Menu Close
Radhika-Nori
రాధికారుచిరం
రాధిక నోరి

పగ

మనుషులందరూ ఒకేలాగా వుండరు. వారి రూపాలు వేరుగా వున్నట్లే వారి స్వభావాలు కూడా అనేక విధానాల్లో వుంటాయి. కొంతమందికి ముక్కు చివరే కోపం వుంటుంది, చీటికీమాటికీ కస్సుబుస్సులాడుతూ వుంటారు. ఇంకొంతమందేమో చాలా శాంతంగా, బయట ఏం జరిగినా సరే, నిమ్మకి నీరెత్తినట్లు కదలక, మెదలక మౌనంగా వుంటారు. ఇంకా ఇలా అనేక రకాల తేడాలు. అయితే ఇలా ఎందుకు వుంటారు, అలా ఎందుకు వుండరు  అని అడిగితే మాత్రం సరైన సమాధానం మనకి దొరకదు. అయితే ఒకటి మాత్రం నిజం. ఒక్కొక్కసారి ఒక గుణం ఇంకో గుణంలోకి దారి తీస్తూ వుంటుంది. ఉదాహరణకి కోపం మరీ ఎక్కువైతే పగలాగా మారుతుంది. సరే, అసలు కోపం ఎందుకు వస్తుంది అంటే దానికి చాలా కారణాలు వుండచ్చు. ఇప్పుడు నేను ఆ వివరాలలోకి వెళ్ళటంలేదు. ఎందుకంటే ఇవాళ కోపం గురించి కాదు, దాని తర్వాతి స్థాయి, అంటే పగ, గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను.

అసలు ఈ పగకి అనేక నిర్వచనాలు వున్నాయి. మనకి అన్యాయం చేసినవారిలాగా మనం వుండకపోవడమే వుత్తమమైన ప్రతీకారం అని Marcus Aurelius అనే ఒక Roman చక్రవర్తి అన్నారు. సంతోషంగా, సుఖంగా జీవించటమే పగ తీర్చుకోవటం అని George Herbert అనే England కి చెందిన ఒక కవి, వక్త అన్నారు. దయ, కరుణే సరైన పగ అని ఇంకో ప్రముఖ వ్యక్తి అన్నారు. అంటే  సౌర్యప్రతాపాల కంటే కూడా మన దయ, క్షమలతో శత్రువులను తేలికగా ఓడించవచ్చు అని వారి అభిప్రాయం కావచ్చు.

విజయమే పగ అని ఇంకొకరు అన్నారు. అంటే మనకి ఎవరిమీద అయినా కోపం మరీ అవధులు దాటి పగగా మారినపుడు మన శక్తిని, తెలివిని అంతా వారి వైపు కాకుండా మన అభివృద్ధికి మరలిస్తే అప్పుడు మనకి విజయం చేకూరుతుంది, అదే వారిమీద నిజమైన ప్రతీకారం తీర్చుకోవడం అని వారి అభిప్రాయం కావచ్చు. అసలు ఏమీ  చేయకపోవడమే అసలైన ప్రతీకారం అని ఇంకొకరు అన్నారు. ఇలా పగకు రకరకాలైన నిర్వచనాలు చెప్పారు. ఇప్పుడు మనం ఈ పగ గురించి కొంచెం లోతుగా చర్చించి ఏ నిర్వచనం బాగా నప్పుతుందో తెలుసుకుందాం.

ఎవరైనా మనకి కానీ, మన కుటుంబానికి కానీ, లేక వేరే మనవారెవరికైనా కానీ,  శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదైనా హాని తలపెట్టినప్పుడు, లేక ఏదైనా హాని చేసినపుడు వారి మీద మనకి చాలా కోపం రావటం చాలా సహజం. కానీ ఆ కోపం హద్దులు దాటి వారికి కూడా మనం ఏదైనా హాని చెయ్యాలి, అప్పుడు కానీ పరిస్థితిలో సంతులనం, అంటే balance రాదు, మనకి న్యాయం జరగదు అని అనిపిస్తే, దాని కోసం మనం ఎటువంటి పని అయినా సరే, చేయటానికి సిద్ధం అయితే దాన్నే పగ తీర్చుకోవటం అంటారు. అంటే మనకి హాని చేసినవారిని కష్టపెట్టాలి అన్న కోరిక మనచేత ఏ పనినైనా చేయిస్తుందన్నమాట. వారు ఎంత బాధపడితే మన కక్ష తీరి, మన మనసుకి అంత శాంతి లభిస్తుందన్నమాట. అంటే, పగ తీర్చుకోవటంలో ముఖ్య వుద్దేశం వారి సొంత లాభం కంటే తమ శత్రువులకి నష్టం కలిగించటం అన్నమాట.

అంటే ఇలా పగ తీర్చుకోగలిగితే కనీసం తాత్కాలికంగా అయినా సరే,  కోల్పోయిన శక్తి, సంతులనం మళ్ళీ తమ చేతుల్లోకి తిరిగి వస్తాయని వారు అనుకుంటారు. వారికి జరిగిన అన్యాయానికి అదే తగిన శాస్తి అని వారు గట్టిగా నమ్ముతారు. అందుకే పగ తీర్చుకోవటం వారికి ఎంతమాత్రమూ తప్పుగా అనిపించదు  సరికదా, తమ శత్రువులకు అదే తగిన శిక్ష అని అనిపిస్తుంది. వారి మానసికి వ్యధ తగ్గి మనసుకి ఉపశమనం లభిస్తుంది. తమని ఎవరో వాడుకున్నారు, అవసరం తీరిన తర్వాత నీచంగా చెత్తబుట్టలోకి విసిరేశారు, తమకి తీరని కష్టనష్టాలు చేకూర్చారు అన్న అవమానం, అలజడి, బాధ, భావోద్వేగం, కాస్త తగ్గి ఏదో తెలీని ఆనందం కలుగుతుంది. తమ శత్రువుల చేతుల్లో తాము కోల్పోయినదాన్ని తిరిగి పొందగలిగినా, లేకపోయినా, పోగొట్టుకున్న తమ మానమర్యాదలని, అభిమానాన్ని మాత్రం మళ్ళీ చేజిక్కించుకున్నామన్న భ్రమో, తృప్తో, ఏదో, అది మాత్రం తప్పక లభిస్తుంది. అంతేకాదు, మేము కూడా ఎదుటివారికి సరైన సమాధానం చెప్పగల శక్తివంతులమని, పౌరుషవంతులమని ఋజువు చేసుకునే అవకాశం ఈ పగ తీర్చుకోవటం ద్వారా వారికి లభిస్తుందని వారి అభిప్రాయం. వీటన్నితోపాటు brain మీద ఇంతవరకు జరిగిన research ఫలితాల వలన ఏం తెలుస్తోందంటే, ఇలా పగ తీర్చుకోవటం dopamine అనే ఒక happy hormone ని మనలో పుట్టిస్తుందట. దానివలన పగ తీర్చుకున్న తర్వాత మనుషులు ఆనందాన్ని అనుభవిస్తారు. తమ మనసులో దయ, కరుణ, క్షమ నశించి ఏదో పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఈ కారణాలన్నిటి వలన కూడా మనిషి మనసులో పగ రగలచ్చు. కానీ పగ తీర్చుకోవటం వలన కలిగే ఈ ఆనందం, తృప్తి అంతా కేవలం తాత్కాలికమే! అందుకే ప్రతీకారం మొదట్లో అతి మధురంగా అనిపించినా, దయార్ద్రహృదయులైనవారికి శాంతి, సహనం, క్షమ ఇంకా తియ్యగా అనిపిస్తాయి అని Issac Burrow అనే England కి చెందిన ఒక గణితశాస్త్రజ్ఞుడు అన్నారు.

ఇతరులను అవమానించటం, వారికి కష్టనష్టాలు కలిగించడం తప్పే! ఇది మనందరికీ అప్పుడప్పుడు జరిగే విషయమే! కానీ అలా అని వారికి శిక్ష వేయటానికి మనకి ఏదో అధికారం వుందని అనుకోవడం, ఆ అధికారాన్ని మన చేతిలోకి తీసేసుకుని, పగ, ప్రతీకారం పేరిట మన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం అంతకంటే ఇంకా పెద్ద తప్పు. దీన్ని అడవి న్యాయం లేక అనాగరిక న్యాయం అని అంటారు అని Francis Bacon అనే England attorney general అన్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ పగ తీర్చుకోవటం అన్నది చట్టబద్ధంగా కాకుండా చట్టవిరుద్ధంగా వుంటుంది. ఒక సమాజంలో వుంటున్నప్పుడు ఆ సమాజ నియమాలు పాటించడం, క్రమశిక్షణతో మెలగడం ప్రతి నాగరికుడి బాధ్యత. అవునా? మరి ఆ బాధ్యతను విస్మరించి, చట్టాన్ని నా చేతిలోకి తీసేసుకుంటాను అనడం తప్పే కదా!

సరే, ఇంక వ్యక్తిగత స్థాయికి వస్తే మనం నిత్యజీవితాలలో, కుటుంబాలలో కూడా చూస్తూవుంటాం, కొంతమంది అస్తమాను ఇతరులను ఏదో ఒకటి అంటూ మాటలతో వారిని బాధిస్తూవుంటారు. దీన్నే మనం bullying, అంటే వేధించటం, ఏడిపించడం అంటాము. ఇలాంటి పరిస్థితులను నేను కూడా ఎదుర్కొన్నాను. అయితే వాళ్ళు అలా ఎందుకు చేస్తారు అన్న విషయం ఇప్పుడు నేను చర్చించదలచుకోలేదు. ఎందుకంటే దానికి చాలా కారణాలు వుండచ్చు. కానీ  అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో చెప్పటం మాత్రం చాలా కష్టం. మౌనంగా వుంటే అవతలివారికి మనం ఇంకా ఎక్కువ అలుసుగా కనిపిస్తాం, ఇంకొంచెం ఎక్కువ శక్తితో వారు విజృంభించే అవకాశం ఇంకా ఎక్కువ వుంది. అలా అని మనం కూడా ఏదో సమాధానం చెప్పి వాగ్వివాదం మొదలుపెడితే ఇంక దానికి అంతు ఎక్కడ అనిపిస్తుంది. మనస్ఫర్ధలు, కక్షలు, ఇంకా ఎక్కువై, ఇంక తప్పకుండా వీరిమీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కోరిక కలగడం ఖాయం.  అంతేకాదు, కుటుంబకలహాలు ఇంకా ఎక్కువై ఆ  కుటుంబసభ్యులందరిలోను కూడా కలవరాలు రేగడం కూడా ఇంకా ఖాయం.

అయితే ఈ ప్రతీకార కోరికకు కారణం వ్యక్తిగతమైనా, సామాజికమైనా, లేక దేశసంబంధమైనా ఏదైనా చర్య తీసుకునే ముందు ఒక్కక్షణం ఆగి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకొక్కసారి ఈ ప్రతీకార కోరిక కింద అసలు వుద్దేశం కప్పబడిపోయి, కనుమరుగయే ప్రమాదం వుంది. అందుకనే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకుని నా వుద్దేశం ఇది, ఈ కారణం కోసం నేను పోట్లాడుతున్నాను అని స్పష్టంగా నిర్ధారణ చేసుకుంటే కొంచెం ఫరవాలేదు. నేను ఈ కుటుంబకలహాల్లో ఇంకో విషయం కూడా గమనించాను. తరచుగా మనుషులు ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి, దాంట్లోంచి మరోదానిలోకి, ఇంక అలా అలా ఓ పది జన్మలు వెనక జరిగిన విషయాలు కూడా తవ్వుకుని వాదులాటలు సాగిస్తారు. దానితో లాభం ఏమీ లేకపోయినా నష్టం మాత్రం బోలెడంత వుంది. కక్షలు, కావేషాలు ఇంకా పెరిగి, ప్రతీకార వాంఛలు ఇంకా ఎక్కువయే ప్రమాదం వుంది. ఇంతా చేస్తే ఆ పోట్లాట అంతా అయిన తర్వాత అసలు అదంతా ఎలా మొదలయిందో, దానికి కారణం ఏమిటో వాళ్ళు మర్చిపోతారు.

ఈ ప్రతీకారం, పగల మీద అనేక భాషల్లో చాలా సినిమాలు కూడా వచ్చాయి. చాలామటుకు చాలా పెద్దగా విజయవంతమయ్యాయి కూడా. అలాంటి కథావస్తువుకు, అంటే పగ ముఖ్యాంశంగా వచ్చిన సినిమాలకు ఆ విజయం ఒక కొత్త వూపిరిని, glamour ని, అంటే ఆకర్షణని ఇచ్చింది. పగ తీర్చుకోవడం మంచిదే, దాని కోసం చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవటం కూడా మంచిదే అన్న భావం దురదృష్టవశాత్తూ అందరిలో పేరుకుపోవడం మొదలైంది. అందుకే దానికోసం విపరీతమైన విధ్వంసాన్ని, హింసని కూడా ప్రజలు వద్దని అనకుండా సహించారు. ఆ పగ తీర్చుకున్న హీరోని ఒక దేవుడిలాగా చూసారు. ఇలా చూడటానికి ఈ పగ అన్నది చాలా మంచిగా, తియ్యగా కనిపిస్తుందేమో! కానీ దాని అసలు స్వరూపం, దాని ఫలితం ఆతర్వాత బయటపడుతుంది. వెనక్కు వచ్చి ఆ పగ తీర్చుకున్నవారిని కాటేస్తుంది. వాళ్ళ కోపం, పగ ఎంత సమంజసమైనదైనా చివరికి వాళ్ళకి చట్టం సంకెళ్ళలో బందీ కాక తప్పదు. చూసారా, ఎంత సినిమా అయినా చివరికి పగ పర్యవసానం ఎలా వుంటుందో! అందుకే పగ అన్నది నరకంలో వండబడిన ఒక తీయని ముద్ద అని Walter Scott అనే Scotland కి చెందిన ఒక కవి, చరిత్రకారుడు అన్నారు. రుచికి తాత్కాలికంగా తియ్యగా వున్నా దాని పుట్టుక మాత్రం నరకంలో అట. దీన్ని బట్టి పగ, ప్రతీకారాలు ఎంత అపాయకరమైనవో, వాటిని ఎంత దూరంగా పెట్టాలో మనకి తెలుస్తోంది.

అంతేకాదు, ఈ ప్రతీకారం, పగ ఇవన్నీ పగబట్టినవారిని, పగ తీర్చుకోబడ్డవారిని, ఇలా అందరి మనసులని గాయపరుస్తాయి. పగ తీర్చుకోబడినవారు, ఒకవేళ ప్రాణాలతో మిగిలివుంటే తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. పగ తీర్చుకున్నవారు కూడా తమ కోపతాపాల తాపంలో ఇంకా కాలుతూనేవుంటారు. పైగా ఈ కక్షలు, కావేషాలు శరీరానికి, మనసుకు తగిలిన గాయాలను మాననీయవు సరికదా, మానబోతున్న, మానుతున్న గాయాలను రేపి మళ్ళీ పచ్చిగా అయ్యేలాగా చేస్తాయి. మరి ఇంక పూర్తి స్వస్థత అన్నది ఎలా వస్తుంది? అందుకనే ప్రతీకార మార్గంలో నడవడానికి సిద్ధం అయినపుడు రెండు సమాధులను తవ్వి సిద్ధంగా వుండు, ఒకటి నీ శత్రువు కోసం, ఇంకోటి నీకోసం అన్నారు Jodi Picoult అనే అమెరికాకు చెందిన ఒక రచయిత.

ఈ పగలో రెండు రకాలున్నాయి. బహిరంగంగా బహిర్గతమయ్యే పగ, అంటే, ఉదాహరణకి ఎవరన్నా రాజకీయ నేరస్థులను లేక దేశద్రోహులను శిక్షిస్తే మనకి బాధ కలగదు. ఎందుకంటే వారి మీద మన మనసులలో కూడా చాలా కోపం, పగ, కక్ష పేరుకుని వుంటాయి. అందుకనే వారు చేసిన నేరాలకు వారికి ఎలాంటి శిక్షలు వేసినా మనకు సమ్మతమే! అవునా? అలాగే సినిమాలలో విలన్లను హీరో చావబాదుతూవుంటే అది మనకి హింసలాగా అనిపించదు. పైగా ఇంకా ఆ ఫైటింగ్ అలాగే కొనసాగాలని, హీరో విలన్ ని ఇంకా ఎక్కువగా కొట్టాలని కోరుకుంటాం. అవునా? అంటే మన మనసులో ఆ విలన్ అంటే అంత పగ పేరుకుపోయిందన్నమాట.  అలాగే వ్యక్తిగతమైన పగ ఇంకో రకం. ఇలాంటి పగలో మనసుకు శాంతి వుండదు. శరీరానికి విశ్రామం వుండదు. కంటికి నిద్ర అసలే వుండదు. అసలు జీవితంలో హాయి అన్నదే వుండదు. అంటే మొదటి రకం పగలో మనకు ఒకరకమైన సంతోషం లభిస్తే, రెండో రకమైన పగలో వున్న ఆనందం కూడా మాయమవుతుందన్నమాట. ఎందుకంటే పగలో మనం అందరం వుంది అనుకొని వూహించుకుంటున్న తృప్తి లేదు. ఆనందం అంతకంటే లేదు. పగలో అగ్ని వుంది, జ్వాల వుంది. మంటలున్నాయి. అశాంతి వుంది. బాధ వుంది. ఇంక ఆనందం ఎక్కడ?

అంతేకాకుండా ఈ పగ మనుషుల మధ్య, మనసుల మధ్య బంధాలను తెంపేస్తుంది. ఎవరి మీదయితే పగ సాధించాలనుకున్నారో వారి దగ్గర నుండి గతంలో పొందిన సహాయాలను మరిచిపోయేలా చేస్తుంది. ఒకసారి తెగిపోయిన మానసికబంధాలు మళ్ళీ ఎప్పటికీ అతకబడవు. ఆ శత్రుత్వాలు ఆ ఇద్దరి మధ్యా జీవితాలు అంతం అయినా కూడా పోవు. ఎందుకంటే పగల వచ్చే ఫలితాలు తిరుగులేనివి, కావాలనుకున్నా కూడా ఇంక వెనక్కి తీసుకువెళ్ళలేనివి, తరతరాల పాటు వారసత్వంలాగా పారేవి. ఈ దిక్కుమాలిన పగ అంత చెడ్డదన్నమాట. అంతేకాకుండా వారు అలా చేసారని వీరు, వీరు అలా చెయ్యలేదని వారు, ఇలా వంతులమీద అందరు పగ వెనక పరుగులు తీస్తూవుంటే చివరికి అందరూ ఎక్కడికి చేరుకుంటారు? అందుకే కన్నుకి కన్నే సమాధానం అని అనుకుంటే ఏదో ఒకరోజు ఈ ప్రపంచం మొత్తం అంతా గుడ్డిదైపోతుంది అన్నారు మన గాంధీ.

మనందరం జీవితంలో ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరి చేతిలో అవమానింపబడ్డవారమే! వారెవరో మనమీద అడుగులు వేస్తున్నారు, మనల్ని నొక్కేస్తున్నారు  అని అరచుకున్నవారమే! మనల్ని చాలా అన్యాయం చేస్తున్నారు అని అసహాయంగా ఆక్రోశించినవారమే! అలాంటప్పుడు, నిజమే, వారి మీద మనకి గొంతుదాకా కక్ష పుట్టడం చాలా సహజమే! ఎందుకంటే కోపాన్ని జయించటం చాలా కష్టం. అయితే ఆ కోపాన్ని, పగని మాటల తూటులతో కానీ, వారికి అప్రియమైన చేతలతో కానీ  ఏదో విధంగా వ్యక్తీకరిస్తే, తాత్కాలికంగా అయినా సరే, ఆ ఆనందం సంగతే  వేరు. ఎందుకంటే అప్పుడు మన అవమానాలు, కష్టనష్టాలు అన్నీ తుడిచిపెట్టుకునిపోయిన భావం మనకు కలిగి మన మండే మనసు మీద కాస్త చల్లటి వాన కురిసిన రిలీఫ్ మనకి కలుగుతుంది. అంతేకాకుండా మనం వారికంటే ఏమీ బలహీనులం కాము, అవసరమైతే దెబ్బకి దెబ్బ తీయగల చాకచక్యాలు మాకు కూడా వున్నాయి అని నిరూపించగలగటం, ఆహా, ఆకాశంలో విహరించినంత ఆనందాన్ని ఇస్తుంది సుమా! కానీ కోపం, పగ, కక్ష, కావేషాలు అన్నవి చాలా శక్తివంతమైన మానవ భావాలు. వాటిని దూరంగా వుంచగలగటం, ఇంక తప్పదు అని అనిపిస్తే అవి ఎవరి మీద వున్నాయో కేవలం వారికోసం మాత్రమే వాడటం, అది కూడా కేవలం సరైన పాళ్ళలో మాత్రమే వుండేలా చూసుకోవడం, దాని వలన ఇతరుల మీద ఏమాత్రమూ ఎటువంటి ప్రభావమూ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన విషయాలు.

ఈ పగ అన్నది వ్యక్తిగత స్థాయిలో ఆఫీసుల్లో కూడా చాలా వుంటుందండోయ్. మనం చేసిన పనిని  దొంగిలించి వారి తెలివిగా చెప్పుకోవటం, లేక మన పని చెడిపోయి అపజయం పాలయ్యేలాగా ఏవో చిక్కులు కల్పించటం, లేక మన విలువైన వస్తువులని దొంగిలించటం లేదా దాచేయటం, మనకని తెచ్చుకున్న ఆహారాన్ని ఎవరు చూడకుండా వాళ్ళు తినేయడం, మన గురించి లేనిపోని పుకార్లను పుట్టించి వాటిని వ్యాపింపచేయటం, మన  గురించి మన పైవాళ్ళకు చాడీలు చెప్పటం, ఇవన్నీ ఆఫీసుల్లో జరిగే పగ, కక్షల్లో భాగాలే! మన కార్యాలయాల పనికి సంబంధించిన రక్షణల బాధ్యతలను చూసే Cyber Ark  అనే ఒక రక్షణ కంపెనీ ఏం చెప్పిందంటే Information technology లో పనిచేసే 80% ఉద్యోగస్తులు ఏ కారణంచేతనైనా వారిని వుద్యోగంలోంచి తీసేస్తే వారి పగ తీర్చుకోవటం కోసం ఆఫీసుకి సంబంధించిన అతి రహస్యమైన పత్రాలను లేక passwords ను దొంగిలిస్తారట. కానీ చాలా కంపెనీలు తమ ఖాతాదారులు,  అంటే customers, పెట్టుబడిదారులు, అంటే investors ని  కోల్పోయే  ప్రమాదం వుందని, ఆ దొంగలు  పట్టుబడితే వారికి పెద్ద శిక్ష పడే అవకాశం చాలా వున్నా సరే,  ఆ దొంగతనాల వివరాలను మాత్రం బయటకు పొక్కనీయరట. అంటే ఒకరకంగా ఇక్కడ ఆ ఉద్యోగస్తుల పగ తీరుతోందన్నమాట.

అసలు ఈ పగకు మూలకారణం న్యాయం కోసం తపన. మనకేదో అన్యాయం జరిగింది, దానికి న్యాయం కావాలంటే మనకి అన్యాయం చేసినవారిని మనం శిక్షించాలి అన్న ఆరాటం. అంటే ఇక్కడ న్యాయం అంటే తన తప్పు తెలుసుకోవటం కాదు, దాన్ని సవరించుకోవాలనుకోవటం కాదు, పశ్చాత్తాపం కూడా కాదు,  కేవలం శిక్ష అన్నమాట, పగ అలాగే ఆలోచిస్తుంది. కనుక పగలో మునిగిన మనిషి కూడా అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈ పగను నియంత్రణలో పెట్టకపోతే అది మనిషిని ఇంకా అశాంతిలో ముంచేస్తుంది. ఇంకా కోపాగ్నిలో దహించివేస్తుంది, ఇంకా భావోద్వేగ ఒంటరితనంలోకి, అంటే emotional isolation లోకి తోసేస్తుంది, అసలు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకుని, అందరినీ బాధపెట్టి, మన చుట్టూ వున్న వాతావరణాన్ని అశాంతితో కలుషితం చేస్తే మంచిదా? లేక జరిగిన గాయానికి ప్రేమపూతని రాసి, కరుణ మందుని వేసి, సహనంతో వేచివుంటే ఆ గాయాలు మానుతాయా? పగ గొప్పదా? క్షమ గొప్పదా? ఈ రెంటిలో ఏది మనకి మంచిని చేస్తుంది? అందుకే ఎవరో తమకు బాకీ వున్నారు అని అనుకునేవారికి పగ, కక్షలు వుంటాయి, తమకు ఏ లోటు లేదు అని అనుకున్నవారు ఎప్పుడూ ఎవరిదగ్గనుండి ఏమీ ఆశించక ముందుకు సాగిపోతూనేవుంటారు అని Chris Jami అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి అన్నారు

అసలు కోపం పగ స్థాయికి వెళ్ళే దాకా వేచివుండకుండా మొదట్లోనే దాన్ని తుంచేస్తే ఏ సమస్య వుండదేమో! అందుకేనేమో, కోపం బయటికి వచ్చేస్తే క్షమగా మారుతుంది, లోపలే దాగివుంటే పగలాగా మారుతుంది అని  Edward Bulwer Lytton అనే England కు చెందిన ఒక రచయిత అన్నారు.

ఇన్ని విధాలా అందరికి కష్టనష్టాలు చేకూర్చే ఈ కోపతాపాలు, పగ, ప్రతీకారాలు మనకు వద్దు. అందరికి శాంతిని పంచి, హాయినిచ్చే ప్రేమనే మనందరం పెంచుకుందాం. కోపం, ఆగ్రహం, ఈర్ష్య, ఇవన్నీ ఎవరి మనసుని మార్చలేవు, అవన్నీ మన మనసులనే  మార్చేస్తాయి అని Shannon Alder అనే ఒక రచయిత్రి అన్నారు. అందుకే వాటిని మనం దూరంగా తరిమేద్దాం. ఇతరుల చర్యల వలన మనం మనం లాగా కాకుండా ఇంకోలాగా మారకుండా జాగ్రత్త పడదాం. ప్రేమ, సహనం, శాంతులతో ఈ ప్రపంచాన్నంతా ముంచేద్దాం. దయ, కరుణ, ప్రేమలలో అందరినీ ఓలలాడిద్దాం.

బలహీనులు పగ తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, కానీ తెలివైనవారు మాత్రం తోసిరాజంటూ అసలు దేన్నీ, ఎవరినీ పట్టించుకోరు అని మరి Albert Einestein అనే జర్మనీకు చెందిన ఒక Physicist, మహా మేధావి, ఊరకనే అన్నారా? అందుకే మరి మనం ఎవరో, ఎవరిలాగా వుండాలో మనమే తేల్చుకోవాలి. అవునా?

సరే, మీరు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూవుండండి. నేను మాత్రం మరి ఇప్పటికి ఇంతటితో అపి మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటాను. మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in June 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *