తే: పుస్తకము మహీతలమున పుట్టు కతన
ప్రజలు ఈపాటి విజ్ఞాన వంతులైరి
లేనిచో లోకమెల్ల వర్ణింప రాని
గాఢమైన చీకట్లలో గ్రాలకున్నె?
తే: విద్యుతును బోలు కాంతుల వెడల జేయు
కోహినూరు వజ్రమ్ములు కోట్ల కొలది
భద్రముగ నిద్రవోయెడు పైకమెపుడు
మంచి పుస్తకమ్మునకు సమానమగునె?
ఆ: పుస్తకాలు లేక మస్తకమ్ముల లోని
పాత చీకటెల్ల పారిపోదు
పుస్తకమ్ము జ్ఞానమును ప్రసాదించి జీ
వితము సతము పల్లవింప జేయు
సీ: మన తాతముత్తాత ఘనచరిత్రములు పు
స్తకములో చేతులు సాచి పిలిచె
భూములేలిన రాజముఖ్యులెల్లరును గ్రం
థములలో జొరి శాశ్వతముగ నిలిచె
యుగయుగాలుగ ప్రజాభ్యున్నతినాశించు
వీరులు పుటల గర్వించు చుండె
గతకాల విజ్ఞాన కాంతులిప్పటికి పే
జీలలో దూరి శ్వాసించు చుండె
తే: మృతుల బతికించునమృతమ్ము కతలలోనె
గాని నేటికీ గ్రంథమ్ము కన్ను వడిన
వాడు లోకమ్ములోన శాశ్వత యశస్సు
ముల్లె గట్టడె?రవి ధర జెల్లు వరకు
క: వస్తువులిచ్చే సుఖము ప
శస్తము గాదెపుడు!జ్ఞాన చక్షువు తెరిచే
పుస్తకమిచ్చే సుఖమున
కస్తమయము లేదు-పుస్తకము పుస్తకమే!
తే: బ్రహ్మ దేవుండు తలరాత రాయుననుట
కుక్కలెత్తుక పోయిన ముక్కిడి నుడి
మనిషి తలరాత తీర్చిదిద్దునది చదువు
దానినొడిసి పట్టినది పుస్తకము గాదె!
రచయిత పరిచయం
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.