Menu Close

Shabdavedhi pagetitle

- గౌరాబత్తిన కుమార్ బాబు -
ద్రావిడ ఉద్యమ మార్గదర్శకుల్లో ఒకరైన పిట్టి త్యాగరాయ చెట్టి
Pitti-Theagaraya-Chetty

మదరాసు నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం టి.నగర్...దీని పూర్తి పేరు త్యాగరాయ నగర్. జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులైన పిట్టి త్యాగరాయ చెట్టి గారి పేరు ఈ ప్రాంతానికి పెట్టడం జరిగింది. శ్రీ పిట్టి త్యాగరాయ చెట్టి ఏప్రిల్ 27, 1852 న మద్రాస్ లో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు అయ్యప్ప చెట్టి, తల్లి గారి పేరు వల్లీ అమ్మాళ్. వీరి మాతృ భాష తెలుగు. వీరి కుటుంబం దేవళ సంప్రదాయాన్ని అనుసరించేది. వీరి అన్నగారి పేరు కూడా త్యాగరాయ చెట్టి యే. ఒక సంవత్సరం తేడా గల ఈ అన్నదమ్ములిద్దరూ పిట్టి బ్రదర్స్ గా ప్రసిద్ధి గాంచారు.

అయ్యప్ప చెట్టి గారికి తన చిన్న కొడుకు దక్షిణాదిన ఒక ప్రముఖ నాయకుడిగా ఎదగాలనే కోరిక బలీయంగా ఉండేదట . అందుకే వీలైనంతలో త్యాగరాయ చెట్టి గారికి మంచి చదువు చెప్పించారు. త్యాగరాయచెట్టి గారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి 1876వ సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. విద్యాభ్యాసం తరువాత రాజకీయ రంగ ప్రేవేశం చేసి 1882లో మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్ కి ఎన్నికయ్యారు. మద్రాస్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా 1922 వరకు కొనసాగారు. వీరు మద్రాస్ కార్పొరేషన్ కి తొలి నాన్ అఫీషియల్ ప్రెసిడెంట్. త్యాగరాయ చెట్టి గారి సహధర్మచారిణి పేరు చిన్నవల్లి అమ్మాళ్. వీరికి ఒక కొడుకు, ఏడుగురు కుమార్తెలు కలిగారు.

1876వ సంవత్సరంలో మద్రాసులో కనీవినీ ఎరుగని భయంకరమైన కరువు ఏర్పడింది. అది ధాతునామ సంవత్సరం కావడంతో ఆ కరువును ధాతు కరువు అనసాగారు. వానలు కురవక , పంటలు పండక ఆహార ధాన్యాలకు విపరీతమైన కరువు ఏర్పడింది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన త్యాగరాయచెట్టి అప్పటి ఆంగ్ల ప్రభుత్వం నుండి సహాయం కోసం ఎదురు చూడక సొంత పైకంతో గంజి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ గంజి కేంద్రాలున్న స్థలాన్ని గంజి దొడ్డి అని పిలిచేవారు. ఆ స్థలంలో కట్టబడిన ఆసుపత్రిని కూడా గంజిదొడ్డి ఆసుపత్రి అని పిలిచేవారు. అదే నేటి చెన్నై నగరంలోని స్టాన్లీ హాస్పిటల్.

1916 వరకు త్యాగరాయ చెట్టి కాంగ్రెస్ పార్టీ లో చురుకుగా పాల్గొన్నారు. 1887లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహణలో త్యాగరాయచెట్టి కీలక పాత్ర పోషించారు. 1882లో బడుగు బలహీన వర్గాల కోసం త్యాగరాయచెట్టి మద్రాస్ మహాజన సభ స్థాపించి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వానికి అర్జీలు సమర్పించేవారు. 1916లో బలహీనవర్గాల హక్కుల విషయమై త్యాగరాయచెట్టి కాంగ్రెస్ పార్టీ తో విభేదించి పార్టీని వీడారు. అప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న పెరియార్ త్యాగరాయచెట్టిని విమర్శించారు. కానీ మరికొన్నేళ్ళకు పెరియార్ కూడా అదే కారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడారు. సమాజంలోని అన్ని వర్గాలవారూ సమజీవనము, సమానాభివృద్ధి పొందాలనే ఆశయంతో తన సహచరులైన సి. నటేశ మొదలియార్, టి.యం.నాయర్ తో కలసి దక్షిణ భారతీయుల సంక్షేమ హక్కుల సంఘంను (Thenninthiyar Nala Urimai Sangam) స్థాపించారు. అదే జస్టిస్ పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ కోసం ఆనాడు కోటి రూపాయల దాకా తన సొంత డబ్బును వెచ్చించారు.

1920లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించింది. కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహిస్తుండడంతో ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. గవర్నర్ విల్లింగ్డన్ త్యాగరాయచెట్టిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. అయితే ప్రజల సొమ్మును జీతంగా తీసుకోవడం ఇష్టంలేని త్యాగరాయచెట్టి నాయకత్వం తీసుకోవడానికి నిరాకరించి సుబ్బరాయలు రెడ్డియార్ కు అవకాశం కల్పించారు.

త్యాగరాయ చెట్టి కుటుంబం మద్రాస్ లోని కొరుక్కుపేట ప్రాంతంలో నివసించేది. అక్కడ చేనేత మరియు తోలు శుద్ధి (జంతు చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియ) పరిశ్రమలను నిర్వహించేది. ఇవే కాకుండా ఉప్పు తయారీ, సున్నం తయారీ పరిశ్రమలను కూడా నిర్వహించేవారు. సుమారు వంద పడవలతో కూడిన సొంత రవాణా వ్యవస్థ కూడా త్యాగరాయచెట్టికి ఉండేది. తన ఇంటి దగ్గరే సుమారు వంద మగ్గాలతో పిట్టి వీవింగ్ మిల్ ను స్థాపించారు. వీవింగ్ లో నూతన పద్ధతులను తన మిల్లులో త్యాగరాయచెట్టి ప్రవేశపెట్టారు.

త్యాగరాయచెట్టి మద్రాసు నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. నూతన రైలు మార్గములు ఏర్పరచుటలోను, ఓడరేవును అభివృద్ధి పరచటంలోనూ, బకింగ్ హాం కాలువను ప్రక్షాళన చేసి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుటలోను, వృత్తి విద్యా పాఠశాలలను నెలకొల్పుటలోను ప్రముఖపాత్ర వహించారు.

మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో భాగంగా చేనేతను ప్రోత్సహించారు. అయితే త్యాగరాయ చెట్టి గాంధీజీ సంప్రదాయ పద్ధతిని మాత్రమే ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించారు. పాత పద్ధతులు భారతదేశ పురోగమనానికి సహకరించవని త్యాగరాయచెట్టి భావన. చేనేత పరిశ్రమలో నవీనతను ప్రవేశపెట్టి అందులో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది త్యాగరాయచెట్టి ఆశయం. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ మద్రాస్ వచ్చినపుడు గాంధీజీ పిట్టి వీవింగ్ మిల్ ను సందర్శించి అక్కడి ప్రక్రియలను పరిశీలించారు.

స్వాభిమాన ఉద్యమాన్ని నడిపించడం వలన త్యాగరాయ చెట్టిని నాస్తికుడని పొరబడుతుంటారు. కానీ మైలాపూరులోని కబాలేశ్వర్ గుడిని పునర్నిర్మించారు... చాకలి పేటలోని రామలింగ చౌడేశ్వరి దేవి గుడికి దానాలు చేశారు.

త్యాగరాయచెట్టి అపూర్వమైన సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1909లో రావు బహదూర్, 1919లో దివాన్ బహదూర్ అను బిరుదులతో పాటు 1921లో సర్వోన్నతమైన "సర్" బిరుదునిచ్చి సత్కరించింది. అనేక సంవత్సరాలపాటు ప్రజాసేవ చేసిన సర్ పిట్టి త్యాగరాయచెట్టి 1925వ సంవత్సరం ఏప్రియల్ 28వ తేదీన పరమపదించారు.

సాహిత్య సరస్వతి కడెము వెంకటసుబ్బారావుగారు త్యాగరాయచెట్టిని ఈ విధంగా కీర్తించారు.

వెండికొండ చందమ్మున నుండువాడు
పావనంబైన దేవాంగ వంశభవుడు
అతడు జగజెట్టి త్యాగరాయచెట్టి

***ఓం నమో నారాయణాయ***

Posted in June 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *