Menu Close
వీరాంజనేయులు శివరాత్రి
అట్టముక్క సైనికులం (కథ)
(వాస్తవ ఘటనల ఆధారంగా...)
వీరాంజనేయులు శివరాత్రి

రెండవది…చివరి భాగం …

2001 ఫిబ్రవరి — ఉత్తర భారతదేశాన్ని చలి ఇంకా వణికిస్తూనే ఉంది…

“ఈ వయసులో అక్కడికి వెళ్లడం అవసరమా నాన్నా? నీకు అక్కడ ఏమైనా అయితే!… ఆ శత్రు దేశంలో నీకు ఎవరు సహాయం చేస్తారు…?” ఆందోళనగా తండ్రికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు ముకేష్.

ఖేతర్పాల్ చిరునవ్వు నవ్వుతూ కొడుకుకి ధైర్యం చెప్పాడు —

“నాకు ఏం కాదులేరా… నేను చదువుకున్న కాలేజీలోనే చదివిన ఒక వ్యక్తి ఈ మధ్య నాకు పరిచయమయ్యాడు. చాలా మంచివాడిలా అనిపించాడు. వాళ్ల ఇంట్లోనే ఉండమంటున్నాడు… అన్నీ తనే చూసుకుంటానంటున్నాడు…”

ఖేతర్పాల్ పుట్టి పెరిగింది — పాకిస్థాన్‌లోని సరగోధలో.

1947 దేశ విభజన సమయంలో — తన ఊరు… తన బాల్య స్నేహితులు… తన జ్ఞాపకాల ప్రపంచం అన్నీ అక్కడే వదిలేసి — భారత్ వైపు రావాల్సి వచ్చింది.

ఇప్పుడు తనకి 81 సంవత్సరాలు — తన జన్మభూమిని మళ్లీ చూసే అవకాశం అతనికి దొరకలేదు.

చిన్ననాటి జ్ఞాపకాలు… ఆ వీధులు… ఆ ఇళ్లు… ఆ మనుషులు… అన్నీ అతని మనసులో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.

“ఎప్పుడెప్పుడు వెళ్దామా… తన ఊరిని మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా…” అనే తపన అతని హృదయంలో ఉవ్విళ్లూరుతోంది.

ఎట్టకేలకు — ఎలాగో కొడుకుకి నచ్చజెప్పి — ప్రయాణానికి బయలుదేరాడు ఖేతర్పాల్.

***

లాహోర్ విమానాశ్రయం నుండి బయటికి రాగానే — తనకోసం ఎదురు చూస్తూ కనిపించాడు నాజర్.

Khetarpal-Naser

తాను చదువుకున్న అదే కాలేజీలో — నాజర్ కూడా చదివాడు. పాకిస్థాన్‌లో ఉన్నన్ని రోజులు — తనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అతనే చూసుకుంటానని ముందుగానే చెప్పాడు.

దేశం కాని దేశం… పైగా — “శత్రు దేశం”గా భావించే నేలపై — ఇంత ఆతిధ్యం ఎదురవుతుందని ఖేతర్పాల్ ఊహించలేదు.

“ఏ జన్మలో ఏ బంధం ఉందో తమ మధ్య…” మనసులో అనుకున్నాడు.

ఇంటర్నెట్ పుణ్యమా అని — కొంతకాలం క్రితం ఆన్‌లైన్‌లో పరిచయం కావడం… అభిరుచులు కలవడం… ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరగడం…తలుచుకుంటే… ఆశ్చర్యంగా అనిపించింది.

ఇద్దరూ కలిసి నాజర్ ఇంటికి బయలుదేరారు.

ఇంటికి చేరగానే — నాజర్ భార్యా పిల్లలు ఖేతర్పాల్‌ను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించారు. తాను పరాయి దేశంలో ఉన్నాననే భావన క్షణం కూడా కలగకుండా — ఎంతో స్నేహంతో, ఆత్మీయతతో — తమ కుటుంబంలో ఒకరిగా కలుపుకున్నారు.

***

మరుసటి రోజు — తాను పుట్టి పెరిగిన సరగోధకు బయలుదేరాడు ఖేతర్పాల్.

చిన్ననాటి తన ఊరు… ఆ గాలి… ఆ నీరు… ఆ వీధులు… ఆ పాఠశాల… తాము చిన్నప్పుడాడుకున్న ఆటలు…

తర్వాత కాలేజీ… అక్కడ చేసిన చిలిపి పనులు… ఆ లేలేత వయసులో మనసు దోచుకున్న ఆ అమ్మాయి చిరునవ్వు…

ఆ మధుర స్మృతులన్నీ — ఒక్కొక్కటిగా అతని మదిలో మెదులుతున్నాయి.

ఆ తియ్యని జ్ఞాపకాలను కూడగట్టుకుంటూ — సమయం ఎలా గడిచిపోయిందో అతనికే తెలియలేదు.

Sargodha-College

***

ఇక భారత్ తిరిగి వెళ్లే రోజు దగ్గరపడింది.

లాహోర్‌కి బయలుదేరాడు… మళ్లీ నాజర్ ఇంటికే చేరుకున్నాడు.

ఆ రోజూ నాజర్ తన ఆఫీసుకు సెలవు పెట్టి — రోజంతా అతనితోనే గడిపాడు. అతని భార్యా పిల్లలు కూడా ఖేతర్పాల్‌ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. మధ్యాహ్న భోజనాలు అయ్యాక — ఖేతర్పాల్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి తనకు కేటాయించిన బెడ్‌రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు.

పిల్లలు బయటికి వెళ్లారు. హాల్‌లో — నాజర్, అతని భార్య ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.

కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత — నాజర్ భార్య మృదువుగా అడిగింది —

“ఈయన గురించి మీకు ఎప్పుడు… ఎలా తెలిసిందండీ?”

నాజర్ ఓ గట్టి శ్వాస తీసుకుని చెప్పడం ప్రారంభించాడు —

“ఆ యుద్ధం ముగిసిన తర్వాత… భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డులు ప్రకటించింది. అప్పుడు పత్రికల ద్వారా కొన్ని వివరాలు తెలిసాయి.

నాకు తెలిసిన కొంతమందితో చాలా రోజులు విచారణ చేయించాను. అలా ఈయన గురించీ… ఈయన కుటుంబం గురించీ… ఎన్నో విషయాలు తెలిసాయి.

తెలుసుకుంటూ వెళ్లే కొద్దీ — ఈయన పట్ల… ఈయన కుటుంబం పట్ల… నా గౌరవం మరింత పెరిగింది.

అప్పటి నుంచి — ఈయనను ఒకసారి కలవాలని అనుకుంటూ ఉన్నాను.

ఇంటర్నెట్ పుణ్యమా అని — కొంతకాలం క్రితం ఈయనతో నేరుగా పరిచయం ఏర్పడింది.

ఇన్నాళ్లకు… ఈ విధంగా ఈయన్ని కలిసి… నా మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకునే అవకాశం దొరికింది…” అని మెల్లగా ముగించాడు నాజర్.

అతని మాటలు విన్న నాజర్ భార్య — భారంగా నిట్టూర్చింది…

***

16 డిసెంబర్ 1971…
సూర్యాస్తమయం దగ్గర పడుతోంది… భీకర యుద్ధం కొనసాగుతోంది.

పాకిస్థాన్ వైపు —
20 ఏళ్ల ఖ్వాజా మహమ్మద్… తన ట్యాంక్‌లో…

భారత్ వైపు —
21 ఏళ్ల అరుణ్… దెబ్బ తగిలి మంటల్లో చిక్కుకున్న ట్యాంక్‌లో…

తమ తమ దేశాల కోసం — ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు. ఇద్దరిదీ ఒకటే ఆలోచన —

“ఈసారి కాల్చే గుండు శత్రు ట్యాంకుని ధ్వంసం చేయాలి… మిస్ అవ్వకూడదు…”

ట్యాంకులు మరింత దగ్గరయ్యాయి…

ఇద్దరూ ఒకేసారి గురి పెట్టి కాల్చారు.

రెండు ట్యాంకుల నుండి అగ్నిగోళాల్లా దూసుకెళ్లిన గుళ్లు — వ్యతిరేక దిశల్లో ప్రయాణించాయి.

క్షణంలో వందో వంతు కాలం స్తంభించింది…

తరవాత రెండు భయంకరమైన విస్ఫోటనాలు…

ఢాం…!
ఢాం…!!

ఆ గుళ్ల దెబ్బకి రెండు ట్యాంకులు అల్లంత దూరంలో తలక్రిందులై పడ్డాయి. మంటలు సుడిగుండాల్లాగా అలుముకున్నాయి.

***

17 డిసెంబర్ 1971… ఉదయం…

పాకిస్థాన్ ఓటమిని అంగీకరించింది. కాల్పులు విరమించబడ్డాయి.

యుద్ధం ముగిశాక — వీరమరణం పొందిన శత్రు సైనికుల శవాలను వారి వారి దళాలకు అప్పగించడం — సైనిక సంప్రదాయం.

ఆ సంప్రదాయం ప్రకారం — తమ సైనికుల మృతదేహాలను స్వీకరించడానికి — ఖ్వాజా మహమ్మద్ భారత శిబిరానికి వచ్చాడు.

అప్పటివరకు శత్రువులుగా ఒకరిని ఒకరు చంపుకున్న సైనికులు… యుద్ధం ముగియడంతో… ఆవేశాలు తగ్గి మళ్ళీ మనుషులుగా మారారు. వారి మనస్సులోకి మానవత్వం తిరిగి వచ్చింది. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, సానుభూతి కలిగాయి.

అక్కడ కనిపించిన ఓ భారత సైనికుడితో —

“మీ పోరాటం అమోఘం… చివర్లో మిగిలిన ఆ ఒక్క ట్యాంక్‌ నుండి పోరాడిన అతను ఎవరో గానీ — మంటల్లో చిక్కుకున్నా అతను తగ్గలేదు. భయంకరంగా పోరాడాడు…”

మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు ఖ్వాజా మహమ్మద్. ఓ క్షణం ఆగి —

“అతనికి గాయాలు ఏమైనా తగిలాయా…? బాగానే ఉన్నాడా…?” అని అడిగాడు… యుద్ధం ఆగిపోవడంతో మానవత్వం పైకి ఉబికింది.

ఆ భారత సైనికుడు నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు —

“మా అరుణ్ సాబ్… పోరాడుతూ వీరమరణం పొందారు…”

ఆ మాట విన్న క్షణంలో — ఖ్వాజా మహమ్మద్ మనసులో ఏదో సూన్యం భారంగా కదిలింది.

అంటే — నిన్న తాను పేల్చిన ఆఖరి గుండు — తన శత్రువు అరుణ్ ప్రాణాలను తీసింది…

అరుణ్ పేల్చిన గుండుకి తన ట్యాంక్ దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నా — ఎలాగో ఆఖరి క్షణంలో బయటికి దూకి — తను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు…

***

2001 మార్చి 1వ తేది — పాకిస్థాన్.

ఆ వసంతకాల సాయంత్రం — లాహోర్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నాజర్ వారి తోటలోని పూల చెట్ల నుంచి వెదజల్లుతున్న సువాసనలు — మనసును ఆహ్లాదపరుస్తున్నాయి.

ఆ సాయంత్రం — నాజర్ కుటుంబం, ఖేతర్పాల్ కలిసి — ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ… పిల్లల కిలకిల నవ్వుల మధ్య… హాయిగా భోజనం చేశారు.

భోజనానంతరం  — వరండాలోని వాలు కుర్చీలో సేదతీరుతున్నాడు ఖేతర్పాల్.

ఈ పాకిస్థాన్ ప్రయాణంలో తాను కూడగట్టుకున్న మధుర స్మృతులను నెమరువేసుకుంటూ…తాను కలుసుకున్న చిన్ననాటి మిత్రులను తలుచుకుంటూ… ముఖ్యంగా — నాజర్ కుటుంబం చూపించిన ఆప్యాయ ఆతిధ్యాన్ని గుర్తుచేసుకుంటూ…అతని హృదయం ఆనందంతో నిండిపోయింది.

కొద్దిసేపటి తరువాత — నాజర్ వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చున్నాడు.

మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు —

“ఖేతర్పాల్ గారు…
మీరు నాకు పరిచయం అవ్వడం… మీ గురించీ… మీ కుటుంబం గురించీ తెలుసుకోవడం… అన్నీ ఓ కలలా అనిపిస్తున్నాయి.

మన అభిరుచులు కలవడం… మీరు పాకిస్థాన్ రావాలని అనుకోవడం… వచ్చి మా ఆతిధ్యాన్ని స్వీకరించడం… ఇంకా నమ్మలేకపోతున్నాను.

మిమ్మల్ని కలవడం — నా భార్యా పిల్లలకు కూడా చాలా సంతోషం కలిగించింది…”

తన గొంతు నెమ్మదిగా సవరించుకుని కొనసాగించాడు నాజర్.

“మీరు రేపు హిందూస్తాన్ తిరిగి వెళ్తున్నారు… నేను… మీకు ఒక విషయం చెప్పాలి…”

అప్పటివరకు సంతోషంగా ఉన్న అతని స్వరం — ఒక్కసారిగా ఏదో చెప్పాలని తటపటాయిస్తోంది.

ఖేతర్పాల్ అతని చెయ్యి పట్టుకుని —

“చెప్పు బేటా… ఎందుకు మొహమాటపడుతున్నావ్? భారత్ నుంచి నీకు ఏమైనా కావాలా?” అని స్నేహంగా అడిగాడు.

నాజర్ పెదవులు కంపించాయి…

“ఈ చేతులే… ఈ చేతులే…” అని ఆగిపోయాడు. స్వరం వణుకుతోంది.

“ఫర్వాలేదు బేటా… చెప్పు…” అని మళ్లీ అనునయంగా ప్రోత్సహించాడు ఖేతర్పాల్.

నాజర్ కళ్లలో నీటి పొర కదలాడింది. తడారి భారమైన స్వరంతో  —

“ఈ చేతులే ఖేతర్పాల్ గారూ… మీ అబ్బాయి అరుణ్ ఖేతర్పాల్‌ను చంపాయి…”

క్షణం — కాలం స్తంభించింది.

అప్పటివరకు ఖేతర్పాల్ ముఖంలో మెరిసిన ఆనందపు ఛాయలు చెదిరిపోయాయి.

వాటి స్థానంలో — అయోమయం… అనుమానం… ఆందోళన… ఒక విచిత్రమైన భయం చేరాయి.

తను ఏం విన్నాడో అర్ధం కాలేదు.

“ఏమంటున్నావ్ బేటా…? నాకు అర్థం కాలేదు… సరిగా చెప్పు…” స్వరం సన్నగా వణికింది.

నాజర్ తల తిప్పి సూన్యంలోకి చూస్తూ మళ్లీ చెప్పాడు —

“అవును ఖేతర్పాల్ జీ… 1971 యుద్ధంలో — మీ అబ్బాయి అరుణ్ ఖేతర్పాల్‌పై పేల్చిన గుళ్లు… ఈ చేతుల నుంచే వెళ్లాయి…”

ఎన్నాళ్లుగానో — ఎలా చెప్పాలా అని మధనపడుతున్న బ్రిగేడియర్ ఖ్వాజా మహమ్మద్ నాజర్ స్వరం — ఏ భావం పలికిందో…

… వింటున్న ఖేతర్పాల్ గమనించే స్థితిలో లేడు.

ప్రతి మాట… అతని హృదయానికి ఫిరంగి గుండులా తగులుతోంది.

“1971 యుద్ధంలో నా కొడుకును చంపిన వాడా — ఈ నాజర్…? ఇతని ఇంట్లోనా నేను ఉన్నది…? నా కొడుకును చంపిన వాడి కుటుంబంతోనా… నేను ఈ రోజులు గడిపింది…?”

ఆ రాత్రి… ఆ ఇంట్లో…

తన కొడుకును చంపిన వాడి ఇంట్లో…

అప్పటివరకు ఎంతో ఆప్యాయంగా తోచిన ఆ కుటుంబం మధ్య…కొడుకును కోల్పోయిన తండ్రి — ఎలా గడిపాడో…!

మనసులో ఎన్ని తుఫాన్లు ఉప్పొంగాయో…! ఎన్ని సంఘర్షణలు అతన్ని చీల్చిచెండాడాయో…!

***

విధి రాసిన విచిత్రమైన వ్రాత —

ఎవరి దేశం కోసం వారు పోరాడిన— ఖ్వాజా మహమ్మద్ నాజర్…అరుణ్ ఖేతర్పాల్.

విధి వైచిత్య్రం— నాజర్ ని అరుణ్ ఖేతర్పాల్ తండ్రితో కలిపింది…వారిని మిత్రులని చేసింది.

అంతలోనే ఓ నిజం…శతజ్ఞులని పేల్చి వారి మధ్య పూడ్చలేని అఘాతం చేసింది.

నిజ జీవితం — ఇంత ఖఠినంగా… ఇంత నిర్దయగా… మనుషులతో ఆటలాడుతుందా…!

వారి మనసుల్లో చెలరేగే భావాలకు భాష్యం ఎవరు చెప్పగలరు?

బాలగంగాధర్ తిలక్ వ్రాసిన కొన్ని పంక్తులు — మన మదిలో మెదలక మానవు—

అబ్బా  చలి ! నెత్తురు చల్లబడే  చలి..

పోదు నాలో భయం

మళ్ళీ రేవు ఉదయం ..

ఎడార్లూ నదులూ అరణ్యాలూ దాటాలి, టెంచెస్‌లో దాగాలి

పైన ఏరో ప్లేను, చేతిలో స్టేన్ గన్‌

కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం

మార్చ్‌!

వన్‌..  టూ..  త్రీ ..  ఘాట్‌..

డెడ్ .. ఎవడ్?  నువ్వా, నేనా

కేబుల్‌ గ్రామ్ యిప్పించండి

కేరాఫ్‌ సో అండ్‌ సో

“మీ వాడు డెడ్‌”

Tank-Bund-Khetarpal

యుద్ధం గెలిచిన భారతదేశం — తన విజయానికి గుర్తుగా ఒక పాకిస్థానీ ట్యాంక్‌ను తెచ్చుకుంది…

ఈ ట్యాంక్ బండ్‌పై నిలిపింది… నా బిడ్డ — అరుణ్ ఖేతర్పాల్ — చిందించిన రక్తానికి గుర్తుగా…

***

ఒక్కసారిగా ఉలిక్కిపడి — కథ చెబుతున్న ఆ ముసలాయన్ని చూసాను.

“ఏమిటీ…? మీ బిడ్డా…?”

ఆయన నిదానంగా తల ఊపాడు.

“అవును… నా బిడ్డే… అరుణ్ ఖేతర్పాల్…”

నా గొంతు తడారింది…“అంటే… మీరూ…?”

అయన నెమ్మదిగా అన్నాడు —

“అవును… నేనే… రిటైర్డ్ బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేతర్పాల్ని … పరమ వీరచక్ర సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ తండ్రిని”

ఒక్క క్షణం — నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది.

కళ్ళు పెద్దవిగా చేసి — ఆయన్నే చూస్తూ లేచి నిలుచున్నాను.

నెమ్మదిగా నా కళ్ళు అక్కడ ఉన్న యుద్ధ ట్యాంక్ వైపు తిరిగాయి.

“దేశానికి ఓ విజయ చిహ్నం.

ఈ తండ్రికి మాత్రం ఇదో రక్త స్మారకం”

హృదయం భారంగా కొట్టుకుంటోంది…

అప్రయత్నంగా నా నడుము వంగింది. ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ సాగిలపడ్డాను…

***

అలా సాగిలపడి ఉన్న నా భుజంపై — ఠపా… ఠపా… అంటూ రెండు సార్లు కొట్టారు.

కొడుతున్నారేమిటా అని ఆశ్చర్యంగా తలెత్తి చూశాను.

కొడుతున్నది — నా మిత్రుడు.

“ఏమిట్రా… ఇక్కడికొచ్చి పడుకున్నావ్? పొద్దున్నే లేచి చూస్తే నువ్వు లేవు. వెతుక్కుంటూ వచ్చి చూస్తే ఇక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్నావ్… ఏమైందిరా నీకు…?”

మిత్రుడి మాటలు పట్టించుకోకుండా ఆతృతగా చుట్టూ చూసాను ఖేతర్పాల్ గారి కోసం…

ఆయన అక్కడ లేరు. మళ్లీ… మరోసారి… ఇంకోసారి… చుట్టూ అంతా కలియదిరిగి చూసాను.

కనిపించలేదు.

గుండె దడ పెరిగింది.

“ఖేతర్పాల్ గారు ఏరి రా …? అడిగాను మిత్రుడిని.

అతను ఆశ్చర్యంగా చూసాడు.

“ఖేతర్పాల్ ఎవర్రా…?”

“అదే…ఇక్కడ ఒక ముసలాయన… వందేళ్లు ఉంటాయి… ఎక్కడికి వెళ్లారు…?” కంగారుగా అడిగాను.

మిత్రుడు నవ్వుతూ…

“నీ మొహం… ఇక్కడ ఎవరూ లేరు. నేను వచ్చేసరికి నువ్వు ఒంటరిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావ్. కలగని ఉంటావు…”

అయోమయంగా మళ్లీ చుట్టూ చూశాను.

ట్యాంక్ ఉంది… ట్యాంక్ బండ్ ఉంది…బుద్ధుడు ఉన్నాడు…

కానీ — ఖేతర్పాల్ గారు మాత్రం లేరు…

“పదా… ఇంటికి వెళ్దాం…” మిత్రుడు గద్దించాడు.

బిత్తర చూపులతో… తల గోక్కుంటూ… జేబులోనుండి ఫోన్ తీసి…గూగుల్ ఓపెన్ చేసాను…

“Arun Khetarpal” అని సెర్చ్ చేసి చదువుకుంటూ… మిత్రుడిని అనుసరించాను.

***సమాప్తం***

Posted in July 2026, కథలు

2 Comments

  1. మహేష్ బాబు ఉండవల్లి

    కళ్ళ ముందు కనిపించేలా కధ చెప్పడం ఒక ప్రత్యేక నైపుణ్యం. అది వీరాంజనేయులు గారికి పుష్కలం.

  2. డా. శివబాబు, జహీరాబాద్, తెలంగాణ

    మొదటి భాగంలో ఉత్కంఠత రేకెత్తించి, రెండవ భాగంలో సామాన్య సైనికుల మనసుల్లో మెదలాడే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని సందేశం గా ఇచ్చిన రచయితకు హాట్సాఫ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *