Menu Close
వేణుగోపాల రావు, గుమ్మడిదల
ఝంఝాటంలో జగన్నాథం (కథ)
వేణుగోపాల రావు, గుమ్మడిదల

సమాజంలో మన చుట్టూ తిరుగుతుండే అసంఖ్యాక జనాల్లో మనకి దగ్గరగా వచ్చిన వారి ప్రత్యేకతలని, సామర్ధ్యాలను చూసికూడా చూడనట్లు సాధారణంగా మనం పట్టించుకోము. తెలుసుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చెయ్యము. దానికి కారణం సాధారణంగా జరిగేది మనని గురించి మనం కొన్ని చిన్న చిన్నసంఘటనలతో మన సామర్ధ్యత పై పెంచుకున్న ఉన్నత భావాల పెనుభూతంగా మారిన అహం కావచ్చు లేదా అసంపూర్ణ అవగాహనతో ఎదుటివారిపై గల తేలిక భావం కావచ్చు. ఏది ఏమైనా, నలుగురు ఒక వ్యక్తిని గురించి గొప్పగా పలుసార్లు మనతో ప్రస్థావిస్తేనో, వారి గురించి ఎక్కడైనా చదివితేనో, మాస్ మీడియాలో వింటేనే తప్ప ఆ వ్యక్తి ఔన్నత్యం మనకి తట్టదు. మన మనో వీధిలో అతడి జండా ఎగరదు.

ఉదాహరణకు మన తోటమాలి ఒక మందార మొక్క ఒక చోట పెడితే బాగుంటుందని అతడి అనుభవంతో చెబితే - నేను వాడికంటే ఎక్కువ చదువుకున్నాను, తెలివైనవాడిని, నాకు ఎక్కువ తెలిసుననే అహంభావం ఉడుం పట్టులా లాగుతుంటే అతడు అక్కడే పెట్టాలని ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోకుండా, చెప్పనివ్వకుండా మనం అక్కడకాదు ఇక్కడే పెట్టు అని పురమాయిస్తాము. ఇక్కడ, నేను వాడికంటే ఎక్కువ చదువుకున్నాను కనుక నాకు ఎక్కువ తెలిసుననే అహంభావం తలకెక్కితే ఏమి చెయ్యగలం? ఇక్కడ జగన్నాథం విషయంలో అదే జరిగింది, వివరిస్తాను.

జగన్నాధం అప్పుడే ఇంజనీరింగ్ పాస్ అయి డిగ్రీ చేతబట్టుకుని తండ్రి సలహా మేరకు ఉద్యోగాన్వేషణకి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదట్లో యూనివర్సిటీ వారు ఇచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని ‘నోబెల్ ప్రైజ్’ గా ఊహించుకుని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తన అసమాన పాండిత్యానికి చిహ్నంగా తలకెక్కి కాలరు ఎగరేసుకుని, ఎవరెస్ట్ శిఖారాన్ని ఎక్కినంత సంబరపడిపోయి కోరుకోవడమే తడవు ఉద్యోగాలు అవంతంటవే వెతుక్కుంటూ వస్తాయి, నేనే దేన్నికావాలనే నిర్ణయము తీసుకోవలసి వస్తుందని భావిస్తూ వచ్చాడు. దానికి కారణము లేకపోలేదు. వాళ్ల బాబాయ్ “నీకేమిరా, నీకున్న తెలివితేటలు సామర్ధ్యం ఈఊళ్లోనే కాదు ఈ దరిదాపులలో ఎవరికీ లేవు, నువ్వు తలుచుకుంటే చాలు ఉద్యోగమేమిటి కొండమీది కోతి కూడా దిగివస్తుంది.” అని ఊదరకొడుతుంటే నిజమేననుకుని తబ్బి ఉబ్బిపోయి ఎదురొచ్చే అవకాశంకోసం ఎదురుచూస్తూ ఊహాలోకాల్లో విహరిస్తూ వచ్చాడు. ఎంతకాలం గడచినా ఎవ్వరూ చిన్నా చితక ఉద్యోగానికైనా పిలవక పోవడంతో అయిష్టంగానే స్వయంగా ఉద్యోగాన్వేషణకై ప్రారంభించి, కాలం గడుస్తున్నా ఉద్యోగం వచ్చే ఛాయ లేవి కనుచూపు మేరలో కనపడకపోవడంతో, నిజం నిష్టూరంగా నిలిచి వెక్కిరించగా అంత ఎత్తులో ఎగురుతున్న ఊహాలోకాల్లోంచి హఠాత్తుగా నేలమీద దిగబడ్డ జగన్నాధం, చుట్టూ చూసి తనలాంటి వాళ్లు చాలామందే ఉన్నారీ ప్రపంచంలో అన్న నిజాన్ని గ్రహించాడు. ఇంట్లో తలిదండ్రుల విసుగు, బంధు మిత్రుల అదరింపులతో లేచి ఒళ్ళు దులుపుకుని తనని ఆకాశానికెత్తేసిన చిన్నాన్న కోసము కోపంతో వెతకగా అతను తనను తప్పించుకు తిరుగుతున్నాడని తెలిసింది.

ఇంక చేసేదిలేక పేపరు ప్రకటనలు చూస్తూ, ఉద్యోగాలకి ప్రయత్నాలు ప్రారంభించాడు. తోటి స్నేహితుల సలహాలకోసం వారి వెంట బడుతూ, వారిలో అదృష్టం పండి ఒక మెట్టు ఎక్కి ఉద్యోగస్తులైన వారి అనుభవాల ఆధారంతో ఉద్యోగాన్వేషణలో క్రొత్త మెళకువల కోసం అన్వేషణ ప్రారంభించాడు. దొరికిన వాటిలో కొన్నిటిని దొరకబుచ్చుకుని వేల్లాడ ప్రయత్నించగా ఫలితం కనిపించకపోవడంతో మళ్లీ క్రొత్తగా వెతికి, కనబడ్డ కొత్త ప్రకటన చూసి అది తప్పక దొరుకుతుందనే కొత్త ఆశాకిరణం మెరిసేది. కానీ చేతిదాకా వచ్చేముందే ఎగురుతున్న బుడగలోని గాలి తీసేస్తూ వచ్చింది రాజకీయ నాయకుల, లేకపోతే పలుకుబడి గల పెద్దల రికమండేషన్. అలా ఆశ, నిరాశల ఉయ్యాలపై ఊగుతుండగా వెంకటరావు మోసుకొచ్చాడు ఒక మెరుపులాంటి వార్త. “భారత్ సంచార్నిగాం” వారు ఎటువంటి వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న వారికి డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా జూనియరింజనీర్ ఉద్యోగాలిస్తున్నారని, రికమండేషల్నేవి పరిగణనలోకి తీసుకోరని. ఇంకేముంది పరుగు పరుగున వెళ్లి దరఖాస్తు పడేశాడు జగన్నాథం. పడేసేముందు అప్లికేషన్ ఒకటికి రెండుసార్లు సరిగ్గా నింపాడో లేదో సరిచూసుకుని కావలిసిన సర్టిఫికెట్లు అన్ని జతపరచాడని తేల్చుకుని మరీ పడేశాడు. రోజులు గడుస్తున్నాయి గానీ బీ ఎస్ న్ ల్ నుంచి ఎటువంటి సమాచారము లేదు. జగన్నాథం తప్పకుండా వస్తుందన్న ఆశ రోజులు గడుస్తున్న కొద్ది సన్నబడుతుండగా పెరుగుతున్న అతగాడి అసహనం కంటే ఇంట్లో వారి నసుగుడు ఎక్కువై అందరిపైనా విసుగు, కోపం క్రమంగా విజృంభించడం ప్రారంభించాయి.

ఇదికూడా పోయిందని టిక్కు పెట్టుకుంటూ మరో ప్రయత్నానికి ఉద్యమిస్తుండగా అనుకోకుండా ఒకరోజున టెలిగ్రామ్ వచ్చింది.- మీరు ఫలానా తేదీలోగా ట్రైనింగ్ కి రిపోర్ట్ చెయ్యకపోతే మీ సెలక్షన్ రద్దు చేయబడుతుందని. దానితో అర్థమైంది బీ ఎస్ న్ ల్ వారు పంపిన ఉత్తరం తనదాకా రాకుండా మధ్యలో పోస్టుమాన్ ద్వారా ఎక్కడో చెత్తబుట్టలో చేరిందన్నమాట అనుకుని హడావిడగా ఆ టెలిగ్రామ్ పట్టుకుని వెళ్లి ట్రైనింగ్ సెంటర్ కి వెళ్లి దీనంగా తన పరిస్థితి వారికి వివరించి దైవవశాత్తు వారు కనికరించగా ట్రైనింగ్ లో చేరిపోయాడు జగన్నాధం.

ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకుని విశాఖపట్నంలో చేరాడు మన హీరో. తనకి ఇచ్చిన ట్రైనింగ్ టెక్నాలజీని పరిచయం చెయ్యడానికే గానీ ఆ వ్యవస్థలోని సాంకేతిక లోపాలని సరిచేసే కిటుకుల్ని అవగాహన చేసుకునేందుకు కాదని తెలుసుకొనడానికి అట్టే కాలము పట్టలేదు. అయినా తెలిసిన తరువాత చేసేదేమీ లేక ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి అవి తెలుసుకోవడానికి మళ్లీ తీవ్ర ప్రయత్నంగా మూల పడేసిన పుస్తకాలు తెరవడం, తెలిసినవారిని సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి ఆ దారి పట్టాడు.

ఆసమయంలో తన వద్ద పనిచేసే టెక్నీషియన్లు ఇతగాడి అంతగా లోతులేని సాంకేతిక పరిజ్ఞానం గుర్తించి పని ఠళాయించి సరదాగా క్లబ్ రూమ్ లో పేకాట, క్యారమ్స్ ఆడుతూ రోజులో సగభాగం గడిపేయడం ఆరంభించారు. తన బాధ్యత అయినపని మిగిలిపోవడం, అతడి బాసు పనిలో ఆలస్యానికి చివాట్లు పెట్టడం జగన్నాథం కళ్లు తెరిపించి ఇబ్బందిలో పడేశాయి. అసిస్టెంట్ ఇంజనీర్ గారికి తాను చూసిన విషయం తెలియ చెబితే ఆయన టెక్నీషియన్స్ ని అదుపులో ఉంచి వారిచేత పనిచేయించుకోవడం నీ బాధ్యత అని మందలిస్తే, చేసేదిలేక ఆలోచించి టెక్నీషియన్లని నిలదీసాడు. వారిలో ఒకడు వెంటనే ఏదో ఒక చాలా కాలంగా ఉండిపోయిన క్లిష్టమైన సాంకేతిక సమస్యని అతడి ముందుంచి దానికి సంబంధించిన సర్క్యూట్ డ్రాయింగ్ ని తెచ్చి, దానిని ఎలా సాల్వ్ చెయ్యాలో అర్థంకావటంలేదని ఎట్లా చెయ్యాలో వివరిస్తే సరిచేస్తాము అని బేలముఖం పెట్టుకుని వచ్చారు. అసలే అయోమయంలో ఉన్న జగన్నాధానికి ఆ కొత్త సమస్య పిచ్చెక్కించినట్లయింది. అంత పెద్ద డ్రాయింగ్ ని తను ఎప్పడు చూడకపోవడం మరింత గందరగోళం కలిగించింది జగన్నాధానికి. అది పెద్ద బల్ల పరిమాణంలో యుండి పదుల కొద్ది తీగలతో గజబిజి గా ఉన్న ఆ సర్క్యూట్ చూడడానికే భయం వేసింది జగన్నాథం కి. ఆ టెక్నీషియన్లు ఇంక ఈయన బెడద కొన్నాళ్లు మనికి ఉండదనుకుంటూ నవ్వుకుంటూ వెళ్లడం దూరంనుంచి కనిపించింది.

ఆ అయోమయ స్థితిలో తోటి ఇంజనీర్ల సహాయంకోరాడు. వాళ్ళు మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పడంతో అతని బెంబేలు మరింత పెరిగింది. వెళ్లి ఆపై అధికారి సహాయం కోరగా అతడినుంచి కూడా యించుమించు అటువంటి సమాధానమే వచ్చేసరికి ఏమిచేయాలో తెలియక సందిగ్ధావస్థలో పడ్డాడు జగన్నాథం. తనని ఎగతాళి చేస్తున్న టెక్నీషియన్స్ కి ఏమని చెప్పాలి? వారి సందేహాలు తేర్చే బాధ్యత తనదే మరి. తను చెప్పలేకపోతే వారి దృష్టి లో మరీ చులకన అయిపోతాడు. తనకి సరైన పరిష్కార మార్గం చూప గలవారెవ్వరు అక్కడ ఎవ్వరు లేరాయే. తానే ఎలాగో దారి కనుక్కోవాలి. అప్పుడు తట్టింది తనని ట్రైనింగ్ సెంటర్ లో మెచ్చుకునే ఒక లెక్చరర్ ని సహాయం అడగొచ్చునని.

మరునాడు తన ట్రైనింగ్ ఇచ్చిన ఆ లెక్చరర్ కి ఫోన్ చేసి కుశల ప్రశ్నల తరువాత డ్రాయింగ్ నంబర్ చెప్పి, ప్రాబ్లెమ్ కూడా చెప్పి ఆయనను సహాయం అడగగా, ఆయన టైం కావాలన్నారు. నాలుగు రోజుల తరువాత ఆయనే పిలిచి చెప్పిన సమాధానం విని తనకి వచ్చిన సందేహాలు తీర్చుకుని దానిని పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడు దానిని వారు ఎదుర్కొంటున్న ప్రాబ్లెమ్ కి ఏవిధంగా అన్వయించాలో తాను శోధించి అప్పుడు టెక్సినీషియన్ కి వివరించాడు. ఆ పద్ధతి ప్రకారం చేసిన ప్రయత్నంతో ఆ సమస్య పరిష్కారమైంది. బ్రతుకు జీవుడా అని ఊపిరి తీసుకున్నాడు జగన్నాథం. ఆ సిస్టం లో అలాంటి సంక్లిష్ట సర్క్యూట్లు ఎన్నోవుండడంతో మళ్లీ అతడు కాకపోతే మరొకడు వేరే సర్క్యూట్ లోని ప్రాబ్లెమ్ తో వస్తే ఏమి చేయాలోనన్న ఆలోచనతో కొంత కాలం ఆరాట పడ్డాడు. అయినా తను ఇప్పుడు చేయ గలిగిందేమీ లేదు గనుక సమస్య వచ్చినప్పుడు చూద్దాములే, అప్పుడు ఏదో ఒక పరిష్కారం లభించకపోతుందా అనుకుని మనసుని కుదుట పరుచుకున్నాడు.

ఒకరోజున ట్రంక్ ఎక్స్చేంజి లో ఒక బోర్డు పనిచేయకుండా మొండికేస్తోందని కంప్లైంట్ వస్తే ట్రంక్ ఎక్స్చేంజి వెళ్లాడు. ఆ సమస్య పరిష్కారానికై తిప్పలు పడుతున్న సమయంలో పరిచయమైంది ఆ బోర్డు పై పనిచేస్తున్న లత అనే ఆపరేటర్ తో. ఆ సమస్య ఐతే తీరిందికాని ఆ పరిష్కారం ఒక్క రోజులో రాక మళ్లీ వెళ్ళాల్సిన సమయంలో అనుకోకుండా వారిరువురి మధ్య మాటలు పెరిగి, దాని ఫలితంగా సానుభూతితో కూడిన అవగాహన మొగ్గతొడిగి మానసికంగా దగ్గరై, యాదృచ్ఛికంగా ఆ పూగుత్తి విచ్చుకుని, ఇరువురికి తెలియకుండానే వారిరువురి మనసులలో ఒకరిపై మరొకరికి అభిమానం దానితో పాటు అనురాగం పెరిగాయి. అవన్నీ ఒక్కరోజులో జరగలేదు. అలాంటి సందర్భాలెన్నో ఒకటి తరువాత మరొకటి రావడం ఆ సమయంలో ఆమె కూడా డ్యూటీ లో ఉండడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి.

లత అల్లాగ ఆ క్షణంలో అతడి జీవితంలో ఆ విధంగా కుడి పాదం మోపి ఇంక అటుఇటు చుట్టుపక్కలకి చూడకుండా అతడిని కూడా చూడనివ్వకుండా తన తియ్యటి మాటల మంత్రంతో తన కొంగుని పట్టుకు తిరిగేటట్లు చేసింది. తప్పు వారిరువురిదీ కాదు, వారిరువురి మధ్య ఏర్పడ్డ మానవ సహజ స్త్రీ పురుష పరస్పరాకర్షణ. యాదృచ్ఛికంగా ఆఫీస్ లోనే కాకుండా సోషల్ గేదరింగ్స్ లోనూ కూడా వారిరువురూ కలవడం జరిగి, సాన్నిహిత్యం పెరిగి, ఒకరోజున బీచ్ లో ఏకాంత సమావేశానికి దారితీసింది. అటువంటి కలయికలు కాల క్రమేణా పెరిగి వారిరువురి మధ్య మాటలు పెనవేసుకుని ఒకరి చెవికి మరొకరి మాటలు తేనె బిందువులై, వసంత ఋతువులోని కోకిల గానాలై, చేస్పర్శలు వీణ తంత్రులపై మీటిన నాద సుధలై, తీయని మధురానుభూతుల్ని కలిగించి వారి మనో వీధులలో యుగళగీతాలు పాడించాయి.

రోజులు సాఫీ నుంచి తీయగా మారి సాగుతున్న సమయంలో, ఆ బంధం మరింత క్రమంగా గట్టిగా పెనవేసుకుంటున్న తరుణంలో, జగన్నాథం తండ్రి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది, అతడికి సంబంధాలు చూస్తున్నట్లు; అతడికి వచ్చిన సంబంధాలలో ఒక సంబంధం ఆయనకి, జన్నాధం తల్లికి, నచ్చినట్లు వీలు చూసుకుని నాలుగు రోజులు శలవు పెట్టుకుని హైదరాబాదు రావలసిందిగా అందులో ఉంది, తండ్రి గారి సూచన లాంటి ఆజ్ఞ. ఆ ఉత్తరం చదివి తిరుగు టపాలో కొత్తగా ఉద్యోగంలో చేరిన తనకు శలవు దొరకడం కష్టమని వ్రాసాడు. అట్లాగ ఆరు నెలలు తప్పించుకు తిరిగాడు. కానీ జరుగుతున్న కాలంతో వారికి తెలియకుండానే వారిరువురి మధ్య అనుబంధం ఫెవికాల్ తో అతికించినట్లు గట్టిగా బిగుసుకుపోసాగింది.

ఒక రోజు తండ్రి దగ్గర్నించి గట్టి ఆర్డర్ లాంటి ఉత్తరం రావడంతో తప్పేదిలేక శని, ఆదివారంతో కలిపి రెండు రోజులు శలవు పెట్టి హైదరాబాదు బయలుదేరాడు జగన్నాథం. ముందుగా తెలియబరచకుండా రావడంతో ఇంట్లో కొంత ఆశ్చర్య భరిత ఆనంద వాతావరణం నెలకొనగా తల్లి వాడికి యిష్టమైన భోజనం తయారు చేయడంలోనూ, చెల్లి వీణ వాడితో ఆ సాయంత్రం చూడాలిసిన సినిమాల ఎంపికలోను, తండ్రి పెళ్ళికూతురు తరఫు వారిని పిలిచి పెళ్ళిచూపులు ఏర్పాటు విషయంలోనూ నిమగ్నులైపోయారు. జగన్నాధమయితే తల్లిదండ్రులకి లత గురించి ఏ విధంగా చెప్పి ఒప్పించాలా అన్న ఆలోచనతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి ఆలోచన ఇంకా ఒక కొలిక్కి రానేలేదు, అతడి నాన్న మరునాడు సాయంత్రం అమ్మాయి వాళ్ళింట్లో పెళ్ళిచూపుల ఏర్పాటుకి వారితో మాట్లాడి నిర్ణయం చేశారు.

అక్కడ లత కూడా జగన్నాథం పెళ్ళిచూపులకి వెళ్ళుతున్నాడని తెలుసుకుని ఇంట్లో వాళ్ళకి ఏవిధంగా తెలియచేసి ఒప్పించాలన్న ఆలోచనా సాగరంలో పడింది. ఒప్పుకోకపోతే ఏమిచెయ్యాలి అన్న మీమాంసలోను పడి, తను ప్రార్థించే దేవుళ్లందరికీ మ్రొక్కుకుంది తన జీవితాన్ని తాను కోరుకున్నవిధంగానే సాగిపోయేలా చెయ్యమని.

పెళ్ళిచూపుల సమయం రానే వచ్చింది, తప్పనిసరై జగన్నాథం కాబోయే పెళ్ళికొడుకుగా తల్లి, తండ్రి, చెల్లి తో అమ్మాయిని చూడడానికి వెళ్లాడు. పెళ్ళిచూపుల తంతులో ఆ కాబోయే పెండ్లికూతురు లవంగి అతడితో ఏకాంతంగా మాట్లాడాలని ప్రతిపాదించింది. దానికి పెద్దలందరూ ఒప్పుకోవడంతో, జగన్నాథం లవంగి వాళ్ల ఇంటిపై డాబా మీదకి మాట్లాడుకోవడానికి వెళ్లారు.

లవంగి “విశాఖపట్నం బాగుంటుందా?”

జగన్నాథం “బాగానే ఉంటుంది. ఇక్కడలేనిది అక్కడ ఉన్నది బీచ్”.

“మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?”

“ప్రత్యేకంగా ఏమీ లేవు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి జీవితం.”

“మీ జీవిత భాగస్వామి ఎలా వుండాలనుకుంటున్నారు?”

“నాకు పెద్దగా ఆశలేమి లేవు, లైఫ్ హ్యాపీ గా గడిచి పోతే చాలు.”

“ సినిమాలు చూస్తుంటారా?” “ఆ“

“మీరు చూసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది” - అని అడిగింది ఇంటర్వ్యూ చేస్తున్న ఫక్కీలో.

“అలవైకుంఠపురంలో”

“అది నాకు కూడా నచ్చింది”

లవంగి “లత ఎవరు?” ..జగన్నాథం ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు.

లత గురించి ఈమెకెల్లా తెలిసి ఉంటుంది?

“ఏ లత?”

“ఇంకెవరు, మీతో కలిసి సాయంకాలాలు బీచ్లో షికార్లు తిరుగుతున్న లతే!”

జగన్నాథానికి అర్థమైంది ఆమెకి పూర్తిగా తన గురించి తెలుసునని. ఇంక దాచి ప్రయోజనం లేదనుకుని

“నేను, ఆమె తెలియకుండానే ప్రేమలో పడ్డాము”

“మరి ఆ సంగతి మీ ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పారా?”

“ఇంకా లేదు, చెబుదామనుకునే వచ్చాను, కానీ నేను చెప్పేలోగానే మా విషయం తెలియని నాన్నగారు ఈ ఏర్పాటు చేశారు.”

“ఇప్పుడేమి చేద్దామనుకొంటున్నారు?”

“వీలు చూసుకుని మా అమ్మ నాన్నలకు తెలియ చెబుతాను, పెళ్ళికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అయినా ఈవిషయం మీకెలాగ తెలిసింది?”

“విశాఖపట్నంలో నా దగ్గర స్నేహితురాలు మీ ఆఫీస్ లోనే పని చేస్తోంది.”

జగన్నాథానికి మూడ్ పోయింది. చెప్పింది ఎవరు అని అడిగే సమాధానం వినే కుతూహలం ఆవిరైపోయి ఈ తంతు ఎంత త్వరగా ముగించుకుని ఇంటికి పోదామా అని ఆతృత పడసాగాడు.

లవంగి దానిని చూసి నవ్వుకుంటూ “వెళ్దామా” అంది.

ఇంటికి చేరాక అమ్మ నాన్న పిల్ల ఎలావుంది అని అడిగారు. బాగానే ఉందని మాత్రం చెప్పి తప్పించుకున్నాడు. రాత్రి భోజనాల తరువాత నెమ్మదిగా చెప్పాడు జగన్నాథం లత గురించి.

“వాళ్ల కులగోత్రాలు కనుక్కున్నావా?” అన్నారు నాన్న. నిజమే! ఆవిషయము అడగనే లేదు. అసలు అడగాలని తట్టనే లేదనుకుని, లేదని చెప్పాడు. “ఏమి తెలియకుండా పెళ్లి ఎలాగ చేసుకుందామనుకున్నావురా“ అని నిలదీసింది అమ్మ. చెప్పడానికి సమాధానం దొరకక క్రింది చూపులు చూస్తూ ఊరుకున్నాడు.

విశాఖపట్నం చేరుకున్న తరువాత మూడు రోజులవరకు లతని బీచిలో కలవడం కుదరలేదు. కలిసినప్పుడు -
“పెళ్ళిచూపులు ఎలా జరిగాయి? పిల్లనచ్చిందా” అని అడిగింది లత.

నచ్చిందన్నట్లు తలూపాడు జగన్నాథం.

“ఏమడిగింది లవంగి?” ఒక్కసారి షాక్ తిన్నాడు జగన్నాథం, ఆమె పేరు లత కెలాగ తెలుసు? సమాధానం ఏమీ చెప్పాలా అని ఆలోచిస్తుండగా మళ్లీ లతే అడిగింది.

“అల వైకుంఠపురంలో’ అంత బాగా నచ్చిందన్న మాట.”

ఇది మరో షాక్ జగన్నాధానికి. లవంగి కి తనకి మధ్య జరిగిన మాటలు ఈమెకెలా తెలిసాయి? అతడు తెల్లబోవడం చూసి నవ్వి “లవంగి మా మేనత్త కూతురు.” మళ్లీ అంది. “లవంగి నేను చాలా క్లోజ్.”

జగన్నాథానికి షాక్ మీద షాక్. షాకులు తిన్న జగన్నాథం కూలిపోలేదు తానింక వేరే వివరించాల్సిన అవసరం లేదనిపించి గుండె తేలిక కాగా హాయిగా నవ్వుకున్నాడు. లత కూడా నవ్వేసింది.

జగన్నాథం పెళ్లి లతతో ‘ధూమ్ ధామ్’ గా జరిగినదని, లవంగి ఆ పెళ్లిలో చాలా హడావిడి చేస్తూ తిరిగిందని, ‘సంగీత్’ లో తీయగా పాటలు పాడిందని వేరే చెప్పాలా ?

********

Posted in June 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *