Menu Close
వీరాంజనేయులు శివరాత్రి
అట్టముక్క సైనికులం (కథ)
(వాస్తవ ఘటనల ఆధారంగా...)
వీరాంజనేయులు శివరాత్రి

మొదటి భాగం ↓

కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం

అబ్బా చలి! నెత్తురు చల్లబడే చలి..

పోదు నాలో భయం

మళ్ళీ రేవు ఉదయం ..

ఎడార్లూ నదులూ అరణ్యాలూ దాటాలి, టెంచెస్‌లో దాగాలి

పైన ఏరో ప్లేను, చేతిలో స్టేన్ గన్‌

కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం

మార్చ్‌!

వన్‌.. టూ.. త్రీ .. ఘాట్‌..

డెడ్ .. ఎవడ్? నువ్వా, నేనా

కేబుల్‌ గ్రామ్ ఇప్పించండి

కేరాఫ్‌ సో అండ్‌ సో

“మీ వాడు డెడ్‌”

Cable Gram

***

డిసెంబర్ 16…

ఈ తేదీ మదిలో మెదలగానే, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన జ్ఞాపకాలని నెమ్మదిగా తట్టి లేపింది.

సెలవులలో కొద్ది రోజులు మిత్రుడి కుటుంబంతో గడపాలని హైదరాబాద్ వెళ్లాను. ఆ రోజు తెల్లవారుఝామునే మెలకువ వచ్చింది. ఎలాగూ లేచాను కదా అని… తెలతెలవారే మంచు చల్లదనంలో జాగింగ్‌కు వెల్దామనిపించింది.

ట్యాంక్ బండ్ మీద ఇంకా రద్దీ మొదలుకాలేదు. అప్పుడప్పుడే ప్రసరిస్తున్న సూర్యకిరణాల్లో స్నానం చేస్తూ వెలిగిపోతున్న బుద్ధుడి విగ్రహాన్ని చూస్తూ —

“ఆహా… ఎంత ఆహ్లాదంగా ఉంది ఈ దృశ్యం…” అనుకుంటూ… నెమ్మదిగా పరుగు అందుకున్నాను.

Buddha Statue Tank Bund

ఇంతలో ఓ పెద్దాయన నా వెనకనుండి జాగింగ్ చేస్తూ నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. ఆయనకి చాలా వయసున్నట్లే అనిపించింది. అంత పెద్దాయన పరుగులో నన్ను దాటిపోవడం… ఏమిటో నాకు అవమానంగా అనిపించింది. నేను పరుగు వేగం పెంచాను.

కొద్దిసేపటికి అతన్ని అందుకుని, అతని సరసన పరుగు పెడుతూ తల తిప్పి చూశాను.

ఏ మాత్రం ఆయాసం లేకుండా, ఎంతో హాయిగా పరుగెడుతూ… తల తిప్పి నన్ను చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు.

నేనూ నవ్వుతూ —

“ఈ వయసులో కూడా చాలా బాగా పరిగెడుతున్నారండి…” అని మెచ్చుకోలుగా అన్నాను.

అలా మాటలు కలిశాయి. సరదాగా మాట్లాడుకుంటూ ట్యాంక్ బండ్ మీద ఈ చివర నుండి ఆ చివరికి… మళ్లీ అటు నుండి ఇటుకి — రెండు రౌండ్లు పరిగెత్తాము.

కొద్దిసేపటికి నేను బాగా అలసిపోయాను. ఇక పరుగు కొనసాగించలేక ఆగిపోయాను.

తల తిప్పి అతని వంక చూసాను. ఆశ్చర్యంగా… ఆ పెద్దాయనలో ఏ మాత్రం అలసట కనబడలేదు.

నాకోసమే అన్నట్లుగా… తనూ పరుగు ఆపేశాడు.

ఎక్కడైనా కూర్చొని కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని అటూ ఇటూ చూసాను.

ఆ పక్కనే ఓ యుద్ధ ట్యాంక్ కనిపించింది. దాని క్రింద కూర్చోవడానికి అరుగు కూడా ఉంది. అక్కడికి వెళ్లి కూర్చున్నాను. ఆయన కూడా నాతో పాటు వచ్చి పక్కనే కూర్చున్నాడు.

Tank Bund

“మీరు ఇంత పరిగెత్తి కూడా ఏ మాత్రం అలిసినట్లు కనిపించడం లేదు… మీ వయసు ఎంత ఉంటుందండీ?” అని ఉండబట్టలేక అడిగేశాను.

“వంద సంవత్సరాలు.”

“చ్చా… మీరు మరీ జోకులు వేస్తున్నారండి. నిజం చెప్పండి…” మళ్లీ నవ్వుతూ అడిగాను.

“నిజమే చెబుతున్నాను నాయనా.”

“ఈయనకి వెటకారం కాస్త ఎక్కువే…!” అని మనసులోనే అనుకున్నాను.

టాపిక్ మార్చితే మంచిదనిపించింది. పక్కనే ఉన్న యుద్ధ ట్యాంక్ మీదకి నా దృష్టి మళ్లింది.

“దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో! పాడైపోయిన దాన్ని ఎక్కడ పడేయాలో తెలీక ఇక్కడ పెట్టినట్టున్నారు…” అన్నాను… ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు.

“అయ్యో… కాదు నాయనా! దీని వెనక చాలా కథే ఉంది…”

“దీనికేం కథ ఉంటుంది తాతా?” అని అతన్ని కొంచెం ఉడికించాలని కావాలనే ‘తాతా’ అన్నాను.

ఆయన నెమ్మదిగా ట్యాంక్ వైపు చూసి —

“చాలా గంభీరమైన కథ ఉంది…
పైగా ఈ రోజుతో… అంటే డిసెంబర్ 16తో…
ఇంకా చెప్పాలంటే — ఈ ట్యాంక్ తో… నాకూ సంబంధం ఉంది.”

ఆయన గంభీర స్వరం, ఆ చెప్పే తీరు నాలో ఉత్సుకతని కలిగించాయి.

“మీరు చెప్పే విధానం చూస్తే ఈ యుద్ధ ట్యాంక్ గురించి మీకు చాలా తెలుసులా ఉంది. అదేమిటో చెప్పగలరా?” అడిగాను.

ఆయనకీ కూడా చెప్పాలని ఉన్నట్లుంది. మొదలుపెట్టాడు—

***

Map

1971 డిసెంబర్ —

బంగ్లాదేశ్ విమోచన సైన్యానికి తోడుగా భారత సైన్యం తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో భీకరంగా పోరాడుతోంది. భారత దళాల తాకిడికి అక్కడి పాకిస్థాన్ సైన్యం బెంబేలెత్తిపోతోంది.

మరో వైపు — పశ్చిమ పాకిస్థాన్ పంజాబ్‌లోని సియాల్కోట్ సైనిక స్థావరంలో తీవ్ర అలజడి రేగుతోంది.

తూర్పు పాకిస్తాన్ నుంచి వస్తున్న సమాచారం — లెఫ్టినెంట్ జనరల్ ఇర్షాద్ హసన్ ఖాన్‌ను అసహనానికి గురిచేస్తోంది.

1965 యుద్ధం గుర్తుకొచ్చింది అతనికి…

అప్పుడు డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌గా తాను ఎదుర్కొన్న వైఫల్యం — అతని మదిలో మంటలు రేపింది.

“మళ్లీ తమకి పరాభవమేనా…! ఈసారి దుష్ట హిందూస్తాన్ మా దేశాన్ని రెండు ముక్కలు చేసేటట్టుంది…” తన టెంట్‌లో అసహనంతో అటూ ఇటూ తిరుగుతూ గొణుక్కుంటున్నాడు ఇర్షాద్ హసన్ ఖాన్.

డిసెంబర్ చలివల్లనో… లేక యుద్ధంలో మళ్లీ ఓటమి మబ్బులు కమ్ముకుంటున్నాయనే భావన వల్లనో… వణుకు నెమ్మదిగా అతని వెన్నులోకి పాకింది.

“ఈ దుర్మార్గులకి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలి!” అదుపులేని అసహనంతో గట్టిగా పైకి అరిచాడు.

ఇంతలో పక్కనే నిలబడి ఉన్న ఓ లెఫ్టినెంట్‌కి మెరుపులాంటి ఆలోచన తట్టింది.

“సాబ్… ఇప్పుడు హిందూస్తాన్ సైన్యం దృష్టి తూర్పు వైపు కేంద్రీకృతం అయివుంది. ఇటు పశ్చిమాన పఠాన్‌కోట్‌లో వారి బలగాలు చాలా తక్కువగా ఉన్నాయని మనకి సమాచారం.

ఇక్కడ మన బలగాలు వారికంటే చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటు నుండి షకర్‌గఢ్ మీదగా వెళ్లి పఠాన్‌కోట్‌లోని హిందూస్తాన్ బేస్‌ మీద దాడి చేసి ఆక్రమిస్తే… జమ్ము కాశ్మీర్‌కు… మిగతా హిందూస్తాన్ కి కనెక్షన్ తెగిపోతుంది. అప్పుడు మనం జమ్ము కాశ్మీర్‌ను సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు…” మెరుపు లాంటి ఆలోచన తన కళ్ళలో మెరుస్తుండగా చెప్పాడు అ లెఫ్టినెంట్.

అతడు చెప్పింది విని ఇర్షాద్ హసన్ ఖాన్ కళ్ళలో ఉత్సాహం ఉప్పొంగింది.

“బ్రిలియంట్ ఐడియా…!” పెద్దగా అరిచాడు మెచ్చుకోలుగా.

***

ప్లాన్ ప్రకారం పాకిస్థాన్ సైన్యం తమ బలగాలు, మందుగుండు సామగ్రి, యుద్ధ ట్యాంకులతో ముందుకు కదిలింది.

ఇంతలో — ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ సైనికుడు సెల్యూట్ కొట్టి సమాచారం అందించాడు.

“సాబ్… మన ప్లాన్‌ని హిందూస్తాన్ సైన్యం పసిగట్టినట్టుంది. మనము పఠాన్‌కోట్‌పై దాడికి కదులుతుండగానే… వాళ్లు మన మీద ఎదురుదాడి ప్రారంభించారు.

ఇప్పటికే మన ఫ్రంట్‌లైన్ బలగాలను నిర్వీర్యం చేసి… సరిహద్దు దాటి… తమ ట్యాంకులతో బసంతార్ నది దగ్గరికి దూసుకొచ్చారు సాబ్…” వణుకుతున్న స్వరంతో నివేదించాడు.

ఇర్షాద్ ఖాన్ కళ్లలో అగ్ని జ్వాలలు రగిలాయి.

తన మనసులోనే బలాబలాలు మెరుపువేగంతో లెక్క వేసుకున్నాడు.

“తమ బలగాలు, ట్యాంకులు శత్రువుల వద్ద కన్నా రెట్టింపు ఉన్నాయి. ఇంకా ఇతర దళాలు కూడా తమ వద్ద చాలా అధికం” లెక్కలు తమకి చాలా అనుకూలంగా ఉన్నాయి.

ఇంకేముంది… పెద్దగా కేకలు వేస్తూ సైనికులకు ఆజ్ఞలు జారీ చేసాడు—

“చలో … వాళ్లని పిచ్చుకలను నలిపినట్టు నలిపేద్దాం! పఠాన్‌కోట్‌ను ఆక్రమించి… జమ్ము కాశ్మీర్‌ను హిందూస్తాన్ కోరల నుండి విడిపిద్దాం!”

పాకిస్థాన్ సైన్యం అత్యంత ఉత్సాహంగా, ఆగ్రహంగా, యుద్ధ నినాదాలతో… కదనరంగంలోకి దూసుకెళ్లింది.

***

16 డిసెంబర్ 1971…

యుద్ధం హోరాహోరిగా జరుగుతోంది. యుద్ధ ట్యాంకులు భీకరంగా గర్జిస్తున్నాయి. వాటి నుండి వెలువడే పిడుగుల్లాంటి గుళ్ల శబ్దానికి — చెవులు చిల్లులు పడుతున్నాయి.

దాడికి గురైన కొన్ని యుద్ధ ట్యాంకులు మంటల్లో దగ్దమౌతున్నాయి … బుల్లెట్ గుళ్లతో సైనిక శరీరాలు ఛిద్రమౌతున్నాయి … ట్యాంక్ పిడుగులు తాకిన శరీర అవయవాలు చెల్లాచెదురైన పడుతున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలతో యుద్దభూమి భయంకరంగా ఉంది.

భారత సైన్యం సంఖ్యలో చాలా తక్కువగా ఉంది. వారి వద్ద ట్యాంకులు కూడా పరిమితంగానే ఉన్నాయి. అయినా — తమ యుద్ధ నైపుణ్యం, వ్యూహ కౌసల్యంతో ధీటుగా పోరాడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు.

దాదాపు వంద ట్యాంకులతో యుద్ధరంగంలోకి ఉత్సాహంగా దూసుకొచ్చిన పాకిస్థాన్ దళాలు — తమ ట్యాంకులు ఒక్కొక్కటిగా ధ్వంసం అవుతుండగా వారిలో నైరాశ్యం పేరుకుంటోంది.

పాకిస్థాన్ యోధుడు ఖ్వాజా మహమ్మద్— ఇరవై ఏళ్ల యువ మేజర్— తమ వైపు జరుగుతున్న నష్టాన్ని చూసి అతని హృదయం ఆవేశంతో, ఆక్రోశంతో రగిలింది.

క్షణం ఆలస్యం చేయలేదు. ఒక యుద్ధ ట్యాంక్‌లోకి ఎక్కి — కదనరంగంలోకి దూకాడు.

వంద ట్యాంకులతో బయలుదేరిన పాకిస్థాన్ వద్ద ఇప్పుడు పది మాత్రమే మిగిలాయి.

భారత్ వైపు రెండు ట్యాంకులు మిగిలాయి.

“ఆ రెండు ట్యాంకుల్ని ధ్వంసం చేయగలిగితే… ఇక ఎలాంటి అడ్డూ లేకుండా భారత్ వైపు దూసుకుపోవచ్చు!” శక్తినంతా కూడదీసుకుని ట్యాంక్‌ను ముందుకు దూకించాడు ఖ్వాజా మహమ్మద్.

ఢాం… ఢాం…!

దిక్కులు మారుమోగుతున్నాయి.

మంటలు ఎగసిపడుతున్నాయి…

ఢాం… ఢాం… ఢాం… ఢాం…!

భారత ట్యాంకుల నుండి కురిసిన పిడుగుల వర్షంలో మరో ఐదు పాకిస్తానీ ట్యాంకులు పేలి ధ్వంసమయ్యాయి.

ఇప్పుడు యుద్ధరంగంలో మిగిలినవి —

రెండు భారత ట్యాంకులు… ఐదు పాకిస్థానీ ట్యాంకులు…

ఆ ఐదు ట్యాంకులు ఒకేసారి గురి పెట్టి కాల్చాయి. ఆ పిడుగుల వర్షం — ఒక భారత ట్యాంక్‌పై బలంగా పడింది.

భయంకర విస్ఫోటనంతో ఆ ట్యాంక్ తలక్రిందులై… మంటల్లో చిక్కుకుని… క్షణాల్లో ధ్వంసమైంది.

“ఇన్షా అల్లాహ్ …!” అని పెద్దగా అరిచి సంబరపడిపోయాడు ఖ్వాజా మహమ్మద్.

“ఇక మిగిలింది ఆ ఒక్క ట్యాంకే… దాన్నీ కూడా మట్టుపెడితే — ఇక తమకి అడ్డు ఉండదు…” ఇనుమడించిన ఉత్సాహంతో ట్యాంక్ ని మందికి దూకించాడు.

భారత్ వైపు మిగిలింది ఒకేఒక్క ట్యాంక్ — చిచ్చరపిడుగులా చెలరేగిపోతోంది.

చిత్రవిచిత్ర మలుపులు తిరుగుతూ… తన మీదికి దూసుకొస్తున్న గుళ్లను చాకచక్యంగా తప్పించుకుంటూ… పాకిస్థాన్ ట్యాంకులను ఒక్కొక్కటిగా గురి పెట్టి పేల్చివేస్తోంది.

మరో గంట గడిచేసరికి మరో మూడు పాకిస్థానీ ట్యాంకులు మంటల్లో కాలిపోయాయి.

ఇప్పుడు మిగిలినవి —

ఒక భారత ట్యాంక్…రెండు పాకిస్థానీ ట్యాంకులు…

ఖ్వాజా మహమ్మద్‌లో అసహనం ఉద్ధృతమైంది.

“ఎవడ్రా ఆ ట్యాంక్‌లో ఉన్న హిందూస్తాన్ సైనికుడు…! మా పది ట్యాంకుల్ని ఆ ఒక్కడే పేల్చేశాడు… వాడి అంతు చూడాలి …!” కృతనిశ్చయంతో తన ట్యాంక్‌ను ముందుకు దూకించి గురి పెట్టి కాల్చాడు.

ఢాం…ఢాం…!

భీకరంగా తగిలాయి ఆ గుళ్లు భారత ట్యాంక్‌కి. ట్యాంక్ మంటల్లో చిక్కుకుంది…

War Tank

***

భారత ట్యాంక్‌లో నుండి పోరాడుతున్నవాడు — 21 సంవత్సరాల యువకుడు … అరుణ్.

తన ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. అయినా — వీరాభిమన్యుడిలా పోరాడుతూనే వున్నాడు.

దూరం నుండి గమనిస్తున్న భారత పైఅధికారి — వెంటనే రేడియో కాల్ చేశాడు.

“అరుణ్…! నీ ట్యాంక్‌కి భారీ దెబ్బ తగిలింది. మంటలు చెలరేగుతున్నాయి. ఏ క్షణమైనా ట్యాంక్ పేలిపోవచ్చు. వెంటనే బయటికి దూకి… మన క్యాంప్ వైపు పరుగెత్తుకుని వచ్చేయ్…!” అని ఆజ్ఞాపించాడు.

ఆ ఆర్డర్ అరుణ్‌కు రుచించలేదు.

సైన్యంలో చేరే వేళ…ఆరు నెలల క్రితం… అమ్మ చెప్పిన మాటలు మదిలో మెదిలాయి…

“బిడ్డా…! భారతమాతను కాపాడటం కోసం పులిలా పోరాడు…

పిరికితనంతో పారిపోయి తిరిగి రాకు…!”

ఆ మాటలు — అతని కర్తవ్యాన్ని బోధించాయి.

అరుణ్ రేడియోలో చెప్పాడు —

“సార్… నా ట్యాంక్‌ని వదిలే ప్రశ్నే లేదు. నా ప్రధాన గన్ ఇంకా పనిచేస్తోంది. ఆ పాకీ ట్యాంకుల్ని ధ్వంసం చేసి గానీ — నేను ఇక్కడి నుంచి కదలను…” చెప్పి కాల్ పెట్టేసాడు.

తన ట్యాంక్‌లో మంటలు చెలరేగుతున్నా — పులిలా పోరాటం కొనసాగిస్తున్నాడు.

ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో ట్యాంక్ లోపల భరించలేని వేడి—

కానీ అరుణ్ రక్తంలో మరుగుతున్న దేశభక్తి వేడి ముందు… ఆ వేడి ఏమాత్రం తెలియడంలేదు.

అతడి మెదడు మెరుపువేగంతో పని చేస్తోంది.

ట్యాంక్‌ను చాకచక్యంగా మలుపు తిప్పి — గురి పెట్టి కాల్చాడు.

ఢాం…ఢాం…!

మరో పాకిస్థాన్ ట్యాంక్ మంటల్లో పేలిపోయింది.

ఇప్పుడు యుద్ధరంగంలో—

పాకిస్థాన్ వైపు —

20 ఏళ్ల ఖ్వాజా మహమ్మద్… తన ట్యాంక్‌లో…

భారత్ వైపు —

21 ఏళ్ల అరుణ్… దెబ్బ తగిలి మంటల్లో చిక్కుకున్న ట్యాంక్‌లో…

తమ తమ దేశాల కోసం — ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు.

ఇద్దరిదీ ఒకటే ఆలోచన —

“ఈసారి కాల్చే గుండు శత్రు ట్యాంకుని ధ్వంసం చేయాలి… మిస్ అవ్వకూడదు…”

ట్యాంకులు మరింత దగ్గరయ్యాయి…

ఇద్దరూ ఒకేసారి గురి పెట్టి కాల్చారు.

రెండు ట్యాంకుల నుండి అగ్నిగోళాల్లా దూసుకెళ్లిన గుళ్లు — వ్యతిరేక దిశల్లో ప్రయాణించాయి.

క్షణంలో వందో వంతు కాలం స్తంభించింది…

తరవాత రెండు భయంకరమైన విస్ఫోటనాలు…

ఢాం…!

ఢాం…!!

రెండవది…చివరి భాగం వచ్చే సంచికలో …

****సశేషం****

Posted in June 2026, కథలు

5 Comments

  1. K M RAMACHAND

    రచయిత గారికి ధన్యవాదాలు 71 నాటి యుద్ధ విశేషాలను మాకు కళ్ళకు కట్టినట్టుగా వినిపిస్తూ ఉంటే (చదివినా కూడా వినిపించినట్టుగా అనిపించింది), చరిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది మీ రెండో భాగం కోసం ఎదురు చూస్తుంటాం,
    చక్కటి కథనంతో దేశం కోసం త్యాగం చేసే మన వీర సైనికుల వీర గాధ పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది

  2. Andhra Chaitanya-Ramireddy

    కథ ను వాస్తవికంగా, ఫిల్మ్ లాగా చూపించారు. చాలా anxiety గా ఉన్నది. Topic బాగా కష్టమైనది. Emotions, sentiments, Historical recorded evidential topic అందువల్ల రచయిత మీద బాధ్యత ఉంటుంది. ఎడిటింగ్ కష్టం గా ఉంటుంది. Patriotism కాబట్టి అందరూ 100% observe చేస్తారు.

    Congratulations 🌹🌹🌹🌹

  3. డా. కె. శివబాబు, జహీరాబాద్, తెలంగాణ

    రచయిత వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టినట్లు రాయడమే కాక, ఉత్కంఠత రేకెత్తించడంలో కొత్త పరవళ్లు తొక్కుతున్నారు. తెలుగు భాష పై నూతన ఆసక్తి కలిగించడానికి ఇలాంటివి ఉపయోగం. హాట్సాఫ్.

  4. ఉండవల్లి మహేష్ బాబు

    శివరాత్రి వీరాంజనేయులు గారి కథా వర్ణన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. 1971 పాక్ భారత్ యుద్ధం లైవ్ లో సగం చూసాము. రెండవ భాగం కోసం నిరీక్షణ తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *