Menu Close
Rajesam Thokala
నాయకుడు (పద్యకవిత)
తోకల రాజేశం
సీ. కులము పానుపు మీద కులుకుచూ ప్రజలలో
            విద్వేష బీజాలు విత్తు వాడు
    మతము బెబ్బులి క్రూరమైన యాకలికి మా
            నవులను బలియిచ్చి నవ్వు వాడు
    ధన బలమ్మున ముందు వెనుకలు గానక
            న్యాయానికూపిరుల్ దీయు వాడు
    అందలమను మత్తు మందుకు మరిగి ధ
            ర్మాంగనన్నడి వీధినమ్ము వాడు

తే. గీ. ప్రజల ఐకమత్యమ్మున ప్రబల మైన
         విషపు దారలు చిలికించి వేరు జేసి
         అందరికి నేనె దిక్కంచు అరుగుదెంచు
         చుండె నాయకుండన్న పేరున్న వాడు

ఉ: మాటల లోన తేనీయలు-మాటున ఘోర విషమ్ము-లోపలన్
     బైటికి వేరు వేరు-బలవంతపు నవ్వులు,-మధ్య మధ్య చిం
     దాటలు-ఓటరుల్ గలిసినంతనె చేతులనెత్తి మొక్కుటీ
     నాటకముల్ ప్రమాదము జనమ్ముల పాలిట నెల్ల వేళలన్

క: ఆ వింత వింత చేష్టలు
    నా వేషము నా శపథము లావేశము నా
    నా విధమగు ప్రకటనలను
    కావింతురు నేతలెన్నికల సమయానన్

మ: ఒకనాడోట్లను బిచ్చమెత్తుకొని ఉద్యోగమ్ము సాధించి శా
     సకుడై పోయిన సంగతుల్ మరిచి నీచస్వార్థుడై సొంత యిం
     టికి పోలీసుల కంచె వేసుకొని లాఠీ రాజ్యముం జేయు నా
     యకుడే రీతి వహించి యీ జన సమస్యల్ దీర్పగా నేర్చునో?

రచయిత పరిచయం

Rajesam Thokalaతోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Posted in July 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *