Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
బక్కెట్ లిస్ట్
- సుజల గంటి -

సునంద మనవరాలి గదిలోకి వచ్చింది. ఖాళీ టైమ్‌లో ఆమె గది సర్దడం ఆమెకు ఇష్టం.

“ఎందుకమ్మమ్మా, నేను సర్దుకుంటాను కదా! అప్పుడప్పుడు టైమ్ దొరకక అలా వదిలేస్తూ ఉంటాను. నువ్వు పట్టించుకోకు. నీ అంత పర్‌ఫెక్ట్‌గా నేను ఉండలేను. అమ్మ కూడా చెప్పి చెప్పి విసిగిపోయింది. ఐనా నీకొక విషయం చెప్పనా? Intelligent people అంటే తెలివైన వాళ్ళు తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోరట” అంది.

నవ్వుతూ “అలా అని ఎక్కడైనా రాసారా?” అంది సునంద. నవ్వుతూ ఆవిడ్ని ఒక్కసారి కౌగలించుకుని వెళ్ళిపోయింది కిరణ్మయి.

పుస్తకాలు బొత్తిగా పెడదామని తీసిన సునందకు కిరణ్ రాస్తున్న నోట్‌బుక్ కనబడింది. ఏమిటో అని చూడబోయిన ఆమెకు బకెట్ లిస్ట్ అని కనబడింది. దానికింద కిరణ్ తను చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి రాసుకుంది. అలా ఎందుకు రాసుకుందో అర్థం కాలేదు. అసలు ఆ మాటే కొత్తగా అనిపించింది సునందకు.

సరే మనవరాలు వచ్చాక అడుగుదామని అనుకుంది. నీట్‌గా సర్ది తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.

సునంద దంపతులకు ఒక కొడుకు కూతురు. కొడుకు అమెరికాలోనూ, కూతురు బెంగుళురు లోనూ ఉంటున్నారు. వాళ్ళ వీలుని బట్టి కొడుకు దగ్గరకు, కూతురు దగ్గరకు వెడుతూ ఉంటారు. భర్త రిటైర్‌మెంట్ తరువాత పల్లెలో సొంత ఊళ్ళో ఉండడానికి నిర్ణయించుకున్నారు.

“అక్కడెందుకు, నా దగ్గర ఉండవచ్చు కదా! పల్లెలో ఎవరున్నారని? మీకేమైనా అవుతే చూసుకుందుకు ఎవరున్నారని?” అంది, కూతురు.

ఎప్పుడూ ఉద్యోగం హడావుడిలో ఉండే కూతురు తమ అవసరాలు చూస్తుందన్న నమ్మకం లేదు. ఐనా ప్రశాంతంగా ఊళ్ళో కల్మషం లేని వాతావరణంలో స్వేచ్ఛగా ఉండడంలో ఒక ఆనందం ఉంది. ఇష్టమున్నది వండుకోవడం లేకపోతే పాలు, పళ్ళుతో కాలక్షేపం చెయ్యడం. ఇక్కడ అలా కాదు, వాళ్ళ కోసం రోజూ వంట వండడం తప్పదు.

‘కన్నపిల్లలకు వంట వండడం కూడా తప్పేనా?’ అంటే సమాధానం ఇవ్వడం కష్టం. కనీసం బాధ్యతలు తీరాకన్నా తమ కోసం తాము బతకాలి. అదేమిటో చాలా మంది ఆడపిల్లలకు ‘మంగలాడ్ని చూస్తే ఎద్దు కాలు కుంటింది’ అన్నట్లు తల్లిని చూడగానే తమ బాధ్యతలన్నీ ఆమె మీదకు తోసేసి కూర్చుంటారు. మళ్ళీ చాకిరీకే కానీ సలహాలకు పనికి రారు. కూతుళ్ళే ఇలా ఉంటే కోడళ్ళనించీ ఇంకేమి ఆశిస్తారు పెద్దవాళ్ళు? ఐనా ఇవ్వన్నీ పట్టించుకోకుండా మనవల కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు.

గదిలోకి వచ్చిన సునందను చూసి భర్త అడిగాడు “పనులన్నీ పూర్తి చేసి వచ్చావా? కాస్త మోకాలు నొప్పిగా ఉంది. కాస్త ఆయింట్‌మెంట్ రాయవోయ్” అన్నాడు.

చదువుతున్న నవల పూర్తి చెయ్యాలని ఉన్నా, భర్త అడిగినది చెయ్యడం ముఖ్యం. ఎంతో నొప్పి ఉంటే కానీ అతను అడగడు. ఆమెకు నొప్పి వచ్చినా అతను ఆమెకు సేవ చెయ్యడానికి వెనుకాడడు.

మంచం మీద అతని పక్కన కూర్చుని మోకాలికి ఆయింట్‌మెంట్ రాయడం మొదలు పెట్టింది. పని చేస్తున్నా ఆలోచనల్లో మునిగిపోయిన భార్యను,

“ఏమయ్యింది, ఏదో ఆలోచనలో ఉన్నావు?” అన్నాడు.

“ఏం లేదు” అంది.

చెప్పడానికి ఇష్టంలేదని అర్థమయ్యింది. బలవంతం చెయ్యలేదు. ప్రతీసారీ తన మనసులో ఉన్నవన్నీ చెప్పాలని లేదు. ఇష్టం ఉన్నప్పుడు ఆమే చెపుతుంది అనుకున్నాడు. మందు రాస్తున్న ఆమె చెయ్యి మీద తన చెయ్యి వేసి, “నీ చేతుల్లో ఏదో మంత్రం ఉందోయ్. ఎంత నొప్పి ఐనా వెంటనే తగ్గిపోతుంది” అన్నాడు.

“చాల్లెండి సరసాలు” అంది నవ్వుతూ.

“నేను ఉన్నమాట అంటే సరసాలు అంటావేమిటి? ఐనా కట్టుకున్న పెళ్ళాంతో కాక పరాయివాళ్ళతో ఆడతానా?” అన్నాడు నవ్వుతూ.

“సర్లెండి పడుకోండి” అంటూ మంచంమీదనుంచి లేచింది.

కుర్చీలో కూర్చుని నవల చదవడానికి ఉపక్రమించింది. భర్త అడిగినదానికి సమాధానం చెప్పలేదు. తన మనసులోని భావాలన్నీ అతనితో చెప్పాలనిపించదు. అతను వద్దంటే చెయ్యలేదు, అదొక బలహీనత ఆమెకు. సాయంకాలం దాకా కిరణ్‌తో మాట్లాడడానికి అవకాశం రాలేదు. కాలేజ్‌నుంచి అలిసిపోయి వచ్చింది.

సాయంకాలం కోసం వంట చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళింది. వెనక వీపు మీంచి గుండెల మీదకు జారిన చేతుల్ని గుర్తించింది. వెనుతిరిగి చూసింది.

“థాంక్యూ అమ్మమ్మా, నా గది సర్దినందుకు. ఐనా నేను సర్దుకుంటాను కదా!” అంది.

“ఫరవాలేదు అది నాకు ఆనందాన్ని ఇస్తుంది.” అంది.

“ఇక్కడి కొచ్చాక నీకు రెస్ట్ దొరకదు. మీ ఇంట్లోనూ, ఇక్కడా నువ్వే పని చేస్తావు. పైన నా పనులు కూడా ఎందుకు నీకు?” అంది కిరణ్.

“నాకు ఇష్టం అన్నాను కదా!”

“పోనీ ఇవ్వాళ వంట నేను చెయ్యనా!” అంది.

“వద్దు నేనే చేస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. అలా కూర్చో” అంది సునంద.

“అంత సీరియస్ మేటరా?”

“కాదురా కుతూహలం. ఇందాకా నీ గది సర్దుతుంటే ఒక నోట్‌బుక్‌లో ‘బకెట్ లిస్ట్’ అని చూసాను. అంటే ఏమిటి? అని తెలుసుకోవాలని ఉంది” అంది సునంద.

“ఓస్ అదా! బకెట్ లిస్ట్ అంటే మనిషి తన జీవితంలో మనం సాధించాలని అనుకుంటున్నలక్ష్యాలు, మన జీవితంలో మనం జీవితంలో ఇప్పటిదాకా సాధించినవి, సాధించాలనుకున్నవీ అన్నమాట. ప్రతి మనిషీ తన జీవితకాలంలో ఏం సాధించాలి? ఇప్పటిదాకా ఏం సాధించాడు అనేవే ఈ బకెట్ లిస్ట్. మా ఫ్రెండ్స్ అందరం రాసుకుంటాము. అలాగే నేను కూడా నా లిస్ట్ రాసుకున్నాను” అంది కిరణ్.

“ఏమిటో... మాకు ఇవన్నీ తెలియవురా. ఏదో బతికేసాము. చదువు మాత్రం చదువుకున్నాను. అది కూడా అమ్మానాన్నా చెప్పారని. ఆ తరువాత పెళ్ళి, పిల్లలు. మీ అమ్మ నోటంబడి కూడా ఈ మాట ఎప్పుడు వినలేదు. ఇది కొత్తగా వచ్చిందా?”

“లేదు అమ్మమ్మా... పాతదే. దీన్ని ఎంత మంది ఫాలో అయ్యారన్న విషయం నాకు తెలియదు. నీకు దీని గురించి కావాలంటే గూగుల్‌లో వెతికితే దొరుకుతుంది” అంది.

“నీ నోటివెంట ఇలాంటి కొత్త విషయాలు వింటే మేం ఎంత అయోమయంగా జీవితాలు వెళ్ళబుచ్చామో అనిపిస్తుంది. నేను జీవితంలో ఏం సాధించాను?”

“అదేంటి అమ్మమ్మా నువ్వు సాధించినది బోలెడు ఉంది. పోనీ ఇప్పుడు నువ్వు నీ బకెట్ లిస్ట్ రాయి” అంది కిరణ్.

“ఇప్పుడు రాయడానికేముందే?” అంది.

“ఎందుకు లేదు? ఇప్పటిదాకా నువ్వు సాధించినవన్నీ కూర్చుని రాయి. ఆ తరువాత నువ్వు చెయ్యాలనుకుని, చెయ్యలేకపోయిన వాటి లిస్ట్ కూడా రాయి. బకెట్ లిస్ట్‌కి ఈ టైములోనే రాయాలని లేదు. బకెట్ లిస్ట్ అన్నది మనం చనిపోయేలోపల చెయ్యదల్చుకున్న పనులు, చేసిన పనులు... మేం చిన్నపిల్లలం మేం చూడాల్సిన ప్రదేశాలు, మేం జీవితంలో ఏం అవ్వాలని అనుకుంటున్నాము అన్నవి రాసుకుంటే జీవితంలో మోటివేషన్ దొరుకుతుంది. ‘నీకున్న కలలేమిటి? వాటిని ఎలా సాకారం చేసుకోవాలనుకుంటున్నావు?’ ఇవన్నీ బకెట్ లిస్ట్‌లో వస్తాయి. కాబట్టి ఇప్పటిదాకా నువ్వేం సాధించావో రాసుకో. దానితో నీకు నీ జీవితం వేస్ట్ అయ్యిందన్న భావం కలగదు. ఆ తరువాత నువ్వు చెయ్యాలనుకుని, చెయ్యలేని పనులు రాయి. వాటికి ఇప్పటికీ టైముందని నా ఉద్దేశం. ఎందుకంటే నీలో ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉంది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ నువ్వు నేర్చుకున్నావు. తాత నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేర్చుకోనని చెప్పేసారు. ఆయనకు కొత్తవి నేర్చుకోవాలని ఉండదు” అంది.

“అలాగే నా బంగారుతల్లీ! అందుకే నువ్వంటే నాకిష్టం. అన్నీ అమ్మమ్మకు తెలిసేటట్లుగా నేర్పుతావు” అంది సునంద.

“నువ్వు నాకు ఎన్ని నేర్పలేదు? నీ మూలంగానే నేను ఇంత పెద్దదాన్నయ్యాను. మా అమ్మమ్మ బంగారం” అంటూ ముద్దు పెట్టుకుంది.

అప్పుడే వంటింట్లోకి అడుగుబెట్టిన రాధ, “ఏమిటీ అమ్మమ్మా మనవరాలూ మంతనాలు ఆడుకుంటున్నారు?” అంది.

“నీకెందుకు? అది మా సీక్రెట్” అంది కిరణ్.

“అమ్మా, ఏమిటి నువ్వు కూడా చిన్నపిల్లలా దానితో బాటు కబుర్లు?” అంది. ఎక్కడో తన కూతురు తనకన్నా అమ్మమ్మతో అన్నీ పంచుకుంటుందన్న భావన.

మళ్ళీ తనలో తను అనుకుంది అమ్మకు అన్ని వయసుల వాళ్ళతో కలిసిపోయే తత్వం ఉంది. చిన్నప్పుడు తను కూడా అమ్మతో పంచుకునేది. ఇప్పుడు పెద్దయ్యాక తమ మధ్య దూరం పెరిగింది. దానికి కారణం తనే అని తెలుసు. అమ్మ నిండుకుండ తొణకదు. తనలాగా అన్నిటికీ చిందులు వెయ్యదు. అమ్మ ఓర్పు తనకెందుకు రాలేదు? బహుశా తను నాన్నను పోలి ఉంటుంది అనుకుంది.

ఆరోజు నుంచి సునంద ఆలోచనల నిండా బకెట్ లిస్ట్ గురించే. ఒకరోజు రాయడానికి నిశ్చయించుకుని చిన్న పాడ్, పెన్ తీసుకుంది.

ఒక్కసారి మనసులో అనుకుంది, ఇప్పటిదాకా తనేం చేసిందని. ఏం తట్టలేదు. పెన్, పాడ్ పక్కన పెట్టేసింది. రాధ చెప్పినట్లు పిల్లలతో సమంగా చెయ్యాలనుకోవడం బుధ్ధి తక్కువ. ఈ వయసులో కృష్ణారామా అనుకోకుండా ఇవన్నీ ఎందుకు?

మనసుని సమాధాన పర్చుకునేందుకు చూస్తోంది. ఎంత చేసినా మనసు చెప్పిన మాట వినటం లేదు. ఉదాసీనంగా ఉన్న భార్యను చూసి ఏమయ్యిందని అడిగాడు.

ఏమని చెప్పాలి? తన ఆలోచనల్ని అతను అర్థం చేసుకుంటారా? ఏమో? ఎందుకో చెప్పాలనిపించలేదు. ఎప్పుడూ పిల్లల విషయాలు, సంసారం గురించిన సమస్యలు తప్ప వాళ్ళిద్దరి మధ్య వేరే సంభాషణలు చోటు చేసుకోలేదు. సునంద తన మనసు విప్పి ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నం చెయ్యలేదు.

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన స్నేహభావం వాళ్ళిద్దరి మధ్యా లేదనే చెప్పుకోవాలి. భర్తలో ప్రియసఖుడిని చూసుకోగలిగిన ఆడది అదృష్టవంతురాలు.

రెండు రోజుల తరువాత కిరణ్ అమ్మమ్మని అడిగింది, “నీ బకెట్ లిస్ట్ రాసావా?” అని. లేదని సమాధానం ఇచ్చింది సునంద.

“అదేంటి అమ్మమ్మా, ఎందుకు రాయలేదు?” అంది.

“రాయడానికి ఏముంది?” అంది.

“ఇప్పటిదాకా నీ జీవితంలో సాధించినవి రాయి”

“ఏం సాధించాను?”

“అమ్మా! మీ అమ్మ జీవితంలో ఏం సాధించలేదా?” అంది అక్కడే కూర్చుని లాప్‌టాప్‌లో పనిచేస్తున్న తల్లితో.

“ఎందుకు చెయ్యలేదు? ఐనా ఇప్పుడవన్నీ ఎందుకు?” అంది.

“బకెట్ లిస్ట్ గురించి తెలుసు కదా నీకు!” అంది కిరణ్.

“ఆ తెలుసు ఇప్పుడు దాని అవసరం ఎందుకు వచ్చింది?”

“నా టేబుల్ మీద నేను రాసిన లిస్ట్ చూసి అమ్మమ్మ అడిగింది చెప్పాను. ‘నేను కూడా రాయవచ్చా!’ అంది. రాయవచ్చన్నాను. ‘ఇప్పుడు రాయడానికి ఏం లేదు’ అంటోంది. అలా ఎలా ఉంటుంది?” అంది కిరణ్.

“ఇప్పుడీ వయసులొ అదెందుకు? నేనే ఎప్పుడూ రాయలేదు” అంది రాధ.

“అదేంటమ్మా నువ్వు రాయకపోతే అమ్మమ్మ రాయకూడదని లేదు కదా!” అంది కిరణ్.

“నాకు తెలియదు. మీరిద్దరూ చూసుకోండి, మీ ఇద్దరి మధ్య నేనెందుకు?” అంటూ లాప్‌టాప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.

“పోనీ నువ్వు చేద్దామనుకుని చెయ్యలేని పనులు ముందు రాయి. నువ్వు ఏం చేసావన్నవి తరువాత ఆలోచించి రాయి” అంది కిరణ్.

“అస్సలు ఈ పేరే విచిత్రంగా ఉంది”

“కిక్ ద బకెట్ అని విన్నావా?” అంది కిరణ్.

“విన్నాను. అంటే మనం చనిపోయే లోపల చెయ్యాలనుకున్న పనులు కదా!”

“కరెక్ట్. అలాగే మనం ఇప్పటిదాకా ఏమైనా సాధించామా అన్నది ఆలోచించుకుని అవి కూడా రాయవచ్చు. దానితో మనకు మన మీద మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మనం అనుకున్నది చెయ్యగలమన్న ధీమా వస్తుంది” అంది కిరణ్.

పెన్ను, పాడ్ ఇచ్చి, “రాయి. నువ్వు చెయ్యాలనుకుని చెయ్యలేని పనులు” అంది.

పెన్, పాడ్ తీసుకుని, “కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉండేది నాకు. కానీ మీ తాత నేర్చుకోవద్దన్నారు. కానీ ఇప్పుడు కుదరదేమో కదా!” అంది.

“అది నీకు ఆనందాన్ని ఇస్తుందంటే నేర్చుకో. రోడ్‌మీద నడపక పోయినా నీకు అది వచ్చు అన్న భావన చాలు నేను నేర్పుతాను. ఇంకా?” అంది.

“బోన్‌సాయ్ అంటే నాకు చాలా ఇష్టం” అంది.

“అది పెద్ద కష్టం కాదు నేను అది నేర్పే వాళ్ళ దగ్గరకు తీసుకు వెడతాను” అంది.

ఆ మాటతో ఒక్కసారిగా సునంద మనసులో తను చెయ్యాలని అనుకున్న పనుల వెల్లువ వరసగా రాయడం మొదలయ్యింది.

“చాలా ఎక్కువ రాస్తున్నానేమో?” అంది.

“రాయి అమ్మమ్మా రాసినంత మాత్రం నష్టం లేదు కదా! చెయ్యగల్గినన్ని చెయ్యి. ఇప్పుడు కూడా నీ మనసులోనివి అణచిపెట్టాల్సిన అవసరం లేదు” అంది కిరణ్.

కిరణ్ మొహంలోకి ఆనందంగా చూస్తూ, ‘నేను లాల పోసి పెంచిన నా బంగారు అప్పుడే ఎంత పెద్దదయి పోయిందో’ అనుకుంటుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

“అమ్మమ్మా ఏడుస్తున్నావా?” అంది.

“లేదురా ఇవి ఆనందబాష్పాలు! నేను ఎత్తుకుని పెంచిన నా చిన్నపండు ఇప్పుడు పెద్ద అయిపోయి నాకు పాఠాలు చెపుతోందన్న ఆనందం”

“మై స్వీట్ అమ్మమ్మ” అంటూ ముద్దు పెట్టుకుని, “ఇంక నేను చదువుకోవాలి. రేపట్నించీ డ్రైవింగ్ స్టార్ట్” అంది.

“ఎస్ మేడమ్” అంది సునంద.

లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయాక సునంద ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ గతాన్ని తల్చుకునే అవసరం లేనంత బిజీగా గడిచిపోయింది. ఎదురుగుండా కనబడుతున్న తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి పడ్డ తాపత్రయంలో కాలం ఎలా పరుగెట్టిందో తెలియలేదు. ఇప్పుడు ఆలోచించాలి. ఇన్నాళ్ళూ తను ఏం సాధించింది? పిల్లల్ని సక్రమంగా పెంచి, దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వడం ప్రతీ తల్లి యొక్క కర్తవ్యం. సరైన దారిలో నడవకపోతే పిల్లలు దేశానికి, సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యే ప్రమాదం ఉంది.

చుట్టుపక్కల కమ్ముకున్న కుళ్ళునుంచి ప్రతీ క్షణం పిల్లల్ని కాపాడ్డం సరిపోయింది. అందుకే వాళ్ళు ఇప్పుడు తల్లిగా గర్వపడే పిల్లలుగా మారారు. తమ తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇది తను సాధించిన విజయమే కదా!

పెళ్ళితో ఆగిపోయిన చదువు తిరిగి మొదలుపెట్టి, బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పిల్లల భవిష్యత్తుకి డబ్బు అవసరమని తను కూడా ఉద్యోగం చేసి భర్తకు ఆర్థికంగా తోడ్పడింది. ఇవన్నీ తను సాధించిన విజయాలే కదా!

కిరణ్ చెప్పినది నిజమే. “ఒక్కసారి తీరికగా కూర్చుని ఆలోచించు అమ్మమ్మా! నువ్వు ఎన్నో విజయాలు సాధించి ఉంటావు. అవి నీ విజయాలని నీకు తెలియకపోవచ్చు అవి జ్ఞాపకం తెచ్చుకుని రాసుకుంటే నీకు ఆత్మసంతృప్తి కలిగి నీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. అలాగే నువ్వు ఇంకా ఏం చెయ్యాలను కుంటున్నావో అవన్నీ రాసుకుని పూర్తిచెయ్యడానికి ప్రయత్నించు. అవి పూర్తి చేసుకుందుకు ప్రయత్నించు” అంది. సునంద రాయడం మొదలుపెట్టింది.

మర్నాడు కార్ డ్రైవింగ్‌కి బయలుదేరింది. పెట్టెలో ఎక్కడో దాచిన సల్వార్ కమీజ్ తీసి వేసుకుంది. ఆ బట్టల్లో ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఆమె భర్త, కూతురు.

విషయం తెలుసుకున్న భర్త, “ఈ వయసులో ఇది ఇప్పుడు అవసరమా?” అన్నాడు.

“అవసరం అని కాదు తాతా! తన మనసులో ఉన్న కోరికలు చెయ్యాలనుకున్న పనులూ చెయ్యాలను కోవడం తప్పు లేదు. బాధ్యతల మధ్య తనను తాను బంధించుకుని, తనకేం కావాలో ఇన్నాళ్ళు ఆలోచించ లేదు అమ్మమ్మ. ఇప్పుడైనా ఆమెను స్వేచ్ఛగా ఆమె అనుకున్నట్లు జీవించనివ్వండి” అంది, కిరణ్.

అడ్డు చెప్పబోయిన రాధకు కూతురు మాటలు విన్నాక ఆమె చెప్పినది నిజమనిపించింది. తను పెరిగినంత స్వేచ్ఛగా అమ్మ పెరగలేదు. ఇప్పుడైనా ఆమెకు అవకాశం ఇవ్వాలి.

తల్లి దగ్గరకు వచ్చి, ప్రేమగా కౌగలించుకుని, “నీ లిస్ట్ తొందరలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంది.

శ్రద్ధ పెట్టడంతో తొందరగానే వచ్చింది.

“నీకు ఈ వయసులో లైసెన్స్ దొరుకుతుందేమో కనుక్కుంటాను” అంది కిరణ్.

“వద్దమ్మా! అందరినీ చూసి కార్ స్టీరింగ్ తిప్పాలన్న కోరిక పెంచుకున్నాను తప్ప మరేం కాదు. నాకిప్పుడు కార్ డ్రైవింగ్ కూడా వచ్చన్న సంతృప్తి చాలు” అంది, సునంద.

********

Posted in June 2026, కథలు

1 Comment

  1. A. Annapurna

    Avunu .Ippati mahilalu annado anukunnavi saadhistunnaru .
    Kaalanugunamga vayasuto sambandham lekunda .
    Sankalpam vunte chaalu neraverchukovachhu “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *