
బాంబులు, పిస్తోళ్లు విప్లవాన్ని తీసుకురాలేవు, విప్లవమనే ఖడ్గాన్ని సరికొత్త ఆలోచనలతోనే సానబెట్టగలమని అన్నారు భగత్ సింగ్. 1907 సెప్టెంబర్ 27న జన్మించిన భగత్ సింగ్, కేవలం ఇరవై మూడేళ్ళ పిన్న వయసులో మార్చ్ 23 1931న బ్రిటిష్ ప్రభుత్వంచే ఉరి తీయబడ్డారు. భారత దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటం సాగించి అసువులు బాసిన విప్లవ వీరునిగా భగత్ సింగ్ అజరామరమైన కీర్తిని సంపాదించారు. అప్పటినుండీ ఇప్పటివరకూ గాంధీజీ అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా హింసాయుత పంథాలో బ్రిటిష్ వారికి బుద్ధి జెప్ప యత్నించి వీరోచితంగా ప్రాణాలు వదలిన వ్యక్తిగానే అత్యధికులు భగత్ సింగ్ ను అవగాహన చేసుకున్నారు. కానీ అది కేవలం ఒక సంకుచిత ధోరణిలో భగత్ సింగ్ ను అర్ధం చేసుకోవడమవుతుంది.
భగత్ సింగ్ ఇరవై మూడేళ్ళ పిన్న వయసులోనే మహోత్కృష్టమైన భావోన్నతిని అందుకున్న వ్యక్తి. "నేనెలా నాస్తికుణ్ణయ్యాను?" అన్న ఒక్క వ్యాసం భగత్ సింగ్ లోని భావ చైతన్యానికి దర్పణం పడుతుంది. ఈ వ్యాసాన్ని భగత్ సింగ్ 1930వ సంవత్సరంలో లాహోర్ సెంట్రల్ జైల్లో ఉండగా రాశారు. భగత్ సింగ్ మరణానంతరం సెప్టెంబర్ 27 1931న ఇంగ్లీష్ వీక్లీ ది పీపుల్ లో అచ్చయింది.
"నేనెలా నాస్తికుణ్ణయ్యాను?" అన్న వ్యాసంలో భగత్ సింగ్ ఉటంకించిన అభిప్రాయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :-
- నేను సర్వ శక్తి మంతుడైన దేవుని ఉనికినే తిరస్కరిస్తున్నాను.
- సంక్లిష్ట పరిస్థితిలో తప్ప హింస సమర్ధనీయం కాదు. ప్రజా ఉద్యమాలన్నిటిలోనూ అహింసే తప్పనిసరి విధానం.
- విశ్వాసం కష్టాల్ని తేలిక పరుస్తుంది. పై పెచ్చు వాటిని సుఖాలుగా మారుస్తుంది. భగవద్భక్తి వల్ల మనిషికి ఎంతగానో ఊరట కలిగించే ఒక సాధనం లభిస్తుంది. 'అతను' లేకుంటే మనిషి తనపై తాను ఆధారపడవలసిందే. తుఫానుల మధ్య, ఝంఝూమారుతాల మధ్య తమ కాళ్ళ మీద తాము నిలబడగలగటమంటే చిన్న విషయం కాదు.
- విమర్శ,స్వతంత్ర ఆలోచనా ధోరణి - ఇవి రెండూ ప్రతి విప్లవకారునిలో ఉండాల్సిన తప్పనిసరి గుణాలు.
- మనిషిలో లేశమాత్రమైనా వివేచనా శక్తీ వున్నట్లైతే, అతను తన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని హేతువాద దృక్పథంతో అర్ధం చేసుకోవాలి.
- పరమ చైతన్య మూర్తి, సర్వోత్తమ పాలకుడు అయిన దేవుడు ఈ ప్రపంచాన్నీ, అందులో మనుషుల్నీ ఎందుకు సృష్టించినట్టు , ఆనందం కోసమా? అలాంటప్పుడు భగవంతునికి ,నీరో చక్రవర్తికీ వ్యత్యాసం ఏమిటి ?
- ఈనాడు కష్టాలు అనుభవిస్తున్న వారంతా పూర్వ జన్మలో పాపులైతే, ఈనాటి పీడకులంతా గత జన్మలో సాధుపురుషులా ? అందుకే ఈనాడు వారు అధికారాన్ని అనుభవిస్తున్నారా?
- సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రపంచ యుద్ధం వల్ల మీద పడే విపత్తుల నుంచి మనవజాతిని ఎందుకు రక్షించడు? భారతదేశాన్ని దాస్య బంధాల నించి విముక్తి చేయమనే ఆలోచనను బ్రిటిష్ వారి మనసులో భగవంతుడు ఎందుకు పుట్టించడు?
- సర్వశక్తిమంతుడైన దేవుడు ఉత్పత్తి సాధనాల మీద తమ వ్యక్తిగత ఆస్తి అధికారాన్ని త్యజించమని పెట్టుబడిదారుల హృదయాల్లో పరోపకార భావనని ఎందుకు నింపడు? సమస్త మానవ సమాజమును పెట్టుబడిదారీ సంకెళ్ళ నుంచి ఎందుకు విముక్తులను చేయడు?
- మీరు నన్ను అడగవచ్చు - విశ్వం పుట్టుక, మానవ వికాసం పై వ్యాఖ్యలను నేనెలా చేస్తున్నానని? చార్లెస్ డార్విన్ జీవోత్పత్తి చదవండి. సోహాన్ స్వామి రాసిన కామన్ సెన్స్ చదవండి. మీ ప్రశ్నకి ఒక మేరకు జవాబు లభిస్తుంది.
ఈ వ్యాసం ద్వారా అర్ధమయ్యేదేంటంటే భగత్ సింగ్ కేవలం నాస్తికుడే కాదు హేతువాది, మానవవాది, సామ్యవాది కూడాను. పెట్టుబడిదారీ సమాజాలు లాభాపేక్ష, వ్యక్తి స్వార్ధం కేంద్రాలుగా యువత మీదకు సంధించే వ్యక్తిత్వ వికాస పాఠాల కంటే ఎన్నో రెట్లు విలువైనది, శక్తివంతమైనదీ భగత్ సింగ్ వ్యాసం.
ఏప్రిల్ 18 1929న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ తో కలసి ఢిల్లీ అసెంబ్లీ లో బాంబులు వేసే రోజున ప్రయాణానికి బయలుదేరే ముందు భగత్ సింగ్ సుఖ్ దేవ్ కు రాసిన ఉత్తరంలో ప్రేమ గురించి తన అభిప్రాయాల్ని తెలిపాడు.
మనిషన్నవాడి జీవితాశలూ, ఆకాంక్షలు అతని తోవకి అడ్డం కారాదు. అతను నిజమైన మనిషైతే! నీకు దీనికి ఋజువు అతను నడిచే తోవలోనే లభిస్తుంది.
ప్రేమ ఎన్నడూ తనంత తానుగా పాశవిక ప్రవృత్తి కాలేదు. ఒక మానవీయంగా, అత్యంత మధురభావం అది. ప్రేమ మనిషి వ్యక్తిత్వాన్ని ఉన్నత పథాలకి చేరుస్తూ వచ్చిందే తప్ప అతన్ని అధః పాతాళానికి తొక్కివేయలేదు. ప్రేమ అసలైన ప్రేమ అయినపుడు నువ్వు ప్రేమ వంకతో అమ్మాయిల్ని పిచ్చెతించలేవు. ప్రేమ మానవ బలహీనత అంటే - దాని అర్ధం - సాధారణ స్థాయిలో ఉన్న మామూలు మనిషి గురించి అన్నది కాదు. మనిషి రాగద్వేషాల్ని అదుపులో ఉంచుకుంటూ తన కార్యక్రమాలకి అనుగుణంగా మనసును క్రమశిక్షణలో పెట్టుకోవడం- ఇది ఆదర్శవంతమైన స్థితి. నేను ఒక మనిషిని (స్త్రీని) మరొక మనిషి (మగాడు) ప్రేమించడాన్ని విమర్శించను. అది కూడా ఓ ఆదర్శాన్ని దృష్టిలో ఉంచుకునే మానవీయ ప్రేమలోని భావ ప్రగాఢతని సంతరించుకోవాలి. ఏదో ఓ మనిషి వరకే దాన్ని పరిమితం చేయరాదు. దాన్ని విశ్వవ్యాపితం చేయాలి.
కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల మాసపత్రిక మోడరన్ రివ్యూ సంపాదకుడు రామానంద చట్టోపాధ్యాయ ఒక సంపాదకీయంలో భగత్‌సింగ్ ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఖూనీలకి, కుట్రలకీ అరాచకత్వానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా భగత్‌సింగ్ తన తరపున, బటుకేశ్వర్ దత్ తరపున మోడరన్ రివ్యూ కి డిసెంబర్ 23, 1929న ఒక లేఖ రాశాడు.
అందులో - ఈ నినాదం రష్యా విప్లవోద్యమంలో ప్రయోగించబడింది. ప్రఖ్యాత సోషలిస్ట్ రచయిత అప్టన్ సింక్లేయర్ బోస్టన్, ఆయీల్ అనే నవలల్లో అరాచకవాద విప్లవకారుల ముఖతః ఈ నినాదం అనిపించాడు. ఇంక్విలాబ్ జిందాబాద్! అనే మాటకి అర్ధం ఏమిటి ? దీని అర్ధం సాయుధ పోరాటం ఎల్లపుడూ సాగుతూ ఉండాలనీ, ఏ వ్యవస్థ కూడా కొన్నాళ్లపాటైనా నిలకడగా ఉండలేదని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశంలో, సమాజంలో అరాచకత్వం వ్యాపించి ఉండాలని ఎంత మాత్రం కాదు!
విప్లవకారులకు ఈ వాక్యం - ఇంక్విలాబ్ జిందాబాద్ - పూజనీయమైనది. విప్లవానికి (ఇంక్విలాబ్) అర్ధం తప్పనిసరిగా సాయుధ పోరాటమే కానక్కరలేదు. పిస్తోళ్లు అప్పుడప్పుడు విప్లవాన్ని విజయవంతం చేసే సాధనాలు మాత్రమే కాగలవు. కొన్ని ఉద్యమాల్లో బాంబులు, పిస్తోళ్లు అతి ముఖ్యమైన సాధనాలుగా నిరూపించబడతాయి కూడా. అంత మాత్రం చేత బాంబులు, పిస్తోళ్లు విప్లవానికి పర్యాయపదాలు కాజాలవు. అలాగే తిరుగుబాట్ల అంతిమ లక్ష్యం విప్లవమే అయినప్పటికీ, తిరుగుబాట్లన్నిటినీ విప్లవం అనలేం.
విప్లవం అనే మాటకి "అభ్యుదయం కోసం మార్పు అనే భావన - ఆకాంక్ష" అని అర్ధం. సర్వ సాధారణంగా ప్రజలు అనూచానంగా వస్తున్నా జీవిత దశలతో అతుక్కుపోతారు. మార్పు అంటే భయపడిపోతారు. అందువల్ల జాతిని నిర్వీర్యం చేస్తున్న భావజాలానికి బదులుగా విప్లవ భావాలను ప్రోది చేయాల్సిన ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది. ప్రతీప శక్తులు మానవ సమాజాన్ని తప్పుతోవ పట్టిస్తున్నాయి, ఈ పరిస్థితులు మానవ సమాజాభ్యున్నతికి పెద్ద అవరోధంగా తయారయినాయి.
ఈ విప్లవ భావనతోనే మానవజాతి హృదయం నిండిపోయి, స్థాయీ రూపంలో ఉండాలి. తద్వారా ప్రతీపశక్తులు మానవ సమాజ ప్రగతి అనే పరుగులో అడ్డంకులు ఏర్పరచేందుకు సంఘటిత పడకుండా ఉండేలా చూడవచ్చు. అలాగే పాత వ్యవస్థ ఎల్లప్పుడూ ఉంటూనే, కొత్త వ్యవస్థకీ చోటు ఇస్తూ ఉండాలి. ఆ విధంగా ఓ ఆదర్శ వ్యవస్థ ప్రపంచాన్ని చెడిపోకుండా ఆపగలుగుతుంది.
భగత్‌సింగ్ సాహస కార్యాల కన్నా స్ఫూర్తివంతం అతనిలో కలిగిన భావ విప్లవం. భగత్ సింగ్ వంటి నాటి యువ ఆలోచనాపరుల బాటలో నేటి భారతదేశ యువత నడవటమే నవోదయానికి నాందీ వాక్యం. కుల రుగ్మత, మత మౌఢ్యం, పెట్టుబడిదారీ సమాజపు వికృత ధనస్వామ్యం నిస్సిగ్గుగా చెలరేగుతున్న నేటి పరిస్థితుల్లో భగత్ సింగ్ వంటి వారిని యువతకు స్ఫూర్తి ప్రధాతలుగా నిలపవలసిన అవసరం ఎంతైనా వుంది. దేశ భక్తి పేరిట వారానికి డెబ్బై గంటల పని దినాలకై యువతను ప్రేరేపిస్తున్న పెట్టుబడిదారీ కుటిల యత్నాలకు అడ్డు నిలిచి అన్నార్తులు లేని సర్వోదయ సమాజాన్ని నిర్మించుకోవాలంటే భగత్ సింగ్ లో వచ్చిన భావ విప్లవం నేటి యువతీ యువకుల్లోనూ రావాలి.
భగత్‌సింగ్ నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కనని తన చిన్న తమ్ముడు కులతార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరంలో (మార్చ్ 3 1931) తనను తాను వర్ణించుకున్నాడు. నాటి నుంచి ఆ వేగుచుక్క అందిస్తున్న స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకోవాలి.