు నచ్చకపోయినా తన జేష్ఠ పుతృడిని (హరిలాల్), మేనల్లుడిని గుజరాత్ లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఉంచటం జరిగింది. కాని కొన్ని నెలలలోపు వారిని తిరిగి నాటాల్ కు తీసుకు రావటం తప్పలేదు. హరిలాల్ కొంచెం పెద్దవాడయిన తరువాత గాంధీజీ నుంచి విడిపోయి అహ్మదాబాదులోని ఒక ఉన్నత పాఠశాలలో చేరాడు. మేనల్లుడు గోకుల్ దాసు మాత్రం గాంధీజీ, కస్తూరిబాయిలతోనే ఉండిపోయాడు. అతను యుక్త వయస్సు లో జబ్బు పడి దురదృష్టవశాత్తు మరణించటం జరిగింది.
గాంధీజీ పుత్రులు ముగ్గురు నాటాల్ లో ఉన్నంత కాలం (హరిలాల్, మణిలాల్, రామదాస్) పబ్లిక్ స్కూల్ కు వెళ్ళలేదు. కాని దక్షిణ ఆఫ్రికాలో భారతీయ సత్యాగ్రహుల పిల్లలకోసం గాంధీజీ ప్రారంభించిన పాఠశాలలో మాత్రం వారు కొంతవరకు చదువుకొనటం జరిగింది.
****సశేషం****
గాంధీజీ ప్రజా సేవ, బ్రహ్మచర్యం, తదితర విషయాల గురించి గురించి వచ్చే సంచికలో (డిశంబర్ 2026) వ్యాసంలో తెలుసుకుందాము.