ఇల్లు వదిలి వచ్చేసరికి మనసు తేలికపడింది. 'కానీ బయట ప్రపంచంలో... అయిన వాళ్లకు దూరంగా...' ఏ మూలో మనసులో బాధ మెదిలింది.
మాణిక్య పురం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు ఉంచిన సామాన్లు అన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. సామాన్లు చూసుకుంటా అని వచ్చిన పిల్లవాడు అక్కడ కనబడలేదు.
"ఇక్కడ మీరు ఉంచిన అబ్బాయి ఏమయ్యాడు?" అడిగింది ప్రణవి.
"వాడేమన్నా నీకు పని వాడా? ఉద్యోగం మానుకొని, నీ పీతి సామాన్లు కాపలా కాయడానికి?" అన్నాడు జంబేష్.
'వాడు చూస్తాడు మీ సామాన్లన్నీ అక్కడ వదిలేసి రండి అంటేనే... అక్కడ సామాన్లు వదిలేసారు. లేకపోతే ఏదైనా హోటల్లో పెట్టేవారు కదా! రూమ్ తీసుకుని,' అనుకుంది.
కానీ పెదవి దాటి మాట రాలేదు. ఇప్పుడిప్పుడే అతన్ని అర్థం చేసుకుంటోంది. ప్రతి చిన్న దానికి రియాక్షన్ అవ్వకుండా ఉండటం అంత ఉత్తమం ఇంకొకటి లేదు అనేది అర్థం చేసుకుంది. అందుకే కామ్ గా ఉంది.
***
జంబేష్ చేయి ఫ్రాక్చర్ అయింది తగ్గే వరకు ఉద్యోగం చేయలేడు అని రాజన్ చెప్పడంతో... ఇంటి ఖర్చులకు మూర్తి డబ్బులు పంపించాడు.
ఆ డబ్బులతో ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నారు. ఉదయాన్నే జంబేష్ భయలుదేరాడు.
'జాబ్ లేదు కదా ఇప్పుడు ఎక్కడికి అని అడిగితే...' 'అయితే ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ నీ ఎదురుగా కూర్చోవాలా?' అంటూ వెళ్ళిపోయాడు.
ఒంటరితనం...నాలుగు గోడల మధ్య నిశ్శబ్దంగా కూర్చుంది. అర్థరాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు.
ప్రణవి వేడి అన్నం వడ్డించింది.
"తినండి"
"నాకు ఆకలి లేదు" అని, మంచం మీద వెల్లకిలా పడుకుని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.
జంబేష్ తినక పోయేసరికి, ప్రణవి కూడా తినలేదు. నీళ్లు తాగి పడుకుంది.
రోజూ ఉదయాన్నే వెళ్ళి, ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడు. అన్నం ఒక్కొక్కసారి తినేవాడు ఒక్కొక్కసారి తినేవాడు కాదు. తిన్నరోజు వంకలు పెట్టి వదిలేసేవాడు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేర్పించారు. పిల్లలు స్కూలుకు వెళ్లి వస్తున్నారు.
***
ఆ రోజు పొయ్యి వెలగలేదు. బియ్యం డబ్బా అడుగు కనిపిస్తోంది. కూరలకి డబ్బులు లేవు.
పిల్లాడు "అమ్మా ఆకలి" అని అడిగాడు. ప్రణవి మౌనంగా తల దించుకుంది.
రాత్రి జంబేష్ వచ్చినప్పుడు ప్రణవి మెల్లగా అంది,
"ఇంట్లో సరుకులు అయిపోయాయి. డబ్బులు కూడా..."
జంబేష్ ముఖం చిట్లించాడు.
"నాకేం తెలుసు? నేను దొంగతనం చేయాలా?"
ప్రణవి ఇంక ఏమీ మాట్లాడలేదు. తరువాత రోజు సాయంత్రం పోస్ట్‌మ్యాన్ వచ్చి మనీ ఆర్డర్ ఒక కవర్ ఇచ్చాడు.
ప్రణవి చేతులు వణికాయి. పేరు చూసింది...మూర్తి...
ఆ కవర్‌లో రెండు వేల రూపాయలు ఉన్నాయి. పక్కన చిన్న కాగితం మీద మూర్తి రాసిన మాటలు:
"అక్కా, పిల్లలకి ఏదైనా కొనివ్వు. నీ గురించి నాకు తెలుసు. నేనున్నాను."
ప్రణవి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒకవైపు భర్త అనుమానం, ఆకలి, ఒంటరితనం.
మరోవైపు తమ్ముడి ఆదరణ.
జంబేష్ మాత్రం మళ్లీ అర్ధరాత్రి వచ్చి, ఏమీ అనకుండా పడుకున్నాడు. కనీసం పిల్లలకు ఏమన్నా పెట్టావా? అని గాని నువ్వు తిన్నావా? అని గాని అడగలేదు.
మూర్తి పంపిన రెండు వేలు కూడా పది రోజుల్లో కరిగిపోయాయి.
ఇరువురి మధ్య మాటలు తగ్గాయి. ప్రణవి మొహం చూసినా చూడనట్లే ఉంటున్నాడు. పిల్లలు పసిపిల్లలు, వాళ్ల ఆకలి మాత్రం తగ్గడం లేదు.
ఒక రాత్రి ప్రణవి ధైర్యం చేసి అంది,
"మనం మీ అన్నయ్య ఇంట్లో ఉండలేం. ఇక్కడ ఈ గదిలో ఉండటం కూడా కష్టంగా ఉంది. మీ ఊర్లో సొంత ఇల్లు ఉందన్నారు కదా! ఆ ఇంటికి వెళ్దాం. అక్కడ ఉన్న పొలం లో ఏ కూరలో పండించుకోవచ్చు."
జంబేష్ మౌనంగా విన్నాడు. కాసేపు..." అక్కడ పొలాలు లేవు, ఇల్లు లేదు. అప్పులు ఉన్నాయి. ఇంకెప్పుడు వాటి ప్రస్తావన తేబోకు," అనేసి, బయటకు వెళ్ళిపోయాడు.
పది గంటలు... పదకొండు గంటలు... ప్రణవి గుండె దడదడ కొట్టుకుంటోంది. పన్నెండున్నరకి తలుపు చప్పుడైంది. జంబేష్ వచ్చాడు. బట్టలు మాసిపోయి ఉన్నాయి, కళ్లు ఎర్రగా ఉన్నాయి.
"ఎక్కడికి వెళ్లారు?" ప్రణవి అడిగింది.
"నా పని నాది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు" అని, మంచం మీద పడుకుని వెంటనే నిద్రపోయాడు. తినలేదు.
ప్రణవి పిల్లల పక్కన కూర్చుంది. ఇది ఇల్లు కాదు. ఒక నిర్బంధం.
ఆమె 'ఇలా వదిలేయటానికి లేదు,' అని అనుకుంది.
ఆమె ఈ ఇంటికి స్వేచ్ఛగా రాలేదు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి, అధికారుల సమక్షంలోనే జంబేష్ తో కలిసి వచ్చింది.
"ఆమె భద్రత నీ బాధ్యత" అని ఎస్సై క్లియర్‌గా చెప్పాడు.
అందుకే జంబేష్ ఆమెను మాణిక్యపురం ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోలేడు. కానీ ఉండి ఆమెను చూసుకోవాలనే మనసు కూడా అతనికి లేదు.
ప్రణవి చీకట్లో కూర్చుని ఆలోచించింది.
'ఒక వైపు పోలీస్ కంప్లైంట్ అనే కట్టు. మరోవైపు మనసులో కోపం అనే గోడ. నేను ఇక్కడ ఉన్నాను కానీ నాతో ఎవరూ లేరు.'
బయట గాలి వీస్తోంది. పాత ఇంటి కిటికీలు కిర్రుమంటున్నాయి.
ప్రణవి పిల్లలను గట్టిగా హత్తుకుని కూర్చుంది. ఆ రాత్రి ఆమెకు మళ్లీ నిద్ర పట్టలేదు.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.