నువ్వు గంగను మోశావు
నాతో బెంగలను మోయిస్తున్నావు
నువ్వు నిప్పును భరించావు
నన్ను నిందలను భరించమంటున్నావు
నువ్వు విషాన్ని కంఠంలో దాచావు
నన్ను విషాన్ని గుండెల్లో దాచుకో అంటున్నావు....
ఒక్క క్షణమైన ఈ దరిద్రుడిపై దయచూపి ఓదార్చాలని
నీకు అనిపించలేదా ఓంకారేశ్వరా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా...
అలసిన దేహం నిదుర మత్తులో మునిగి సుఖపడినట్టు....
అలసిన మనసు నీ స్మరణ మత్తులో పడదోసి
మనశ్శాంతిని ఇస్తున్నావా....
ఇచ్చువాడివి నీవా...
ఏదో లేదని సచ్చువాడివి నేనా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా...
నా చేతి గీతలు
నా నుదిటి రాతలు
నీ చేతి ఆటలు
నా జీవితం అరిగి కరిగి ఆవిరై
నీ లింగమందు లీనమవని శంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అమ్మ కడుపు తీపి ఎంత
నాన్న గుండె బరువు ఎంత
పెంచి పోషించబడ్డ కొడుకు గుణం ఎంత
బంధాల బాధే జీవన బోధనా...!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చిన్నవాడికి ఆట పిచ్చి
వయసువాడికి శృంగార స్పర్శా సుఖ పిచ్చి
పిల్లలు ఉన్నవాడికి ఉద్దరించాలనే పిచ్చి
వృద్ధుడికి జ్ఞాపకాల పిచ్చి
ఈ పిచ్చిలో పడకుండా
నీ ఉచ్చులో నన్ను గుచ్చవా మహదేవా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
భూమి నలుపేలా
నీరు తెలుపేలా
నిప్పు ఎరుపేలా
నింగి నీలమేలా
గాలి అదృశ్యమేలా
పంచభూతాలు నీ పరిమళ రంగులా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నాలుక మాటల తూట
నడుం బరువుల మూట
నడక నడవడి బాట
నరుడి జీవితం ధర్మపు నీ ఆట
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మూగజీవులది కడుపు నింపుకునే గొడవ
మనుషులది వెనకేసుకోవాలనే గొడవ
ప్రకృతిది వినాశాల వికృతితో గొడవ
గొడవలు నీ ఆటకు పడవలా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కంటికి కన్నీటితో బంధం
మనసుకు భావనతో బంధం
మనిషికి అనుభవాలతో బంధం
భక్తుడికి నీ ఆటలే అనుబంధం
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
శివా....
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో
ఏదీ శాశ్వతం కాదని తెలిసినా...
ఏదో సాధించాలని శోధన చేసి
నీ శ్మశానానికి వరుస కట్టిన ఈ ప్రాణుల గెలుపెంత ఈశ్వరా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...