చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని వస్తావు (జాతీయం కథ)
శివరామరాజుపేట గ్రామంలో మురళి అనే ఆయన నివసించేవారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కొడుక్కి ఒక కూతురు, ఒక కొడుకు.
చిన్న కొడుక్కి ఒక కొడుకు ఉన్నారు. మురళి తన మనవలు, మనవరాలితో శేషజీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
ఒకరోజు మురళి ఇంటి అరుగు మీద కూర్చుని మనవడు జున్నుబాబుకి కథలు చెబుతున్నారు. ఇంతలో కాశీబుగ్గ నుంచి ఆయనకు దూరపు బంధువైన రాఘవరావు వచ్చారు.
"బావగారూ! బాగున్నారా?" అని పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్లారు. కాసేపు కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాక, "మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది రాఘవరావు?" అని అడిగారు మురళి.
“ఏం చెప్పను బావగారూ! ఆయన ఆరోగ్యం రోజురోజుకీ దిగజారిపోతోంది. మరో వారం రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది. ఆ పెళ్లికి మిమ్మల్ని పిలవడానికే ఇలా వచ్చాను” అన్నాడు రాఘవరావు దిగులుగా.
“వ్యాపారం ఎలా ఉంది అన్నయ్యా?” అని అడిగింది మురళి భార్య.
“వ్యాపారం సరిగ్గా సాగడం లేదు చెల్లెమ్మా.. చాలా ఇబ్బందిగా ఉంది” అన్నాడు రాఘవరావు.
“కంగారు పడకు అన్నయ్యా, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. మంచి రోజులు వస్తాయిలే” అని ఓదార్చింది మురళి భార్య.
“ఓ రెండు రోజులు ఉండి వెళ్లచ్చు కదా బావగారూ!” అన్నారు మురళి.
“అయ్యో! రెండు రోజులా? ఒక పూట కూడా ఉండే పరిస్థితి లేదు బావగారూ. పెళ్లి పనులన్నీ నేనొక్కడినే చూసుకోవాలి. నాకు సాయం చేసేవారెవరూ లేరు. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలి” అని చెప్పి రాఘవరావు వెంటనే బయలుదేరారు.
అప్పుడు మురళి భార్య బాధపడుతూ.. “అదేంటి అన్నయ్యా! చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని వస్తావు?” అంది.
“ఏం చేయను చెల్లెమ్మా.. పరిస్థితులు అలా ఉన్నాయి” అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న జున్నుబాబు సందేహంగా అడిగాడు.. “తాతయ్యా! ఎవరైనా చెప్పుల్లోనే కదా కాళ్లు పెట్టుకునేది? మరి మామ్మ ఎందుకలా అంది?” అని.
మురళి నవ్వుతూ “నాయనా జున్ను! ‘చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని ఉండటం’ అనేది ఒక జాతీయం. ఇంటికి వచ్చిన అతిథులు వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో ఈ మాటను వాడతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే పాదరక్షలు వేసుకుంటాం, విశ్రాంతి తీసుకునేటప్పుడు వాటిని పక్కన పెడతాం. అంటే చెప్పుల్లో కాళ్లు ఉన్నాయి అంటే వారు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని అర్థం.”
అని వివరించారు.
“ఓహో.. మామ్మ ఎందుకు అలా అందో ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్యా!” అన్నాడు జున్నుబాబు నవ్వుతూ.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.