Menu Close
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
దోసెకు లోకము దాసోఽహమ్ (స్రవంతి)
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
చం. భళిర! భళీ! యనంగ బహుభాసురవేషములన్ ధరించి యీ
       యిల నమితావతారముల నెందఱికో జల మూర జిహ్వలన్,
       గలుగఁగఁ జేసి తృప్తి నెదఁ, గామితసిద్ధి నొసంగు దోసెలన్
       దలఁచినఁ, జేకొనన్, నుడువ నల్వురిలో, నరజన్మ ధన్యమౌ

కం. పెరిగెడు జనముల రుచులకుఁ
      బెరుఁగుచుఁ దగురీతి వందవిధముల పైనే
      పురములఁ బల్లెల నన్నిట
      స్థిరముగ దర్శన మొసంగు దేవత దోసే

ఉ. దోసెకు మ్రొక్కగా యువత దోసిట కాసులొ ‘ఫోనుపే’లనో
     పోసియొ చేసియో మురిసి, ముద్దుగఁ జేరును నోటి రక్షకుల్(1)
     దాసులరీతి సిద్ధమయి దండము వెట్టుచు స్వాగతింపఁగాఁ
     జేసిన పున్నెమేమిటని చెప్పెద? సప్తగిరీశ! కాంచుమా
              (1) దంతపంక్తి

ఉ. ఆసకు దోసెఁ జేర్చి కడునందముగాఁ దమ యాటపాటలన్
     మోసములేని స్వచ్ఛతకు మూర్తులుగాఁ దిరుగాడు బాలలే
     మూసలు గారె సంస్కృతికి  ముంగిట ముత్యము లౌచు? దోసేలే
     బాసట యౌగదా ముదముఁ బంచఁగ లోగిళులందు నిచ్చలున్   

తే.గీ. ఇన్ని యవతారముల దోసె లెవ్వరేని 
        కొన్న, దాన మొసంగినఁ గోర్కె దీరి
        జిహ్వచాపల్యముక్తిని జెంది పిదప
        శాశ్వతానంద మొందరే సఫలు రగుచు?
Posted in July 2026, సాహిత్యం

1 Comment

  1. శర్మ దంతుర్తి

    భలే ఉన్నాయండి పద్యాలు. అయితే చివర్లో ఫలశృతి అంత నప్పలేదు. “జిహ్వచాపల్యముక్తిని జెంది” ఇదే అయితే ఇంక దోశెలు తినడం ఎలా? ఒక్కో దోశె తింటూంటే జిహ్వ చాపల్యం ఎక్కువవ్వాలి. ఏమంటారు?

    ఆ మధ్య ఫేస్ బుక్కులో కొంత చర్చ జరిగింది. రకరకాల పదాలు సృష్టించడం. అందులో ఒకాయన “ఫిర్ దౌసి” అంటే ఒక దోసె తిని రెండోది కావాలి అని అడిగేవాడు అన్నారు. అలాగే మనం “ఏకాదసి” అంటే చంద్రమానంలో ఉపవాసం చేసి పదకొండు దోసెలు తినేవాడు అని చెప్పుకోవచ్చంటారా? 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *