Menu Close
Uma Bharathi Kosuri
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి
hrudayagaanam-22

చివరి భాగం

పెళ్లి ముచ్చట.....

పరమేశ్వరీ, శాంతలు ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని ఉగాది పండుగ నాడు తిరిగి వస్తున్న సందర్బంగా గాయనీమణుల గౌరవార్ధం ఏర్పాటైన విందుకి బంధు, మిత్ర వర్గాలకి ఆహ్వానం పలికింది రామనాధం కుటుంబం. కాకినాడ నుండి రామ్ కుటుంబం, మాలిని జోసెఫ్ లతో పాటు, హైదరాబాదులోని బంధువులు వేంచేశారు.

***

శాంతా, పారూలు కుటుంబాన్ని కలసిన సంతోషంలో ఉన్నారు. పారూ, కిరణ్ లు ఒకరిని ఒకరు విడువకుండా కబుర్లలో మునిగి ఉన్నారు.

ఉగాది పూజయ్యాక, ఉగాది పచ్చడి, ప్రసాదాలు పుచ్చుకున్నాక షడ్రుచుల విందు కూడా అయిన తరువాత, స్వీట్స్ వడ్డించే బాధ్యత విమలా, శ్రీనివాస్ గారు తీసుకున్నారు.

స్వయంగా అతిధులకు స్వీట్స్ సర్వ్ చేస్తూ అందరికీ వినిపించేలా ‘మరో నెలరోజుల్లో ... కిరణ్, పరమేశ్వరీల నిశ్చితార్థ కార్యక్రమం తమ స్వగృహంలో జరగాలన్న కోరికని వ్యక్తపరచి, వివాహం కూడా జయ గార్డెన్స్ లో వైభవంగా జరిపిస్తే బాగుంటుందని సూచించారు శ్రీనివాస్ గారు. కిరణ్, పరమేశ్వరి ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.

పారూ పెళ్లి ప్రస్తావనతో అమ్మాయి తండ్రి మనసు సంతోషంతో నిండిపోయింది. అమ్మమ్మగారి పరిస్థితి కూడా అదే.

"మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలే మాకు ముఖ్యం" అన్నాడు రామ్, శ్రీనివాస్ గారితో.

"మీ చొరవకు చాలా సంతోషం బావగారు. మీ ఆశీస్సులు మాకు పదివేలు. అన్ని విషయాలు తీరిగ్గానే మాట్లాడుకుందాము." అన్నాడు శ్రీనాధం, శ్రీనివాస్ తో.

బంధువర్గం లోని మూడు కుటుంబాల్లోనే కాక మాలిని, జోసెఫ్ ల్లోనూ సంతోషాలు, సంబరాలు వెల్లివిరిసాయి. సీతమ్మ, శాంత, మాలినీలు తమ పారూ అదృష్టానికి మురిసిపోయారు.

అప్పుడే పట్టుచీరలు, నగలు, అలంకారాలు, ఏర్పాట్లు, ఆహ్వానాల గురించి ఆలోచనలు మొదలయ్యాయి.

మీనాక్షి విషయంలో శ్రీనివాస్ అంకుల్ కి ... ప్రశాంతత చోటుచేసుకుని ఉండవచ్చునని భావించింది పారూ. మీనాక్షి క్షేమంగానే ఉన్నదనీ, తన జీవితాన్ని తనకి కావాల్సినట్టుగా తీర్చిదిద్దుకునే పనిలో ఉందనీ కిరణ్ నుండి కూడా తెలుసుకుని పారూ సంతోషించింది.

***

నచ్చలేదు...

కిరణ్- పరమేశ్వరీల నిశ్చితార్థం తమ స్వగృహంలోనే బ్రహ్మాండంగా జరిపించారు శ్రీనివాస్ దంపతులు. నగరంలోని ప్రముఖులెందరో విచ్చేసారు. సంగీతకారులు, కళాకారులు, పారూ నిర్మాతలు కూడా విచ్చేసి పారూ, కిరణ్ లకి అభినందనలు తెలిపారు.

కొంత ఆలస్యంగానే అయినా తన రాకతో అతిథుల్ని, తల్లితండ్రుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది మీనాక్షి. పోతపోసిన విగ్రహంలా కొంత వొళ్ళు చేసిన ఆరునెలల గర్భవతి ఆమె. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా కదిలి వచ్చింది. చిరునవ్వుతో అందరినీ పలకరించింది. కిరణ్, పారూలకి అభినందనలు తెలిపింది.

తల్లితండ్రుల వంక నవ్వుతూ చూసింది. పెద్దవాళ్లెవ్వరూ మీనాక్షితో మాట్లాడ్డానికి జంకడంతో ... పారూ, కిరణ్ లు ఆమెతో కలిసి కూర్చుని భోంచేశారు.

