Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

మధ్యప్రాచ్య సెగలు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వెనుక వ్యూహాత్మక విశ్లేషణ
రెండవ భాగం

గత నెల ‘రచ్చబండ’ చర్చలో ఇజ్రాయెల్ చరిత్ర, ఆ దేశ ఆవిర్భావం, అప్పట్లో ఎదుర్కొన్న సవాళ్లతో పాటు ఇరాన్‌తో సంఘర్షణ మూలాలను చర్చించాం. ప్రస్తుత ఇరాన్ యుద్ధానికి దారితీసిన చారిత్రాత్మక, భౌగోళిక కారణాలు, ప్రవాస భారతీయుల భద్రత, ఆర్థిక స్థితిగతులపై ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు చూపుతున్న ప్రభావంపై గత నెలలో లోతైన విశ్లేషణ చేశాం. ఈ నెల చర్చలో... ఎడతెగని యుద్ధ మేఘాలు, కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి, ఇరాన్ యుద్ధ పరిణామాలు భారత్‌కు నేర్పిన పాఠాలేమిటి? అంతర్జాతీయ వేదికపై భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి? భవిష్యత్తు సవాళ్లను మనం ఎలా అంచనా వేయాలి? వంటి కీలక అంశాలను సమగ్రంగా చర్చిద్దాం. ముందుగా, మే 1, 2026 తర్వాత అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ సమీకరణాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలను గమనిద్దాం.

1. యుద్ధం నేపథ్యం – ఎక్కడ మొదలైంది?

2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి సహా పలువురు అగ్రశ్రేణి నాయకులు హతమయ్యారు. దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌తో పాటు బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతం, అంతర్జాతీయ చమురు సరఫరా మార్గాలు ఈ ఉద్రిక్తతల్లో చిక్కుకోవడంతో ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మిగలకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే గ్లోబల్ సంక్షోభంగా మారింది. "ఆరంభ శూరుడికి ఆర్భాటం ఎక్కువ" అన్న చందంగా — యుద్ధం మొదట్లోనే ఎక్కువ హడావిడి కనిపించింది. ఎందుకంటే, ఇజ్రాయెల్ యుద్ధం మొదటి రోజే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లుగా నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఈ యుద్ధాన్ని మొదలుపెట్టడం పూర్తిగా అమెరికా–ఇజ్రాయెల్ చేతుల్లో ఉన్నప్పటికీ.. దీనిని ముగించడం మాత్రం ఇప్పుడు ఇరాన్ చేతుల్లోనే ఉందని స్పష్టమవుతోంది.

బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలు తీవ్ర ఇంధన సమస్యల కారణంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను పాక్షికంగా మూసివేయడం, పౌరులపై ఇంధన రేషనింగ్‌ను రుద్దడం వంటి పరిణామాలు చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ భారత్ ప్రజలకు పిలుపునిస్తూ. "ఇంధనాన్ని ఆదా చేయండి, విదేశీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకోండి, ఒకటి రెండు సంవత్సరాల వరకు బంగారం కొనకండి, వీలైనంత వరకు ఇంటి నుండి (వర్క్ ఫ్రమ్ హోమ్) పనిచేయండి, భారతదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించండి" అని కోరారు.

2. కాల్పుల విరమణ ఉన్నా లేని శాంతి

మే 1, 2026 నాటికి అమెరికా–ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ అమల్లోక వచ్చినప్పటికీ, ఇది తాత్కాలిక విరామం మాత్రమే తప్ప పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఈ సమయాన్ని ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను పునర్నిర్మించుకోవడానికి వాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలపై తనకు “సంతృప్తి లేదు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం, ఈ ప్రాంతం మళ్లీ యుద్ధ జ్వాలల్లోకి వెళ్లే సూచనలను చూపిస్తోంది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఐదు రోజుల కాల్పుల విరమణ మే నెల మొదట్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంగా కనిపించింది. ఆ ప్రకటన ప్రకారం అమెరికా దళాలు కొత్తగా దాడులు చేయవు. అయితే ఈ నియమం కేవలం అమెరికా దళాలకు మాత్రమే వర్తించడంతో, ఇజ్రాయెల్ లెబనాన్ లో తిష్ట వేసిన హిజ్బుల్లా ఉగ్రవాదుల పై దాడులను కొనసాగించింది. దీనివల్ల ఇది నిజమైన శాంతి ప్రయత్నమా లేక ఒక 'వ్యూహాత్మక విరామమా' (Tactical Pause) అనే సందేహాలు తలెత్తాయి.

అదే సమయంలో, అమెరికా ఈ విరమణను మరో 10 రోజులు పొడిగించి, ఇరాన్ పరిసర ప్రాంతాలకు 7,000 కంటే ఎక్కువ మంది మెరైన్ బలగాలను, భారీ నౌకాదళ ఆస్తులను, అత్యాధునిక ఎయిర్-డిఫెన్స్ వ్యవస్థలను తరలించడం ప్రారంభించింది. ఒకవైపు శాంతి మంతనాలు జరుపుతూనే, మరోవైపు యుద్ధ విస్తరణకు సంకేతాలిస్తూ బలగాలను మోహరించడం పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. ఒకపెద్ద సైనిక ఆపరేషన్‌కు ముందు బలగాలను సర్దుబాటు చేసుకునేందుకే అమెరికా ఈ సమయాన్ని వాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యూహాత్మక లక్ష్యాలు మరియు ఆర్థిక ఒత్తిడి:

ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే, అమెరికా మెరైన్లు నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడానికి వ్యూహాత్మక దీవులను అమెరికా కైవసం చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కీలక లక్ష్యాలు:

  • ఖార్గ్ దీవి: ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు ఇది ప్రధాన కేంద్రం. దీనిపై నియంత్రణ సాధిస్తే ఇరాన్ ఆర్థిక వెన్నెముక పూర్తిగా దెబ్బతింటుంది.
  • సౌత్-పార్స్ గ్యాస్ ఫీల్డ్: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు (గ్యాస్) క్షేత్రాలలో ఒకటి. దీనిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్‌ను ఆర్థికంగా పూర్తిగా ఒంటరి చేయవచ్చు.

ఈ పరిణామాలు కేవలం ఇంధన వనరుల కోసం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ చమురు రవాణా మార్గాలను తమ పూర్తి అదుపులోకి తెచ్చుకోవడానికి అమెరికా వేస్తున్న ఎత్తుగడలుగా కనిపిస్తున్నాయి. ఏతావాతా.. ఈ కాల్పుల విరమణ పొడిగింపు నిజంగా శాంతి కోసమా లేక ఒక వ్యూహాత్మక యుద్ధానికి ముందస్తు సన్నద్ధతా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

3. పాకిస్తాన్ ద్వారా పరోక్ష రాయబారాలు - డొనాల్డ్ ట్రంప్ శైలి: విశ్లేషకుల అంచనాలు మరియు వాస్తవికత

ఇరాన్, అమెరికాతో నేరుగా కాకుండా పాకిస్తాన్ ద్వారా పరోక్ష చర్చలు జరుపుతోంది. అమెరికా వైపు నుంచి ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి భద్రతపై కఠినమైన షరతులు విధిస్తుండగా.. అమెరికా తన “విస్తరణ వాదం”, “బెదిరింపులను” విరమిస్తేనే నిజమైన చర్చలు సాధ్యమని ఇరాన్ తెగేసి చెబుతోంది.

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సామాజిక మాధ్యమాల్లో తరచుగా ఒక హాస్య పాత్రగా చిత్రించడం పరిపాటిగా మారింది. కానీ, ముందస్తు రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆయన రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై తన సత్తా చాటారు. కొన్ని సందర్భాల్లో చరిత్రలోని బాధాకరమైన, తీవ్రమైన సంఘటనలను కూడా ఆయన తేలికగా తీసుకుంటున్నట్లు అనిపించవచ్చు. తన మాటలను తరచుగా మార్చడం, వ్యూహాలను మార్చుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం పత్రికల మొదటి పేజీల వార్తల్లో నిలవడం ఆయనకు సరదా. అయితే, ఆయన వలె దేశాధ్యక్షుడి హోదాలో ఉండి కూడా ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా గంటల తరబడి విలేఖరులతో ప్రత్యక్షంగా మాట్లాడగలిగే ధైర్యం ఉన్న నాయకులు చాలా అరుదు. ఈ విషయాన్ని ఆయన విమర్శకులు కూడా అంగీకరిస్తారు.

కాబట్టి, ట్రంప్‌ చేసే ప్రతి వ్యాఖ్యను భూతద్దంలో చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విజ్ఞులైన విశ్లేషకులు ఆచితూచి స్పందించాలి. భారత సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌పై సరదా వ్యాఖ్యలు చేయడం సాధారణమైనప్పటికీ, ఆయన మాటల వెనుక ఉన్న వ్యూహాత్మక ఉద్దేశ్యం ఏమిటో గ్రహించడం ముఖ్యం. మీడియా చర్చల నిర్వాహకులు, వ్యాఖ్యాతలు ట్రంప్‌ను కేవలం వినోదభరితమైన వ్యక్తిగా చూడటం మానుకుని, ఆయన ప్రతి చర్య వెనుక ఉన్న రాజకీయ సందర్భాన్ని పరిశీలించాలి. చర్చల పేరుతో సమస్యను వాయిదా వేస్తూ, సమయం చూసి లక్ష్యాలపై ప్రత్యర్థులు కోలుకోలేని రీతిలో మెరుపు దాడులు చేయడం ట్రంప్‌కు వెన్నతో పెట్టిన విద్య. దీనిని గ్రహించలేక చాలామంది అనుభవజ్ఞులైన విశ్లేషకులు కూడా ఆయన 'ట్రాప్‌'లో పడుతున్నారు. "అగ్రరాజ్యమైన అమెరికా చేతిలో ఓడిపోకపోతే చాలు, ఇరాన్ గెలిచినట్లే" అనే కఠోర వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు.

భారత ప్రధాన స్రవంతి పత్రికలు కొంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ, భారత సోషల్ మీడియా మాత్రం గత రెండు నెలలుగా అమెరికా మరియు ట్రంప్ వ్యతిరేక వార్తలతో కిక్కిరిసిపోయి ఉండటం విచారకరం. అటు అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ప్రచార ప్రభావానికి లోనై కొందరు ఆయనపై సాయుధ దాడులకు సైతం తెగబడుతున్నారు. ఈ దాడుల ప్రయత్నాల నుండి ఆయన ప్రాణాలతో బయటపడగా, ఆయనపై దాడులకు దిగిన వారిలో కొంతమంది సీక్రెట్ సర్వీస్ పోలీసుల చేతిలో హతమయ్యారు, మరికొంతమంది పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వైట్ హౌస్ సమీపంలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల నేపథ్యంలో.. అక్కడ పనిచేసే మీడియా ప్రతినిధులు బల్లల కింద దాక్కొని, ‘బతుకు జీవుడా’ అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల వ్యవహారంపై సగటు అమెరికా పౌరుల స్పందన ఏమిటనేది రాబోయే మధ్యంతర ఎన్నికల్లో స్పష్టమవుతుంది.

4. హోర్ముజ్ జలసంధి – అంతర్జాతీయ చమురు మార్గంపై ఇరాన్ పట్టు - అమెరికా ప్రతిచర్య

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిసరాల్లోని దాదాపు 2,000 కిలోమీటర్ల తీరరేఖపై తమ పట్టును మరింత బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. చమురు సరఫరాకు అంతరాయం కలిగితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతాయనే హెచ్చరికల నేపథ్యంలో, అమెరికా నౌకాదళం ఈ ప్రాంతంలో తన ఉనికిని భారీగా పెంచింది. అయితే, అదను చూసి అమెరికా.. ఇరాన్‌కు వచ్చే పోయే నౌకల జలమార్గాన్ని పూర్తిగా మూసివేసింది. ఇప్పటికే ఇరాన్ పరిసర అంతర్జాతీయ జలాలలో అమెరికా నౌకాదళం పాగా వేసి ఉండటంతో, అమెరికా ఈ పనిని సునాయాసంగా చేయగలిగింది.

దాంతో ఇరాన్ నుండి నిరాఘాటంగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈ వ్యూహాత్మక చర్యను అమెరికా యుద్ధం మొదట్లోనే చేపట్టి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని విశ్లేషకులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, 2026 మే నెలలో అమెరికా అడ్డుకున్న చైనా కార్గో నౌకలో పూర్తి స్థాయి ఆయుధాలు లేనప్పటికీ, ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ కార్యక్రమాలకు ఉపయోగపడే కీలక విడి భాగాలు ఉన్నట్లు అమెరికా అధికారులు నిర్ధారించారు. తద్వారా ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీకి ఇప్పటివరకు వెనుక ఉండి ఎవరు సహాయం అందిస్తున్నారో అంతర్జాతీయ వేదికపై బట్టబయలైంది.

5. ఇజ్రాయెల్-హిజ్బుల్లా : విస్తరిస్తున్న యుద్ధం

ఇరాన్ మద్దతు ఉన్న ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ కూటమిలోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ దక్షిణ సరిహద్దుల నుండి ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేయడంతో పౌరుల ప్రాణనష్టం, లెబనాన్ పౌరుల వలసలు పెరుగుతున్నాయి. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనుకూల 'బఫర్ జోన్' (రక్షిత వలయం)ను ఏర్పాటు చేసే దిశగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. ఎందుకంటే, ఈ ప్రాంతం నుండే హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ విమర్శిస్తున్నప్పటికీ, 2022–2026 అధికారిక జాబితాల ప్రకారం లెబనాన్ పార్లమెంట్‌లో హిజ్బుల్లాకు చెందిన 13 మంది సభ్యులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. లెబనాన్ వంటి ఒక సార్వభౌమ దేశ పార్లమెంట్‌లో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు ఇంతటి ప్రాతినిధ్యం ఉండటం, వారిని వెనుక ఉండి పెంచి పోషిస్తున్న ఇరాన్ యొక్క ప్రాబల్యానికి అద్దం పడుతోంది.

6. అమెరికా అంతర్గత చట్టపరమైన వివాదాలు

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) నుండి యుద్ధానికి అధికారిక అనుమతి తీసుకోవడానికి ఉన్న 60 రోజుల గడువు ముగియడంతో, వైట్ హౌస్ “యుద్ధం ముగిసింది కాబట్టి అనుమతి అక్కర్లేదు” అని వాదిస్తోంది. అయితే, అనేకమంది న్యాయ నిపుణులు ఈ సైనిక చర్యలను అమెరికా అంతర్గత, అంతర్జాతీయ చట్టాల ప్రకారం “చట్టవిరుద్ధం”గా పేర్కొంటున్నారు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలు, కాంగ్రెస్-సెనేట్ పాత్రపై అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

ఈ నవంబర్‌లో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో విజయం కోసం ట్రంప్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్ తరువాత ట్రంప్ దృష్టి క్యూబా పైనేనని వార్తలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా కంటిలో నలుసుగా ఉన్న వెనిజులా, ఇరాన్, క్యూబాలను తాను దారికి తెచ్చానని చెప్పి ట్రంప్ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో అమెరికా పౌరుల ఓట్లు అడిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ ప్రయత్నంలో ఆయనకు ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయమా-ఓటమా అనే విషయం పక్కనుంచితే - గత 30 నుండి 50 ఏళ్లుగా ఈ మూడు దేశాలతో ఉన్న సమస్యలను ఇంతకుముందున్న అమెరికా అధ్యక్షులు ఎవరూ పరిష్కరించలేకపోయారని కాకలు తీరిన విశ్లేషకులు సైతం అంగీకరించడం ఇక్కడ గమనార్హం.

7. ఇరాన్ అంతర్గత ఆర్థిక సంక్షోభం

పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు, తాజాగా జల మార్గాల దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం దీనికి అమెరికానే కారణమని ప్రచారం చేస్తున్నప్పటికీ.. అంతర్గత అవినీతి, ఆర్థిక దుర్వినియోగం, వ్యాపార రంగాలపై IRGC పెత్తనమే అసలు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ ప్రభావం లేని ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని కాస్పియన్ సముద్ర తీరంలో గల నాలుగు పోర్టుల ద్వారా ఇరాన్‌కు నిత్యావసర వస్తువుల సరఫరా నిరంతరంగా అందుతోంది. అసలు ఇరాన్ ఇన్ని రోజులు యుద్ధంలో నిలబడగలగడానికి ప్రధాన కారణం—గత 50 ఏళ్లుగా IRGC కనబరిచిన సంసిద్ధత, అంతర్గతంగా ఇరాన్ పౌరులను అణచివేసే వారి కఠిన వ్యూహాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

8. భారత దృష్టికోణం: నిశ్శబ్ద ఆందోళన – ప్రత్యామ్నాయ వ్యూహాలు

ఈ యుద్ధం నేరుగా భారత్‌ను లక్ష్యంగా చేసుకోకపోయినా, చమురు ధరలు, గల్ఫ్ దేశాల్లోని కోట్లాది మంది భారతీయుల భద్రతకు ముడిపడి ఉంది. భారత్ ఎప్పుడూ “సమతుల్య విదేశాంగ విధానాన్ని” అనుసరిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్... ఈ మూడు దేశాలతోనూ భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అందుకే భారత్ బహిరంగ విమర్శలకు పోకుండా “శాంతి, చర్చల” మార్గాన్ని లౌక్యంగా ప్రతిపాదిస్తోంది. చమురు సంక్షోభాన్ని తట్టుకునేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మే నెలలో పలు యూరప్ దేశాలలో పర్యటించారు. ముడి చమురు, గ్యాస్ సరఫరా కోసం గల్ఫ్ దేశాలపైనే పూర్తిగా ఆధారపడకుండా, భారత్ ఇప్పుడు ఇతర అంతర్జాతీయ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. "ఎవరికి వారే యమునా తీరే", యుద్ధంలో చివరికి ప్రతి ఒక్కరూ తమ కోసమే పోరాడాలి: ఇది భారత్ ఈ ఇరాన్ యుద్ధం చూసి నేర్చుకున్న పాఠం.

9. ముగింపు: ఇరాన్‌లో పాలనా మార్పు (Regime Change) వస్తే జరిగేదేమిటి?

ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి ఇరాన్ శాంతికి అంగీకరిస్తే లేదా అక్కడ పాలనా మార్పు సంభవిస్తే, అది ఇరాన్ ప్రజలతో పాటు భారత్‌కు కూడా పెద్ద ఊరటనిస్తుంది. ఆ సానుకూల పరిణామాలు ఎలా ఉంటాయో కింద చూద్దాం:

ఇరాన్ ప్రజలకు కలిగే లాభాలు:

  • ఆర్ధిక స్థిరత్వం: ఆంక్షలు తొలగి ఇరాన్ కరెన్సీ స్థిరపడుతుంది. ధరలు తగ్గి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
  • మహిళలకు స్వేచ్ఛ: కఠినమైన ‘హిజాబ్ పోలీసింగ్’ అంతమై, విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
  • డిజిటల్ ఫ్రీడమ్: ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఉన్న ఆంక్షలు, అడ్డంకులు తొలగిపోతాయి.
  • ప్రజా సంక్షేమానికి నిధులు: ప్రస్తుతం ఇరాన్ చమురు, గ్యాస్ ఆదాయంలో సింహభాగం డ్రోన్లు, మిస్సైళ్లు, అణు కార్యక్రమాలకే ఖర్చవుతోంది. ప్రభుత్వం మారితే ఈ నిధులు ప్రజా సేవలకు మళ్లుతాయి.
  • మెరుగైన గ్లోబల్ కనెక్టివిటీ: అంతర్జాతీయ వీసా ఆంక్షలు సడలి ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగవుతాయి.

భారత ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలు:

  • ధరల నియంత్రణ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చి ద్రవ్యోల్బణం తగ్గుతుంది.
  • సాధారణ కుటుంబాలపై భారం తగ్గుదల: రవాణా ఖర్చులు తగ్గడం వల్ల కూరగాయలు, నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల భారం తగ్గి సామాన్యుడికి ఉపశమనం లభిస్తుంది.
  • భద్రత - స్థిరత్వం: హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల భారత్‌కు చమురు సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. గల్ఫ్ ప్రాంతంలోని భారత కార్మికులకు భద్రతతో పాటు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.
  • మార్కెట్ల బూస్ట్: చమురు భారం తగ్గితే భారత రూపాయి విలువ పెరిగి, స్టాక్ మార్కెట్లు లాభాల బాట పడతాయి మరియు ప్రభుత్వ ఆర్థిక లోటు తగ్గుతుంది.
  • భారత ఆయుధాలకు గల్ఫ్ మార్కెట్ బూస్ట్: ముఖ్యంగా యూఏఈ రక్షణ రంగంలో భారత్‌ను భాగస్వామిగా చేసుకునే అవకాశం మెండుగా ఉంది. యూఏఈ రక్షణకు అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు భారత్ కూడా తన ఆయుధాలను, తదితర సేవలను అందించే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ ప్రాంతంలో భారత్ పరపతిని కచ్చితంగా పెంచుతుంది, పైగా దేశీయ రక్షణ రంగంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ముగింపు

మధ్యప్రాచ్యం ప్రస్తుతం ఒక పెద్ద యుద్ధం ‘రౌండ్-2’ అంచున నిలబడి ఉన్న మాట వాస్తవం. మే చివరి నాటికి గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ సైనిక సంసిద్ధతను ప్రదర్శిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై పట్టు, ఇరాన్ ప్రేరేపిత ప్రాక్సీ ఉగ్రవాద ముఠాల నియంత్రణ... ఈ మూడు అంశాలపై ఇరాన్ మొండి పట్టు సడలించకపోతే, చర్చలు విఫలమైతే అనివార్యంగా “రౌండ్ 2” యుద్ధం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ తన వైఖరిని మార్చుకుని, “శాంతి మార్గంలో నడిచేవాడికి శత్రువైనా మిత్రుడవుతాడు” అనే సత్యాన్ని గుర్తిస్తూ స్నేహహస్తం చాచితే మాత్రం.. అటు ఇరాన్ పౌరుల జీవితాల్లో వెలుగులు నిండటంతో పాటు, ఇటు ప్రపంచ మరియు భారత ఆర్థిక వ్యవస్థలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి.

భారత్ కు అగ్రరాజ్యాలతో, ఇతర ప్రపంచ దేశాలతో స్నేహం ఒక నిరంతర ప్రక్రియ. మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా, భారత్ లక్ష్యం మాత్రం ప్రపంచ శాంతి మరియు మన దేశ అభివృద్ధి కావాలి. ప్రజాస్వామ్య దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. అమెరికా తన ప్రయోజనాలను చూసుకున్నట్లే, భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాలనే పరమావధిగా తీసుకుని ముందుకు సాగాలి. అయితే ఆ భేదాలు ఎప్పుడూ శత్రుత్వంగా మారకూడదు. రష్యా–ఉక్రెయిన్ లేదా ఇరాన్–ఇజ్రాయెల్ వంటి సంక్షోభాల్లో భారత్–అమెరికా సమన్వయం ప్రపంచ శాంతికి అత్యంత అవసరం.

మన భావితరాలు, ముఖ్యంగా మన యువత సోషల్ మీడియా విష ప్రచారాలకు లోనుకాకుండా, చరిత్రను మరియు వాస్తవ రాజకీయాలను అధ్యయనం చేసి, సొంతంగా సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. యువత ఫేక్ న్యూస్ (అవాస్తవ ప్రచారాల) ప్రభావానికి లోనవకుండా స్వతంత్ర దృష్టికోణం పెంపొందించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ఫేక్ న్యూస్ భావోద్వేగాలను రేకెత్తించి కోపం, భయం, ద్వేషాలను పెంచుతుంది. సోషల్ మీడియా ఒకే రకమైన సమాచారాన్ని మళ్లీ మళ్లీ మనకు చూపిస్తూ మన ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే యువత నిజం, సగం నిజం, అబద్ధాల మధ్య గల తేడాను గుర్తిస్తే.. వారు రాజకీయ, సామాజిక మోసాలకు బలి కారు. భవిష్యత్తు నిర్ణయాలు యువత చేతుల్లోనే ఉన్నందున, వారికి ఈ అవగాహన ఉంటే వారు తాముండే సమాజానికి, దేశానికి ఎంతో మేలు చేసినవారవుతారు.

ఈ సందర్భంగా 'సిరిమల్లె' పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల రచ్చబండ అంశంపై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో పంచుకోండి. వచ్చే నెల మరో ఆసక్తికరమైన చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!

నమస్కారములతో,
మీ వెంకట్ నాగం.

Posted in June 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *