ఊహాలోకం
కవిత రాయాలనే ఉంది? కానీ ఎలా!
కాళిదాసులా లేదా కృష్ణదేవరాయల్లా
భాషా సంపత్తి లేదు భావ కలిమి లేదు
నా ఊహా సుందరి…. అందం ఎక్కడో లేదు! ఇక్కడే!
నలుదిసల పరుచుకున్న ప్రకృతిని చూడంది..
జడత్వంతో కదలని నా కలం ఇక జర జర సాగింది
పూలగుచ్చాల బరువుతో వాలిన కొమ్మ
సిగ్గుతో తలవంచిన పెళ్ళి కూతురులాగుంది
కడలి కెరటాలు ఒడ్డు తాకిన సవ్వడి
సమూహంగా పఠిస్తున్న వేదఘోషలాగుంది
తరువుల నిండిన గలగల మనే రెమ్మలు
ప్రపంచ ద్వారానికి తోరణాలు గామోసు!
నీలాకాశంలో పయనిస్తున్న తెల్లటి మబ్బులు
రెండు రంగుల చీరనెవరో నేస్తున్నట్లుంది
నల్లటి ఆకాశంలో మెరిసే తారలు
ఎవరో జ్ఞాని మహా కావ్యం రాస్తున్నట్లుంది
చిరుగాలుల తాకిడి నా వీనుల్లో సవ్వడి
ఎవరో కరచాలనం చేసి గుసగుసలాడినట్లుంది
సృష్టిని చూస్తుంటే పదే పదే స్ఫురిస్తుంది
మనం క్షణికం మన మనుగడ క్షణికం
మనుజుల జననం మరణం క్షణికం
సృష్టిలోని రహస్యం… దాని శాశ్వత అందం.