Menu Close
ఉప్పలూరి మధుపత్ర శైలజ
చివరి కోరిక
మధుపత్ర శైలజ

“ఏరా పెద్దోడా! రాత్రి టి.వీ.లో సినిమా చూస్తూ నిద్రపోలేదా ఏమిటి? ఇంత ఆలస్యంగా పొలానికొచ్చావు?” కొడుకుని ఆప్యాయంగా పలకరించాడు చేనుకి నీరుపెడుతున్న దేవయ్య.

“ఔను నాన్నా! తమ్ముడు కూడా ఈరోజు పొలానికి ఆలస్యంగానే వస్తానని చెప్పమ్మన్నాడు” కాస్త సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు పెద్దోడు పంకజ్.

“ఫర్వాలేదులేరా! ప్రతిరోజూ నా కన్నా ముందుగానే పొలానికొచ్చి పనుల్లో మునిగిపోయే మీరింకారాలేదేమిటా? అని అడిగానంతే. పిల్లకాయలైన మీకు ఏవో సరదాలుంటాయి కదా” అంటూ పారపట్టుకుని కదిలాడు దేవయ్య.

దేవయ్యకి 55 ఏళ్ళ వయస్సుంటుంది. రాయలసీమలోని 'పామిడి' గ్రామం వారిది. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన రెండెకరాలకు తన రెక్కల కష్టంతో మరో రెండెకరాలను జత చేసి, కూతురు, ఇద్దరు కొడుకులతో సంతోషంగా జీవనయాత్రను చేస్తున్నాడు. అతని భార్య సత్యవతి భర్తకి అనుకూలంగా ఉంటూ, పొలంపనుల్లో భర్తకు తాను కూడా సాయం చేస్తోంది. యుక్తవయస్సు రాగానే కూతురికి పక్క ఊరి మోతుబరి రైతు కొడుక్కిచ్చి పెళ్ళిచేసి పంపించేసాడు. కొడుకులిద్దరికి పెద్దగా చదువులబ్బలేదు. వాళ్ళు కూడా తండ్రికి పొలంపనులలో సాయంచేస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నారు.

వీరి పొలానికి ఆనుకుని భూకామందు పెద్దిరెడ్డిగారి పొలం కూడా ఉంది. ఏదో కారణం వెతుకుతూ దేవయ్యని, అతని కొడుకులను భయపెట్టి, గొడవలు చేస్తూ వీళ్ళ పొలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించే ప్రయత్నాలను చేస్తున్నాడాయన. ఊరి చుట్టుప్రక్కల వందెకరాలపొలమున్నా, తన పొలాలకు ఆనుకుని ఉన్న పొలాలను కొద్దికొద్దిగా కబ్జాలు చేస్తూ తన పొలాలలో కలిపేసుకోవటంలో సిద్ధహస్తుడైన భూబకాసురుడాయన.

ఓరోజు దేవయ్య కూలీలతో తన పొలంలో నాట్లు వేయించుతున్నాడు. చక్కగా దున్నిన పొలంలో చిన్నచిన్న నారకట్టలు పట్టుకుని ఆడకూలీలు పల్లెపదాలను కమ్మగా పాడటం మొదలుపెట్టారు.

“నింగినేలా కలయిక, నింగీనేలా కలయిక,
భూమితల్లి ఎదలో కదలిక, భూమితల్లి ఎదలో కదలిక,
మొదలయ్యే మొలకల వేడుక, మొదలయ్యే మొలకల వేడుక,
ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినారెందరో
ఈ ప్రకృతికి పదిలంగా పచ్చరంగుల నద్దినారెందరో
మట్టిని తాకిన చేతులకు మరిమరి దండాలో రామరామ
మొలకలు నాటిన చేతులకు పరిపరి దండాలో రామరామా”

అంటూ మైమరుస్తూ శ్రమని దూరం చేసుకుంటూ, పాటలు పాడుతూ, ‘పుడమితల్లికి పచ్చలపతకం’ తొడిగినట్లుగా నాట్లు వేస్తున్నారు.

సగం పొలం పూర్తికావస్తోంది. ఇంతలో పెద్దిరెడ్డిగారి పాలేరు రంగడు అటుగావచ్చి “ఏయ్ దేవయ్యా! ఏంటి సంగతి? మా అయ్యగారు ఎప్పుడో మాట్లాడి పెట్టుకున్న కూలీలతో నీ పొలంలో ముందుగా నాట్లు వేయించుకుంటున్నావా? మా బాబుగారికి నీ విషయం, ఈ కూలీల సంగతి చెప్పమన్నావా?” అంటూ రంకెలేయటం మొదలుపెట్టాడు.

దేవయ్య ఓక్షణం ఆగి “ఏరా! మిమ్మల్నందరిని ఆ పెద్దరెడ్డిగారు ముందుగా ఆయన పొలంలో నాట్ల గురించి మాట్లాడుకున్నారా?” అంటూ తన పొలంలో పనిచేస్తున్న కూలీలను అడిగాడు.

“ఔను దొరా! కానీ ఆరి పొలంలో నాట్లు వేయటానికి ఇంకా నాలుగు రోజుల సమయముంది. ఖాళీగా కూర్చుంటే మాకెలా గడుస్తుంది. నాలుగుదుడ్లు వస్తాయని మీ పొలంలో పని రెండురోజులేకదా అని మీ పనికి వచ్చాం” అన్నారు.

దేవయ్య, రంగడితో “చూసావా? వాళ్ళేం చెపుతున్నారో? బీదాబిక్కి పనుల్లేక వలసల దారి పడుతున్నారు. ఎక్కడ పనులుంటే అక్కడికే పక్షుల్లాగా తరలిపోతున్నారు. మన ఊళ్ళోవాళ్ళు అలా వలసపోబట్టే కదా మనం వేరే ఊరివాళ్ళను పిలిచి మరీ నాట్లు వేయించుకుంటున్నాం. మీ పొలంలో నాట్లువేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయముంది కదా. అందుకే రెండురోజులలో పూర్తయ్యే మా పొలంలో నాట్లు వేయటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. పాపం ఏదో నాలుగు దుడ్లు సంపాదించుకుని పోతారు కదా.

నువ్వు కూడా వీళ్ళలాగానే పనులకోసం ఎక్కడినుండో వచ్చి, ఆ పెద్దరెడ్డిగారి దగ్గర పాలేరుగా పనికి కుదురుకున్న వాడివేగా? అదృష్టం బాగుండి నిన్ను ఆ దొర చక్కగా చూసుకోబట్టి, ఇలా నీ స్థాయి మరచి వీళ్ళ మీద జులుం చలాయిస్తున్నావు? పాపం అంతా మనవంటివాళ్ళే కదా. వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోనీరా!” అంటూ రంగడికి సర్దిచెప్పాడు దేవయ్య.

అంతా విన్న రంగడు “పోనీలే పాపం వాళ్ళ ఉసురు నాకెందుకు?” అనుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటికే అటుగా వచ్చిన పెద్దిరెడ్డిగారు కూలీలను మరోసారి దబాయించాడు.

“దొరా మీ పొలంలో పనికి ఇంకా నాలుగురోజులు సమయముంది కదా ఈ దేవయ్యగారి పొలం పని రెండురోజులే కదా అని ఒప్పుకున్నాం. అలా కోపానికి రాకండయ్యా” అంటూ కాళ్ళావేళ్ళా పడి బ్రతిమలాడుకున్నారు.

“సరే ఈసారికి ఇలా కానీయండి. ఏదో పాపం బీదవాళ్ళని మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇదే ఆఖరిసారి చెప్పటం. ఏపనైనా ముందు నా ఇంట్లో, నా పొలంలోనే మొదలవ్వాలి. తర్వాతే మిగిలిన వాళ్ళ పనులు” అంటూ కఠినంగా హెచ్చరించి, వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓసారి దేవయ్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళాడు.

ఆయన వెళ్ళగానే దేవయ్య కూలివాళ్ళ దగ్గరకొచ్చి “మీ పని మీరు చేసుకోండి. పెద్దిరెడ్డిగారు అలాగే బెదిరిస్తూంటాడు. మెత్తగా ఉన్నవాళ్ళను చూస్తే మొత్తబుద్ధవుతుందని పేదోళ్ళని చూస్తే ఉన్నోళ్ళకెప్పుడూ లోకువే” అంటూ గట్టుపై ఉన్న నారుకట్టలను కూలీలకందించటం మొదలుపెట్టాడు.

ఇలాంటి చిన్నచిన్న కారణాలతోనే పక్కపక్కనే పొలాలున్న దేవయ్య, పెద్దిరెడ్డిగార్ల మధ్య స్పర్ధలు పెరిగిపోయాయి.

ఒక్కోసారి “నాన్నా! ప్రతిదీ పెద్దిరెడ్డిగారుచెప్పినట్లే చేయాలంటే ఎలా? మనదేమీ ఉమ్మడి వ్యవసాయం కాదుకదా?” అనేవారు కొడుకులు. దేవయ్యే తగ్గి ఉండమని కొడుకులకు సర్దిచెప్పేవాడు.

ఒకరోజు దేవయ్య పొలానికి పెడుతున్న నీటికి అడ్డువేసి మళ్ళించి గట్టు తవ్వించి మరీ పెద్దిరెడ్డిగారి పొలంలోకి పంపించాడు రంగడు. ఉదయం దేవయ్య పొలం దగ్గరకి వచ్చి చూసేసరికి నీళ్ళులేక వరిపైరు తలలు వాల్చేసింది.

ఎక్కడినుండి వచ్చాడో గాని రంగడు వచ్చి “ఏం దేవయ్యా! పెద్దోళ్ళతో పెట్టుకోవద్దని నీ కొడుకులతో చెప్పు. లేకపోతే అన్నదమ్ములిద్దరూ కలసి ‘ఈ పెద్దిరెడ్డిగారి అన్యాయాలకి, దుర్మార్గాలకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పేదరైతులెవ్వరినీ బ్రతకనిచ్చేలాగాలేరు’ అంటూ ఊరందరికీ దండోరా వేయించినట్లుగా చెపుతారా?. అందుకే ఈ పని చేయమన్నారు మా అయ్యగారు. ఎలా ఉంది మా బాబుగారి దెబ్బ” అన్నాడు.

ఇదంతా విన్న దేవయ్య “ఒరేయ్ రంగా! పిల్లకాయల మాటలెందుకురా పట్టించుకోవటం? నిజంగా నువ్వు ఆలోచించు. నీకూ ఓ మనసుందిగా! గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పరా! మావాళ్ళన్న మాటలలో నిజంలేదా? మీ పెద్దిరెడ్డిగారిది నీతివంతమైన జీవితమా?

ఎన్నెన్ని దిక్కుమాలిన పనులుచేస్తూ బీదరైతులను నట్టేటముంచటంలేదు? అది నీకు కూడా తెలుసు. కానీ నీ కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకుంటున్నారని ఆయనగారి మాటలకి, చేతలకి ‘తానతందాన’ అంటూ వత్తాసు పలుకుతున్నావేగాని నిజం చెప్పు? ఆయన ధర్మరాజా?

ఆయన సంపాదించిన ఆస్తి అంతా చుట్టుపక్కల పొలాలను తాకట్టుపెట్టుకుని ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వటం, ఆ రైతులు వడ్డీలే కట్టలేని స్థితిలో ఉన్నా కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవటం ద్వారా సంపాదించినవేగా! ఇదేనా న్యాయం? ఊరంతటికి పెద్దదిక్కుగా నిలబడి మారాజుగా పేరుతెచ్చుకోవల్సింది పోయి, చిన్నోళ్ళ జీవితాలతో ఆడుకోవడమేమిట్రా?" అంటూ వాపోయాడు.

దేవయ్య చెప్పినవన్నీ నిజాలే అని తెలిసినా రంగడు ఏమీ అనలేక “ఊరుకో అన్నా..” అంటూ వెళ్ళిపోయాడు. అతనూ పెద్దిరెడ్డి చేతిలో కీలుబొమ్మేగా మరి.

ఓ రోజు దేవయ్య కొడుకులిద్దరూ పొలానికొచ్చేసరికి, పెద్దిరెడ్డి దగ్గరుండి సరిహద్దుగట్టు కొట్టేసి దేవయ్య రెండెకరాల పొలం ఆక్రమించుకుని అక్కడ గట్టు వేయిస్తున్నాడు. ఎవరూ గొడవకు రాకుండా రౌడీలను కాపలాగా పెట్టుకున్నాడు.

పరుగున వెళ్ళి దేవయ్యతో కలసి తిరిగి పొలం దగ్గరకి వచ్చారు కొడుకులు. దేవయ్య పెద్దిరెడ్డితో మా పొలాన్నెందుకు ఆక్రమిస్తున్నారు? ఇది మీకు ధర్మమా?” అంటూ శాంతంగా మాట్లాడుతున్నాడు.

“అన్యాయంగా దౌర్జన్యంతో మన పొలం ఆక్రమిస్తున్న ఆయనతో మనకి మాట్లేమిటి నాన్నా?” అంటూ ఆవేశంగా మిత్రులతో కలసి కర్రలు తీసుకుని గొడవకు సిద్ధమయ్యారు కొడుకులు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రమవుతోంది. దేవయ్య కొడుకులిద్దరూ పెద్దిరెడ్డి మనుష్యుల చేతులలో బాగా దెబ్బలు తింటున్నారు. ఒళ్ళంతా రక్తం కారుతోంది.

కొడుకులను అలా చూడలేక, ఎదుటివారిని ఆపలేక, ఇక ఏదో ఒకటి చేయకపోతే తన కొడుకులు తనకు దక్కరనుకొని చుట్టుపక్కల చూసిన దేవయ్యకు ఓ గొడ్డలి దొరికింది. ఓ చెట్టు నీడన కూర్చుని నోట్లో చుట్ట తాగుతూ చిద్విలాసంగా కోట్లాటను చూస్తూ, ఆనందిస్తున్న పెద్దిరెడ్డి కనిపించాడు. “ఈ ఒక్కడిని తొలగిస్తే తన పొలం తనకు దక్కటమే కాదు ఊరిలోని బీద రైతులందరూ బ్రతికి బట్ట కడతారు” అనుకుంటూ పెద్దిరెడ్డి రౌడీతనానికి బలవుతున్న తన కొడుకులిద్దరిని రక్షించుకోవటానికి వేరే దారి దొరకని దేవయ్యలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్క గొడ్డలివేటుతో పెద్దిరెడ్డి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతే అంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుని గొడవ సర్దుమణిగిపోయింది.

ఊళ్ళోని జనమంతా గుమ్మిగూడారు. చేతిలో రక్తంకారుతున్న గొడ్డలితో పరశురాముడిలా వెలిగిపోతున్న ముఖంతో దేవయ్య “ఇక నా పొలానికే కాదు, మరే ఇతర పేదోళ్ళ పొలాలకు నష్టంలేదు. మీరంతా మీ పొలాలలో హాయిగా పంటలు పండించుకోండి. నేను జైల్లో కూర్చుని మీరుచేసే పనులను నా మనోనేత్రంతో చూస్తూ బ్రతికినంత కాలం గడుపుతాను” అంటూ కూలబడిపోయాడు.

పోలీసులొచ్చారు. వాదోపవాదనలు పూర్తయ్యి, కోర్టులో దేవయ్య నేరాన్ని ఒప్పుకోవటంతో అతనికి ఉరిశిక్ష విధించారు. దేవయ్యను రాజమహేంద్రవరం జైలుకి తరలించారు. కొన్ని నెలలకు దేవయ్య ఉరిశిక్షను ఖాయపరస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుండి కూడా ఉత్తర్వులు వచ్చాయి. అతిత్వరలో దేవయ్యను ఉరితీస్తున్నామని, ఆఖరిసారిగా వచ్చి దేవయ్యని కలసుకోమని అతనింటికి ఉత్తరం రాసారు పోలీసువారు.

దేవయ్యకి భార్యని చూడాలనిపించింది. ఆమె దేవయ్యతో ఎప్పుడూ ఒకమాట అంటూండేది. "ఏమయ్యా! మన పిల్లలిద్దరూ మన కోసమే చదువులంటూ మనలను విడిచి దూరంగా వెళ్ళలేదు. కష్టమో, సుఖమో అమ్మానాన్నలను చూసుకోవాలని మనతోనే ఉండి, పొలం పనులలో మీకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. రామలక్ష్మణుల్లా కలసిమెలసి ఉంటున్న వారు మన తరువాత కూడా అలానే ఉండాలంటే మన పొలాన్ని ఇద్దరికీ సమానంగా రాయాలండి” అనేది. పైగా “మీకు మన పెద్దోడు పంకజ్ అంటే కాస్త ప్రేమెక్కువని నాకు తెలుసు. అందుకనే ఇలా చెపుతున్నాను” అనేది.

ఆమె జైలు దగ్గరకు వస్తే తనకు పెద్దకొడుకంటే ఎందుకెక్కువ ఇష్టమో తన నోటితోనే ఈ చివరి రోజులలో చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె రానేలేదు. భార్యా, కూతురే కాదు మిగిలిన బంధువులెవ్వరూ దేవయ్యను చూడటానికి రాలేదు. కొడుకులిద్దరూ జైలు దగ్గరకు వచ్చారు.

కొడుకులిద్దరూ తండ్రితో కాస్సేపు మాట్లాడారు. “ఎందుకలా పెద్దిరెడ్డిని చంపావు నాన్నా! గాయపరచి వదిలేస్తే పోయేది. ఇప్పుడు చూడు ఏమయ్యిందో? పెద్దిరెడ్డి చేసిన అకృత్యాలన్నీ నీవు చేసిన పనితో తెరమరుగయ్యాయి. ఊళ్ళో అందరూ మమ్మల్ని ఓ హంతకుడి కొడుకులుగానే చూస్తున్నారు. నీ మూలంగా మన కుటుంబానికి చెడ్డపేరొచ్చింది. పరువు పోయింది” అంటూ నిందారోపణలు చేసారు.

వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుండగా జైలు సూపరింటెండెంట్‌గారు వాళ్ళను పిలిచి "ఉరి తీయడం అవ్వగానే మీ తండ్రిగారి శరీరాన్ని మీకు అప్పగిస్తాం" అన్నారు.

“ఆయన ఓ హంతకుడు. ఆయన శవాన్ని మేం ముట్టుకోం. మీరే ఏదో ఒకటి చేసేయండి. మేం ఇప్పుడే మా ఊరెళ్ళిపోతున్నాం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు పంకజ్. ఆమాటలను విన్న ఆ సూపరింటెండెంట్‌గారు చలించిపోయారు.

‘ఇలాంటి కొడుకుల కోసమా, రూపాయిరూపాయి కూడబెట్టి నా పిల్లలు అనుకుంటూ వాళ్ళకి పొలం, ఇళ్ళు అమర్చాడా తండ్రి. చివరికి తన వాళ్ళకి చెందాల్సిన పొలాన్ని ఆక్రమించుకుంటూ, ఆ పనికి అడ్డొచ్చిన తన కొడుకులను చంపబోతున్నాడనే ఆ పెద్దిరెడ్డిని చంపి తాను జైలు కొచ్చాడు. రేపోమాపో ఉరితీయబడతాడు. అట్లాంటి ప్రేమమూర్తయిన తండ్రినేనా వీళ్ళిలా నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడేది’ అనుకుంటూ మధనపడ్డారా సూపరింటెండెంట్‌గారు.

ఆ అభాగ్యుడి శవాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు జరపటానికి కూడా ఇష్టపడని కొడుకుల ప్రవర్తన తననే ఇంతగా బాధపెడుతూంటే ఈ విషయం దేవయ్యకి తెలిస్తే ఇంకెంత బాధ పడతాడో? అయినా ఆఖరి రోజులలో అతణ్ణి బాధపెట్టడం ఎందుకని అతనికా విషయం చెప్పనేలేదా సూపరింటెండెంట్‌గారు.

ఆ రోజు తెల్లవారుఝామునే దేవయ్యని ఉరితీయటానికి సిద్ధం చేస్తున్నారు. సూపరింటెండెంట్‌గారు దేవయ్యని “నీ చివరి కోరిక ఏమిటో చెప్పు?” అని అడిగారు.

“సార్! నాకు నా పెద్ద కొడుకంటే ఎందుకు ఎక్కువ ఇష్టమో నా భార్యకు చెపుతానన్నాను. మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి. ఈ కారణంగానే ప్రతి తండ్రికి పెద్ద కొడుకంటే కాస్త ఎక్కువ ప్రేమ కలుగుతుంది. నేను కూడా ఆ సూక్తికి బద్ధుడనే. అందుకే నేను చనిపోయాక నా శరీరాన్ని నా పెద్ద కొడుకుకే అప్పగించండి.

కానీ నా కొడుకులను కూడా నేను చేసిన పని బాధించింది. ఆ కారణంగానే వారు మొన్న వచ్చినప్పుడు నా గురించి ఏమాత్రం బాధపడుతున్నట్లుగా అనిపించలేదు. కానీ వాళ్ళు పిల్లకాయలు. వాళ్ళకెలా తెలుస్తుంది ఈ తండ్రి ఆ క్షణంలో అనుభవించిన నరక యాతన. వారు నన్ను వద్దనుకున్నా వారిపై నా ప్రేమ చెక్కు చెదరదని చెప్పండి. సెలవు” అంటూ తలారితో పాటు వెళ్ళిపోయాడు దేవయ్య.

శిక్ష అమలుచేసిన జైలు అధికారులే దేవయ్య శవానికి అంత్యక్రియలను కూడా పూర్తి చేసారు. ఆ తరువాత దేవయ్య ఆస్థిని పంపకాలు చేస్తూ రాసిన వీలునామాతో పాటు, అతని ‘చివరి కోరిక’ను కూడా ఇంటివారికి అందించారు.

దేవయ్య ‘చివరి కోరిక’ను తెలుసుకున్న పంకజ్ “అమ్మా! నేనెంత బుద్ధిహీనుడనయ్యాను. నాన్న మన కోసం ఇంత త్యాగం చేస్తే, ఆయన ‘చివరి కోరిక’ను తీర్చలేక పోయాను. మేం ఎప్పుడు ఏదడిగినా మాకు అందించిన నాన్న, నన్ను కోరిన ఒకే ఒక్క చివరి కోరికను తీర్చలేకపోయిన పాపిని” అనుకుంటూ ఏడుస్తున్నాడు పంకజ్.

‘కృషితో ఋషిగా మారిన మా ఇంటి సూరీడు నాన్న. శ్రమ శక్తిలోని శక్తి రూపం నాన్నే. ఆ శ్రమలోని స్వేదబిందువూ నాన్నే. పిల్లల హృదయాలలో నిలిచే త్యాగమూర్తి నాన్న. తెల్ల కాగితం నాన్న మనస్సు’ తీవ్రమైన మనస్థాపంతో తండ్రికి నివాళులర్పించాడు పంకజ్.

********

Posted in July 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *