'తను ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. ఏదో ఒకటి చేయాలి. కొంతవరకు ఇలాగే ఉంటుందని తెలిసి, మళ్ళీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు, తిరిగి పుట్టింటికి వెళితే బాగుండదు. అందువల్ల నా కాళ్ళ మీద నేను నిలబడాలి. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఉంటే మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి,' అనుకున్నాక ప్రశాంతంగా నిద్రపోయింది ప్రణవి.
***
జంబేష్ తయారయ్యి బయటకు వెళ్ళబోయాడు.
"మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను," అంది మెల్లగా.
"ఏంటి?" చిరాగ్గా మొహం పెట్టి, అడిగాడు.
"నేను ఏదైనా జాబ్ చేద్దామని అనుకుంటున్నాను," చెప్పింది ప్రణవి.
మనసులో ఎగిరి గంతేసిన అంత పని చేసి,
"మంచిదే! మరి ఇంట్లో పనులు, ఉద్యోగం రెండు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. నేనేం నిన్ను బలవంతంగా పంపించటం లేదు. నువ్వే ఉద్యోగం చేస్తానని అడిగావు. మునుముందు నా మీద ఎటువంటి నింద వేయటానికి వీల్లేదు," అంటూ కండిషన్లు పెట్టాడు.
అన్నింటికీ తలాడించింది ప్రణవి.
మరుసటి రోజు ఉదయాన్నే...
"తొందరగా బయలుదేరు నీకు ఒక ఉద్యోగం చూసాను. వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ కి తీసుకురమ్మన్నారు," అంటూ చెప్పాడు జంబేష్.
"ఇప్పటికిప్పుడు చెప్తే ఎలాగండి. ఇంట్లో వంట, పిల్లల్ని స్కూలుకు పంపడం లాంటి పనులు ఉంటాయి కదా! ముందుగా తెలిసినట్లయితే తగిన ఏర్పాట్లు చేసుకునేదాన్ని. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి," అంది ప్రణవి.
"ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న దానివి...నీ పనులు నువ్వు ముందుగా చేసుకొని రెడీగా ఉండాలి అని తెలియదా!
నా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని వస్తాను అంటే... అవతల వాళ్ళు ఊరుకుంటారా?!? రా అమ్మ నీకోసం తలుపులు తెరిచి పెట్టి ఉంచుతాము... నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే ఇంటర్వ్యూ చేస్తాము... అని రాణి గారి కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారా!" వెటకారంగా అన్నాడు.
"వాళ్లని నాకోసం ఇంటర్వ్యూ టైము మార్చమని అడగటం లేదు. మీకు వారు చెప్పినప్పుడు ముందుగా నాకు తెలియజేస్తే నేను రెడీగా ఉండేదాన్ని కదా, అని అడుగుతున్నాను," అంది.
"అలా ముందుగా చెప్పడం నాకు కుదరదు. నా పనులే నాకు చాలా ఉంటాయి. అయినా నేను బయటకు వెళ్లే టైం నీకు తెలుసు కదా! ఉద్యోగం చేయాలి అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు ఆ టైం కు నువ్వు రెడీగా ఉండాలి కదా! నువ్వు రా లేకపోతే ఆగిపో... నీ పనులయ్యాకే ఆ స్కూల్ కి ఆటోలోనో బస్సులోనో ఏదో ఒకటి పట్టుకుని వెళ్లి కనపడు," అంటూ వెళ్ళబోయాడు.
'అసలే ఈ ఊర్లన్నీ కొత్త నేను ఎక్కడికని, ఎలా వెళ్తాను?' అని అనుకుని,
"ఒక్క అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను," అని చెప్పి, పిల్లల్ని పక్కింట్లో అప్ప చెప్పేసి, ఇంటికి తాళం పెట్టి, అతని వెనకాలే బయలుదేరింది ప్రణవి.
ఇరువురు బైక్ మీద అక్కడ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాన్వెంట్ దగ్గరికి చేరుకున్నారు. అది చాలా పెద్ద స్కూల్. అప్ టు టెన్త్ వరకు ఉంది. స్టేటు సెంట్రల్ సిలబస్ క్యాంపస్లు సెపరేట్ గా ఉన్నాయి. ఇరువురు కాసేపు ఆఫీస్ రూమ్ లో కూర్చున్నాక కరస్పాండెంట్ సార్ వచ్చారు.
పరిచయాలు అయ్యాక, "సోషల్ టీచర్స్ మాకు ఉన్నారు. మీరు చెప్పగలను అన్న తెలుగుకి కూడా టీచర్స్ ఉన్నారు. అయితే మాకు కంప్యూటర్ ఫ్యాకల్టీ కావాలి. మీరు అది చెప్పగలరా?" అని అడిగారు కరస్పాండెంట్ సార్.
ప్రణవి, "ఎప్పుడో చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను. ఆ సబ్జెక్ట్ చెప్పేటంత నాలెడ్జ్ లేదు," అని చెప్పింది.
"ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకుంటే అదే వస్తుంది. కొంత మీకు పరిచయం ఉంది కాబట్టి, ఫిఫ్త్ లోపు పిల్లలకు బేసిక్స్ చెప్పండి. మీకు ఏ డౌట్ ఉన్న కంప్యూటర్ ఇంచార్జ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎక్కువ పీరియడ్స్ వేయొద్దని చెబుతాను. ల్యాబ్ లో ఉండి అన్ని నేర్చుకోండి," అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు, జంభేష్ తెచ్చిన రికమండేషన్ వల్ల కరస్పాండెంట్ సార్.
జీతం ఎనిమిది వందలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. జంబేష్, "అలాగే సర్ జీతంతో పని ఏముంది? మీ స్కూల్ లో జాబ్ రావడం మా ఆవిడ అదృష్టం... మీ జీతంతో పనిలేదు ఊరికనే అయినా స్కూల్ కి వచ్చి స్కూల్ మూసే వరకు ఉండి వెళ్తుంది," అని చెప్పాడు.
"జీతం గురించి ఆలోచించక, నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండు. బయట నేర్పాలంటే చాలా ఎక్కువ ఫీజులు తీసుకుంటారు. ఇక్కడ ఉండి నేర్చుకుంటూ పిల్లలకు నేర్పు. ఊరికనే చెప్పించుకోలేము కాబట్టి నెలకు 800 జీతం ఇస్తాను. నీకు ఇష్టమైతే రేపటి నుంచి రా!" అని ప్రణవి వంక తిరిగి, చెప్పాడు కరస్పాండెంట్ సర్.
"రేపటి నుంచి వస్తుంది," అని జంబేషే చెప్పి ఆమె ఇంటికి తీసుకొచ్చాడు.
"అదేంటి చాలా తక్కువ జీతం ఇస్తాను అన్నారు. ఇంకొకటి ఏదన్నా చూసుకుంటే సరిపోతుంది కదా! నాకు రాని సబ్జెక్ట్ మీద కసరత్తు చేస్తూ... పిల్లలకు నేనేమి నేర్పిస్తాను? వేరే స్కూల్ ఏదైనా చూసుకుందాం," అంది ప్రణవి.
"ఏ స్కూల్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎంత అని అడుగుతారు. మొట్టమొదట ఎవరు ఎవరిని పెట్టుకోరు. ఇలాంటి పెద్ద స్కూల్లో పనిచేశామంటే... వేరే స్కూల్లో ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జీతం గురించి ఆలోచించక. జీతం లేకపోయినా పర్వాలేదు. అనుభవం కావాలి," అని చెప్పాడు.
ప్రణవికి అతను చెప్పింది నిజమే అని అనిపించినా... తన అభిప్రాయం అడగకుండానే స్కూల్ కి వచ్చేస్తుంది అని చెప్పడం కొంచెం నచ్చలేదు. అయినా అతను చెప్పిన రీజన్ కూడా కరెక్టే అనిపించింది. మరుసటి రోజు నుంచి స్కూల్ కి వెళ్దామని నిర్ణయించుకుంది.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.