బయటవారంతా వెళ్ళిపోయాక దూరంగా కూర్చుని సేద తీరుతున్న తండ్రి వద్దకు వచ్చింది మీనాక్షి.

“చూడండి డాడీ, నాకు ఈ ఇల్లు, ఫార్మ్ హౌస్ కావాలి. మీ వ్యాపారాల్లో పెత్తనం కావాలి. అలా కాకుండా పూర్వుల పొలాలు, మిద్దెలు, వంద కోట్ల నగదు ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నారు. అలా కుదరదు డాడీ. మీ సెటిల్మెంట్ ప్రతిపాదన నచ్చలేదు డాడీ. మీరు నాకు కిరణ్ని భర్తగా ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని క్షమించలేను.

నేను పోట్లాడితే, ఇంతమాత్రం ఆస్థులు కూడా ఇవ్వరేమో అన్న అనుమానం ఉంది. అయినా చాలా మర్యాదగా ఆడుగుతున్నాను. ఒకవేళ మీరు కాదంటే......" అని తండ్రిని బెదిరిస్తున్న మీనాక్షి భుజాన చేయి వేసింది వెనుక నుండి విమల.

"మీనా! అంతా విన్నాను. నీ అదిరింపులు, బెదిరింపులు ఇక సాగవు. నీకు మా మీద ద్వేషం పోయినప్పుడే మా వద్దకు రా. తల్లివి కాబోతున్నావు. నీ వైఖరి మార్చుకోమ్మా!. మీ డాడీ, నేను ఆస్థుల విషయంలో నిర్ణయం చేసేసాము. ఇక అది మారదు. ఇంటి మీద అంత ప్రేమ ఉంటే ... వదిలి వెళ్లిపోయేదానివే కాదు. నిన్ను బాధపెట్టాలన్నది నా అభిమతం కాదు. క్షేమంగా వెళ్ళు. జాగ్రత్తగా ఉండు మీనాక్షి!" అంటూ భర్తతో అక్కడి నుండి కదిలిపోయిందామె.

***

గట్టి నిర్ణయమే...

తమ ఎస్టేట్, ఆస్థుల పంపకాల్లో ఎటువంటి మార్పులూ ఉండబోవన్న విషయం లాయర్ ద్వారా కూడా తెలిపారు శ్రీనివాస్ దంపతులు. ఆలోచించుకోడానికి సమయం కోరింది మీనాక్షి.

***

అలా జరిగింది....

కిరణ్-పరమేశ్వరీల పెళ్లి ముహూర్తం కుదిరింది. సంగీత కచేరీలు, కొత్త ప్రోజెక్టుల నుండి కొద్దికాలం విశ్రాంతి తీసుకుని తన పెళ్లి పనుల్లో నిమగ్నమయినా ప్రతినిత్యం సంగీత సాధన మాత్రం ఆపలేదు పారూ.

ఆ నాలుగు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో మునిగారు. వివాహవేదికగా జయ గార్డెన్స్' లో, నాలుగురోజుల షడ్రుచుల విందులకి అడ్వాన్సులిచ్చాడు తండ్రి రామ్‌కుమార్‌.

చీరల కోసం కంచికి వెళ్లారు ఆడవాళ్ళు. నగలు నాలుగు పేరున్న షాపుల్లో ఆర్డర్లు చేశారు.

***

సందడిగా... ఓ పండుగలా జయగార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవానికి కళారంగం నుండి విచ్చేసిన అతిరథమహారధులు, అతిధులు, బంధుమిత్రులు కాక వేలాది అభిమానులు సైతం లైవ్ లో పరమేశ్వరి, కిరణ్ నాథ్ ల వివాహ మహోత్సవం కనులపండువగా వీక్షించారు.

అమ్మా, అమ్మమ్మ, మాలినీ ల కలలు, ఆశలు ఫలించాయి. ఆ ముగ్గురమ్మల మురిపాల బిడ్డగా ఎదిగిన పారూ, నేడు ప్రపంచ ఖ్యాతి నార్జించిన గాయని. పారు తండ్రిగా రామ్ ఆశలు, ఆశయాలు సంపూర్ణంగా నెరవేరాయి.

శ్రీనివాస్ మూర్తి, విమల అభిమానాలు మెండుగా గెలుచుకుంది పరమేశ్వరి. అంతే కాదు.. తమ కోడలి స్థానంలో 'శ్రీ క్రియేషన్స్ టీవీ ఛానల్' యొక్క బాధ్యతలు వహించే అధినేత స్థానాన్ని పరమేశ్వరీకి పెళ్లి కానుకగా అందించారు మూర్తి దంపతులు.

పుట్టినింట, మెట్టినింటా కూడా పరమేశ్వరి జీవితం ప్రేమాభిమానాలతో నిండిపోయింది.

***

మీనాక్షి తల్లితండ్రులతో అవుట్-ఆఫ్-కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నాక, మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దికాలానికే దుబాయ్ కి తరలి పోయిందని సమాచారం.

వెళ్ళే ముందు, తాను రంజిత్ ని వివాహం చేసుకున్నానని తెలియజేస్తూ ఫోటోలు పంపింది తల్లితండ్రులకి.

తాము కొన్నాళ్ళు దుబాయిలో ఉండి.. అక్కడినుండి అమెరికా వెళ్లిపోతామని, అక్కడ రంజిత్ ప్రొడక్షన్ హౌజ్ తరఫున టీవీ, సినీ చిత్ర నిర్మాణ రంగంలో కృషి చేస్తానని కూడా తెలియజేసింది.

***

యేడాది పాటు... కొత్త జీవితం, కొత్త బాధ్యతలతో ఊపిరాడలేదు పారూకి. ఆమె ఆధ్వర్యంలో, శ్రీ క్రియేషన్స్ టీవీ ఛానల్ నూతన ఉత్తేజంతో ముందుకి చక్కగా సాగుతుంది.

పడమటి సంధ్యారాగం ….

అమెరికా నుండి 'పరమేష్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్' వారు పరమేశ్వరిని కలవాలన్నారు. సాంప్రదాయ సంగీతం ఆధారితమైన ఓ చక్కని కుటుంబ కధని సినిమాగా రూపొందించే ప్రతిపాదనతో పరమేశ్వరి ముఖ్య పాత్రధారిణిగా చిత్ర నిర్మాణం జరిపే ఆలోచనతో ఉన్నారని తెలియజేసారు నిర్మాతలు. పెర్త్, ఆస్ట్రేలియా నుండి నేథన్ చెరియన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ప్రొడక్షన్ పర్యవేక్షణ కూడా చేబడుతారని తెలిపారు.

యువతకి, కళారంగంలోని వారికి స్ఫూర్తిదాయకంగా ఉండగలిగే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి అనువదించే ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు.

పరమేశ్వరి సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపింది. సంస్థ తరఫున పలు మార్లు నేథన్ హైద్రాబాదు వచ్చి అందరితో చర్చలు జరిపాడు. సంగీతకారిణి పరమేశ్వరి జీవితాన్నే ఆధారంగా నిర్మించేందుకు పరమేశ్వరి అంగీకారాన్ని తీసుకుని శరవేగంగా చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు 'పరమేష్ ఫిలిమ్స్' తరఫున నేథన్ బృందం.

***

ఓ ఏడాది పాటు నిర్మాణం తరువాత 'హృదయ గానం' అన్న సంగీత కళాఖండాన్ని ఉగాది విడుదలకి సిద్ధపరిచారు. అమెరికా నుండి నిర్మాతల బృందం, ఆస్ట్రేలియా నుండి నిర్మాణ నిర్వాహక బృందం, కధా-సంగీతం కూర్చిన బృందంతో పాటు గౌరవ సలహాదారులయిన డాక్టర్ మాలీని దేవి అబ్రహం, వేదాంతం సీతామహాలక్ష్మీ, శాంతా, రామ్‌కుమార్ లు ... ఒకే వేదికపైకి వచ్చి చిత్ర విడుదల సభలో పాల్గొననున్నారని విస్తృత ప్రచారణ జరిగింది.

'హృదయగానం' సినిమా విడుదలకి రంగం సిద్ధమైంది.

***

'హృదయగానం' నేడే విడుదల ....

బ్యానర్లు నగరమంతా వెలిశాయి. మాదాపూర్ ఆర్ట్స్ సెంటర్ లో వేలాది ప్రేక్షకుల నడుమ సభ అంగరంగ వైభవంగా ఆరంభమైంది.

సినీ నిర్మాత నుండి 'ప్రత్యేక ఆహ్వాన సందేశం' అంటూ స్క్రీన్ పై వీడియో మొదలయింది. నిర్మాత 'పరమేష్' చిత్రం ... ఓ అందాల బాబుది.

"తెలుగు ప్రజకు నమస్కారాలు. మా ‘హృదయాగానం’ సినిమా నేడే విడుదల. తెలుగు వారు గర్వించదగ్గ మేటి గాయని 'పరమేశ్వరి రామ్‌కుమార్‌' నిజ జీవిత గాధని తెరకెక్కించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. నేను ఆప్తురాలిగా భావించే పరమేశ్వరి పిన్నికి నా అభివాదములు. మీరందరూ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి." అన్న పరమేష్ బాబు వీడియో సందేశం ముగిసిన వెంటనే...

సహ నిర్మాత 'మీనాక్షి మూర్తి' వేదిక పైకి వీల్-చైర్లో ప్రవేశించింది. ఆ వెనుకే... పరమేష్ ని ఎత్తుకుని ఓ యువకుడు కూడా నడిచి వచ్చాడు.

మీనాక్షి గురించి పరిచయ వాఖ్యాలు చెప్పిన నేథన్ చెరియన్ ... మైక్ ఆమెకి అందించాడు. "అందరికీ నమస్కారం. నేను మీనాక్షి. ఈ సినిమా తీయడానికి కారణం పరమేశ్వరి. ఆమె జీవితం, వ్యక్తిత్వం, నడవడి కూడా నేటి యువతకి, సమాజానికి స్ఫూర్తిదాయకం అవగలదన్న తలంపుతో నిర్మించాము. నేను స్వయంగా ఆమె అభిమానిని. ఆమె నుండి ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాము. ఈ మంచి సినిమాని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తాను." అని ముగించారామె.

పరమేశ్వరి సహా మీనాక్షి తల్లితండ్రులు, కిరణ్, బంధువర్గమంతా భావోద్వేగానికి గురయ్యారు. ఎంతోకాలంగా దూరమైన మీనాక్షి మాటలని ఆనందభాష్పాలతో ఆకళింపు చేసుకున్నారు. మీనాక్షి రూపాన్ని మనసున నిలుపుకున్నారు. కార్యక్రమం ఎప్పుడు ముగుస్తుందా .. ఎప్పుడెప్పుడు ఆమెని, బాబుని కలుద్దామా అని ఉవ్విళ్ళూరారు వారు.

***

కార్యక్రమం ముగుస్తూనే... నిర్మాత ‘పరమేష్ మూర్తి నుండి… శ్రీనివాస్ దంపతులకి, కిరణ్ దంపతులకి, రంగనాధం గారి కుటుంబానికి, రామ్‌కుమార్‌ కుటుంబానికి, జోసెఫ్ దంపతులకి --- మరునాడు ఒబెరాయ్-షెరటాన్ లో బ్రేక్-ఫాస్ట్ కి ఆహ్వానం అందింది.

ఇన్నాళ్ళకి …. ఈ కలయిక శుభ పరిణామామే ...

అందరినీ సాదరంగా పలకరించింది మీనాక్షి. తల్లితండ్రులకి కన్నీళ్లతో అంజలి ఘటించింది. "మీ మనవడు 'పరమేష్'” అంటూ బాబుని వారి చేతుల్లో ఉంచింది.

"మీకు నా గురించి ఎన్నెన్నో జవాబులేని ప్రశ్నలు ఉన్నాయేమో గానీ, నేను బాగున్నాను. క్షేమంగా లాస్-ఏంజెలెస్ కాలిఫోర్నియాలో స్థిరపడ్డాను. నా భర్త రంజిత్ కి ప్రపంచవ్యాప్తిగా వ్యాపారాలున్నాయి. నేను మాత్రం అమెరికాలో నివసిస్తూ చిత్రనిర్మాణం చేపట్టాను. మేము నిర్మించిన హాలీవుడ్ చిత్రాలు విజయవంతమయ్యాయి.

‘హృదయగానం’ సినిమాకి మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. ప్లీజ్ అందరూ బ్రేక్-ఫాస్ట్ చేసి వెళ్ళండి." అంటూ మరోమారు అందరికి నమస్కారాలు చెప్పింది మీనాక్షి.

****************

సమాప్తం

పాఠకులకు నమస్కారాలు,

నమస్తే 'సిరికోన - జొన్నలగడ్డ రాంభొట్లు సరోజమ్మ' - 2023 ‘ఉత్తమ రచనా పురస్కారం’ అందుకున్న నా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ గత ఇరవై మాసాలుగా ‘సిరిమల్లె – తెలుగు భాష సౌరభం’ అంతర్జాల సాహిత్య పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడుతూ ఈ జూలై సంచికతో ముగియనుంది.

ప్రచురణకి స్వీకరించినందుకు సంపాదకులు మధు బుడమగుంట గారికి మరియు ఉమా బుడమగుంట గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎంతగానో ఆదరించి, స్పందించిన పాఠకులకి మిక్కిలి ధన్యవాదాలు.

త్వరలో మరో ధారావాహికతో మీ ముందుకు వస్తాను – నమస్కారములతో మీ ఉమాభారతి.

రచయిత్రి పరిచయం ....

Uma Bharathi Kosuri‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in July 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *